No transcript for this section.
[భారతీయ సంగీతం] భారతీయం. [భారతీయ సంగీతం] సనాతన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగమాలిక ఒక భావవీచిక. [భారతీయ సంగీతం] రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆధ్యాత్మిక లోకానికి భగవంతుడు అందించిన ఆణిముత్యం శ్రీ శంకర భగవత్పాదుల వారు. భారత ఖండంలో అసేతు హిమాచలం పర్యటించి భగవత్ శక్తిని పునరుద్ధరించిన మహనీయులు శంకరుల వారు. ఈనాటి నుండి వదలు ఐదు వారాలు మీకు భారతీయం కార్యక్రమంలో శంకరుల వారు భారతీయ ఆధ్యాత్మిక సంపదకు అందించిన ప్రాముఖ్యాన్ని గురించి శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగాల ద్వారా తెలుసుకుందాం. వినండి శ్రీ శంకర భగవత్పాదుల వారి గురించి వి.ఎస్.ఆర్. మూర్తి గారు అందించిన మొదటి ప్రసంగం. సాయిరాం. [భారతీయ సంగీతం] శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి జీవిత పరమార్థాన్ని, జీవన విధానాన్ని ఎరిగి జీవించాలి. ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడిది మహోన్నతమైనటువంటి జన్మ. ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి, విలువలు ఎరిగి వర్తించటానికి పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి ఒక ఆనంద వేదిక, సర్వానంద భూమిక. అయితే మానవుడు మనోమయుడు కనుక ప్రాపంచికమైనటువంటి లాలసకు, అవిద్యకు, అనాచారానికి, అస్పష్టతకి, అహంకారానికి లోనై తన స్వస్థితిని తాను పోగొట్టుకునేటువంటి ఒక తరుణం ఆసన్నమైనప్పుడు పరమేశ్వరుడు మానవ దేహాన్ని ధరించి అవనీ సంచారానికి వచ్చి ఆ తరాన్ని జాగృతం చేసి రాబోయే అనేక వందల తరాలకు కావలసినంత వాఙ్మయ సారస్వాన్ని, సంపూర్ణతని, బోధని, ఆచరణీయత్మకమైనటువంటి దివ్య విధానాన్ని వరదానం చేస్తాడు. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో శంకర భగవత్పాదులు ఒక అపురూప ఆగమనం. శంకర భగవత్పాదుల ఆగమనం మానవ జాతికి జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతంగా ప్రబోధ రీతిలో సాగినటువంటి ప్రసార ప్రవాహం అది. శంకరులు తడమని విషయం లేదు, శంకరులు వ్యాఖ్యానం చేయని విషయం లేదు, శంకరులు భాష్యం చెప్పనటువంటి శాస్త్రం లేదు. సర్వ ఆనంద భూమికని కూడా మానవుడికి అందిస్తూ మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక సర్వోన్నత స్థితిని ఎట్లా పొందాలి అన్నది భగవత్పాదులు ఈ ప్రపంచానికి ద్వైత, అద్వైత మార్గంలో బోధన చేస్తూ వచ్చారు. ద్వైతంలోనూ చెప్పారు, అద్వైతంగానూ చెప్పారు, ద్వయంగా చెప్పారు, అద్వయంగా చెప్పారు, మానుషంగా బోధించారు, అతిమానుషమైనటువంటి రీతిలో నిరూపణ చేస్తూ వచ్చారు. ఇటువంటి మహత్పూర్ణమైనటువంటి ఒక మహాపురుషుడిని గురించి మనందరం కూడా స్మరించుకోవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎవరు ఈ శంకరులు? వారు ఏ సమయంలో వచ్చారు? కేవలం ముప్పై రెండు సంవత్సరాల అవనీ సంచారంలో యుగయుగాంతముల వరకు కావలసినటువంటి జ్ఞానబోధను ఎట్లా అందించారు? ఇది ఒక అతిమానుష చర్య. ఆ విచార ధారలోకి మనం అడుగు పెట్టబోయే ముందు జీవన పరమార్థాన్ని గురించి కాసేపు మాట్లాడుకున్నట్లయితే మన ప్రమేయం లేకుండా కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. వాటి కదంబమే జీవితం. మనం జీవించే సమాజం, ప్రదేశం, దేశం మనల్ని ప్రభావితం చేస్తుంది. అట్లాగే మన ముద్ర కూడా సంఘంపై పడుతుంటుంది. విలువలు, ఆదర్శాలు, లక్ష్యాలు, చింతలు, చింతనలు ఇటువంటివన్నీ జీవితం చుట్టూ ఆవిరించే ఉంటాయి. అవిద్యను, అస్పష్టతను మన నుంచి దూరం చేసి జీవితాన్ని అర్థవంతంగా, సమర్థవంతంగా, విజయవంతంగా, సర్వోపయోగంగా జీవించటానికి మార్గం చూపించటానికి ఒక ఉదాత్త వ్యక్తి అవసరమైనప్పుడు ఆ వ్యక్తి తారసపడతాడు. సాధారణ మానవుడి కంటే భిన్నంగా ఉంటూ తన జీవన విధానం ద్వారా, బోధ ద్వారా మనల్ని ప్రభావితం చేస్తూ...మనకు ప్రబోధం చేస్తూ సంపూర్ణ మానవుడిగా జీవించటానికి కావలసిన వివిధ మార్గాలను సూచిస్తూ చూపిస్తూ నడిపిస్తారు. అటువంటి వారు భగవత్ సమానులు నిజానికి వారే దైవం కూడా వారే పరశివ అవతారమైన శంకర భగవత్పాదులు. అనంత వాంగ్మయాన్ని సృష్టించి జ్ఞానాన్నం వరదానం చేసిన పూర్ణ పురుషులు శంకరులు. సమకాలీన ప్రపంచం డబ్బు, అధికారం, అహంకారం, మమకారం, భోగలాలస వంటి అశాశ్వత స్వల్పకాలిక విషయాల వెనుక పరుగునిడుతూ జీవితాన్ని అస్పష్టంగా, అనాచారంగా, భయంగా, అభద్రతగా, ఆందోళనగా, అసంతృప్తిగా, అశాంతిగా గడుపుతున్న తరుణంలో శంకర బోధ ఎంతగానో అక్కరకు వస్తుంది. శంకరులు ఆలోచనలు నిత్య సత్య శాశ్వతాలు, సర్వకాలికాలు, విశ్వజనీనాలు. వాటిని మనం అర్థం చేసుకోగలిగితే మనం గడిపే జీవితం దాని పరిమితి పరమార్థం స్పష్టమై జీవితాన్ని ఒక వాస్తవ సీమగా, ఆనంద రేఖగా, జ్ఞాన బిందువుగా సమగ్రంగా అనుభవించగలుగుతాం. అయితే ఈ పని ఎవరు చేయాలి? శంకరుల వంటి మహానుభావులే చేయవలసి ఉన్నది గనుక భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో శంకరులు ఒక అపూర్వ ప్రజ్ఞ. బాల మేధావిగా, వాదవేదిగా, వేదవాదిగా, వాగ్మిగా, ఆచార్యుడిగా, అద్వైత సిద్ధి ప్రదాతగా, రూపుగట్టిన యోగత్రయీగా, నాలుగు దిక్కులలో ఆత్మాయపీఠ ప్రతిష్ఠాపనాచార్యుడిగా, సర్వజ్ఞుడిగా, సర్వోన్నతుడిగా, మానవ దేహంలో నడయాడిన శుద్ధ చైతన్యంగా శంకరుల తలపే ఒక శివానందలహరి. శంకర భగవత్పాదుల అధ్యాత్మ ప్రస్థానం అంతా కూడా కాలడి నుంచి ఒక చిన్న బిందువుగా ప్రారంభమై కైలాసం దాకా ఎగబాకినటువంటి కేదార యాత్ర. కాలం ఒక అనంత ప్రవాహం మలుపులు, లోతులు, మెరకలు దారంతా పరచుకున్న ఒక అద్భుతం అది. మలుపు తిరగాలి, లోతు ఎరగాలి, మెరక దాటాలి నిజానికి కాలమే జీవితం. పంచరాత్ర, పాశుపత, శాక్త, జైన, బౌద్ధాలు