Skip to content
Transcript తెలుగు
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దాని పేరు జీవితం కాదు. అనుకోనిది జరిగినప్పుడు దానిని ఎదుర్కొని తద్వారా కలిగేటువంటి అనేక అననుకూలాలను అధిగమిస్తూ జీవితాన్ని నడపటం అనేటువంటిది అసలైనటువంటి జీవన విధానం. ఆలోచనలన్నీ వయస్సు వచ్చిన తర్వాత కలిగినవి కావు. ఒక నాలుగు సంవత్సరాలు నిండకుండా ఏర్పడినటువంటి తాత్విక విచార ధార, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం, అలాగే ఉపనిషత్తులు అనుగ్రహించినటువంటి ప్రశ్నించే హక్కు. ఇవన్నీ కూడా జీవితాన్ని చాలా చక్కగా నిర్మాణం చేసినయి, నా విషయంలో. జీవితం ఎప్పుడూ కూడా మనం డ్రాఫ్ట్ చేసినట్లుగా అది ఉండదు. నా గట్టి నమ్మకం ఏంటంటే అదొక ప్రీ-ప్రోగ్రామ్డ్ వెర్షన్. దానిలో మనం ఉంటాం. మన అహంకారం చేత నేను జీవితాన్ని భద్రంగా నడిపాను, జీవితాన్ని గడపలేకపోయాను అని రెండు న్యూనతలు, అహంకారాలు ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి జమిలిగా. అలా కాకుండా జీవితం సాగిపోతూ ఉన్నప్పుడు జీవితం విసిరేటువంటి ప్రతి సవాలిని ఒక అవకాశంగా, ప్రతి అవకాశాన్ని ఒక ఆదర్శంగా, ప్రతి ఆదర్శాన్ని ఆలోచనాత్మకంగా, ప్రతి ఆలోచనని రాబోయే భవిష్యత్ కాలానికి ఉపయోగపడే విధంగా గనుక జీవించగలిగితే, కార్యక్రమాలను గనుక నిస్వార్థంతో రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా చేయగలిగినట్లయితే అది నిజమైనటువంటి తపస్సుగా నేను భావన చేశా. కనుకనే అటు వైజ్ఞానిక, ఇటు సాహిత్య, అటు ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు కోణాలతో పాటుగా fourth dimension సామాజిక సేవ. జీవితాన్ని ఒక్కసారి పునః సింహావలోకనం చేసుకుంటే పుస్తకాలు రాయటం తృప్తి కలిగించిందా? అనేక బిరుదులు పొందటం ఆహ్ ఆనందం కలిగించిందా? ఏది ఆనందం కలిగించింది? అంటే అవన్నీ సంతోషం కలిగించి ఉండొచ్చు కానీ నిజానికి ఆనందం కలిగిన-కలిగించినవి మాత్రం రెండే. ఒకటి థలసేమియా సికిల్ సొసైటీలో మూడు వేల ఎనిమిది వందల మంది పిల్లలకి ఆహ్ భద్రతమమైన జీవితాన్ని ఇవ్వగలగటం ఒకటి. రెండవది నేను నివసిస్తున్నటువంటి కాలనీని child labour free గా చేసి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక అపూర్వమైనటువంటి గౌరవాన్ని పొందటం, పొందించటం, దానిని సమాజానికి అందించటం. ఇవన్నీ కూడా ప్రవాహ వేగంతో నడిచి పోతూ ఉన్నప్పుడు జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది. నా జీవితంలో తొలినాళ్లలోనే పన్నెండు సంవత్సరాలు రాకుండానే ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన మలుపు భగవాన్ సత్యసాయి బాబా వారితో ఏర్పడినటువంటి ఒక సమాగం. అది యాభై నాలుగు సంవత్సరాలు జీవితమంతా కిక్కిరిసిపోయి ఆయన చెప్పినటువంటి ఆదర్శాలు, ఆయన చూపించినటువంటి మార్గాలు, ఆయన చేసినటువంటి ప్రబోధాలు, ప్రసారాలు, ఇవన్నీ కూడా ప్రతిరోజూ జీవితాన్ని self audit చేసుకోవటానికి ఉపయోగించినయి. ఇక కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు అని మూడు మనం చెప్పుకుంటూ ఉంటాం. భగవద్గీత నుండా ఉన్నది కూడా అదే. కొందరేమో కర్మ యోగం కంటే గొప్పది లేదని, కొందరు భక్తి యోగం కంటే మరొకటి లేదని, జ్ఞాన యోగమే అత్యుత్తమమైనదని ఇలా విభాగీకరించుకుంటూ వెళ్తాం. కానీ నా అధ్యయనంలో, నా స్వాధ్యాయంలో, నా అనుభవంలో, నా అనుభూతిలో మూడు భిన్నం కావు. మూడు మూడు పార్శ్వాలు. కర్మ యోగం లేని భక్తి నిరుపయోగం. భక్తి లేని జ్ఞానం అది మరింతగా నిరుపయోగం. ఎందుకంటే కర్మ శరీరాన్ని, మనస్సుని balance చేస్తుంది. అది ఒక విస్తృతమైనటువంటి సమాదరణ, ఒక ఔదార్యము, ఒక కరుణ, ఒక స్పృహ, ఇవన్నీ కలిగిస్తాయి. ఏది? కర్మ యోగం. భక్తి యోగంలో మనసు మార్ధవం అవుతుంది. ప్రపంచాన్ని కంటికీ కనపడకుండా నడిపిస్తున్న ఒక అదృశ్య మహా చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో