No transcript for this section.
Transcript begins at 0:06.
[మ్యూజిక్] వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వత్మ సుఖావబోధే జనస్యయే జంగలికాయమానే సంసార హాలాహల మోహ శాన్యయే. అనంతకోటి గురుస్వరూపాల మహా దివ్య స్మృతికి ప్రాంజలి ఘటిస్తూ, గురుపూర్ణిమ ఒక మహోత్సవం. నిజానికి ఉత్సవం అంటే అది వేడుక కాదు. ఉత్-సవము అది ఉత్కృష్టమైన యజ్ఞము అని పేరు. కాబట్టి ఈ మహోత్సవం గురుపూర్ణిమగా, వ్యాసపూర్ణిమగా అఖండ భారతావని అంటే ఆసేతు-సీతాచలం కూడా ఈనాడు అఖండ భారతావని జరుపుకుంటున్నటువంటి పరమ పవిత్ర పర్వదినంగా మనం భావన చేస్తాం. ఇది వ్యాసపూర్ణిమ ఎందుకయింది? నిజానికి ఇది ఆషాఢమాసంలో వచ్చినటువంటి పౌర్ణిమ. ఈ పూర్ణిమ వ్యాసులవారు అంటే పద్దెనిమిదవ వ్యాసులవారి కంటే ముందు పదిహేడు మంది వ్యాసుల వారు వచ్చారు. అసలు వ్యాసుడు అంటే ఉన్న విషయాన్ని విస్తృతంగా చెప్పేవాడు అని అర్థం. ద్వాపర యుగంలో ఒక చైతన్యం మూడు పాయలుగా చీలి ఒకే పేరుతో వచ్చింది. ఆ మొదటి పేరు కృష్ణ పరమాత్మ యోగీశ్వర కృష్ణుడు. రెండవది ద్రౌపది ఆమె పేరు కృష్ణ. ఇక మూడవది ఇదిగో ఈ ద్వైపాయనుడు ద్వీపంలో పుట్టాడు గనుక ద్వైపాయనుడు. ఆయన పేరు కూడా కృష్ణ. అందువల్లనే ఆయన కృష్ణ ద్వైపాయనుడు అయినాడు. అలాగే సరస్వతీ నదీ తీరం పక్కన రేగు పళ్ళ తోటలో భాగవతం రాశాడు గనుక బాదరాయనుడు అయినాడు. ఒక వేద రాశిని విభజన చేసి సామవేదంగా, ఋగ్వేదంగా, యజుర్వేదంగా మూడు భాగాలు చేసి దానిని త్రయి విద్యగా, బ్రహ్మ విద్యగా, పరా విద్యగా ఈ ప్రపంచానికి ఆవిష్కరించినటువంటి వ్యాసుల వారు ఈ లోకంలో తొలి గురువు. పరా విద్యగా ఈ ప్రపంచానికి వ్యాసుల వారు వేద విద్యని అనుగ్రహించినటువంటి కారణంగా, దానిని విస్తృతంగా వ్యాఖ్యానం చేసిన కారణంగా వ్యాసుల వారు ద్వాపర యుగం నాటికే తొలి లోకగురువు అయినారు. అంతే కాదు పౌరాణిక వాఙ్మయం అంతా కూడా పద్దెనిమిది పురాణాలు రచించి భారతీయమైనటువంటి వాఙ్మయానికి ఒక స్వరూపాన్ని ఇచ్చారు. అలాగే బ్రహ్మసూత్రాలు, ఐదు వందల యాభై ఐదు బ్రహ్మసూత్రాలు ఉన్నాయని అది వేద విద్యలో పరాకాష్ట అని చెప్పినటువంటి వారు వ్యాసుల వారు. వీటన్నింటితో పాటు వ్యాసయన గ్రథిత పురాణమునిన మధ్యే మహాభారతం మనకు తెలుసు. అంటే మహాభారత సంగ్రామ ఆ రణరంగం మధ్యలో శ్రీ కృష్ణ పరమాత్మ ద్వారా ఈ జాతికి అందినటువంటి భగవద్గీతని గ్రంథస్తం చేసినటువంటి వారు వ్యాసుల వారు గనుక ఈ పూర్ణిమని ప్రధానంగా మనం వ్యాస పూర్ణిమగానే భావన చేస్తాం, గౌరవిస్తాం, పూజిస్తాం, అనుసరిస్తాం, ఆచరిస్తాం, ఆరాధిస్తాం. దీనికి కారణం ఏమిటంటే వ్యాసుల వారు పుట్టిన రోజు కూడా ఈ వేళే, పద్దెనిమిది పురాణాలు పూర్తి చేసిన రోజు కూడా ఈ రోజే గనుక ఇంత బృహత్తరమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఈ గురుపూర్ణిమ కలిగి ఉంది. ఇంతకీ గురువు అంటే ఎవరు అని? ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాన్మే. ఆధార రహితుడై ఉంటాడు కానీ అన్నిటికీ ఆధారమై ఉంటాడు. ఈ సర్వ జగత్తుకి శబ్ద బ్రహ్మమై ఉంటాడు కానీ తాను నిశ్శబ్దమై ఉంటాడు. ఇంట, బయట, అంతటా, అన్నిటా, అన్నీ తానై సమస్త జగత్తుకి కూడా నైతిక, భౌతిక, ఆధ్యాత్మిక, లౌకిక, పారలౌకిక అనేటువంటి అనేకమైనటువంటి విద్యలని సూచన ప్రాయంగా అందిస్తూ మానవుడు తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉదాత్త స్థితికి, అక్కడి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఆపై యదార్థ స్థితికి తన మూలంలోకి వెళ్ళటానికి కావలసినటువంటి సమస్త మార్గాలని అనేక రూపాలలో, అనేక దశలలో, అనేక స్థాయిలలో, అనేక అవస్థలలో ప్రపంచానికి ఆవిష్కరించేటువంటి వాడు గురువు అవుతున్నాడు. మానవుడి యందు ఉన్నటువంటి అజ్ఞానము, అవిద్య, అనాచారము, అస్పష్టత, అవివేకము, అహంకారము, దంభము, గర్వము ఇవన్నీ ఉంటే వీటన్నింటినీ కూడా అణచి మానవుడిలో ఉన్నటువంటి మృదువైన, లలితమైన, మార్దవమైన, సరళమైన, సూటియైన, గంభీరమైన, ఉదాత్తమైనటువంటి మానవీయ భావనా పరిమళాన్ని ఈ ప్రపంచానికి అందే దిశగా మానవుడిని తయారు చేసేటువంటి వాడు