అఖండ భారతాన్ని ఆవహించి వైదిక జీవన ధర్మాలు వెనకబడుతున్న వేళ, ధర్మ శూన్యత ఏర్పడిన వేళ, ధర్మోద్ధరణ అనివార్యము, అచ్చవసరము అయిన వేళ పరమేశ్వరుడు తనను తానే సృష్టించుకున్న మరొక మహా సంమంగళ వేళ జరిగింది శంకరుల ఆగమనం. మానవ జీవితం నడపటానికి గడపటానికి వచ్చింది కాదని, పరిపూర్ణంగా జీవించటానికి వచ్చిందని బోధించటానికి వచ్చిన ఆచార్య రూపమే శ్రీ శంకరులు. సనాతన ధర్మాన్ని సనూతన జీవన ధర్మంగా తీర్చిదిద్ది అధునాతన సమాజానికి సాంఘిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గాన్ని విస్పష్టంగా నిర్దేశించిన వేదమూర్తి శంకరులు. చిరుప్రాయంలోనే సమస్త విద్యలను కైవసం చేసుకొని కౌమార యౌవన దశలలోనే మహా పండితులను వాదాలలో ఓడించి అంటే సమాధాన పరిచి అద్వైత జీవన విధానాన్ని జాతికి వరదానం చేసిన పూర్ణద్వైతమూర్తి శ్రీ శంకరులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని శంకర భగవత్పాదులని మనం స్తుతిస్తాం. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో వర్తరిష్యతి అంటే పరమేశ్వరుడు గురువుగా నలుగురు శిష్యులతో వస్తాడు అంటుంది వాయుపురాణం. వ్యాకుర్వాన్ వ్యాస సూత్రార్ధం శ్రుతేర్ధాం యతోచివాన్ శ్రుతేర్న్యాయః స ఏవర్తతః శంకర సవితానని అంటే శంకర భగవత్పాదులు మానవ మాత్రులు కారు ఆయన సూర్యదేవుడే. కాదు కాదు ఆచార్య శంకరులు జ్ఞానాదిత్యులు తత్వమసి. శంకరుల అవనీ సంచారం పరిమిత కాలంలో సాగిన మహిమా మహనీయ రసార్ద్ర ఘట్టం. అమ్మా నీ చివరి క్షణాలలో నన్ను తలుచుకో మరో క్షణం నీ చెంత నిలుస్తాను, నీ అంత్యక్రియలు నేను జరుపుతాను అని తల్లితో అన్నప్పుడు ఆయన కర్మకాండను ధర్మబద్ధం చేశారు. అమ్మా ఇకపై ఎవరు నాకు భిక్ష ఇస్తే ఆమే నా తల్లి, ఎవరు జ్ఞానబోధ చేస్తే ఆయనే నా తండ్రి, పరమశాంతమే నా సఖి, శిష్యులే నా సంతతి, ఏకాంతమే ఆనందం, మౌనమే నా భాష, మాటలే నా మౌనం, చూపులే బోధ అన్నప్పుడు ఆయన మనఃసన్యాసి విశ్వంభరుడు. నేను నేలను కాను, నింగిని కాను, నీరును కాను, నిప్పును కాను అన్నీ కలిసి నిజానికి నేను కాను కానీ నేను చైతన్యాన్ని, ఏకాత్మను, యోగాన్ని, యోగాతీతున్ని, అవస్థాత్రయతీతున్ని. ఏ వస్తువుతోనూ నాకు తాదాత్మ్యం లేదు నేను శివున్ని, చిదానందున్ని, సదానందున్ని, సర్వవర్ణాతీతున్ని, నిరాకార నిష్ఠుల తేజాన్ని అని గోవిందపాదుడితో అన్నప్పుడు శంకరుడు సర్వాత్మకుడు. సర్వేశ్వరా! మూడు తప్పులు చేశాను మన్నించు, నీవు సర్వాంతర్యామివి అని తెలిసి అనేక దేవాలయాలు దర్శించాను, నీవు మనస్సుకి అతీతుడవని ఎరిగి మనసులో ధ్యానించాను, నీవు మాటలకు అందనివాడివి అని తెలిసి కూడా నిన్ను స్తుతిస్తూ, స్తుతిస్తూ అసంఖ్యాక స్తోత్రాలు వ్రాశాను. నిజానికి నీవు నేను ఒక్కటే అయినా ఈ పొరపాట్లు చేసినందుకు మన్నించు అన్నప్పుడు ఆయన అద్వైతమూర్తి. కనకధారాస్తవన