No transcript for this section.
Transcript begins at 0:00.
జీవుడు స్వభావం చేత, గుణం చేత, జన్మాంతర సంస్కారం చేత, బుద్ధి విశేషం చేత లౌకికంగా బద్ధుడై ఉంటాడు. ఈ బద్ధత్వాన్ని వదులుచుకొని జీవుడు బుద్ధుడు గా కావాలి. అంటే పరిణామ క్రమంలో దానిని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో ఓ మాట అంటారు. లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రజ్ఞ బయటకు వచ్చి జీవుడు తనను తాను ఆత్మగా ఎరుక పరుచుకునేటువంటి దివ్య సందర్భమే ప్రజ్ఞాన భూమిక. ఈ గౌతమ బుద్ధుడు తానున్నటువంటి కాలంలో తనకున్నటువంటి సర్వ లౌకిక భోగాలని పరిత్యజించి రాజ్యాన్ని, రమణిని, ముద్దుల కుమారుడిని చక్కగా సన్యసించి అంటే వదిలిపెట్టి సత్యాన్వేషణకి తన తొలి అడుగు చాలా గంభీరంగా వేశాడు. అయితే మిగతా అవతారమూర్తుల వలె సంస్కర్తల వలె కాకుండా అతి భిన్నమైనటువంటి కోణంలో ముందు బోధ చేశాడు అంటే ప్రబోధం చేశాడు. తర్వాత ప్రచారం చేశాడు. తర్వాత ప్రసారం చేశాడు. ఈ ప్రసారం చేయటానికి తనను తాను పణంగా పెట్టుకున్నాడు. శరీరాన్ని సృష్టింపజేశాడు. శరీరాన్ని సృష్టింపజేస్తే ఆత్మ ఎరుకలోకి రాదు, అనుభవం మిగలదు అని తెలుసుకోవటమే ప్రబుద్ధమానమైనటువంటి స్థితి గనుక జగత్తుతో, జనంతో ఉంటూనే పారలౌకికమైనటువంటి ఒక స్థితిని అందుకునేటువంటి దిశగా బుద్ధుడి యొక్క ప్రయాణము, యానము సాగింది. ఆ యానంలో ఆయన మొట్టమొదట భోగాన్ని వదిలిపెట్టి యోగి అయినటువంటి త్యాగి. భోగాన్ని త్యాగం చేస్తే తప్ప యోగం రాదు. యోగం మిగిలితే తప్ప యోగత్వం సిద్ధించదు గనుక దానికి మానవీయమైనటువంటి పరిమళాన్ని ఒక కోణంగా ఆవిష్కరించి సర్వే సర్వత్రా వెదజల్లినటువంటి దివ్య మానవతా మూర్తి బుద్ధుడు. బహుజనుల పట్ల కరుణ, లోకం పట్ల దయ, జీవిత పరమార్థం పట్ల ఒక లక్ష్య గమ్యాలు, వైరాగ్యమే వైభోగము అన్నటువంటి ఒక ప్రతిపాదన. వీటన్నింటినీ సాకల్యంగా విచారణ చేసి, చేయించి, ప్రబోధించి, ఆచరింపజేసి, జీవులను ధ్యాన ముద్రాంకితులను చేసి తద్వారా ధర్మాచరణ గనుక చేసినట్లయితే తద్వారా శాంతి, సుఖము ఏర్పడతాయని, శాంతి, సుఖము ఏర్పడినప్పుడు సహజంగానే జీవుడి యందు ప్రేమ ఉద్భవిస్తుందని ప్రబోధించినటువంటి తాత్విక వేత్త. అంతే కాదు, జీవుడు రాగ అనురాగాల కంటే కూడా ప్రేమ గొప్పదే అని తెలుసుకునే లోగా జీవితం ముగిసిపోతుంది. రాగము రక్తంతో కూడి ఉన్నటువంటిది. అనురాగము మనసుతో కూడినటువంటిది. ప్రేమ హృదయ సంబంధి. కనుక ఎవరు బంధువులు అన్నటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు రాగము, అనురాగము దాటి నమ్మకమే బంధువు అని చెప్పినటువంటి ప్రథమ ప్రవక్త బుద్ధుడు. అదరక, బెదరక, చెదరక, కదలక గండ శిలవలె జీవితం విసిరే అన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాలని చెప్పా-చెప్పాడు. అలాగే ధర్మం చాలా గంభీరమైనది కానీ అది ప్రశాంతినిచ్చేటువంటి ఒక చల్లని ఒడి. అది తర్కానికి అందదు. కర్మ సర్వోన్నతమైనటువంటిది, అనివార్యమైనది. ఎందుకంటే కర్మానుబంధి మనుష్య లోకే. ఎట్లాంటి విత్తనం పాతుతామో అటువంటి చెట్టే వస్తుంది. ఫలితం కూడా అట్లాగే అందుతుంది. జీవనానికి ఆది తెలియదు, మొదలు తెలియదు. ఇది అనంతమైనటువంటి ఒక ప్రవాహం. కంటికి కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచమంతా చల చలితం. దానిని నడిపిస్తున్నటువంటి ఆత్మ అచలం. కర్మ గుణం మంచి చెడులను నిర్ణయిస్తుందని, రాగద్వేషమోహాలను వదులుకోగలగటమే నిర్వాణ స్థితి అని, నిర్యాణము దేహానికి, నిర్వాణము పూర్ణ ముక్తి అని ప్రబోధించినటువంటి ఆచార్య సత్తముడు గౌతమ బుద్ధుడు.
YouTube · audio
Nirvana Buddhudu
Nirvana Buddhudu
Source: AIRHyderabad on YouTube
0:00 / 4:19