No transcript for this section.
Transcript begins at 0:00.
శ్రీ రామకృష్ణ గురుదేవులు అంటారు. సముద్రం ఒడ్డున నుంచుండి ఎంతకాలం ఎదురు చూసినా అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది. ఎన్నాళ్ళున్నా చివరికి దొరికేవి గవ్వలు, గులకరాళ్లు మాత్రమే. ముత్యం కావాలి అంటే లోపలికి దూకాలి, ఈదాలి, వెదకాలి, ఆలుచిప్పలను పట్టుకోవాలి. అప్పుడే కొన్నైనా ముత్యాలు లభిస్తాయి. ఎంతటి మార్గదర్శనం! అన్నిటికీ మూలం ఆత్మే అని ఆగిపోకుండా ఆ ఆత్మను దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకు వెతకాలి? అదే అసలు మనం కనుక. లోచూపు కావాలి. లోనారసి అంటే లోపలకు వెళ్లి చూచి, అనుభవించి, అనుభూతిని పొంది విభూతి స్థాయిని అందుకోవాలి. నమ్మకమే లేని స్థితి, నమ్మి నమ్మని స్థితి, నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు. తెలియదంటున్న వాడు, తెలియనట్లు ఉన్నదన్న వాడు, తెలుసుకుంటున్నానంటున్న వాడు ఇక్కడే ఉన్నారు. తెలుసుకున్న వాడు మాత్రం ఏమీ అనటం లేదు. అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. మాటలను దాటి మౌనం ద్వారా ప్రసారం చేస్తున్నాడు. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. మనం ఉంటున్న ఇదే ప్రపంచంలో ఉన్న తనతో తాను ఉంటున్నాడు. కానీ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాలను ఏ ప్రమేయము లేకుండా చూస్తున్నాడు. ఒక సర్వానందమయ స్థితిని అనుభవమయం చేసుకుంటున్నాడు. తామరాకుపై నీటి బొట్టు వలె అంటక ఉండగలుగుతున్నాడు. ప్రతి చర్యలోనూ చైతన్యాన్ని, ఆ చైతన్యం వెనుక ఉన్న ఆత్మశక్తిని నిత్యానుభవం చేసుకుంటున్నాడు. నిత్యానుసంధానం చేసుకుంటున్నాడు. వస్తువు వెనుక ఉన్న యదార్థాన్ని నిత్యమూ దర్శిస్తున్నాడు. ఆ కారణంగా పైపై జరుగుతున్న విషయాలను, అవి కలిగించే ప్రభావాలను గుర్తించకుండా తత్వానుభూతిని పొందుతున్నాడు. ఈ అనుభవమే, ఈ అభ్యాసమే ప్రకృతి రహస్యాలను చూడగల, చూపించగల ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిచయం చేస్తున్నది. ఆ కారణంగా జాతి, మత, వర్గ, వర్ణాతీతమైన మానవతావాదం శాస్త్రంగా రూపుదిద్దుకొని ప్రకృతి మూలాలలో ఇమిడి ఉన్న సహజ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది. అప్పుడే జగత్తు సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది. ఆత్మాన్వేషణను ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి ఆపై సూక్ష్మ శరీరాన్ని, ఆపై కారణ శరీరాన్ని దాటుకొని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము అనబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది నిజానికి ఆత్మే. ఇదంతా నిత్య పరిశీలన, అనుష్ఠానం, సాధన వలన సాధ్యమవుతుంది. సర్వత్రా ఆత్మను దర్శించగల స్థితి కలిగిన తర్వాత ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు ద్వంద్వాలు లేవు, గుణగణాలు లేవు, అనేకం లేవు, ఏమీ లేవు. ఉన్నదంతా ఆత్మే అన్న స్థిర భావన స్థిరమవుతుంది. ఆనందం స్వభావం అవుతుంది. ఆనంద సాగరంలో తాను నిశ్చలుడై ఉంటాడు. ఎన్ని అలలు పుట్టని, ఎన్ని కెరటాలు ఎగసిపడని, ఎన్ని తుంపరలు తాకని తాను మాత్రం అచలుడై ఉంటాడు. కేనోపనిషత్తు ప్రశ్నించుకుంటూ సమాధానం పొందమంటుంది. సాధ్యమైతే నీ అంతట నీవే ప్రయత్నించమంటుంది. సాధ్యం కాకపోతే గురువును ఆశ్రయించమంటుంది. ఆత్మోన్నతి కలిగించే గురువును అనుసరించమంటుంది, అనుకరించవద్దంటుంది. ఆత్మను ఎరిగినవాడు మృత్యు భావనను జయిస్తాడు. భయం లేకుండా ఉంటాడు. ఎందరినో ఆ దారిన నడిపించగల నాయకుడు అవుతాడు, కర్త్రుత్వ భావన లేకుండా.
YouTube · audio
All India Radio Hyderabad | Bhavana | లోచూపు
All India Radio Hyderabad | Bhavana | లోచూపు
Source: AIRTARANGAM on YouTube
0:00 / 3:32
More in this series