నాడు కారుణ్యమూర్తి, సౌందర్యలహరి నాడు సదానందమూర్తి, శివానందలహరి నాడు సదాశివమూర్తి, వివేకచూడామణి నాడు వైరాగ్యమూర్తి, భజగోవిందం నాడు జగజ్జీవేశ్వరమూర్తి. జగత్తు పట్ల, సంసారం పట్ల, జీవుడి పట్ల శంకరుల సహజ కరుణాస్పర్శే భజగోవిందం. శంకరులు నిజానికి ఒక బిల్వవృక్షం ఆయన నుండి జారిన ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క దళం అది ధవళం, సరళం, తరళం, పాపశాపహరణం, కైవల్య కారణం.శంకర భగవత్పాదులు రచించిన భజగోవిందం ఎన్ని కళలలో ప్రవచనమై, ఎన్ని కళలలో వ్యాఖ్యానమై అర్థమై సమర్థ సమన్వయ బోధయై ఈ ప్రపంచంలో ఆవిష్కృతమైందో లెక్కలేదు. కాలం, సంస్కృతి, విలువలు, ఆయా దేశాలలో జాతులలో విభిన్నంగా, వినూత్నంగా, విచిత్రంగా రూపాంతరం చెందుతున్నప్పుడు భగవత్పాదుల భజగోవిందం మనకు అక్కరవుతున్నది. మానవ జీవితం మీద, జీవన విధానం మీద సనాతన సనూతన సమగ్ర వ్యాఖ్యగా, బోధగా, కాలాద్యవచ్ఛిన్నంగా నిలిచిన సప్రమాణ ఉద్గీత భజగోవిందం. వారు వ్రాయని భాష్యం లేదు, గీతిక లేదు, స్తోత్రం లేదు. సర్వ దేవతా గుణాల సమన్వయ స్వరూపంగా, మతాతీతమైన సరళ భావనగా అద్వైతాన్ని ప్రతిపాదించి భారతీయ ఆత్మను మహోజ్వలమణిగా వెలిగించిన తేజో రూపమే శంకరుడు. పరమ కరుణాలయంగా గురు శిష్య పరంపరను, శృతి స్మృతుల వ్యాఖ్యాతగా ఆచార్యత్వాన్ని, దైవం పట్ల అచంచల విశ్వాసాన్ని, దైవీ శక్తుల పట్ల నిర్ద్వంద్వమైన నమ్మకాన్ని, నామ రూప భావాతీతమైన తత్వాన్ని అరచేతిలో అమలకంగా అనుగ్రహించిన సరస్వతీ స్వరూపమే శంకరుడు. ఎన్ని సిద్ధులున్నా వాటిని సమాజహితం చేసి, ఎంత జ్ఞాన స్వరూపమైనా వినయమూర్తిగా నిలిచి, సాక్షాత్తు శివ స్వరూపమైనా ఈ లోకంలోనే సాలోక్య, సామీప్య, సాన్నిధ్యంగా నిలిచి, సాయుజ్య మార్గోపదేశనం చేసి, పరమహంస పరివ్రాజక సన్యాస స్థితులను తేటతెల్లం చేసిన పురాణ పురుషులు ఆదిశంకరులు. మాట, పాట, నడక, నడత అంతా సత్యబోధగా సాగిన శంకరావతారం సత్యాచార్య స్వరూపం. సమన్వయమే కానీ సంఘర్షణకు తావులేని భావధార శంకరులది. తమ రాకకు ముందున్న భావ సంపదలను పరిష్కరించి, వాటికి హేతుబద్ధత కల్పించి, పూర్ణవాదంగా తీర్చిదిద్దిన భావనా శిల్పి శ్రీ శంకరుడు. శంకర వాంగ్మయము శంకరులు భిన్నం కాదు. జీవుడు దేవుడు భిన్నం కాదు. దేహం ఆత్మ భిన్నం కాదు. జనన మరణాలు, చీకటి వెలుగులు, దివా రాత్రాలు భిన్నం కావు. అవి రెండుగా కనిపించే ఒకే సంగతి. రెండోదంటూ మరొకటి లేదు. ఉన్నది ఒకటే, అదే ఆత్మ. అందరిలో అంతటా ఉన్నది అదే. శూన్యమూ పూర్ణమూ ఒకటే. అవి రెండు స్థితులు, అంతే. కాలడి నుంచి కేదారం వరకు సాగిన ముప్పై రెండు సంవత్సరాల శంకర అవతార ప్రవాహం భారతీయ చరిత్రలో ఒక అపూర్వ సన్నివేశం. పూర్ణా నది తీరంలో ప్రారంభమై హిమాచల సానువులలో సమైక్యమైన అద్వైత ధార. దేశం ఒకటే, దిక్కులు ఇలా జరిగిన విభజన మనిషి