Skip to content
Transcript తెలుగు
అందుకనే సహస్ర శీర్షా పురుషః అంటే ఏంటి వెయ్యి మంది అక్కడ కూర్చు సహస్ర అంటే అనేకము అని. అనేకం ఐదుగురు కావు ఏకంగానేదంతా అనేకమే. ఇద్దరు కూర్చున్నా అనేకమే. ఏకము కానీ అనేకం ఏదైతే ఉన్నదో అనేకం అంతా కలిపితే నేను అన్నాడు. అనేకం అంతా మాయమైపోయినా ఏకమైన నేను మాత్రం ఉంటున్నాను అన్నాడు. నేనే నిత్య సత్య శాశ్వతమైన వస్తువుని. అందుకనే నా పేరు సద్వస్తువు. సద్వస్తువు ఎక్కడ ఉన్నది? మానవ దేహంలో ఉన్నది, జీవుడి దేహంలో ఉన్నది అంటూ జిజ్ఞాస కలిగిస్తూ కలిగిస్తూ శంకర భగవత్పాదులు పరిపూర్ణమైనటువంటి ఒక దివ్య ಜೀವನ విధానాన్ని జగత్తుకి ఇచ్చారు. ఒక గురువుగా ఆయన బోధించిన కొన్ని ప్రామాణిక ప్రాథమిక సూత్రాలని విచారణ చేద్దాం అది చాలా అవసరం. ఇది ఆయన జీవన గాథలో ఏర్పడినటువంటి సన్నివేశాలు. ఒకటిది మొట్టమొదటిది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఏకం ఏవా ఒకటే ఉన్నది. ద్వితీయం లేనిది బ్రహ్మముగా ఉన్నది. ఇదిగో ప్రపంచం ఒకటే. ప్రపంచమూ బ్రహ్మమూ జగన్నాయకుడు జీవుడు అంతా కూడా ఒకటే ఏకరూపమే. ఏకరూపంగా కనిపిస్తున్నది నిజానికి ఒకరోజున అరూపమే. దాని బొమ్మే లేదు. కాబట్టి బొమ్మలో బ్రహ్మను చూడు బ్రహ్మలో బొమ్మను చూడు ఇది మొదటి మాట. రెండవది నీకు ఎన్ని శక్తులు ఎన్ని సిద్ధులు ఉన్నా వాటిని నీ స్వార్థం కోసం వాడుకోకు అదే కనకధారాస్తంభం. నేను ఇలా అమ్మవారిని ప్రార్థించానో లేదో టన్ను బంగారపు ఉసిరికాయలు వచ్చి పడిపోయాయి. ఎందుకీ సన్యాసం? అమ్మవారినే ప్రార్థిస్తే ఇంకో రెండు టన్నులు రావచ్చు కదా అనుకున్నారా భగవత్పాదులు. ఆమె కోసము మాత్రమే ప్రార్థించారు. మనం కూడా మనకోసం ప్రార్థించుటంతో పాటుగా మన పక్కవాడి కోసం కూడా ప్రార్థించాలి. అది నిజమైన ప్రార్థన. మనం ఇంకోటి కోసం చేసే ప్రార్థన వలన మనకు సుఖమూ, సంతోషమూ, ఆనందమూ, ముక్తి లభిస్తాయి. మనకోసం మనం చేసే ప్రార్థన వలన సామాన్యమైన కోరికలు తీరుతూ ఉంటాయి. మరి ఎటువంటి ప్రార్థన చేయాలో మనం నిర్ణయించుకోవాలి. ఆకలిగొన్న వాడికి, ఔషధం కావలసిన వాడికి, జీవితం గడవని వాడికి, తల్లిదండ్రులు లేనివాడికి, ఆసరా లేనివాడికి, వాడి కోసం గనక మనం ప్రార్థించినట్లయితే వాడి ఆనందమే మనకు ఆహారం అవుతుంది కనుక పరమేశ్వరుడు అనే మాట సత్యసాయి భగవానుడి మాటే మీ ఆనందమే నాకు ఆహారం అన్నారు. డెభై రెండేళ్లు మాటలో మార్పు లేదు. నేను ఇది తిన్నాను అది తిన్నాను అనలేదు. మీరందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అంటే మీరు బింబం అయినప్పుడు నేను ప్రతిబింబం అవుతున్నాను, నేను బింబం అయినప్పుడు మీరు నా ప్రతిబింబాలుగా ఉన్నారు. మనిద్దరం ఒకటే యు ఆర్ మీ యామ్ యు. త్వమయవాహం సంశయః నీకూ నాకూ తేడా ఏం లేదు. తేడాలొ ఒక్కటే. నేను పరమాత్మను అన్న భావన నాకు ఎరుకలో ఉన్నది. ఎరుకలోకి మీరు ప్రయాణం చేస్తున్నారు కనుక రెండు ద్వైతంగా కనిపిస్తున్నాయి. శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యంలో ప్రామాణికమైన సత్ప్రమాణికమైనటువంటి భాష్యము ఇదే. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటూ ఐదు వందల యాభై ఐదు బ్రహ్మసూత్రాలను ప్రపంచానికి అందించారు. బ్రహ్మసూత్రాలు అమ్మో మాకొద్దు, మాకేదన్నా విశ్వేశరాష్టకం, సరస్వతీ అష్టకం, లేదా రామాష్టకం, దుర్గాష్టకం ఇస్తే చాలు అనే వాడికి బ్రహ్మసూత్రాలలో అంత భయంకరమైన విషయాలు లేవు. ఉన్నదంతా మనస్సు తర్కం చేసి, విచారణ చేసి, with a sense of reasoning radical గా rational గా సత్యాన్ని ఎదుర్కొనేటువంటి, సత్యాన్ని కనుగొనేటువంటి ప్రయత్నమే, దానిమీద వ్యాఖ్యానమే బ్రహ్మసూత్రములు. సూత్రాలు points అవి. ఒక మాలగా వేశారు. దేనిని గురించి? అంతా బ్రహ్మాన్ని గురించే. జీవుడు బ్రహ్మ, ప్రకృతి బ్రహ్మ, కాలము బ్రహ్మ, కర్త బ్రహ్మ, అనంతము బ్రహ్మ, జ్ఞానము బ్రహ్మ, యజ్ఞము బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ, దీప ధూప నైవేద్యములు బ్రహ్మ, అసలు ఉన్నదే భం బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ. దీన్ని మొత్తం పూర్ణం చేసి, దీనిని బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం చేశారు. ఇటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడు జగత్తులో ఏం చేయాలంటే మనం ఇవాళ ఐదు రోజులు చేస్తున్నది అదే. వాళ్ళ జీవిత గాథలు ప్రపంచానికి పరిచయం చేయడం మన పని కాదు. అవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. పది రూపాయలు పెడితే వాళ్ళ జీవితాలు ఎప్పుడు పుట్టారు, ఎన్నాళ్ళు ఉన్నారు, ఎప్పుడు దేహం చాలించారు, అవన్నీ data ఉంది. ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏమిటంటే వాళ్ళు జగత్తుకి ఏం బోధించారు? అద్వైత సిద్ధిని పొందమన్నారు. ఆనంద సిద్ధిని పొందమన్నారు. జీవితాన్ని ఇటువంటి మహోత్కృష్టమైన జీవితాన్ని ఎన్ని తపస్సులు చేసి, యాగాలు, యోగాలు చేసి పొందావో దానిని సఫలీకృతం చేసుకుంటూ సమాజహితమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాలి అనేది శంకర భగవత్పాదుల ప్రబోధం. అంతే కాదు కులము చేత, మతము చేత, గుణము చేత, సంపద చేత మనస్సులు గనక విడిపోతూ ఉన్నట్లయితే అన్నింటినీ జోడించుకొని అందరం ఒక్కటే, మన యందున్న ఆత్మ ఒక్కటే అన్న నిశ్చల నిర్మల నికేతన నిరంజన భావనలో నిశ్చలంగా మనీషగా ఉండమన్నారు శంకర భగవత్పాదులు. అలాగే భగవద్గీతకి శంకర భగవత్పాదులు ఒక భాష్యం రాశారు. భగవద్గీత మీద వ్యాఖ్యానం రాయని వాడు ఎవడూ లేడు. కొన్ని వేల లక్షల వ్యాఖ్యానాలు వచ్చినాయి. ప్రతి వాడు నాలుగు అధ్యాత్మ ముక్కలు గనక నోటికి వస్తే భగవద్గీత మీదో వ్యాఖ్యానం రాద్దామని ఒక చాపల్యం పుట్టి రాసేస్తూ ఉంటారు. కానీ శంకర భగవత్పాదుల శాంకర భాష్యం ఏదైతే ఉన్నదో అది సప్రమాణికము, సార్వకాలికము, అది అచ్చము, అది సత్యము. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని గ్రహించి దానిమీద వ్యాఖ్యానం చేశారు. అంతటా మీద చేశారా? కొన్నింటి మీదే చేశారు.ఆ కొన్నింటి మీద చేసిన వ్యాఖ్యానాన్ని గనుక మనం గమనించినట్లయితే మిగతా వ్యాఖ్యానాలన్నీ కూడా గాలికి కొట్టుకుపోతాయి, ప్రయోజనం లేదు వాటివలన. కాబట్టి ఎవరెవరు ఆ-ఆ జీవులు తమ తమ సంస్కారాన్ని బట్టి వ్యాఖ్యానం చేశారు. వస్తువు ఒక్కటే, దర్శనాలు వేరు, చూపులు వేరు, అర్థం చేసుకోవటాలు వేరు, అనుభవించటాలు వేరు, అనుభూతులు చెందటాలు వేరు కానీ యదార్థమైనటువంటి సత్యం మాత్రం అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్య జ్ఞాన అనంతములు బ్రహ్మముగా, బ్రహ్మమే సత్యంగా, బ్రహ్మమే జ్ఞానంగా, బ్రహ్మమే అనంతంగా ఉన్నది అన్నటువంటి బోధ. ఇంత మహా జ్ఞాని కదా! తల్లికి తాను ఎప్పుడో ఒక మాట ఇచ్చారు. అవసాన దశలో "నాయనా! నా ప్రాణ నిర్గమన వేళను నా దగ్గర ఉండాలి" అంటే ఒక మహత్తరమైన యోగవిద్య ద్వారా ఎక్కడో ఉన్న శంకర భగవత్పాదులు తమ తల్లి దగ్గరికి చేరుకున్నారు. చేరుకుంటే, ఆనాటి సమాజం ఛాందస సనాతన బ్రాహ్మణ సమాజం. "నీవు సన్యాసివి గనుక నీ తల్లికి దహన కార్యక్రమాలు