దానికి దైవం అని గనుక పేరు పెట్టుకున్నట్లయితే, దైవంతో గనుక నా మనస్సుని అనుసంధానం చేయగలిగినట్లయితే అది నా మనస్సు ఒక లాలిత్యాన్ని, ఒక నెమ్మదితనాన్ని, ఒక నిండుతనాన్ని, ఒక సంపూర్ణత్వాన్ని, పవిత్రతని సంతరించుకొని పూర్ణమైనటువంటి భావన భావనామయ స్థితి మనస్సులో ఏర్పడుతుంది. ఇది భక్తి యోగంలో నేను అనుభవించినటువంటి ఒక స్థితి. ఇక జ్ఞాన యోగంలో ఉన్నదంతా ఒకటే, సర్వం ఖల్విదం బ్రహ్మ. అంతా ఒకటే అయినప్పుడు నేను ప్రత్యేకంగా లేను. నేనే కాదు దేవుడు కూడా ప్రత్యేకంగా లేడు. ఎట్లా ఉన్నాడంటే అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అంతే కాదు ప్రజ్ఞానం బ్రహ్మ. అనేటువంటి ఒక తాత్విక విచారధార జీవితాన్ని, జీవితం ఏర్పరిచే ప్రతి క్షణాన్ని భావనం చేస్తున్నప్పుడు, పరిపూర్ణం చేస్తున్నప్పుడు జీవితం ఒక పరితృప్త స్థాయికి వెళుతూ ఉంటుంది. ఇక సమాజం మన పట్ల లేదా మన జీవన విధానం పట్ల, మనం నడిచే తీరు పట్ల, మన నడత పట్ల ఒక అవగాహన ఏర్పరచుకొని మనకు ఒక సమున్నతమైన స్థానాన్ని అది అనుగ్రహిస్తుంది. దానిని స్వీకరించటమా? స్వీకరించకుండా ఉండటమా? స్వీకరించినట్లయితే మనం అహంకార పూరితమైన జీవితాన్ని గడుపుతాం. స్వీకరించకుండా స్వీకరించినట్లుగా ఉండి దానితో సంబంధం లేకుండా ఉండగలిగితే అది తామరాకు మీద నీటి బొట్టు వంటి విషయం. ఇక వైజ్ఞానిక రంగంలో అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. విజ్ఞాన ప-- శాస్త్రం యొక్క పరిధి చాలా విస్తృతమైనటువంటిది. విజ్ఞాన శాస్త్రమే గనుక లేకపోయినట్లయితే అనాత్మగా కనపడే ప్రకృతి మనకు అర్థం కాదు. నెమ్మది నెమ్మదిగా విజ్ఞానం ద్వారాగనక సంపాదించగలిగినట్లయితే ప్రతి వస్తువు యొక్క మూలాన్వేషణ అంటే దాని మూలం ఏమిటి, తత్వం ఏమిటి, అది ఎందుకు వచ్చింది, దాని ఉపయోగం ఏమిటి, అని ప్రశ్నలు వేసుకుంటూ వెళ్లినట్లయితే సమస్త సృష్టి ఒక అత్యద్భుతమైన విలాసంగా, ఒక హేలగా, ఒక ఖేలగా, ఒక ఆనందలీలగా గోచరిస్తుంది. నేను జీవితాన్ని అలాగే దర్శనం చేశాను. ఇక సాహిత్యం ఒక భావనా పరిధిని విస్తృతం చేయగలదు. ఆలోచనలకి ఒక అందాన్ని, ఒక సొబగుని, ఒక సౌందర్యాన్ని, ఒక పరిమళాన్ని అలది. ఆలోచనలు, మన భాష, మన భావ వ్యక్తీకరణ, మన inter personal relations, సమాజంతో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి మార్గంలో, సరళ మార్గంలో, సూటైన, గంభీరమైన, ఉదాత్తమైనటువంటి స్థాయిలో నడిపించగలిగినది సాహిత్యం. ఎందుకంటే హితమును ఇచ్చేదే సాహిత్యం. నా దృష్టిలో అది. కనుక మనలో ఉన్నటువంటి అనేక పూర్వజన్మ వాసనల నుండి, సంస్కారాల నుండి నడుస్తున్న, నడుపుతున్న జీవన విధానం సుసంపన్నం కావాలి అంటే సాహితీ క్షేత్రంలో మనం ప్రవేశం చేయాలి. ఇక వీటన్నింటిని దాటి దేశమంతా కూడా సర్వాంగీణమైనటువంటి ఒక దేహంగా గనక మనం భావించగలిగినట్లయితే జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతమైనటువంటి ఒకే ఒక్క మానవ జాతిని గనక మనం సర్వే సర్వత్రా దర్శించగలిగినట్లయితే అది నిజమైనటువంటి జీవన సాఫల్యంగా నేను భావిస్తాను. వ్యక్తిగత విజయాలు వ్యక్తితో ఆగిపోతాయి. తనువు ముగిసినప్పుడు, అది తెల్లవారినప్పుడు దానితో పాటు కాలగర్భంలో కలిసిపోతాయి. జీవితం ఒక గొప్ప అవకాశం. అవకాశాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నామని, అలాగే జీవితం కేవలం గడపటానికి, నడపటానికే కాదని, అది సంపూర్ణంగా, అర్థవంతంగా, సమర్థవంతంగా జీవించేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి వినాణంగా గనక భావించగలిగినట్లయితే జీవితం నిజానికి ఆనంద సందోహం అది. అది మహానంద సర్వస్వం. అంతే కాదు life is beautiful.
YouTube · audio

Anubhav - Life Experience - Heritage Foundation

Home

Anubhav - Life Experience - Heritage Foundation

Source: i-radiolive on YouTube

0:00 / 9:34