No transcript for this section.
[సంగీతం] భారతీయం. [సంగీతం] సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగమాలిక ఒక భావవీచిక. [సంగీతం] రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయన్ కార్యక్రమానికి స్వాగతం. ఆదిశంకరాచార్యుల వారిమీద శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు భారతీయన్ శీర్షికలో భాగంగా అందిస్తున్నటువంటి ఉపన్యాస పరంపరలోని మూడవ భాగాన్ని ఈనాడు విందాం. [సంగీతం] సోపాన పంచకాన్ని అంటే శంకర భగవత్పాదులు సాధనా స్థితిలో ఐదు మెట్లుగా మనకి పరిచయం చేస్తూ. ఆ మెట్లు ఏమున్నాయి? ఒక్కొక్క మెట్లో ఏం సాధించుకోవాలంటూ వివరణ ఇస్తూ, దీనికంతటికీ కూడా గురువు కావాలి అని చెప్తూ, గురుపాద ద్వంద్వానికి నమస్కరించమంటున్నారు. శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదభినంచితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం అని కదా గురుపాదుకలకు వందనం. అయితే శంకర భగవత్పాదులు దీనిని దాటి పరమోన్నతమైనటువంటి స్థాయిలో గురు పాదాలని సమాశ్రయించమంటున్నారు. అందుకనే మనం మానస భజరే గురు చరణం అనేటువంటి దాంట్లో గురు చరణాలు ఎంత గొప్పవో మనకి గురు స్వరూపమైనటువంటి స్వామి కూడా బోధ చేశారు. దాన్ని కాస్త పక్కన పెడితే శంకర భగవత్పాదులు ఈ గురు పాదుకలను గురించి మాట్లాడుతూ సుందర శరీరం, సుందరి అయిన భార్య, విమల కీర్తి, మేరువంత సంపద, ఇవన్నీ మంచి పనులు చేయటం వలన లభించినవే కానీ శాశ్వతమైనవి కాదు. ఇవన్నీ మాడిపోతే, జారిపోతే గతి ఏమిటి అని గురుపాద పద్మముల యందు మనసు లగ్నం కాకపోతే తర్వాత ఏమిటి? తతః క్యమ్ అంటారు కదా! ఆదర వాక్యంగా శంకరులు జిజ్ఞాస రేకెత్తిస్తున్నారు. గురు పాదములు గనక దొరక్కపోయినట్లయితే ప్రాపంచికమైన సుఖాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం లాభం? ఇవన్నీ మారిపోతే, జారిపోతే మన గతి ఏమిటి? గురుపాదం అందుకోకపోతే ఏం పోగొట్టుకుంటాం? అనే దాన్ని చెప్తూ ఇంకాస్త ముందుగా ఈ తతః క్యమ్ అంటే ఏం లేదు తర్వాత ఏమిటి? తర్వాత ఏమిటి అని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. వంశ సంపద, బంధు సంపద, వేదాధ్యయనం, శాస్త్ర విద్యా సంపద, మధుర వాక్కులు, పాండిత్యం, కవిత్వం, ఇవన్నీ మార్పు చెందేవే, నశించేవే తతః క్యమ్ తర్వాత ఏమిటి? విదేశంలో గౌరవం, స్వదేశంలో ధన్యత, సదాచారం వలన కలిగే ప్రాబల్యం, పొందే అగ్రస్థానం, ఇవి శాశ్వతం కాదు. గురు పాదముల యందు మనసు నెలకొకడి చెందకపోతే తర్వాత ఏమిటి? భూపాల మండలమంతా చేసే పాదపూజ, సేవ సైతం తాత్కాలికమే. అవి సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వవచ్చునేమో కానీ అవి క్షణికాలే. ఈ గౌరవాలన్నీ కాసేపు మనసుకు సంతోషం కలిగిస్తాయి. కానీ ఆనందాన్ని ఇవ్వవు. ఇవి రూపురేఖలు మార్చుకుని ఏదో నాటికి మాసిపోయేవే. గురు చరణ లగ్నం కాని మనసు వీటిని నిలబెట్టుకోలేదు. ఆపై ఏమిటి? భోగంలోనూ, యోగంలోనూ, పశు సంపదలోనూ, భార్య ముఖంలోనూ, ధన విషయంలోనూ మనసును