గురువు అవుతున్నాడు. ఈ గురువు నిజానికి ఆహ్ కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే గురువు కాదు. అనేక రంగాలలో, అనేక శాస్త్రాలలో, అనేక పరిశ్వాలలో, అనేకమైనటువంటి కారణాలతో మార్గోపదేశనం చేస్తూ, అనేక విషయాలను కనిపెడుతూ, కనిపెట్టిన వాటిని పంచి పెడుతూ తద్వారా ఈ ప్రపంచాన్ని అంటే ఈ సంసారాన్ని, ఈ సృష్టిని ముందుకు నడిపించేటువంటి సనాతన సారథి అయి ఉన్నటువంటి వాడు గురువై యున్నాడు. సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైన ఒక ధర్మాన్ని ఆధారం చేసుకుని మానవుడు జీవించగలిగితే ఆ జీవితానికి ఒక పరమార్థం ఉన్నదని, సాఫల్యం ఉన్నదని, దానివలన మానవుడు పూర్ణుడు అవుతాడని, పూర్ణ మానవత్వానికి, మాధవత్వానికి పెద్ద తేడా లేదని గట్టిగా చెప్పగలిగిన వాడు, చెప్పేవాడు.చెప్పి ఆచరించి చూపించేవాడు గురువు అవుతున్నాడు గనుక ఇది ప్రత్యేకంగా గురుపూర్ణిమ గా మనం భావన చేస్తున్నాం. ఇవాళ మనమందరం ఏం చేయాలి? ఏ-ఏ రకంగా ఈ పవిత్రమైనటువంటి క్షణాలని మనం ఉపాసన చేయాలి అంటే మనకి అతి పిన్న వయస్సులో పలక మీద బలపంతో అక్షరాభ్యాసం చేయించి "ఓం నమశ్శివాయ" అని రాయిస్తూ తద్వారా అక్షరాభ్యాసం చేయించినటువంటి ఆ గురువు మనకు గుర్తుండడు కానీ ఆయన్ని స్మరించాలి. ఆ తర్వాత ప్రాథమిక మాధ్యమిక ఉన్నత తరగతులలో అనేకమైనటువంటి ఆ ఉపాధ్యాయులందరూ కూడా మనకు విద్యాబోధన చేసిన కారణంగా వారందరినీ కూడా మనం తలుచుకోవాలి. ఆ తర్వాత కళాశాల ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు మనకు అనేకమైనటువంటి శాస్త్రాల్ని విషయాలని బోధపరుస్తూ మన వ్యక్తిత్వ నిర్మాణానికి శిల్పాచార్యులై నిలకడ చెంది మనల్ని తీర్చిదిద్దినటువంటి మహా మహిమాన్విత స్వరూపులైనటువంటి ఉపాధ్యాయ బృందానికి మనం నమస్కరించాలి. వారిని మన స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఎవరు ఏ పాఠం చెప్పారు, ఎవరు ఏ నీతి బోధించారు, దేనివల్ల మనమందరం కూడా చక్కగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలిగాం, జీవితాన్ని భద్రతమంగా, సౌఖ్యంగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా గడపగలుగుతున్నామో దానికి కారణభూతులైనటువంటి ఈ గురువులందరినీ కూడా మనం స్మరించుకోవలసినటువంటి రోజు. అయితే గురువు అంటే ఏదో అజ్ఞానాన్ని పోగొట్టేవాడు అని మాత్రమే చెప్పబడుతూ ఉన్నది. కానీ అది మాత్రమే కాదు. "గుణాతీతుడు రూపరహితుడు గురువు" అని ఒక వేదాంత భాష ఉన్నది. అంటే ఆ మనలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు ఉంటాయి. ఈ మూడింటికీ అతీతమైనటువంటి గుణాతీతమైనటువంటి వాడు. రూపంలో ఉన్నా అంటే దేహంలో ఉన్నా, దేహం వదిలిపెట్టినా గురువు యొక్క స్మృతి, గురువు యొక్క శక్తి, గురువు యొక్క భావన, గురువు యొక్క ఆదర్శం, గురువు యొక్క ఆలోచన ఇవన్నీ కూడా మానవజాతిని పరిమళభరితం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అదొక నాగరికతా ప్రవాహంగా మనం భావన చేయాలి. అటువంటి గురువులని మనం ఇవాళ స్మరించుకోవాలి. అంతే కాదు ఆప్తవాక్యము ఎవరు చెప్పినా, వాత్సల్య పూరితమైనటువంటి ఒక పదము వాడినా, తద్వారా మన దుఃఖాన్ని వాళ్ళు పోగొట్టగలిగినా, ఒక కష్టంలో నుంచి మనను బయట పడవేసి మళ్ళీ మంచి మార్గంలో లేదా ఆనంద మార్గంలో మనల్ని తిరిగి ప్రవేశపెట్టగలిగిన ఆతడు కూడా గురువు అవుతున్నాడు. నిజానికి మనందరికీ జన్మ ఎత్తిన మనందరికీ మొట్టమొదటి గురువు ఎవరు అంటే మనకు తనువునిచ్చిన తల్లే తొలి గురువు. ఆ తల్లి తన చనుబాలతో ఒక సంస్కారాన్ని, ఒక జాతి యొక్క ఆత్మని, ఒక భాషని, ఒక స్పష్టతని, ఒక ఆలోచనే, ఒక సంస్కారాన్ని, ఒక ఉదాత్తమైనటువంటి వైఖరిని తాను అనుగ్రహిస్తూ రామాయణ, భారత, భాగవత, భగవద్గీతాది వాంగ్మయాలు అన్నింటినీ కూడా చిన్న చిన్న మాటలతో సరళంగా మనకి బోధిస్తూ మా రాముడు వలె ఎలా జీవించాలి, కృష్ణ పరమాత్మ వలె ఎట్లా skillful గా ఉండాలి, అంటే ఎంత ప్రజ్ఞాపూర్వకంగా ఉండాలి, చివరికి జ్ఞాన స్వరూపుడుగా ఎలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అని ఇవన్నీ చెప్తూ చెప్తూ చిన్న