చేసుకున్నదే. నిజానికి అద్వైతమే అచలం. ద్వాపరలో వ్యాసుడు తొలి లోక గురువు. ఆ యుగంలోనే యోగేశ్వర కృష్ణుడు తొలి జగద్గురువు. కలియుగంలో శంకర భగవత్పాదులు, ఆది శంకరులు జగద్గురువులు. అద్వైతా అమృతధార కురియ, అంతరంగ మనిడి పాత్ర తెరచి ఉంచు. బోర్లించి ఉండగా బొట్టైన చిక్కదు. తెరచి ఉంచిన చాలు తరచనగును. శంకర స్మృతి నిత్యం, సత్యం, శాశ్వతం. ఎవరు ఈ శంకరులు? శంభోర్ మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా. అంటే, పరమేశ్వరుడు మానవ దేహాన్ని తీసుకుని వచ్చినప్పుడు పరమశివుడే, సదాశివుడే శంకర స్వరూపంగా వచ్చారు గనుక శంభోర్ మూర్తిహి. పరమేశ్వరుడే మూర్తి అంటే బొమ్మ. బొమ్మగా వచ్చాడు. శరతి భువనే, ఈ భువనంలో, ఈ ప్రపంచంలో నడిచారు ఆయన. ఏ రూపంలో? శంకరాచార్య రూపా. ఆచార్య శంకర స్వరూపంగా ఈ అఖండ భారతావనిని కూడా ఆసేతు సీతాచలం, పరమ పావనమూ, ఆనంద రసతుందలమూ, మహోజ్వలమైనటువంటి అద్వైత పతాకాన్ని రెపరెపలాడించినటువంటి అద్వైత నికేతనమే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదుల భావధార ఈ తరానికి మాత్రమే కాక రాబోయేటువంటి అనంత కాలాలకు మార్గ నిర్దేశకమై, దారిదీపమై మానవుణ్ణి అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి భావనలో నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ మనం శంకర వాంగ్మయాన్ని తీవ్ర విచారధారకు గురిచేసి ఆ ఆనంద అంబువులని మనం పానం చేద్దాం. శంకర భగవత్పాదులు మహా దార్శనికుడిగా జీవిత పరిసత్యాలను అనేక కోణాలలో ఆవిష్కరించి మానవ మేధకు తాత్విక చింతన జోడించారు. మానవుడు తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఆలోచనా స్రవంతికి అక్షర రూపం ఇచ్చారు. దుఃఖానికి, అపజయానికి, ఆశాభంగాలకు మూలమైన అనేక కారణాలను స్పృశిస్తూ, ఆలోచనాగ్ని రగిల్చి ఉపదేశంగా తీర్చిదిద్దుతూనే, కనిపిస్తున్న గురువుని, కనపడని భగవంతుణ్ణి అంటే అంతరాత్మను అనుసరిస్తూ జీవితాన్ని ఆనంద నందనం చేసుకోమన్నారు. ఆధునిక మానవ జీవన శైలిలో వస్తున్న విపరీత ధోరణులకు, పరిణామాలకు ఉపశమన యోగంగా శంకరులు అనుగ్రహించిన విచారధారే భజగోవిందం. జీవితం అంటే ఎన్నో విషయాలను తెలుసుకోవటం మాత్రమే కాదు, వాటిని ఆచరించటం కూడా. మానవ జీవితం అత్యంత పరిమితమైనది. లక్ష్యగమ్యాలు దూరం తరగనివి. అందుకే దారి చూపించి, ఉడుపు నేర్పే గురువును, అంతరంగ శక్తిగా, భావనగా వెలిగే దైవాన్ని స్మరిస్తూ జీవితాన్ని జీవించాలి. మితిమీరిన సంపదలు సంపాదించి, మోహ వ్యామోహ వ్యసనాలు పెంచుకునే కంటే మంచి ఆలోచనలు, మంచి పనులు చేసి ధర్మమార్గంలో పొందిన సంపదను ఆనందంగా అనుభవించాలి. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. అది దుర్దశకు దారితీస్తుంది. సృష్టిలో ఏ లోపమూ లేదు. ఉన్నదంతా చూసే చూపులోనే ఉంది. స్త్రీ సౌందర్యం ఉత్తముడికి ఆహ్లాదం కలిగిస్తుంది, అధముడికి ఆతృత కలిగిస్తుంది. ధర్మ కామం వలన వ్యక్తికి వ్యవస్థకు నష్టం ఏమీ లేదు. ఇంద్రియ నిగ్రహమే చేయవలసిన సాధన.