చేయటానికి వీలు లేదు" అన్నది. "అదేమిటి? నేను కొడుకుని, తర్వాత కదా సన్యాసిని. ముందు నేను నా తల్లికి నేను బిడ్డని. నేను ఢిల్లీకి రాజునైనా మా అమ్మకైతే నేను బిడ్డనే కదా!" అన్నట్టుగా "నేను యతిని కావచ్చు, యోగిని కావచ్చు, మరొకటి కావచ్చు, నేను మా అమ్మకి కొడుకుని గనుక నేను చేయాలి" అన్నారు. ఆనాటి సమాజం ఆయనకు permission ఇవ్వలేదు. అప్పుడు "కనీసం చితి అంటించటానికి మీ ఇంట నిప్పివ్వమని" అడిగారాయన. "నిప్పిస్తే పాపకార్యం మేం చేసినట్టు అవుతుంది గనుక మేము అది ఇవ్వం" అన్నారు. అప్పుడు శంకర భగవత్పాదులు తపోశక్తి చేత తన తల్లి గూడా ఎముకను తీసుకుని సంకల్ప మాత్రంతో అగ్నిని సృష్టించి యోగాగ్నులలో తన తల్లికి ఒక మహావిభూతి స్థాయిని ఇచ్చారు. ఎక్కడ? తల్లి ఎక్కడ తన ప్రాణాన్ని నిర్గమనం చేసుకున్నదో ఇంటి పెరట్లోనే అక్కడే దహనం చేయబడింది ఆమె. కనుకనే కేరళ దేశంలో స్మశానాలు ప్రత్యేకంగా లేవు. ఎవరన్నా పోతే వాళ్ళ ఇంట్లో వెనకే దహనం చేస్తారు, పాతిపెట్టుకుంటారు. అది శంకరుల ఆగ్రహం కాదు. ఒక సమాజాన్ని సంస్కరించే రీతిలో ఒక సన్యాసి ధర్మం బద్ధమైనటువంటి ఒక కర్మాచరణం ఎలా చేస్తాడో, శాస్త్రాలన్నిటినీ కూడా అధిగమించి మహోత్కృష్టమైన స్థాయిలో ఒక మానవతా రసమాలయంగా ఎట్లా ఉంటాడో, మానవీయ దృక్కోణాన్ని మానవజాతికి ఎట్లా పరిచయం చేస్తాడో రసార్ద్ర సన్నివేశం మనకి బోధిస్తుంది. మనమంతా ఛాందసంగా సనాతనం ఇప్పుడు ఏదో చెప్పారు, అట్లాగే ఇవాళ ఉండాలంటే కుదరదు. సత్యనారాయణ వ్రతం చేద్దామని ఒక జమీందారు గారి ఫ్యామిలీ యాభై ఏళ్ళు సత్యనారాయణ వ్రతం చేసింది. కాలగమనంలో జమీందారు గారు పోయారు, కొడుకు వచ్చింది వారసత్వం. కొడుకు కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వ్రతం చేయాలి. లిస్టు తీసుకురమ్మన్నారు, అందులో ఒక పెద్ద తట్ట రాశాడు. తట్ట ఎందుకు తెలియక తల్లి దగ్గరికి వెళ్లి అడిగాడు. ఏమనంటే, "అమ్మా! ఏదో ఆవుపాలు, అవి ఇవి కావాలంటే అన్నీ తేగలను గానీ, అన్నీ తెస్తాను గానీ తట్ట ఎందుకు తెప్పించేవారు?" "అంటే పురోహితుడిని అడుగు నాయనా" అంది. "ఏమో మా నాన్నగారు లిస్టు ఇచ్చారు, అదే మీకు ఇచ్చాను" అన్నాడు వీడు. తల్లి ఏమన్నదంటే, "ఓహో! తట్ట సంగత? ఏం లేదు. మన ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి కావలసిన వస్తువులన్నీ రాత్రికే ఉంటాయి గనుక పిల్లి వచ్చి అవన్నీ పాడుచేయకుండా ఉండటానికి మీ నాయనగారు పెద్ద బుట్ట సంపాదించి ఇంట్లో ఉన్న పిల్లులందరినీ దానిమీద పెట్టి దానికో రాయి పెట్టేవారు. తట్టకు ఏం విలువ లేదు" అన్నారాయన-అన్నదామె. సాంప్రదాయాలు కూడా ప్రాపంచికమైనటువంటి అవసరాలకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. వాటి యొక్క అర్థం తెలిసి చేయాలి. చేయకపోయినట్లయితే అర్థం తెలియకుండా చేసే పనైనా వ్యర్థమే గనుక శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతం కానీ, భజగోవింద వ్యాఖ్యానం కానీ, వివేక చూడామణిలో ఆస్తిక మహాజనులకు కావలసిన జ్ఞాన సంపద కానీ, భక్తి ప్రపత్తి కానీ, కర్మ యోగం కానీ, విజ్ఞాన భూమికలు కానీ, ఆనందమయ కోశ విచారణ కానీ, ఇవన్నీ కూడా సాధకుడికి అక్కరకు వచ్చేవే. అవన్నీ ఎరగకుండా ఒక కెమిస్ట్రీలో, ఒక మ్యాథ్స్‌లో, ఇంగ్లీషులో చిన్న పీహెచ్‌డీ సంపాదించుకొని, "నాకంతా తెలుసు" అనగలుగుతున్నాడా? తాను దేనిలో research చేశాడో అంతవరకే వాడికి పీహెచ్‌డీ. subject కంతా లేదు కదా! భగవత్పాదుల subject అంతా ఏమిటంటే మానవుడు ఉదాత్త మానవుడిగా జీవించటానికి, మానవుడు