చిన్న కథలతో మనలో ఒక ఆధ్యాత్మిక భావ బీజాన్ని ఆ పాదుకొల్పేటువంటి ఆ మాతృమూర్తికి మనం ప్రథమ వందనం చేయాలి. కనుక తల్లే తొలి గురువు. ఆపై ఉపాధ్యాయులు, ఆపై అధ్యాపకులు, ఆపై అనేకమైనటువంటి ఆ మన జీవితంలో ప్రవేశించేటువంటి వారందరూ కూడా గురు స్వరూపాలు గానే భావించాలి. చూడండి జీవితంలో ఒక ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఆ ఎదురుదెబ్బ మనల్ని [గొంతు సవరించుకుంటూ] నిస్సత్తువలోకి, ఒక అలసత్వంలోకి, ఒక బాధలోకి, ఒక యాతనలోకి నెట్టినప్పుడు దాని నుంచి ఒక ఆప్త వాక్యంతో బయట పడేసి మళ్ళీ మనలో ఉన్న ఒక ఉత్సాహాన్ని, ఒక ఆనందాన్ని, ఒక శక్తిని, ఒక వీర్యాన్ని ప్రసాదించినటువంటి అటువంటి గురువులను కూడా మనం స్మరించుకోవాలి. అంతే కాదు [గొంతు సవరించుకుంటూ] భారతీయమైనటువంటి పౌరాణిక వాంగ్మయం నిండా ఉన్నటువంటి గురువులు, ఒక బృహస్పతి వంటి వారు అంటే గురువు అనబడేటువంటి వాడికి అసలు ఆయన పేరు బృహస్పతి. ఆయన్ని తలుచుకోవాలి. అలాగే దేవతలకి, దేవుళ్ళకి ఒక గురువు బృహస్పతి అయితే రాక్షసులందరికీ శుక్రాచార్యుడు గురువైనాడు. అంటే ఆ రోజుల్లోనే negativity కి ఒక గురువున్నాడు, positivity కి ఓ గురువున్నాడు. కానీ యుద్ధం ఎంత జరిగినా కడగా విజయాన్ని ఎవరు సముపార్జించి పెట్టారంటే దేవతలే గెలిచారు. దానికి కారణం సంయమనం, సహనం, సమర్పణ, శరణాగతి, శౌర్యము, ధీరవీర గంభీరమైన స్థితులు ఇవన్నీ కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి దేవతలకు చెప్పిన కారణంగా, నేర్పిన కారణంగా, ఆచార్యత్వం వహించిన కారణంగా దేవతలు ఎప్పుడూ విజయాన్ని సాధించారు. ముందు ఇబ్బందులు పడ్డా, ముందు చాలా సుఖపడ్డా, [గొంతు సవరించుకుంటూ] చాలా దుఃఖపెట్టినా ఏ-ఏ రకంగా ఉన్నా నెమ్మది నెమ్మదిగా రాక్షసులంతా సమసిపోయినారు, శుక్రాచార్యుడు ఏకాకిగా మిగిలిపోయినాడు. ఇది బలి చక్రవర్తి కథలో మనకు తెలుస్తుంది. వచ్చినవాడు విష్ణువు "నీకు పదవి ఉండదు, నీ వంశక్షయం అయిపోతుంది. వాడు అడుగుతున్నది మూడడుగుల నేల కాదు, మూడు భువనాలని ఆక్రమిస్తాడు. దానం చేయవద్దు" అని శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి చెప్తే బలి చక్రవర్తి అన్నాడు "నేను చేస్తున్న యాగమో, యజ్ఞమో ఆ విష్ణువు కోసమే చేస్తున్నప్పుడు ఆయనే నా వాకిట్లోకి వచ్చి కేవలం మూడడుగుల నేల అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నా దాన వ్రతం అంతా భంగం అయిపోతుంది. ఇక నేను చేసే దానానికి అర్థమే లేదు గనుక నేను దానం ఇస్తున్నాను" అన్నాడు.బలిదైత్యేంద్ర కరద్వయీ కృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాక్ష యోగిస్సు మనస్సం ప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికా శాదమున్ నళినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్ అని అటువంటి ఆ రెండు పాదాలు కడిగి మూడడుగుల నేలని కూడా ధారాదత్తం చేశాడు. ఎవరు? బలిచక్రవర్తి. అంటే ఆత్మోన్నతి వైపు, ఒక మంచి మార్గం వైపు, మంచి భావన వైపు, మంచి తలపు వైపు, మంచి సంకల్పం వైపు మానవుడు వెళుతూ ఉన్నప్పుడు గురువు గనక అడ్డుపడిన ట్లయితే ఆతన్ని ధిక్కరించినైనా ముందుకు వెళ్లమని మనకి భాగవతం చెప్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ గురుపూర్ణిమ అనేటువంటిది ఒక మహా విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి భావనా పరిధి. దానిలో మనల్ని మనం చక్కగా ఆవిష్కరించుకోవాలి. ఇక ఈ గురువులు లోకగురువులై ఉంటారు. అంటే లోకవిద్య నేర్పేటువంటి వాడు లోకగురువు. బోధ గురువు ఉంటాడు. బోధిస్తూ ఉంటాడు. విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఇదిగో ఇది ఇట్లా, ఇది ఇట్లా బాగా నేర్చుకో నాయనా అని ఉపదేశం చేస్తాడు, బోధ చేస్తాడు ఉన్న విషయాన్ని. తర్వాత సూచక గురువు ఉంటాడు. ఏం చేస్తే బాగుంటుందో చెప్తాడు, ఏం చేయకపోతే మంచి జరుగుతుందో చెప్తాడు. సూచన చేసేవాడు సూచక గురువు. తర్వాత వాచక గురువు ఉంటాడు. తన వాక్కు ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు. తర్వాత మోచక గురువు ఉంటాడు. మోక్షం