డబ్బుంటే లోకం నీ చుట్టూ ఉంటుంది. అది లేనినాడు లోకం నిన్ను వీడుతుంది. కరిగిపోయే కరిగిపోయే లౌకిక ధనంతోనే స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కదలని సిరే ఉత్తమ విద్య అదే ఆత్మవిద్య అది వినయాన్ని, వివేకాన్ని, విచక్షణను, తృప్తిని, ప్రశాంతతను అనుగ్రహించి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒంట్లో ఊపిరి ఉన్నంతసేపు మన దేహం శివం. శివం లేనప్పుడు అది శవం. శరీరానికి ఉన్న పరిమితి ఇది. ఉన్నంత కాలము అంటిపెట్టుకున్న భార్య సైతం తన భర్త శవాన్ని చూసి భయపడుతుంది. గడప దాటి బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే లోకంలో ఉన్నతంగా, శక్తివంతంగా, సర్వహితంగా జీవించటానికి ఈ శరీరమే సాధనం. గుర్తెరిగి వర్తిస్తే అది శ్రేయోదాయకం. ఎవరికి ఎవరు? ఎవరి మూలాలు ఏవి? ఎవరికీ తెలియదు. జీవన ప్రవాహంలో కలుసుకుని కొంత దూరం కొంతకాలం ప్రయాణించే సహయాత్రికులుగా భార్యాభర్తలుంటారు. ఈ సత్యం తెలుసుకుని స్పృహతో జీవించగలగటం ఎంతో అవసరం. మంచి వారితో, మంచి విషయాలతో, మంచి పనులతో అంటే ఆత్మవిద్యకు దారితీయించే సంగతులతో ఎప్పుడూ కూడి ఉండాలి. దానివలన ప్రపంచము, దాని పోకడ, దాని రీతి అర్థమై లోకానికి లోబడి దురాశతో బతికే ప్రమాదం తప్పిపోతుంది. విచక్షణ, వివేకం కలిగి ఆశ దురాశగా మారదు. ఏది ఎంతవరకు కావాలో అంతే పొందుదామన్న భావన నెలకొంది చెందుతుంది. ఆశలు నెమ్మదిస్తున్నందున మనసు పరిమిత కోరికలతో ప్రశాంతంగానూ, నిశ్చలంగానూ ఉంటుంది. శుద్ధత్వము, సిద్ధత్వము కలుగుతాయి. సంసార పరమైన బాధ్యతలను ఉదాత్తంగా నిర్వహించగలిగిన చిత్తశుద్ధి కారణంగా ఏమీ అంటించుకోని స్థిమితత్వం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ప్రపంచం పట్ల మనసు ఏర్పరచుకునే మోహ వ్యామోహాలు, తీవ్ర భావలులు నశిస్తాయి. మోహక్షయమే మోక్షం. మోక్షం అంటే మరణానంతర సుఖం కాదు. మోక్షం అంటే నిర్మలానందం, నిశ్చలానందం, నిరంజనానందం. అటువంటి ఆనందమే జీవితా ఆనందం. జీవితం అంటే నిజానికి రోజూ కొంత పోగొట్టుకోవటమే. పుట్టినరోజు పండగ జరుపుకుంటాం. దేనికి? గడిచిన దానికా? మార్పుకా? ఏమో? తరుగుతున్న వయస్సుతో కామవికారము నశిస్తున్నది. హరించి పోతున్న సిరితో బంధువర్గము తరలిపోతున్నది. నీరింకితే చెరువు ఉన్నదా? ఉనికి అస్తిత్వము నశిస్తున్నాయి కదా! నిజతత్వమే ఎరిగితే మారేది దేహము దానిని ఆశ్రయించిన ప్రపంచమే కానీ, వాటికి మూలమైన ఆత్మ కాదని స్పృహ కలిగితే ఇక ప్రపంచ భావనకు చోటు ఎక్కడ? బంధు జన బలం బలం కాదు. యవ్వన బలం బలం కాదు. ధనబలము బలం కాదు. ఈ మూడు నిజానికి ఎంతో కాలం ఉండవు. కనురెప్పపాటులో కాలం వీటన్నింటినీ హరించేస్తుంది. కనిపిస్తున్నవి, అనిపిస్తున్నవన్నీ మంచు తెర కమ్ముకున్నవే. అన్నీ పంచదార బొమ్మలే. క్షణంలో కరిగిపోయేవే. కరగని, తరగని, వరగని, జరగని బ్రహ్మానందాన్ని శాశ్వత స్థాయిని పొందే అచ్చ తెలివిని సంపాదించుకోవాలి. కాలచక్రం ఆగదు. దేనినీ ఆపదు. చీకటి, వెలుగు, ఆశ, నిరాశ, ఎత్తు, పల్లం, జయం, అపజయం, జననం, మరణం ఇవన్నీ పైకి కిందికి ఆగకుండా కదిలే చక్రం లోని ఆకులే. వీటికి స్థిరత్వం లేదు, స్థిమితము లేదు. కాలం వాడుకునే ఈ ఆటలో ఆటను చూస్తున్న మనిషి ఆయుష్షు అవిరై పోతున్నది. అన్నీ తెలిసి, ఇదంతా చూసి కూడా మానవుడు తనలోని ఆశలను, ఆకాంక్షలను, అహంకారాన్ని, మమకారాన్ని వదులుకోలేకపోతున్నాడు. వైరాగ్యం నిజానికి వైభోగమే. ప్రపంచము మధుర సౌందర్యమయమే. జగతి యల్లా మధుర సౌందర్యమయమంచు కన్నుమూసి కలలు కాంచినాను. కన్ను విప్ప తెలిసే కర్తవ్యమును చేయ వాసయోగ్యమగును వసుధ యెనుచు. అశాశ్వతం నుంచి శాశ్వతత్వంలోకి, పరిమితి నుంచి అపరిమితంలోకి, ఊహ నుంచి వాస్తవంలోకి, వాస్తవిక నుంచి అతివాస్తవికతలోకి ఏటి వాలు ప్రయాణంగా తీర్చిదిద్దే అధ్యాత్మ ప్రస్థానమే భజగోవిందం. అదే మోహ ముద్గర. పన్నెండు శ్లోకాలలో మానవుడి అశాంతికి మూలమైన విషయ ప్రస్తావనే ద్వాదశ మంజరీక స్తోత్రం. ఏ పేరున పిలుచుకున్నా సనాతన బోధకుడి, సనూతన దివ్య భావలహరి భజగోవిందం. శ్రీ శంకరుల భజగోవిందం వారి శిష్యులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గురువు బోధించిన దానికి కొనసాగింపుగా వారందరూ జీవన పరిసత్యాలను, తాత్విక చింతనను, లోక రీతులను, మానవ స్వభావాలను, కపట గురువుల వైనాలను, భగవంతుని దివ్యత్వాన్ని, ఆయన సర్వవ్యాపకత్వాన్ని సరళంగా, గంభీరంగా బోధించారు. శ్రీ పద్మపదాచార్యులు, తోటకాచార్యులు, హస్తామలకుడు, సుబోధుడు, యోగానందుడు, ఆనందగిరి వంటి సమర్థ శిష్యుల ఆలోచనలన్నీ గురుదేవుల భావనలకు ప్రతిబింబాలే. అవి ప్రతిధ్వనులే. సజ్జన సాంగత్యం మనిషిని సంసార సాగరాన్ని దాటమని స్పష్టంగా బోధిస్తున్నది. వేషం కట్టినవాడు నటగురువే. విషయం బోధించేవాడు నుతగురువు. శరీరం శిథిలావస్థకు చేరుకున్నా ఆశాపాశం తెగకపోతే ఎట్లా? ముసలితనం ముంచెత్తినా, ఇంద్రియాలన్నీ ముడుచుకుపోయినా, మరణాన్ని గురించి తీవ్ర ఆలోచన పీడిస్తున్నా, బాహ్య సాధనలు వదులుకోకుండా ప్రపంచాపేక్ష తుంచుకోకపోతే ఎట్లా? జ్ఞానం లభించకపోతే కైవల్యం లభించదు. సముద్ర, నదీ స్నానాలు, వ్రత దానాదులు మనస్సును నిర్మలం చేస్తాయే కానీ ముక్తిని ఇవ్వవు. అవి కేవలం ముక్తికి మార్గాలే. చెట్టు నీడే భద్రభవనం, నేలే భవ్య శయ్య, అరచేయే పాత్ర, జింక చర్మమే పట్టుబట్ట, పళ్ళే పరమాన్నం, నదిలో నీళ్ళే అమృతం. ఈ విధంగా జీవించే నిత్య తృప్తుడే నిత్యసుఖి. భగవద్గీతా పఠనం, గంగాజల పానం, గోవింద స్మరణం అధ్యాత్మ పురోగమనానికి సాధనలు. పుట్టటం, ఉండటం, పోవటం ఇదొక విచిత్ర జన్మచక్రం. ఎన్నిసార్లు జరిగినా ఏమీ మిగలని ఆట. తప్పని తప్పించుకోలేని అక్కరకురాని పరుగు. భగవంతుని కృపతో దాన్ని తప్పించుకోవాలి.