లగ్నం చేస్తే ఏం ప్రయోజనం? ఇవి శాశ్వతం కాకపోగా దుఃఖానికి కారణమవుతున్నాయి. ఆనందం కలగాలి అంటే పరమాత్మ యందే మనస్సును నిలిపి ఉంచాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా దుర్గతి తధ్యం. అదే జరిగితే తతః క్యమ్ ఆ తర్వాత ఏమిటి? అరణ్యం మీద అంటే వానప్రస్థాశ్రమం మీద, ఇంటి మీద అంటే సంసారం మీద, ఏవేవో కార్యకలాపాల మీద, అశాశ్వతమైన శరీరం మీద మనసు లగ్నం చేసి ఏం లాభం? అవన్నీ మారేవే, అన్నీ నశించేవే. మనస్సును గురుపాద యుగళాలపై నిలపలేకపోతే ప్రయోజనం శూన్యం, ఫలితం సున్నా. ఈ దుస్థితి ఏర్పడిన తర్వాత ఏమిటి? యతి గాని, భూపతి గాని, సన్యాసి గాని, సంసారి గాని, బ్రహ్మచారి గాని ఎవరైనా సరే ఈ ప్రశ్నలను సందిన్చుకుని, చింతన అలవరచుకుని, ప్రామాణికమైన గురు వాక్యముల యందు మనస్సును కూర్చి ఉంచాలి. నిరంతర విచారణ, ఆచరణ, సత్య సంచారణ వలన విచారం నశించి, ప్రాపంచిక కోరికలు తీరి, బ్రహ్మానంద పదం లభిస్తుంది. సర్వానందమయ జీవితం సిద్ధిస్తుంది. ఇంతకీ గురువు ఎవరు? ఈశ్వరో గురురాత్మేతి. ప్రత్యేకంగా వస్తువుగా కనిపించని ఈశ్వరుడు, చైతన్యంగా శక్తిగా ప్రకాశించే ఆత్మ, ఈ రెండింటి అందమైన కలనేతే గురువు. గురువు సాకారుడు. గురువు నిరాకారుడు కూడా. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు."గురుపాదమన్నా భగవంతుని పాదమన్నా ఒక్కటే. లౌకిక విషయాలలో మనస్సును నిలిపి వగచేయకంటే, భగవంతుని పాదపద్మములపై నిలిపి జీవించగలిగితే ఆ జన్మే ధన్యం, ఆ జీవితం ఆనందమయం. ఇదే శంకర భగవత్పాదుల సూటి బోధ, చూపించిన దీటైన బాట." అని చెప్తూనే శంకర భగవత్పాదులు భగవంతుని వైపు మన మనస్సుని పురాణగతమైనటువంటి విశేషాలను చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి స్పురణకు తెస్తుంటారు. భగవంతుడు వినమ్రుడా? మానవుడు వినమ్రుడా? అని. మానవుడు వినయాన్ని నేర్చుకుంటాడు భగవంతుడికి అది సహజ గుణం. భగవంతుడు వినమ్రుడు. భగవంతుడు నిజానికి ఉత్తమ శ్రోత. శ్రీకృష్ణ పరమాత్మకు అనటము కొత్త కాదు, వినటము కొత్త కాదు. భీష్ముడు బోధిస్తుంటే పాండవులతో కూడి తాను శ్రవణపేయంగా విష్ణు సహస్రనామ అమృతపానం చేశాడు. అరిషడ్వర్గాలు తొలగిపోగా, కౌరవ భుక్తాన్న రూపంగా మిగిలిన రక్తమంతా అంపశయ్య యోగంలో పోగా, మనసంతా విష్ణుమయమైన వేళ భీష్ముడు విష్ణు గుణగణాలను కీర్తించిన సన్నివేశం మహనీయం, వర్ణనీయం. అదొక అద్భుత అధ్యాత్మ మణిమాల, వేదాంత భావనా సుమమాల. "తత్వం తత్వమిత్ ఏకాత్మ జన్మ మృత్యుగరాతిగా" అని కదా! అంటే పరమ సత్యం అంటే భగవంతుడే, అదే బ్రహ్మం. తత్వమెరిగిన వాడే తత్వవిదుడు, అతడే బ్రహ్మవేత్త. తత్వమూ బ్రహ్మమూ ఎరిగినవాడే ఏకాత్మ. ఆత్మ కంటే రెండోదంటూ లేదని, రెండుగా లేనిదని అర్థం. ఆ విషయం ఎరిగినవాడు ముక్తుడే అవుతున్నాడు. జన్మనూ, మృత్యువునూ, వృద్ధాప్యాన్నీ దాటినవాడు ముక్తుడు. దేవుడు వీటన్నిటికీ అతీతుడు. జీవుడు వీటిని దాటవలసినవాడు, దాట కలిగినవాడు. విష్ణు సహస్రనామం అన్నవాడు భీష్ముడు, విన్నవాడు విష్ణువైన