అంటే ఏమిటి? కోరికలంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? వీటి స్వరూపం ఏమిటి? ఇవన్నీ మానవుణ్ణి ఎందుకని యాతన పెడుతున్నాయి? అని ఇవన్నీ మనకి చెప్తూ చెప్తూ మనల్ని చక్కగా మోక్షం వైపు అంటే మోహం పోగొట్టే దిశగా మనల్ని నడిపిస్తాడు గనుక ఆ మోచక గురువైనటువంటి ఆయన్ని మనం గుర్తు చేసుకోవాలి. సూచక, వాచక, మోచక గురువుల తర్వాత నిషిద్ధ గురువులున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఏం చేయాలో చెప్తారు, ఏం చేయకూడదో అంతే స్పష్టంగా చెప్తారు. తర్వాత దీక్షా గురువులున్నారు. ఇదిగో ఈ మంత్రం నలభై రోజులు చేసుకోండి మీకేదో మంచి జరుగుతుందని నలభై రోజులు మన మనస్సుని మంత్రమనే తాడుతో కట్టి అటూ ఇటూ కదలకుండా చేస్తాడు దీక్షా గురువు. ఆ దానితో పాటుగా మంత్ర గురువు ఉంటాడు. బీజాక్షర సమన్వితమైనటువంటి కొన్ని మంత్రాలను మనకు ఉపదేశనం చేసి, "ఈ మంత్రం చదువుకో, జీవితం సుఖంగా సాగుతుంది, మనస్సు నిలకడగా చెందు-- ఉంటుంది, నీకు ఆనందం కలుగుతుంది" అని చెప్తాడు. ఇవన్నీ అయిన తర్వాత దీక్షా గురువై, మంత్ర గురువైన తర్వాత కారణ గురువు ఉంటాడు. మనం అసలు ఈ జన్మ ఎత్తి ఎందుకు వచ్చాం? వచ్చినందుకు ఏం చేస్తున్నాం? ఈ చేస్తున్నదంతా మంచికే జరుగుతున్నదా? ఇవన్నీ గనక మనం విచారణ చేసినట్లయితే మనకి జీవిత పరమార్థము, జీవన సాఫల్యము అవి ఎట్లా సాధించుకోవాలో చెప్పి మా-- మానవుడు తన జీవితాన్ని ఈ రకంగా పారమార్థికంగా సాధించుకోవాలని చెప్పేటువంటి వాడు కారణ గురువు అవుతున్నాడు. విహిత గురువు ఉన్నాడు. ఆయన కూడా సర్-- అన్ని వేళలా హితాన్ని బోధిస్తూ, "నువ్వు మంచి మార్గంలో ఉండు. సంస్కరింపనేల సంఘమంతటి నీవు సజ్జనుండవగుము స్వార్థముడిగి, ఒక్క నీచుడప్పుడు ఉరివిలో తగ్గును" అంటూ చెప్పే ఆ గురువు ఉన్నాడు. కనుక ఎన్ని రకాల గురువులు ఈ భారతదేశంలో ఉన్నారో చూడండి. నిజానికి సమస్త మహా సృష్టికి గురు స్థానము ఎవరిది అంటే అసేతు సీతాచలం పరుచుకున్నటువంటి ఈ భారతదేశమే గురు స్థానంలో ఉన్నది. అది గురువై ఉన్నది. సమస్త విశ్వానికి గురువై ఉన్నది. సమస్త ప్రపంచానికి ధర్మబోధ చేసినది. నిజానికి ప్రపంచంలో దేవుడనేవాడు ఎప్పుడైనా మానవ దేహం తీసుకుని రావాలి అంటే అట్లా వచ్చినటువంటి దేశం ఒకే ఒకటి, అది భారతదేశం. అట్లాగే బోధ చేయటానికి, మానవుడిలో పరిణామ గతిశీలమైన భావనా స్ఫూర్తిని నింపటానికి, మనిషిని నడిపించటానికి, మానవతా పరిమళాన్ని నింపటానికి గురువుగా వచ్చినటువంటి ప్రదేశం ఏదైనా ఉన్నదా అంటే అది కూడా భారతదేశమే. ఇటు దైవము, అటు గురువు మాత్రమే కాదు శిష్యుడు ఏర్పడింది కూడా ఇక్కడే. మిగతా దేశాల్లో టీచర్, స్టూడెంట్ ఉంటాడు. అక్కడ గురువు, దైవం ఇవన్నీ ఉండవు. మనకి అంటే భారతదేశంలో ఇదొక గొప్ప సంప్రదాయం. నిజానికి మనందరికీ హనుమంతుడి కథ తెలుసు. హనుమంతుడు అతి చిన్న వయస్సులో సూర్యబింబాల్ని చూసి పండు అనుకొని సూర్యగోళం దాకా వెళ్లి అక్కడ ఆ పండు తినాలని ఒక ప్రయత్నం చేశాడు. సరే అది జరగలేదు. జరగటానికి వీల్లేదు గనుక జరగలేదు. కానీ ఆనాడే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. సర్వ కర్మలకు సాక్షి అయినటువంటి ఈ సూర్యనారాయణ దేవుడు ఎవరైతే ఉన్నారో, ఈయన నుంచి నేను సమస్త విద్యలు నేర్చుకోవాలి అనుకున్నాడు. అనుకొని తూర్పు కొండమీద ఒక కాలు, పడమటి కొండమీద రెండవ కాలు పెట్టాడు. పెట్టి ఎట్లాగైతే సూర్యబింబము ప్రారంభమై అస్తమించే దాకా సూర్యుడు భవమండలం మీద అంటే ఆకాశమనే తెరమీద ఎట్లా ప్రయాణం చేస్తున్నాడో తాను నేత్రావధానం చేస్తూ బ్రహ్మవిద్యనంతా కూడా గురువు దగ్గర నేర్చుకున్నాడు. అంటే ఈ దేశం భూగోళం మీద నుంచున్న హనుమకి ఖగోళంలో సంచారం చేస్తున్న సూర్యదేవుడు గురువైనాడు. అంటే గురుశిష్య సంబంధం ఎప్పుడూ ఎంత దూరంగా ఉంటుందో అంత దగ్గరగా ఉంటాయి. అందుకనే మనకి వేదాల తర్వాత వేదాలలో శిఖరప్రాయమైనటువంటి ఉపనిషత్తులు మనకివ్వబడ్డాయి. ఆ ఉపనిషత్తు అంటే ఏమీ లేదు. ఉప అంటే దగ్గరగా, నిషత్తు అంటే కూర్చొని. చూడండి ఒక హనుమ, ఒక సూర్యదేవుడు ఎంతో దూరంగా ఉన్నా విద్య-అందించబడింది. ఇక్కడ ఒక గురువు యొక్క పాదాల దగ్గర చాలా దగ్గరగా సన్నిహితంగా కూర్చుంటే గురువు బోధిస్తూ ఉంటే శిష్యుడికి కూడా ఆ అద్భుతమైనటువంటి విద్య ప్రసారమయ్యేది. ఆ ప్రసారం చేసినటువంటి సర్వోత్తమమైనటువంటి గురు స్థానమే ఈ భారతదేశం. కాబట్టి గురుపూర్ణిమ నాడు మనం గురువుని స్మరించటం అంటే గురువుని కీర్తించటం అంటే గురువుని పూజించటం అంటే ఏమిటి ఏం చేయాలి? దీనికి పరిహారాలు లేవు. పరమ పవిత్రమైనటువంటి రోజు ఇది. ఈ రోజున గురువాజ్ఞను పాటించటమే గురుకు దక్షిణ. మామూలుగా ఆ రోజుల్లో గురుకులాలలో విద్య నేర్పిన తర్వాత దక్షిణ గురువు అడిగేవాడు కాదు శిష్యుడే ఓ తనకు తోచినది ఆ గురువు గారికి అప్పచెప్పి వెళ్ళేవాడు, ఇచ్చేవాడు. ఇ-ఇవ్వాలాగా కాదు ఇవ్వాల విద్య అమ్మబడుతున్నది. ఆ రోజు అమ్మకం లేదు అక్కడ నమ్మకమే ప్రధానం. భగవంతుడు ఉన్నాడు దేవుడున్నాడు అనేటువంటి ఒక పంచాక్షరిని నిలబెట్టడానికి ఏర్పడినటువంటి గురుకుల విద్యా విధానంలో మానవుడు సముదీర్ణమైనటువంటి ఒక స్థితిలోకి వెళ్ళాడు. సర్వోత్తముడు కాగలిగాడు. కాబట్టి ఇవ్వాళ గురు దక్షిణ అంటే తాంబూలంలో డబ్బు పెట్టి ఇవ్వటం గురు దక్షిణ కాదు. అంటే ఏమిటంటే సమర్పణ, శరణాగతి, వినయము అని మూడు ఉన్నాయి. ఈ మూడు ఎప్పుడైతే గురువు దగ్గర మనం నేర్చుకొని వారి దగ్గర నుంచి మనం తీసుకొని ప్రపంచంలోకి వస్తామో అన్నీ కూడా ఈశ్వర ప్రీతి కోసమే చేస్తున్నామని, అన్నీ శరణాగతి భావంతో చేస్తున్నామని, అన్ని శాస్త్రాలు తెలిసినా వినయంగా ఉన్నామని, ఈ మూడు ఉంటే మానవత్వం పరిపూర్ణంగా వికాసమానం చెందుతుంది. కనుక రేపు ఏం చేయాలి అంటే గురువులను స్మరించుకోవాలి. అలాగే గురువులకి [గొంతు సవరించిన శబ్దం] ఇవాళ పాదపూజలు జరుగుతూ ఉన్నాయి. పాదపూజలు లేవు ఎక్కడా పాదుకా పూజలు మాత్రమే ఉన్నాయి. గురుపాదుకా స్తవంలో శ్రీభూవిత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదభిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ఆ నిక్షితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం అని ఒక మాట ఉంది. అంటే గురువు యొక్క పాదము అంటే అరికాళ్ళలో అగస్త్య రేఖలు ఉంటాయి మన చేతిలో కర్మ రేఖలు ఉంటాయి గురువు యొక్క పాదాన్ని గనుక మనం చేతితో తాకినట్లయితే మనం చేసుకున్నటువంటి కర్మలు మనల్ని యాతన పెట్టకుండా బాధించకుండా పెద్దగా పోయేవన్నీ కొద్దిగా పోయేట్టుగా చేస్తాయి అంతేతప్ప గురువు కూడా మనల్ని కర్మ నుంచి బయట పడేయలేడు అని ఒక rational గా ఒక అద్భుతంగా ఆవిష్కరించినటువంటిది గురు పాదుకలకు మనం నమస్కరిస్తాం. అందుకనే శ్రీమద్రామాయణంలో [గొంతు సవరించిన శబ్దం] శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు వచ్చి తన అన్న గారితో మాట్లాడి, "వెనక్కి వచ్చి నువ్వు అయోధ్య నగరాన్ని ఏలుకో తండ్రి లేడిప్పుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం నువ్వు వచ్చావు మంచిదే కానీ తండ్రే లేడు కనుక ఆయన ఇచ్చిన ఆజ్ఞ కూడా ఆయనతో వెళ్ళిపోయింది. నువ్వచ్చి సింహాసనం అధిష్టించవ్వు" అన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఒప్పుకోలేదు. "పధ్నాలుగు సంవత్సరాల వనవాసం నాకు విధింపబడింది కనుక నేను ధర్మాన్ని పాటించి పధ్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం చేస్తాను" అని ప్రమాణం చేస్తే భరతుడు చాలా సమయం తర్వాత ఏమడిగాడంటే, "నీవు [stutter] తొడుక్కున్నటువంటి పాదాలు గన-పాదుకలు గనుక నాకు ఇచ్చినట్లయితే వాటినే నిన్నుగా భావించి నువ్వు వచ్చేవరకు అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామంలో ఉండి ఆ నీ రాకకై ఎదురు చూస్తుంటాను. నీకూ నీవు ధరించిన పాదుకలకి ఏమీ తేడా లేదు" అన్నాడు. జంకారమ్మగు సామగానములతో సేవాలునీ గీతికాలంకర్మీణ మనోజ్ఞ దానములతో లావణ్య రేఖానితాంతంబై చను పాదుకాయుగమన్ ప్రొజ్జత్సింహ పీఠంబుపై శంఖాపేతముగాగ ఉంచి రఘువంశ స్వామిగా చూచుచున్ అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో. ఆ రాముడి పాదుకలు కేవలం రామ స్వరూపంగా భావించిన భరత స్వామి అయినాడు ఆయన. కాబట్టి ఈ దేశం