Skip to content
Transcript తెలుగు
శంభోర్ మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా పంచరాత్ర పాశుపత శాక్త జైన బౌద్ధాలు అఖండ భారతావని ఆవహించి వైదిక జీవన ధర్మాలు వెనకబడుతున్నటువంటి వేళ ధర్మ శూన్యత ఏర్పడిన వేళ ధర్మోద్ధరణ అనివార్యము అత్యవసరము అయిన వేళ పరమేశ్వరుడు తనను తానే సృష్టించుకున్న మరొక మహా సన్మంగళ వేళ జరిగింది శంకర ఆగమనం. మానవ జీవితం నడపటానికి గడపటానికి వచ్చింది కాదని అది జీవించటానికి జీవుడు పొందిన ఒక మహత్పూర్ణ అవకాశమని శంకరులు నిరూపించటానికై వచ్చారు. సనాతన ధర్మాన్ని సనూతన జీవన ధర్మంగా తీర్చిదిద్ది అధునాతన సమాజానికి సంఘానికి ధార్మిక ఆధ్యాత్మిక మార్గాన్ని విస్పష్టంగా నిర్దేశించిన వేదమూర్తి శంకరులు. చిరుప్రాయంలోనే సమస్త విద్యలను కైవసం చేసుకొని కౌమార యవ్వన దశలలోనే మహా పండితులను వాదాలలో ఓడించి సమాధాన పరచి అద్వైత జీవన విధానాన్ని జాతికి వరదానం చేసిన అద్వైత మూర్తి శంకర భగవత్పాదులు. పరమ కరుణాలయంగా గురు శిష్య పరంపరను శృతిస్మృతుల వ్యాఖ్యాతగా ఆచార్యత్వాన్ని దైవం పట్ల అచంచల విశ్వాసాన్ని దైవీ శక్తుల పట్ల నిర్ద్వంద్వమైనటువంటి నమ్మకాన్ని నామ రూప భావాతీతమైన తత్వాన్ని అరచేతిలో ఆలకంగా అనుగ్రహించిన సరస్వతీ స్వరూపమే శంకరులు. ఎన్ని సిద్ధులు ఉన్నా వాటిని సమాజహితం చేసి ఎంత జ్ఞాన స్వరూపమైనా వినయమూర్తిగా సంచరించి సాక్షాత్తు శివ స్వరూపమైన లోకంలోని సాలోక్య సామీప్య సాన్నిధ్యాలను అనుగ్రహించి సాయుజ్య మార్గోపనం చేసి పరమహంస పరివ్రాజక సన్యాస స్థితులను తేటతెల్లం చేసిన పురాణ పురుషులు శంకర భగవత్పాదులు. శంకర వాంగ్మయము శంకరులు భిన్నం కాదు. జీవుడు దేవుడు భిన్నం కాదు. దేహం ఆత్మ భిన్నం కాదు. జనన మరణాలు చీకటి వెలుగులు దివా రాత్రాలు భిన్నం కావు. రెండుగా కనిపించే ఒకే సంగతి రెండోదంటూ మరొకటి లేదు ఉన్నది ఒకటే అదే ఆత్మ. అందరిలో అంతటా ఉన్నది అదే శూన్యము పూర్ణము అదే అవి రెండు స్థితులు అంతే. కాలడి నుంచి కేదారం వరకు సాగిన ముప్పై రెండు సంవత్సరాల శంకర అవతార ప్రవాహం భారతీయ చరిత్రలో ఒక అపురూప సన్నివేశం. అది పూర్ణా నది తీరంలో ప్రారంభమై హిమాచల సానువులలో సమైక్యమైన అత్యద్భుతమైన అద్వైత ధార. దేశం ఒకటే దిక్కులుగా జరిగిన విభజన మనిషి చేసుకున్నదే. శంకర స్మృతి నిత్యం సత్యం శాశ్వతం.
YouTube · audio

Shambhormurthihi

Home

Shambhormurthihi

Source: AIRHyderabad on YouTube

0:00 / 2:43