No transcript for this section.
Transcript begins at 0:00.
జిజ్ఞాసే తత్వదర్శనానికి తొలిమెట్టు. కంటికి కనిపిస్తున్న, నడుస్తున్న, నిరంతరం పరిణామం చెందుతున్న ఈ సృష్టికి మూలం ఏమిటి? దాని వెనుక దాగిన శక్తి ఏమిటి? ఇంత అద్భుతంగా గతి తప్పకుండా సాగుతున్న ఈ కదలికలకు, నానానేక చర్యలకు చోదక శక్తి ఏది? అనే ప్రశ్నలు సహజమైనవి, అనివార్యమైనవి. "ఎవ్వనిచే జనించు" అన్న పోతన మహాకవి జిజ్ఞాస "అట్టి ఆత్మ భవు ఈశ్వరు" అంటూ తత్వదర్శనంగా ముగుస్తున్నది. ఆలోచనల పుట్టుక ఎట్లా? అన్ని ఆలోచనలు కలిసి మనసు ఎట్లా అవుతున్నది? ఆ మనసుకు చలనాన్ని, వేగాన్ని ఇస్తున్నది ఎవరు? వాక్కు ఎట్లా పురుడుపోసుకుంటున్నది? దానికి మూలమైన భావన, భావం, భాషలను ఎవరు సమకూరుస్తున్నారు? ఎవరు అమరుస్తున్నారు? వాక్కు స్పష్టతను, మాధుర్యాన్ని, గాంభీర్యాన్ని, అర్ధాన్ని, పరమార్ధాన్ని, శక్తిని పొందగల నేర్పును ఎవరు అలదుతున్నారు, పొదుగుతున్నది ఎవరు? కంటికి దృశ్యాన్ని చూపిస్తున్నది ఎవరు? కాలులో ముల్లు గుచ్చుకుంటే కన్ను ఎందుకు ఏడుస్తున్నది? ఆ కన్నీరు ఎలా కారుతున్నది? దాని వెనుక ఉన్న యంత్రం ఏమిటి? ఈ అనుబంధ-సంబంధ-సమన్వయ క్రీడను సాగిస్తున్నది ఎవరు? శాసిస్తున్నది ఎవరు? నియంత్రిస్తున్నది ఎవరు? నిగ్రహిస్తున్నది ఎవరు? క్షమిస్తున్నది ఎవరు? కేవలం కట్టెగా జడాత్మకమైన శరీరం కరచరణాది అవయవాల ద్వారా భిన్నభిన్న కార్యకలాపాలను ఎట్లా నిర్వర్తిస్తున్నది? చెవులు వినగలగటం వెనుక దాగిన సూత్రం ఏమిటి? ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు ఇంతటి సమన్వయంతో పనిచేయటం ఎవరి నేతృత్వంలో? ఎవరి ప్రేరణ వలన? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే, అది ఆత్మ అని. మనం ధరించే చేతి గడియారంలో మూడు ముల్లులు ఆగకుండా తిరుగుతూ కాల ప్రమాణాన్ని మనకు చూపించటం వెనుక గడియారం లోపల తాను కదలకుండా ముల్లులకు కదిలే శక్తిని ఇస్తున్న battery వలె ఈ సృష్టిలో జరిగే సమస్త కార్యకలాపాలకు ఆత్మే కారణం అవుతున్నది. శంకర భగవత్పాదులు "ఆత్" అంటే ఏమి? "మా" అంటే లేదు అని ఆత్మను గురించి వ్యాఖ్యానించినప్పుడు ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదని కానీ ఉన్నదంతా ఆత్మే అని తత్వం బోధపడుతుంది. ఇనుప పెట్టెలో వజ్రాల నగ ఎట్లా ఉంచబడిందో, శరీరంలో ఆత్మ సర్వాణువుల యందు నిండి ఉన్నది. అన్ని ప్రజ్ఞలు ఆత్మ నుండి ప్రసారమయ్యేవే. దేనిని ఈ కనులు చూడలేవో కానీ దేనివలన ఈ కనులు చూడగలుగుతున్నవో, చూపించగలుగుతున్నదో అదే ఆత్మ లేదా బ్రహ్మము. అందువలననే "సర్వం ఖల్విదం బ్రహ్మ" అన్న తత్వము అనుభవమవుతున్నది. ప్రాణము, చైతన్యము, శక్తి వంటివన్నీ ఆత్మ శక్తులే. అంటే సర్వేంద్రియాలను ఆత్మే ప్రేరేపిస్తున్నది. కనుక సమస్త కార్య నిర్వహణ వెనుక ఉన్నది ఆత్మే అన్న భావన దృఢతరం అవుతున్నది. అటువంటి మూలాన్ని పట్టుకునే ప్రయత్నమే ఆత్మాన్వేషణ. ఫలించిన ప్రయత్నమే ఆత్మసాక్షాత్కారం. అంటే ఆత్మ సాక్షాత్తు ఆకారమై కనిపిస్తున్నది అని అర్థం. కనుక ఆత్మసాక్షాత్కారం అంటే దైవ సాక్షాత్కారం కాదు. దైవం ఒక భావన, అది ఒక అంతర్గత శక్తి. దైవం నామరూప గుణ విశేష వైభవోల్లసితం. ఆత్మ ఇది ఏది ఎరగని పరిపూర్ణ బ్రహ్మ పదార్థం. ఆత్మ నిర్వికార నిరామయ నిరంజన నికేతన స్థితి. అది కాలాద్య విచ్ఛిన్నం, అపరిణామ ప్రాప్తం, అప్రమేయం. ఈ తత్వదర్శనం కడగా "ఈశ్వరో గురురాత్మేతి" అనే అనుభవాన్ని ప్రసాదిస్తున్నది. అంటే దైవం, గురువు, ఆత్మ ముడు ఒక్కటే. ప్రతిక్షణము నశించే లేదా మార్పు చెందే పదార్థానికి, విషయాన్ని విడమరచి బోధించే గురువుకు, ఈ అన్నింటికీ మూలమైన ఆత్మకు తేడా లేదు, అంతా ఒక్కటే. బయట కనిపిస్తున్న వస్తువుల మూలాన్వేషణ పూర్తైన తర్వాత కలిగే స్థిర అభిప్రాయం ఏమిటి అని ఆలోచించినప్పుడు అది ఒక మహా ప్రజ్ఞ. అంతటికీ అదే మూలం, అదే అనంత శక్తి. పదార్థం కలిగించే పరమార్థం, పరమార్థం ఆవిష్కరించే యదార్థం నిశ్చలానందాన్ని కలిగిస్తాయి. దానినే వేదాంతులు బ్రహ్మానందం అన్నారు. ఎవరి వలన అంటూ ప్రారంభమయ్యే కేనోపనిషత్ ఆత్మాన్వేషణకు ముఖద్వారం, అది సింహద్వారం.
YouTube · audio
All India Radio Hyderabad | Bhavana | ఎవ్వనిచే జనియుంచు
All India Radio Hyderabad | Bhavana | ఎవ్వనిచే జనియుంచు
Source: AIRTARANGAM on YouTube
0:00 / 4:26
More in this series