భ్రమర కీటక న్యాయ విశేషంతో ఒక చిన్న పురుగు జంకారం చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటే ఆ జంకారము విని విని ఈ పురుగు మళ్ళీ భ్రమరమై పోతున్నట్లుగా శిష్యుడు తన గురువు దగ్గర అనేక విషయాలు నేర్చుకుని నేర్చుకుని అని అని మననం చేసి ఆచరించి అనుభవించి అనుభూతిని చెంది విభూతి స్థాయికి వెళ్ళి తాను గురువు అవుతున్నటువంటిది ఈ దేశంలో మాత్రమే మనం చూస్తాం. కనుకనే మనకో నానుడి ఉంది గురువును మించిన శిష్యుడు. ఈ శిష్యుడు ఎప్పుడూ తనకంటే గొప్పవాడు కావాలి అని గురువు అనుకుంటాడు. నేను ఎంత గొప్పవాడినైనా గురువు పెద్ద గీత నేను ఎప్పటికీ చిన్న గీతనే అనేటువంటి వినయ భూమికలో నిలకడ చెందుతాడు శిష్యుడు. గనుక ఇది గురు శిష్య సాంప్రదాయానికి రేపు పట్టాభిషేకం. ఆ రేపు పొద్దున చేయవలసినటువంటి పనులు ఇవే. మనకి ఎవరు పాఠం చెప్పారో, ఎవరు మంచి మార్గంలో ప్రవేశపెట్టారో, ఎవరు మనల్ని కాపాడారో, ఎవరు మనకు మంచి ఆలోచనలు సద్బుద్ధిని ప్రసాదించారో, సన్మార్గాన్ని ఉపదేశనం చేశారో, సూచించారో అటువంటి ఆ గురువులందరినీ కూడా మనం తలుచుకోవాలి. ఇది ఏ విద్య గురువు ఆత్మవిద్య మాత్రమే కాదు సైన్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు. ఇదిగో నా ముందున్న కెమెరా, కెమెరా నడుపుతున్న వ్యక్తికి ఓ గురువు ఉన్నాడు. అతనికి ఆ గురువుకి ఇంకో గురువు ఉన్నాడు. కనుక ఇది ఒక అద్భుతమైన గురువు, పరమగురువు, గురువులకు గురువు ఇట్లా అనేకమైనటువంటి ఈ గురు సాంప్రదాయం. ఉదాహరణకి రామాయణంలో శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణ మూర్తే, పరబ్రహ్మమూర్తి అయినప్పటికీ కూడా ఆయనకి ఒక బ్రహ్మర్షి అయిన వశిష్టుల వారు జ్ఞాన గురువు అయితే రెండవ బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు లోక గురువు అయినారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు అయినప్పటికీ కూడా ఆయన కూడా శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ కూడా సాందీపుడు గురువైనాడు.కడగా ద్వాపర యుగం చివరలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ సఖుడా, స్నేహితుడా, బంధువా, బావా అన్నీ దాటి గురు స్థానంలో కూర్చొని భగవద్గీతను అర్జునుడికి బోధ చేశాడు. చూడండి ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సంప్రదాయం ఇది. ఈ సంప్రదాయ పీఠికలో మానవుడు గురుపూర్ణిమ నాడు రేపు ఆ పూర్ణిమ అంటే వెన్నెల. ఆ వెన్నెల వెలుగు అవి భిన్నం కావు. వెన్నెల పదిహేను రోజులు ఉంటుంది వెలుగు అన్ని వేళలా ఉంటుంది. మరి ఈ వెలుగు ఎక్కడ ఉంటుంది? సూర్యుడు ఉదయించి అస్తమించే దాకా సూర్యకాంతి ఉంటుంది. సూర్యుడు వెళతాడు చంద్రుడు వస్తాడు చంద్రకాంతి వస్తుంది. ఈ సూర్యుడి కాంతిలో వేడిమి, పోడిమి, తాళిమి ఉంటాయి. సమస్త ప్రకృతి చైతన్యాన్ని సంతరించుకుంటుంది. బలవత్తర మవుతుంది, బలీయమవుతుంది. బలాఢ్య మవుతుంది. చంద్రుడి కిరణాలు సుషుమ్నా కిరణాలు. దాని నిండా ఔషధులు ఉన్నాయి గనుక ఆ కిరణాల వలన మనసుకు శాంతి, ప్రశాంతి, ఒక హాయి, ఒక చల్లదనము, ఒక నెమ్మదితనము ఏర్పడతాయి. కానీ విచారణ చేసినట్లయితే సూర్యకాంతి పన్నెండు గంటలు చంద్రకాంతి మరి మరొక పన్నెండు గంటలు ఉంటూ ఉన్నది. మరి అన్ని వేళలా ఉండే వెలుగు ఎక్కడ ఉన్నది? వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థ భూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వము నందును వేరు చోట లేవు. అలకుడు, శిష్యవత్సలుడు, అంబుధి శోషణ దాహమూర్తికిన్, వెలుగుల నిధికిన్, గురుత్తమునకున్, జగదక్షునకున్ నమస్కరించెదన్ అంటాడు హనుమ. అంటే సముద్రానికి గనక దాహం వేస్తే ఎట్లా? ఇది ప్రశ్న. సముద్రం నీరెప్పు-- ఎప్పుడూ ఉప్పుగా ఉంటాయి. ఆ ఉప్పుగా ఉండేటువంటి నీటిని భరించి ధరించినటువంటి సముద్రుడికి కూడా దాహం వేస్తే ఏమవుతుందంటే, సూర్యకాంతి దానిమీద పడినప్పుడు ఉపరితలం మీద పడినప్పుడు అది నెమ్మదిగా ఆవిరై మేఘమై కాలమేఘమై కాళమేఘమై నెమ్మదిగా త్రిళ్ళి బళ్ళున తెగి మళ్ళీ వర్షం పడ్డప్పుడు సముద్రుడి యొక్క దాహం తీరుతుంది. అట్లాగే