పూర్ణ మానవుడిగా జీవించటానికి, మానవుడు తన జన్మ యొక్క విశేషాన్ని ఎరుగుతూ పరిపూర్ణమైనటువంటి స్థాయిలోకి వెళ్ళటానికి చేసినటువంటి రమణీయ బోధే అద్వైత బోధ. అది ఆత్మబోధ. అనేక ప్రకరణ గ్రంథాలు అన్నింటా అన్ని విషయాలున్నాయి. అలాగే గురుపాద పద్మముల యందు గనుక మనస్సు లగ్నం చేయకపోతే సుందరమైన భార్య ఉన్నా, అమిత సంపదలు ఉన్నా, అపార పాండిత్యం ఉన్నా, శాస్త్ర విజ్ఞానం ఉన్నా, పూర్ణ ఆయుష్షు ఉన్నా ఏం ఫలం? తీసుకువెళ్లి, తీసుకువెళ్లి మనస్సును ఎక్కడ పెట్టాలంటే "గురోర౦ఘ్రి పద్మం మనసేన లగ్నం తతః క్యం తతః క్యం తతః క్యం". తర్వాత ఏమిటి? ప్రయోజనం ఏం లేదు. కాబట్టి గురుపాద పద్మముల యందు గురుతత్వాన్ని మనం విచారణ చేయాలి. శంకర భగవత్పాదుల విచారణా మార్గంలో అద్వైత ప్రతిపాదన ఇదైతే మరొక మార్గం ఉన్నది. దేవుడు లేక జీవుడు లేడు, జీవుడు లేక దేవుడు లేడు. దీన్నే ఆధునిక కాలంలో సత్యసాయి భగవానుడు కుల్వంత హాలులో ఒకనాడు వచ్చేసిన ఒక ప్రామాణికమైన మాట. భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తుడు లేడు. మనది అన్యోన్య సంబంధము అన్నారు. నేనే భక్తుడిగా మీ అందరి యందు ఉన్నాను. ఇందాక అన్నారే, ఎక్కడ భగవన్నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ నేనుంటాను అని, సర్వ హృదయాలలో ఉంటానని, ఎక్కడ ఉన్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను, పర్తిని లేను సర్వ హృదయంబుల నిండి ఉంటినను సత్యము తెలుపగా వచ్చెను సాయియై సత్య సాయియై అన్నారు.సాయి అంటే షిరిడి సాయి సత్య సాయి ఇలా వచ్చాను అనేటువంటి ప్రకటన ఎక్కడ ఉంటాడు భగవంతుడు అంటే భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడ అని మనం ప్రశ్నించాలి. వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉంటాడు, బ్రహ్మ లోకంలో ఉంటాడు, పాతాళ లోకంలో ఉంటాడు అంతా ఉంటాడు కాదు. ఆయన లేని చోటంటూ ఉన్నదా? ఆఖరికి మన దేహంతో సహా అంటే సర్వదేహాంతరాత్మ అయినటువంటి పరమాత్మే ఈశావాస్య ఉపనిషత్తుగా ఒక బోధగా మానవుడికి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శంకర భగవత్పాదులు అద్వైతమూర్తి ఆయన. అందుకనే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. షం అంటే శుభం షం అంటే మంగళం షం అంటే వెలుగు. దేనికి వెలుగు? లోకానికి మంగళం జరుగు గాక. లోకానికి వెలుగు దొరకు గాక. లోకానికి శ్రేయస్సు కలుగు గాక. లోకానికి సతత నిరంతర ఆనందము నిరతిశయమైన ఆనంద రేఖ విలాసంగా విహరించు గాక అని కవితా హృదయం పరిపూర్ణంగా పల్లవించిందో, శ్రీ చరణాకృతమై ఆవిష్కృతమైందో అదే శంకర భగవత్పాదులు. అందుకనే శంకర భగవత్పాదులు అంటే పరమేశ్వరుడి యొక్క దివ్య పాదములు ప్రపంచము నందు ప్రవేశించి అజ్ఞాన భూమికలో ఉన్నటువంటి జీవున్ని జ్ఞాన భూమికలోకి, అహంకార మదోన్మత్తుడైనటువంటి మానవున్ని సాత్విక గుణంలోకి, జీవగుణంలో ఉన్నటువంటి వాడిని దైవగుణంలోకి, దైవీగుణంలో ఉన్నటువంటి వాడికి విశ్వగుణంలోకి, విశ్వగుణంతో ఉన్నటువంటి వాడికి సృష్టి గుణంలోకి, సృష్టి గుణంలో ఉన్నటువంటి వాడికి సత్గుణంలోకి అది సద్గుణం. సత్ సృష్టి కంటే ముందే సత్ ఉన్నది. ఎవరో సంకల్పించకపోతే సృష్టి జరిగేది కాదు. దానికి సత్ అని పేరు పెట్టారు. దాని వలన సృష్టి ఏర్పడింది. సృష్టి ఏర్పడింది కానీ పద్నాలుగు భువనాలుగా ఏర్పడింది. దానిలో నుంచి ఒకటి ప్రవేశించింది గనుక దానికి మన ఉన్న ప్రదేశం పేరు విశ్వం. విశ్వం అంటే ఏది ప్రవేశించిందో అది విశ్వం. అది మూలం కాదు. అది స్థూలం