No transcript for this section.
Transcript begins at 0:00.
వందనీయ త్యాగరాజ మహాస్వామి దివ్య మహా స్మృతికి ప్రాంజలి ఘటిస్తూ, మే నాలుగు, పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరంలో ప్రాదుర్భవించిన వాగ్గేయకారుడు, సంగీత జ్ఞాని త్యాగరాజ స్వామి వారి యొక్క మధుర స్మృతిలో వారిని గురించి కొన్ని విశేషాలు మనం అనుకుందాం. వారు సంగీతం అంతా కూడా రామనామమయమై ఉన్నది గనుక తొంభై ఆరు కోట్ల రామ నామ మంత్రాన్ని ఆయన జపం చేసుకున్నారు. అయితే ఈ జపానికి ముందు సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి ఒక సంస్కృతి విధానానికి ఆలంబనగా నారద మహర్షి స్వరార్ణవ గ్రంథం ఇవ్వటం అనేది ఒక చారిత్రక సత్యం. ఈ ప్రసక్తిని త్యాగరాజ స్వామి వారే తమ స్వరరాగసుధ కీర్తనలో నిక్షిప్తం చేశారు. విడిగా చెప్పకుండా కీర్తనలో నారదుల వారికి అంజలి ఘటించారు. రెండు వందలకు పైగా రాగాలను, డెబ్బై రెండు మేళకర్త రాగాలలో నలభై ఏడు మేళకర్త రాగాలను వినియోగించి, ఎనభై మూడు నూతన రాగాలని ఆయన ప్రయోగించారు. ఇహభోగాలను పరిత్యజించినటువంటి త్యాగయ్య ఆనాడే త్యాగరాజు అయినాడు. దేనిని త్యాగం చేశాడు అంటే లౌకిక పరమైనటువంటి లాలస, భోగము, సుఖము అన్నీ వదిలి రామనామాన్ని మించి మరొకటి లేదు అనుకున్నాడు. అందుకనే రామనామ రూప భావ తత్వార్ధాలని రాగరంజితము, భక్తి బంధురము చేసి స్వరరాజు అయినాడు ఆయన. స్వరరాగానికి ఆయన చక్రవర్తి అయినాడు. ఆయన సాహిత్యం నిండా, సంగీతం నిండా, స్వరం నిండా, భావన నిండా రాముడికి ఎన్నో వేడుకోలులున్నాయి. అలాగే విన్నపాలున్నాయి. ఈ రెండూ కూడా జమిలిగా సాగించిన మనోధర్మ సంగీత వేత్త త్యాగరాజస్వామి. స్వామి అంటే జ్ఞాని అని అర్థం. భుజాస్పద కోదండరాముడు, పక్కన అమ్మ, శ్రీరామ దివ్య పాదాబ్జముల చెంత హనుమ, ఇది ఒక మహాద్భుత దృశ్యం. ఈ దృశ్యాన్ని స్వాప్నికంగా గాక ఆంతరంగికంగా అనుభవించినటువంటి త్యాగరాజస్వామి పూర్ణంగా జ్ఞాన సముద్రుడయినాడు. దానిలో నుంచి ఏర్పడినటువంటి కొన్ని భావనలే ఈ నాటికి మానవజాతికి దిక్సూచిల వలే పనిచేస్తూ ఉన్నాయి. నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాల సుఖమా అని, శాంతము లేక సౌఖ్యము లేదని, అన్నింటికంటే సేవ మహోన్నతమైనటువంటి కర్మకాండ అని చెప్తూ, బంటురీతి కొలువీయ వయ్య రామా అంటూ ఈ ప్రపంచానికి సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వమను-- అడుగుతూ, మరుగేలరా ఓ రాఘవా అన్నటువంటి కీర్తనలో "అన్ని నీవనుచు అంతరంగమున నా అంతట నేను తిన్నగా తెలుసుకున్నాను" అన్నారాయన. ఇంకా ఏ రకమైన భేదభావం లేదు. నువ్వు ఆత్మజుడవై ఉన్నావ్, ఆంతరంగికంగా ఉన్నావ్, చిత్తజ గురుడవై ఉన్నావ్ అనేటువంటి ఆ తపో ఫలాన్ని సాధించుకున్నటువంటి సాధకుడు త్యాగరాజస్వామి. అంతేకాదు, మామూలుగా సంగీత విద్వాంసులు ఎవరైనా తరించటం కోసం పాడతారు. త్యాగరాజస్వామి వారు తరించి పాడారు. ఈ తరించి పాడినందువలన దేహాత్మ భావన అంతరించి భౌతిక, ఆదిభౌతికమైనటువంటి రెండు స్థితులను దాటి పరిపూర్ణ మానవతాన్ని పరిమళించినటువంటి త్యాగరాజస్వామి ఆత్మజ్ఞాని. ఆయన అచ్చమైనటువంటి తెలుగు వాగ్గేయకారుడు. త్యాగరాజస్వామి వారి సంప్రదాయంలో నుంచి కొన్ని వేల లక్షల సంగీతకారులు ఇంకా పుడుతూనే ఉన్నారు. తమదైనటువంటి రీతిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలని అన్నింటిని కూడా సమన్వయం చేస్తూ, సంగీత సమార్చన చేస్తూ, సాంప్రదాయకమైనటువంటి కర్ణాటక సంగీతాన్ని పరిపుష్టం చేస్తూ, త్యాగరాజస్వామి శ్రోతల హృదయాలను శ్రీరామచంద్ర పద పద్మాధీన చేతస్కం చేస్తూ, రామ రూపంలో హృదయాన్ని నిలిపేట్టుగా ఒక నిశ్చల, నిర్మమ, నికేతన, నిరంజనమైనటువంటి భావనతో సాధకుడు భక్తుడై, భక్తుడు జ్ఞాని ఎట్లా కాగలడో ఆ పరిణమించేటువంటి ఆ పరిణామ క్రమాన్ని తమ సాహిత్యం ద్వారా చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇదే త్యాగరాజస్వామి ఈ జగత్తుకి అందించినటువంటి మహాద్భుతమైనటువంటి జ్ఞాన ఫలం.
YouTube · audio
Thyagaraja Swamy
Thyagaraja Swamy
Source: AIRHyderabad on YouTube
0:00 / 4:49