పసివాడు, ఉన్మత్తుడు, అవధూత ఈ ముగ్గురు ప్రపంచంలోనే ఉన్నా భయమెరగని వారు. వారి చిత్తం అత్యంత సహజంగా బ్రహ్మంతో కూడి ఉంటుంది. అందువల్లనే ఆ ముగ్గురు ఆనంద స్వరూపులు. ప్రాపంచిక విషయాలను వదిలి తత్వ విచారణ చేయాలి. సమచిత్తమే దివ్య యోగం. అంతటా ఉన్నది దైవమే. శత్రుమిత్ర భావం వదిలిపెట్టి ఆత్మ దర్శనం చేయాలి. అరిషడ్వర్గాలను హరిమయం చేయాలి. ఈ విధంగా సాగిన శిష్యుల ఆలోచనలకు ఆచార్య శంకర హృదయం ఆనంద సాగరమైంది. పధ్నాలుగు కోణాలలో విచ్చుకున్న శిష్య హృదయాలు వారి అనుగ్రహ పాత్రమైనై. భగవత్పాదుల శిష్యులు సర్వ ప్రపంచాన్ని ఆశీర్వచనా అమృత వృష్టిలో ముంచెత్తుతున్నారు సాదరంగా, సానందంగా. గీతా జయము, సహస్రనామ గానము, రూప ధ్యానము, సత్సంగము, సత్సాంగత్యము, పరివీణులకు దానము చేయండి. భోగ రోగాలు వదులుకొని యోగంలో ఉండండి. డబ్బు పాపిష్టిది కాదు. పాపిష్టి వాడి చేతిలో డబ్బుంటే ప్రమాదం. డబ్బు మనుషులను వెర్రిదీస్తుంది. అనర్ధానికి మూలం అదే. పరిమితి ఎరిగి సంపాదించండి. పాత్రత ఎరిగి వినియోగించండి. ఇంద్రియ నియంత్రణ, ఏది నిత్యం ఏది సత్యం అనే విచారణ, నామ జపంతో పాటు ధ్యానం, చివరకు పొందవలసిన సమాధి స్థితి, ఇవన్నీ బహు నేర్పుతో, బహు ఓర్పుతో సాగించాలి, సాధించాలి. నీలో ఉన్న దివ్యంని నీ అంతట నీవే దర్శించాలి. నిన్ను నీవే ఉద్ధరించుకోగలవు. నీ అనుభవమే నీ నిజ గురువు. నీవు ఆత్మవు. నీవు పరమాత్మ కంటే భిన్నం కాదు. శంకర భగవత్పాదుల భజగోవిందం అధునాతన మానవుడికి కరదీపిక, సత్యకాలిక, ఆనందమాలిక. సాయిరాం. [నవ్వు] ఇంతవరకు మీరు భారతీయన్ కార్యక్రమంలో భాగంగా శ్రీ శంకర భగవత్పాదుల వారి గురించి శ్రీ వి.ఎస్.ఆర్ మూర్తి గారు అందించిన మొదటి ప్రసంగాన్ని విన్నారు. వచ్చే వారం శంకరుల వారి గురించి మూర్తి గారు అందించి రెండవ ప్రసంగాన్ని వింటారు. అంతవరకు సెలవామరి. సాయిరాం. [నవ్వు
SSSMC · audio
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 01
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 01
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:06
More in this series
Sri Adi Shankara — Contribution to Indian Culture and Spirituality
- 27 min 1
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 01
Now playing - 26 min 2
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 02
- 31 min 3
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 03
- 31 min 4
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 04
- 31 min 5
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 05