కాదు. మూలంలో నుంచి ప్రభవించిన మరొక కొమ్మ. విశ్వంలో నుంచే ప్రపంచం. ప్రపంచంలో నుంచే సంసారం. సంసారంలో నుంచే కుటుంబం. కుటుంబంలో నుంచే వ్యక్తి. వ్యక్తి లో నుంచే వ్యష్టి. మళ్ళీ వ్యష్టి నుంచి సమష్టి. సమష్టి నుంచి సృష్టి. సృష్టి నుంచి పరమేష్టి. ఇది ఒక మహా వృత్తం కాబట్టి ఆవృత్తంలో మనం ఎక్కడికక్కడ శంకర భగవత్పాదుల బోధలన్నీ కూడా విచారణ చేసుకుంటూ వెళ్ళాలి. మానసిక వైక్లవ్యాలకి, జయాపజయాలకి, కుంగి, పొంగి, ఒంగి, లొంగిపోయేటువంటి మనస్సు ధృడంగా, నిశ్చితంగా ఒక మనీషగా ఉండాలి అంటే శంకర వాంగ్మయాన్ని యువకులు చదవాలి, వృద్ధులు చదవాలి. వృద్ధులు మానసిక శాంతి కోసం, ఉల్లాసం కోసం, తాము జీవించిన జీవితాన్ని ఒక్కసారి పునః సమీక్షించుకోవటం కోసం వృద్ధులు చదవాలి. యువకులు ఒక నిడుపాటి భవిష్యత్తుని పరిపూర్ణంగా, సానందంగా మూడు వందల అరవై డిగ్రీలలోనూ ప్రతిభా ప్రజ్ఞామూర్తి మంతంగా అనుభవించాలి అంటే శంకర వాంగ్మయాన్ని చదవాలి. శంకర వాంగ్మయమే లేకపోతే సంక్రాంతి పండుగ లేదు, ఉగాది పండుగ లేదు. ఒక నిరీశ్వర వాదంలో నుంచి ఈశ్వర వాదంలోకి నడిపించినటువంటి ఒక దివ్య మహాప్రబోధాకృతి శంకర భగవత్పాదులు. ఒక పండుగ రేపు సంక్రాంతి వస్తోంది. అది మూడు రోజుల పండుగ. పండుగ ఇలా చేసుకోవాలని ఎవరు చెప్పారు? శంకర భగవత్పాదులే. భోగి పండుగ నాడు అది శిశువుల పండుగ. సంక్రాంతి పండుగ నాడు మనవోటి వారి పండుగ. మూడవ కనుమ పశువుల పండుగ. శిశువుకి, మనకి, పశువుకి ఒక సమన్వయ స్థాయిని కల్పించి అన్నింటియందు జీవుడున్నాడని, జీవుడి యందు దేవుడున్నాడని, ఆయా దైవాన్ని ఇలా కొలవమని చెప్పినటువంటి సమ్యక్ క్రాంతమైన సంక్రాంతమే సంక్రాంతి. సమ్యక్ క్రాంతి. ఎక్కువ వెలుగుంది అనుకోండి ఇక్కడ కూర్చోలేం. బాగా డిమ్ గా ఉందనుకోండి అసలు కూర్చోలేం. ఎంత కాంతి కావాలి ఎంత కావాలో అంతే ఉండాలి. జీవితం కూడా ఎంతవరకు మనం భరించగలమో అంత ఉండాలి. ఎంత ధరించగలమో అంతే ఉండాలి. ధరించలేనిది, భరించలేనిది మనకిస్తే తీసి పక్కన పెడతాం కదా! అలాగే పరమేశ్వరుడి యొక్క దివ్య గుణం మీద, దివ్య శక్తి మీద అపారమైన, అమితమైన విశ్వాసం ఉండాలి. పరమేశ్వరుడు శ్వాసగా లేకపోతే, పరమేశ్వరుడి యొక్క నిశ్వాస లేకపోతే వేదాలే వచ్చేవి కాదు. పరమేశ్వరుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదాలు. అవే నిగమములు, ఆగమములు. అదే సత్య సాయి నిగమ ఆగమం. దాని పేరది. నిగమం, ఆగమం రావాలి, పోవాలి. రాక పోక మనం మన ఇంట్లోకి ఎన్ని సార్లు వెళ్ళాము? ఎన్ని సార్లు మన ఇంట్లో నుంచి బయటికి వచ్చాము? ఎన్ని ఇళ్ళల్లోకి వెళ్ళాము? ఎన్ని సార్లు బయటికి వచ్చామో లెక్క ఉందా? వెళ్తున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. వెళ్ళి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఉన్న ఒకానొక విరామ కాలంలో మన మృత్యువు నిర్ణయించబడింది. క్షణం గనుక నిలబడ్డామా మనం ఉన్నట్టు లెక్క, నిలబడలేకపోయినామా పోయినట్టు లెక్క. ఇది ఒక ఎత్తయితే ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర గ్రంథాలు, భాష్యాలు, వ్యాఖ్యానాలు వీటి ఇవన్నీ ఒకే ఎత్తయితే కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు యోగత్రయగా భావన చేస్తూ ఎవరైతే అధ్యాత్మ విద్యలోకి వెళ్లాలని అనుకుంటున్నారో వారి అధ్యాత్మ విద్య కేవలం ఒక థియరీగా ఉండటానికి వీలు లేదని దానిని ప్రాక్టికల్ గా, డెమాన్స్ట్రేటివ్ గా శరీరాన్ని ఒక లాబొరేటరీగా తయారుచేసి లాబొరేటరీలో జరగవలసినటువంటి, జరుగుతున్నటువంటి అనేకానేకమైనటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వీటన్నింటినీ కూడా యోగంగా భావన చేసి శంకర భగవత్పాదులు చెప్పారు. దాని పేరు యోగ తారావళి. తారావళి అంటే తారల సమూహం, వరుస అని అర్థం. ఆయా ఎన్ని తారలున్నాయి? ఇరవై ఏడు తారలున్నాయి ఖగోళ శాస్త్రం ప్రకారం.