No transcript for this section.
Transcript begins at 0:00.
ఆత్మవిద్యే అసలు విద్య. కవిత్వం, పాండిత్యం వంటివి మన భావనా శక్తికి అనుకూలించే అభివ్యక్తి సాధనాలు. సంస్కృతి పురోగమనానికి, సంస్కార స్వరూపానికి పాండిత్య స్పర్శ, కవితా ధోరణి దోహదపడతాయి. ఆత్మవిద్య అనుభవం నుంచి పొందవలసిన అచ్చ తెలివి. ఎన్నో వదులుకుంటే గాని కావలసిన దాన్ని పొందలేం. లోక విద్యలను దాటి మనసును హృదయంతో కలుపుకునే ప్రయత్నంలో నుంచి ఆత్మవిద్యా గ్రంథం అనుభవం అవుతుంది. సత్యాన్వేషణ దిశగా అదే లక్ష్యంగా మన జీవితం సాగాలి. పుట్టినది మొదలుగా మరణం వరకు జరిగే జీవన ప్రయాణం అంతా అనుభవమయమే. ఒక్కొక్క అనుభవం నుంచి మానవతావాదం బలపడుతూ ఉండాలి. అహాన్ని, తీవ్ర మమకారాలను, పిడివాదాలను, తర్కవితర్కాలను విదుల్చుకొని, వదులుచుకొని సహజీవన సౌందర్యాన్ని అలుపెరుగక అనుభవిస్తూ జీవితాన్ని అతి వాస్తవికంగా పండుగ వలే జీవించాలి. ప్రతి ఆలోచనను మానవీయం చేయాలి. అధ్యాత్మ మరణానంతర సుఖం కోసం కాదు. ఉన్నదంతా ఇక్కడే ఉంది. చేయవలసినదంతా ఇక్కడే ఉంది. పరస్పర విరుద్ధ భావజారాలతో, భిన్న వాదాలతో నిరంతరం సాగే ప్రపంచపు పోకడలను గమనిస్తూ అధ్యయనంతో, సహనంతో, సమన్వయంతో జీవితాన్ని ప్రసన్న, ప్రశాంత ప్రవాహంగా పాలించగల శక్తిని అధ్యాత్మవిద్య అలవోకగా అనుగ్రహిస్తుంది. మనం పూర్ణ మానవత్వాన్ని సాధించుకోవాలి. అపరిమిత, స్వార్థరహిత ఆలోచనా పరిధి నిజానికి ఒక విశాల వేదిక. వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి ఈ క్రమాన్ని కేనోపనిషత్తు దృఢంగా పరిచయం చేస్తుంది. అన్ని శబ్దాలు నిశ్శబ్దంలో నించే పుడతాయి. అన్ని యుగాలు యోగంతోనే ప్రారంభం అవుతాయి. అన్ని జన్మల అనంతరం లభించేదే పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మ. జీవిత పరమార్థం నిజానికి సత్యాన్వేషణే. మనిషి ఎంతో ధన్యుడు. ఆలోచించగల బుద్ధి, మనసు, స్పందించగల హృదయం, వివేకం, విచక్షణా స్ప్రుహ మనిషి సాధించుకున్న వికాస స్థితులు. అయితే వీటన్నింటినీ సమన్వయంతో నిగ్రహించుకుంటూ వినియోగించుకోవాలి. ప్రకృతితో మమేకమై తానొక భాగమై ప్రకృతి గమనానికి తన తోడ్పాటుని అందించాలి. ఇదే అసలైన అధ్యాత్మ శిక్షణ. శ్రద్ధ తద్వారా పొందే జ్ఞానం అధ్యాత్మ శక్తిని తేజోమయం చేస్తుంది. అనుకూలతలను అనుగ్రహిస్తుంది. పశుత్వాన్ని, షఠత్వాన్ని వదిలి పావన భావనామయ ప్రపంచాన్ని అంతరంగంలో సృష్టిస్తుంది. మనిషి మనసు విశ్వ హృదయంతో అనుసంధానమై లోపలి వెలుగు సన్మార్గం వైపు, అమృతత్వం వైపు సరళ గంభీరంగా నడిపిస్తుంది. ఆత్మవిద్యే అధ్యాత్మ శాస్త్రం. అన్నిటిలో ఉన్న శక్తిని భేదభావం లేకుండా అనుభవ పరిధిలోకి తీసుకువస్తుంది. స్తబ్ధమైన మనసు చైతన్యవంతమై మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. మనిషి తనలోని మాయావిని నిరంతరయం జయిస్తూ ఉండాలి. మహాయోగిని నిలబెట్టుకుంటూ ఉండాలి. ఆశలు ఆశయాలై ఆదర్శ సీమలో మనిషి మానవతావాదాన్ని ఆశ్రయించాలి. నేను, నాది అన్న సంకుచిత పరిధి నుంచి బయటపడి మనం, మనది అన్న సమతా భావాన్ని దృఢతరం చేసుకోవాలి. ఈ క్రమంలో మనిషి అమరత్వ లబ్దిని, ఆనంద సిద్ధిని తాను బతికుండగానే పొందగల అనుభవాన్ని అధ్యాత్మ శాస్త్రం అనుగ్రహిస్తుంది. అధ్యాత్మ శాస్త్రం వేద, వేదాంతాల సారాన్ని మానవీయ కోణంలోనే ఆవిష్కరిస్తుంది. భౌతికవాదాన్ని వదలకుండా ఆధ్యాత్మిక వాదాన్ని ఒక ఆచరణీయ వేదాంత భూమికగా మనిషి తన మనుగడను పూర్ణత్వం వైపు నడిపించాలి. సంఘ జీవనాన్ని ధర్మ మార్గం వైపు మళ్ళించి మానవతా విలువలను పాటించాలి. భారతీయమైన తత్వశాస్త్రం అంతా మానవతావాదానికి పెద్దపీట వేసింది. ఆ జాతి శక్తి అంతా అధ్యాత్మలోనే ఇమిడి ఉన్నది.
YouTube · audio
All India Radio Hyderabad | Bhavana | సత్యాన్వేషణ
All India Radio Hyderabad | Bhavana | సత్యాన్వేషణ
Source: AIRTARANGAM on YouTube
0:00 / 3:58
More in this series