ఈ గురువు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా శిష్యుడి యొక్క దాహార్తిని తీర్చగలిగినటువంటి వాడు జగదక్షుడై ఉంటాడు. రెండు కళ్ళు సూర్య, చంద్ర అవి రెండు నాడులు. ఆ నాడులతో ఈ వెలుగులో ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది గనుక జగదక్షునకున్ శిష్యుడు. ఆ శిష్యుడికి శిష్యుడి పట్ల వాత్సల్యం ఉంటుంది. వత్సలము అంటే బిడ్డ. శిష్యుణ్ణి తన బిడ్డగా భావించేవాడు నిజమైనటువంటి గురువు. కాబట్టి ఆ శిష్యత్వంలో నుంచి ఆ తాను తన గురువుని ఆరాధించాలి. మరి ఎవరు శిష్యుడు అంటే తన ఉనికిని, తన అస్తిత్వాన్ని, తన వ్యక్తిత్వాన్ని తనను తాను సంపూర్ణంగా పోగొట్టుకుని తాను ఖాళీగా నిలకడ చెందినటువంటి వాడు. అంటే just like a white paper అది ఖాళీగా ఉంటుంది ఎప్పుడూ. అటువంటి స్థితిలో ఉన్నటువంటి శిష్యుడే దేనినైనా పొందగలడు, దేనినైనా ఆవేశింపుచుకో గలడు, దేనినైనా ఆచరించగలడు. ఇది గురు శిష్య సంప్రదాయానికి మనం చేస్తున్నటువంటి ఒక పూజ ఇది. ఇది కేవలం గురువు అని మాత్రమే గాక ఆచార్య శబ్దం ఒకటున్నది. ఆచార్యుడు అంటే ఎవరు అంటే ఎవరు ఆచరించి బోధిస్తారో మిగతా వాళ్ళంతా బోధిస్తారు. ఈయన తాను ఆచరించి బోధిస్తాడు. అటువంటి వారు మాత్రమే ఆచార్యులు అవుతారు. ఈ ఆచార్యత్వంలో నుంచి సత్యాచార్యులు వచ్చారు. ఆ సత్యాచార్యులు ఎవరంటే శంకర భగవత్పాదులు. శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా. ఈ శంకరుడు ఒక దేహం తీసుకుని ఆచార్య రూపంలో గనుక వస్తే ఆయనే శంకర భగవత్పాదులు అయినారు అని మనకు వాయు పురాణంలో ప్రమాణం ఉంది. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు కొన్ని వేల సంవత్సరాల క్రితం అఖండ భారతావని చీలికలై, పేలికలై సనాతన ధర్మానికి దూరమై ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ వచ్చి సనాతనమైన, వైదికమైనటువంటి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసి అనేక స్తోత్రాలు రచించి ప్రకరణాలు, భాష్యాలు రాసి మళ్ళీ ఈ ప్రపంచాన్ని ధర్మ మార్గోపదేశనం చేసి భగవంతుని వైపు జాతి మనస్సుని మరల్చినటువంటి వారు శంకర భగవత్పాదులు. వారు చేసినటువంటి, వారు స్థాపించినటువంటివే ఆమ్నాయ పీఠాలు. ఆ ఆమ్నాయ పీఠాలే రేపు గురుపూర్ణిమని ప్రా-- ఆధారం చేసుకుని ప్రారంభంగా శుభ ముహూర్తం చేసుకుని చాతుర్మాస్య దీక్షకి ఈ జగద్గురువులంతా కూడా ఉపక్రమించేటువంటి పరమ పవిత్ర కాలము రేపు. వ్యాస పూజ, వ్యాస పూర్ణిమ, గురుపూర్ణిమ అలాగే పీఠాధిపతులు జగద్గురువులంతా కూడా చాతుర్మాస్య దీక్షా కంకణ బద్ధులై జాతికి ఒక సనాతన ధర్మాన్ని మళ్ళీ నెలబెట్టి ప్రతిరోజూ ధర్మ ప్రచారం చేస్తూ, ప్రసారం చేస్తూ, ధర్మోపదేశం చేస్తూ మానవుణ్ణి ధర్మ మార్గంలోకి దానము, ధర్మము, భిక్ష, విద్యాభిక్ష ఇవన్నీ కూడా అనుగ్రహిస్తూ జాతిని పునరుజ్జీవనం చేసేటువంటి మహోపేతమైనటువంటి పుణ్యకాలము కాబట్టి ఇది కాలే స్థలే జలే కాలము గొప్పది, స్థలాలు గొప్పవి అంటే భారతదేశం గొప్పది అందున జలే అందరము కలిసి రేపు పొద్దునంతా సమష్టిగా, సామూహికంగా మనం గురుపూర్ణిమని ఆ మహోత్సవంగా చేసుకుంటాం గనుక చాతుర్మాస్య దీక్ష చూడండి ఇవాళ ఆ హైదరాబాద్ లో తెలుగువారి పీఠం అయినటువంటి పుష్పగిరి పీఠం ఇక్కడ గురువుగారు రేపటి నుంచి పీఠాధిపతి శ్రీ శంకర విజాభారతి స్వామివారు వారు ప్రారంభిస్తారు. కాకినాడలో కంచి జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు వారు ప్రారంభిస్తారు. ఎక్కడికక్కడ పీఠాధిపతులు అందరూ కూడాచాతుర్మాస్య దీక్షని అవలంబించి మనందరినీ కూడా భగవంతుని వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి మనమేం చేయాలి అని. మనం కూడా దీనినొక చాతుర్మాస్య దీక్షగా ఒకప్పుడు చాతుర్మాస్యం అంటే నాలుగు నెలలు. దాన్న ఇప్పుడు మనం నాలుగు పక్షాలుగా చేసి రెండు నెలలుగా కుదించుకున్నాం. దేశకాల పరిస్థితులను బట్టి మనం కూడా రేపటి నుంచి దీక్షాబద్ధులం కావాలి. విద్యని అభ్యసించాలి. మంచి విద్యని నేర్వాలి. నేర్చిన విద్యకు పదును పెట్టాలి. పదును పెట్టిన విద్యని ప్రపంచానికి ఇవ్వాలి. ప్రపంచానికి ఇవ్వటం ద్వారా మనం సేవ చేయాలి. ఇవన్నీ కూడా మనం సమస్తము కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే గురుపూర్ణిమ ఏదో వచ్చి పోయే వ్యాస పూర్ణిమ కాదు, ఏదో అన్ని పౌర్ణమిలాంటిది కాదిది. అషాఢ పౌర్ణమి ప్రధానమైనటువంటి గురుపూర్ణిమ రేపు మనం ఆ ఇవాళ నుంచి రేపుగా అంటే ప్రారంభం చేసుకుంటూ రెండు నెలలు దానికి రేపంటూ లేదు రేపు మొదలవుతుంది. ఈరోజు మొదలవుతుంది. రేపుగా రేపు రేపు అంటూ సుమారుగా అరవై రోజులు నడిచేటువంటి ఈ గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమగా అలాగే మనందరి జీవితాలలో వెలుగును నింపే పూర్ణిమగా మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్షుని, అనంతమైన ఆనందాన్ని కలిగించి ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి గురుపూర్ణిమగా మనం భావన చేస్తూ మీ మీ గురువులు మీ కనుక తల్లి ఆ వారు పెద్దవారు అయినప్పటికీ ఉన్నట్లయితే వారి పాదాలకు నమస్కరించి వారిని గౌరవించండి. మీ సంపాదనలో ఆమెకి ఏదైనా కొని ఒక చీర ఆమెకిచ్చి వస్త్రం ఇచ్చి ఆమెకి ఆ గౌరవాన్ని ప్రతిపాదన చేయండి. అది వంద రూపాయల చీర కావచ్చు, ఏ ఎంతైనా కావచ్చు మన శక్తిని బట్టి. కాబట్టి తల్లి తొలి గురువు. తర్వాత విద్యా గురువులను గౌరవించండి. ఆపై ఆధ్యాత్మిక గురువులను కూడా గౌరవించి గురుపూజ చేయండి. గురు వందనం చేయండి. గురు సత్కారం చేయండి. గురువుని కాపాడుకోండి. అంటే కాపాడటం అంటే గురువే మనల్ని రక్షిస్తాడు. గురువు ధర్మ మార్గాన్ని చెప్తాడు గనుక ఆ గురువులోనే ధర్మాన్ని, ధర్మంలోనే గురువుని ఈ రెండింటిని సనాతనమైన హైందవమైనటువంటి మానవీయ ధర్మాన్ని గనుక ఆవిష్కరించుకోగలిగినట్లయితే అది ఒక అపూర్వమైనటువంటి పూజగా మనం భావన చేయాలి. ఎందుకంటే పూజలు ప్రత్యేకంగా ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరకు వెళ్ళినా వారి వారి వారి సందర్భాలలో మనందరం కూడా మన మనస్సుని గురువు యొక్క పాదపద్మముల యందు లగ్నం చేయాలి. ఎంత సురూపం ఉన్నప్పటికీ, ఎంత సౌందర్యం ఉన్నప్పటికీ, ఎంత అందమైన భార్య ఉన్నప్పటికీ, ఎంత అనంత అష్ట ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ, ఆకాశాన్ని ఆవరించిన వెన్నెల వంటి కీర్తి ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ కూడా గురు పాదపద్మముల యందు మన మనస్సు గనుక లగ్నం చేయకపోయినట్లయితే ఇవి ఏవీ శోభిల్లేవని చెప్పేటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలాన్ని, పరమ పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని, ఈ సన్నివేశాన్ని మనం ఆచరిస్తూ మన కడుపున పుట్టినటువంటి బిడ్డలకు కూడా ఈ సంప్రదాయాన్ని, ఈ గురు సంప్రదాయాన్ని, గురు శిష్య బాంధవ్యాన్ని అలాగే ఆచార్యత్వాన్ని ఆచార్యుడు, అంతేవాసి ఎట్లా కలిసి మెలిసి జీవించాలో "సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై" అని మనందరం కలిసి మెలిసి ఉండాలి, కలిమిని పెంచాలి, కలిమిని పంచాలి. సుఖము, దుఃఖము, ఆనందము అన్నీ అందరం కలిసి ఒక సమాజంగా, సమష్టిగా మన జీవితాలను చక్కగా వెలార్చుకోవాలి అని భావన చేస్తూ ఈ గురుపూర్ణిమ మీ అందరికీ కూడా మీ ఈ యొక్క తరానికి మాత్రమే కాక రాబోయే మీ ఇరవై యొక్క తరాలను ప్రభావితం చేసే దిశగా ఈరోజు ఆ పూర్ణిమా మాలికలు జీవితమంతా నిండాలని అలాగే ఈ సమస్త ప్రపంచము అనేకమైన రుగ్మతలు, ఆందోళనలు, ఒత్తిళ్ళు వీటన్నింటి నుంచి బయటపడి పరమ ప్రశాంతమైన, ప్రసన్నమైన, హాయి అయినటువంటి జీవితాలని అనుభవించే దిశగా గురువులందరు మనకు వరదానం చేయాలని అనంతకోటి గురు స్వరూపాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంగళాశాసనం చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.
YouTube · audio
గురు పౌర్ణమి విశిష్టత | VSR Murthi | Guru Pournami | Vyasa Pournami | Guru Purnima 2022 | Mirror TV
గురు పౌర్ణమి విశిష్టత | VSR Murthi | Guru Pournami | Vyasa Pournami | Guru Purnima 2022 | Mirror TV
Source: Mirror TV Official on YouTube
0:00 / 34:44