ఈ ఇరవై ఏడు శ్లోకాలలో శంకర భగవత్పాదులు యోగ తారావళి గురించి చెప్పారు. లయ యోగం, మనోన్మనీ యోగం, ఉన్మనీ యోగం, రాజ యోగం, కేవల కుంభక యోగం ఇట్లా తదాదిగా గలిగిన యోగాలన్నీ కూడా ప్రస్తావిస్తూ. యోగాలన్నీ దాటుకుంటూ గనక వెళ్లగలిగినట్లయితే వాటికి అర్థం అయ్యేది ఒక్కటే. నేను దేహాన్ని మాత్రమే కాదు. దేహాన్ని ఎవరో నడిపిస్తున్నారు. నేనేమీ అనలేకపోతున్నాను కానీ నా చేత ఎవడో అనిపిస్తున్నాడు. ఇన్ని వినగలుగుతున్నానా? ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? వింటున్న వాడు కూడా ఎక్కడో నాలో ఉన్నాడు. అంటున్న వాడు నాలో ఉన్నాడు, వింటున్న వాడు నాలో ఉన్నాడు, అనిపిస్తున్న వాడు నాలో ఉన్నాడు. నాలో లేనిది ప్రపంచంలో లేదు, ప్రపంచంలో లేనిది నాలో లేకుండా లేదు. అదే విశ్వం దర్పణ దృశ్యమాననగరీతుల్యం. అద్దంలో బొమ్మ అంటే దాని అర్థం అది. కాబట్టి సమన్వయం చేయాలి. ఒక సమర్ధతతో చేయాలి, పరిపూర్ణమైన అవగాహనతో చేయాలి, అభ్యాసనంతో చేయాలి, అధికారంతో చేయాలి, అనుభవంతో చేయాలి, అనుభూతి చెంది చేయాలి. ఇన్ని చేస్తే బోధ ఉత్తమ బోధ అవుతుంది. లేకపోతే పుస్తకంలో ఉన్నది తీసుకొచ్చి గనక క్లాస్ రూమ్ లో డెలివరీ చేస్తే వాడికి పోస్ట్ మాన్ కి పెద్ద తేడా ఏం లేదు. మరి ఎటువంటి గురువు, ఎక్కడున్నాడు గురువు అంటే ముప్పై మూడు వేల సంకీర్తనలు చేసిన అన్నమాచార్య వారు చిట్టచివరకు ఒక మాటన్నాడు. "చిత్తజగురుడా! నీకు శ్రీమంగళం" నువ్వు అదన్నాను, ఇదన్నాను, ఇదన్నాని పాటలు రాశానయ్యా చివరికి నువ్వు ఎక్కడున్నావ్ అంటే చిత్తజగురుడా! నా మనసులో నువ్వున్నావ్, నా లోపల ఉన్నావ్, అంతర్జ్యోతిగా ఉన్నావు. దాన్ని నేను ఇప్పుడు గమనించుకున్నాను అన్నాడు. అలా అనుకోవటానికి ఆయనకు ముప్పై మూడు వేల శ్లోకాలు రాసి యాతన పడవలసి వచ్చింది. ముందే అనుకుంటే నిరతాన్నమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆనంద తారక స్థితిలో జీవుడు వెలుగొందుతూ ఉంటాడు గనుక స్థాయికి వెళ్ళమని చెప్తుంది శాంకరీయం. పరిపూర్ణ బౌధాకృతిలో శంకర భగవత్పాదులు మరొక కోణాన్ని కూడా స్పృశించారు. అది చాలా మనం అధ్యయనం చేయవలసినటువంటిది. ఇవాళ ప్రాపంచికమైన అన్ని సంపదలు మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర లేనిదంటూ ఏం లేదు. మార్కెట్లో, బజారులో వస్తువు ఎప్పుడు పుట్టిందో పుట్టిన ఐదు నిమిషాల్లో మన ఇంట్లో ఉంటుంది. లేకుండా లేదు. కానీ, శాంతి లేదు. చిత్తశుద్ధి లేదు. చిత్తశాంతి లేదు. ఒక్కరినైనా మీరు-- నువ్వు ఆనందంగా ఉన్నావా అంటే నేను ఆనందంగా ఉన్నానని ధృడంగా చెప్పగలిగిన వాడు లేడు. ఎందుకని అంటే జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని ఎరగని కారణంగా, దీనిలో ఉన్నటువంటి డొల్లతనాన్ని తెలియని కారణంగా, దీని కంటే ఉత్తమోత్తమమైన ఒక జీవితం అదొకటి ఉన్నదని, అది ఆంతరంగికమైనటువంటి జీవితం అని, ఆంతరంగిక స్పర్శతో మాత్రమే అనుభూతిని పొందగలవని, మిగతాదంతా బహిరంగ విన్యాసమేనని తెలియని కారణంగా ఇన్ని వస్తువులు ఉండి కూడా మనకు ఆనందాన్ని మాత్రం కలిగించటం లేదు. మనల్ని మనం గనక తెలుసుకోగలిగిన స్థాయికి వెళ్ళినట్లయితే అది పరిపూర్ణమైన అధ్యాత్మ మార్గంగా విరాజిల్లుతుంది గనక వేదాలతో ప్రారంభమై ద్వాపరాంతంలో భగవద్గీత బోధించటంతో ఒక స్థాయికి వచ్చి మళ్ళీ కలియుగ ప్రారంభం అయిన తర్వాత బౌద్ధం వికాసమానం చెందిన తర్వాత దేశం చిన్నాభిన్నం అయిపోయిన కారణంగా శంకర భగవత్పాదులు ప్రపంచంలోకి ఒక మహదవతార మూర్తిగా వచ్చి కేవలం ముప్పై రెండు సంవత్సరాలు ఇక్కడ ఆయన ఉన్నది. ఆలోచిద్దాం, ఇవాళ ముప్పై రెండు ఏళ్ళు వస్తే ఒక ఆడపిల్లకు పెళ్ళే కావటంలే, పిల్లవాడి జీవితంలో సెటిలే కావటంలే. ఎందుకని? ముప్పై రెండు ఏళ్ళల్లో ముప్పై రెండు యుగాలకు కావలసినటువంటి ఒక వాంగ్మయాన్ని వరదానం ఎలా చేయగలిగారు? అంటే న్యూరాలజీలో కాన్సెప్ట్ ఉంది. మానవుడి మేధ బ్రెయిన్లో ఒక సెకన్లో ఆరు వేల ఆలోచనా తరంగాలు పుట్టించగల శక్తి దానికి ఉంది. ఒక సెకన్లో. మనకున్నటువంటి మేధాశక్తిలో పాయింట్ జీరో ఫైవ్- జీరో ఫైవ్ పర్సెంట్ గనక వాడుకున్నట్లయితే వాడు ఒక భారతరత్న స్థాయికి వెళ్తాడు. అంటే భారతరత్న వచ్చిన వాళ్ళంతా ఎంత వాడి ఉంటారంటే ఏదో తంబూరులుగా పాయింట్ జీరో ఫైవ్. మిగతాదంతా ఏమిటని? వాడలేదు వాళ్ళు. వాళ్ళు వాడి ఉంటే టైం లేదు, స్పేస్ లేదు. వాళ్ళు అంతవరకే వాడవలసి ఉన్నది. వాళ్ళతో మనల్ని కంపేర్ చేసుకున్నట్లయితే మనం అసలు వాడుతున్నామా లేదా అంటే అసలు అది ఉన్నదని తెలిస్తేగా వాడటానికి. అది ఎక్కడ ఉన్నదో చెప్పడానికి శంకర భగవత్పాదులు వచ్చారు. అది ఎట్లా పనిచేస్తుందో చెప్పడానికి ఆయన వచ్చారు. పనిచేసి ఆయన చూపించారు. కనుకనే ఆయనే శంభోర్ మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా. పరమేశ్వరుడు ఎక్కడన్నా ఉన్నాడా? చిట్టచివరికి జరిగిన ఒక సన్నివేశం. ఇవాళ కాస్త మొదట్లో లేట్ అయింది గనుక ఇవాళ మిగిలిన రేపు ఇంకాస్త ముగిస్తాం. మనం స్వామి ఆర్గనైజేషన్లో గాని స్వామి తత్వంలో గాని ఒక మాట ఉంది. కాలాన్ని అతిక్రమించకూడదు. ఇప్పటికే అతిక్రమించాం. తెలుస్తున్నది నాకు. ఎనిమిదన్నర అంటే ఎనిమిదన్నరకి హారతి ఇచ్చేసేయాలి, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. రేపటి నుంచి అలాగే జరుగుతుంది. ఇవాళ కాస్త ప్రారంభోపన్యాసాలు కొద్దికొద్దిగా ఉన్నాయి గనుక శంకర భగవత్పాదుల యొక్క భావనలో చిట్టచివరగా కేదారంలోకి వెళ్ళినప్పుడు ఆయన వెనక కేవలం ఇద్దరు శిష్యులు మాత్రమే ఉన్నారు. శిష్యుడు A, శిష్యుడు B. A అడిగాడు, "నాకు గురువుగారు మళ్ళీ కనపడరు అని ఇప్పుడే అనిపిస్తోంది. మనల్ని కూడా పట్టించుకోకుండా ఆయన దారిన ఆయన వెళ్ళిపోతున్నారేమిటి? నాకు ఇంకా చిరకాలంగా మిత్రమా చిన్న ఆలోచన ఉందయ్యా, కోరిక. గురువుగారిని మళ్ళీ దొరకరు గనుక అడుగుదామని" అన్నారు. ఏమని అడుగుదామనుకున్నారు? గురువుగారి దగ్గరికి వెళ్ళి భగవంతుణ్ణి ఒక్కసారి చూపించి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అడుగుదామనుందన్నాడు.ఈ మొదటి వాడు పరిణిత మనస్కుడు గనుక ఏమన్నాడో తెలుసా? భగవంతుడి దగ్గరికే వెళ్లి భగవంతుణ్ణి చూపించు అని అడిగినట్టుగా లేదా? శంభోర్మూర్తిహి పరమేశ్వరుడే ఒక బొమ్మై ఒక జీవుడై ఇక్కడికి వచ్చాడు. వచ్చి నడిచాడు చరతి భువనే మనం నడిచిన నేలమీద నడిచాడు. ఎట్లా నడిచాడో తెలుసునా? శంకరాచార్య రూపా. శంకర రూపంలో నడిచినటువంటి అవతారమూర్తి పరదైవము పరమమైనటువంటి సదాశివుడు కాక మరొక్కరవుతారా మిత్రమా? అన్నాడు. అంత స్థాయికి వెళ్ళిన కొన్ని వేలాది శిష్యులలో ఇద్దరు మిగిలితే ఇద్దరిలో కూడా ఒక్కడే జ్ఞానాన్ని పొందాడు. కనుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఒక్కమాట "కోటిమంది నా దగ్గరకు వచ్చినా కోటి మందిలో ఒక్కడో మాత్రమే జ్ఞానం కోరి వస్తాడు. అసలు నేను బయటికి వచ్చేదే వాడొక్కడి కోసం. మిగతా వాళ్ళంతా మా కోసం వచ్చారని అనుకుంటారు. నేను వచ్చేది, నేను ఇచ్చేది, నేను ఇక్కడ ఉండేది ఒక్కడు గనక నిలబడినట్లయితే సర్వ ప్రకృతి ధర్మబద్ధమైన ఒక సత్య పీఠంగా, ఒక ఆనంద పీఠంగా, ఒక కర్మ పీఠంగా, ఒక ధర్మ పీఠంగా ఉంటుంది గనుక దానికై నేను అవతారం తాల్చి వస్తానన్నా" శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి మరొక్కసారి అంజలి ఘటిస్తూ శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకరులది మహా స్మృతి. శంకరుల తర్వాత వచ్చినటువంటి అవతారమూర్తి అయినా శంకర స్పర్శ లేకుండా, శాంకరీయమైన ముద్ర లేకుండా, శంకరులను గురించిన ఆలోచన లేకుండా వారి వారి అవతార కార్యకలాపాలు సాగవు. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఉపన్యాసాలలో ముగ్గురు ప్రముఖమైన వ్యక్తుల మాటలు ఎప్పుడూ అనవరతము వినపడేవి. ఒకటి శంకర భగవత్పాదులు, రెండవది రమణ మహర్షి, మూడవది శ్రీ రామకృష్ణ పరమహంస. ముగ్గురు మాత్రమే మహాయోగవంతమైనటువంటి అంటే జాతిని మహోన్నతమైనటువంటి మార్గంలో నడిపించటానికి పూర్ణావతారాలుగా, అర్చావతారాలుగా, అంశావతారాలుగా, కళావతారాలుగా, ఆవేశావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా ఇక్కడికి వస్తాయి. అందులో పూర్ణావతారాలు కొన్ని. ఒకడు రాముడు పూర్ణావతారం, రెండవది కృష్ణుడు పూర్ణావతారం. రామకృష్ణులు ఒకే ఒక్కసారి వివేకానంద స్వామితో "అసలు నువ్వు ఎవరో చెప్పు గురుదేవా" అని నిలబడితే "నాటి రాముడు తర్వాత వచ్చిన కృష్ణుడు కలిపితే రామకృష్ణులు" అన్నారు. అది రెవలేషన్. రోజు చెప్పరా మాట. ఆయన జీవించిన కాలంలో ఒక సెకండ్ మాట్లాడినటువంటి మాట. కాబట్టి పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు మనమంతా ఉపనిషన్ మూర్తులం. ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చొని. దగ్గరగా కూర్చొని, ఎవరికి దగ్గరగా? పరమాత్మకు దగ్గరగా. పరమాత్మకు దగ్గరగా కూర్చొని ఏమడగాలి? పరమాత్మను గురించి తెలుసుకోవాలి. పరమాత్మను గురించి వేదన చెందాలి. పరమాత్మ తత్వాన్ని ఎరగాలి. అదే ఉపనిషత్. దాని అర్థం అంతే. ఉపనిషత్ అంటే సంస్కృతంలో ఉన్న శ్లోకాల మాలికలు, గ్రంథాలు కావు. పరమేశ్వర భావనకు దగ్గరగా ఎవరుంటారో వారంతా ఉపనిషత్తులే. ఉపనిషత్ స్థితి మనకెట్లా వస్తుంది అంటే అవతార మూర్తులంతా మనకు సాలోక్య, సామీప్య, సాన్నిధ్యములు అనుగ్రహించి సాయుజ్యం వైపు నడిపిస్తారు గనుక అటువంటి అనంతకోటి గురు స్వరూపాలకి మరొక్కసారి నమస్కరిస్తూ, గురుమూర్తి తత్వంగా సాగబోతున్నటువంటి పాంచాంతికమైనటువంటి కార్యక్రమము సర్వ జగత్తుకి కూడా మహాపురుషుల యొక్క దివ్య బోధ, వారి జీవన సారము, జీవన సరళి, జీవనశైలి, వారి దార్శనికత, వారి తాత్విక విధానము అందరికీ ఆదర్శప్రాయము, అనుష్ఠాన యోగ్యము, ఆచరణ యోగ్యము, అనుస్మరణీయమైనటువంటి ఒక మహాస్థితికి మనందరినీ నడిపించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio

Talk on Adi Shankara - 03

Home

Talk on Adi Shankara - 03

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 28:28

More in this series

Talks on Adi Shankara

3 episodes · 1 hr 27 min

  1. 25 min 1

    Talk on Adi Shankara - 01

  2. 33 min 2

    Talk on Adi Shankara - 02

  3. 28 min 3

    Talk on Adi Shankara - 03

    Now playing