కృష్ణుడు. వేదిక మహాభారత సంగ్రామ రంగం, సమయం సంధ్యా సమయం, భీష్ముడి అవనీ సంచారంలో అది శాంతి పర్వం. రమణీయ భగవన్నామ స్మరణంతో సాధించుకున్న ఇచ్ఛామరణం. పూర్ణ ముక్తి సంచారమూ, విచారమూ సమసిపోగా మిగిలిన దివ్య విభూతి. విశ్వంతో ప్రారంభమై విష్ణువుతో ముగిసే విష్ణు సహస్రనామం విరాట్ మూర్తి వైభవానికి పతాక. అంతా మంత్రాత్మకమే, అంతా యంత్రాత్మకమే, తంత్రాత్మకమే. భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థితులలో అర్థం చేసుకోవలసిన సర్వవ్యాపకత్వమూ, సర్వజ్ఞత్వమూ, సర్వాంతర్యామిత్వమూ, సంపూర్ణత్వమైన విష్ణుత్వాన్ని అనుభవించమంటున్నాడు భీష్ముడు. ఇదంతా వింటున్నాడు ఉత్తమ శ్రోత అయిన శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవి మూడు కలాపాలు. అవి సృష్టి, స్థితి, సంహారం. మూడింటిలో సృష్టి, సంహారం, సంకల్ప వ్యవహారాలు. స్థితి సుదీర్ఘమైనది, విస్తృతమైనది. జీవుడు, జగత్తు నట రంగస్థలాలుగా సాగే నాటకం. ఆడించే దేవుడు, ఆడే జీవుడు కలిసే దివ్య యోగ ప్రయోగం. అదొక ప్రయాణం, అదొక ప్రస్థానం. ఆట వెక్తి కట్టాలంటే ఎన్నో మెళకువలు కావాలి. ఓర్పు, నేర్పు, కూర్పు, మార్పు వనగూడాలి. గెలవటానికి మనోశక్తి కావాలి. గెలుపే లక్ష్యంగా ఆట సాగాలి. విష్ణు సహస్రనామం ఏ నామానికి అది విడి కాదు. ఒకదానితో మరొకటి ముడిపడిన శక్తి మాల, అది రసాత్మక భక్తి మాల, ఆనంద మాల. పూర్తై ముడిపడుతున్న వేళ ముడి విప్పే యుక్తి మాల. విష్ణు సహస్రనామం భీష్ముడి ఆత్మ గానం. పరితృప్త భావం, భక్త జీవులకు సర్వ పాప సంహార చక్రం, నిత్య సుదర్శనం, శాశ్వత రక్ష విష్ణు సహస్రనామం. ఈ మహా మంత్ర రాజాన్ని జగటికందించిన వేదవ్యాసుల భగవానులకు వేవేల వందనాలు. ప్రతిరోజూ సాయంత్రం చదువుకోవలసిన జన జాగరణ గీతిక, జన కళ్యాణ మాలిక ఈ విష్ణు సహస్రనామం. శంకర భగవత్పాదులు భక్తి సామ్రాజ్యంలోకి మన మనస్సులను ప్రవేశపెడుతూనే మళ్ళీ మరొక్కసారి ఆత్మజ్ఞానమే అచ్చ తెలివి అంటున్నారు. "పంచభూతములు దిశాకరుండు నిశాకరుడుని తను సప్త కంబయేని శరీరంబు నీదే, కన్ను విప్పుట, కన్ను మూయుట నీవు కలుగకెట్లు? ఏతదధిష్టాత ఎవడో యజమానుడనున అష్టమ తనువు వాడు. కెరళనన్నేమి మిగిల్చితి నాసామి, బిట్టు నేనన్నది అభిజ్ఞ గాక." పరమాద్భుతం! పంచభూతాలు, కుడి కన్ను అనేటువంటి సూర్య నాడి, ఎడమ కన్ను అనేటువంటి చంద్ర నాడి, ఇవి కలిపితే శరీరం గనక అనుకున్నట్లయితే "నాదంటూ ఏం లేదు. నీవు లేకుండా కన్ను విప్పలేను, నీ అనుజ్ఞ లేనిదే కన్ను ముయ్యలేను. కానీ నేను చేశానంటున్నానే, మరి నాకేం మిగిల్చావు తండ్రీ?" అంటే "నీవెంత దయామయుడివి పరమాత్మ! ఓ మానవుడా! నీ స్థితి ఏమిటో నీకు తెలుసునా? భగవంతుడు ఉన్నాడు అని చెప్పటానికి మిగిలిన ఏకైక అభిజ్ఞ, ఏకైక గుర్తు ఏమిటి? అది నువ్వే." తత్వమసి స్థాయిలో అంటే జీవుడు, దేవుడు వేరు కాదని చెప్తూనే శంకర భగవత్పాదులు ఎరుక మీద ఆత్మజ్ఞానమే అచ్చ తెలివి అనేటువంటి మాట చెప్తూ, మానవుడి ఆనందమంతా ఆరోగ్యంలో, సంపదలో, అధికారంలో దాగి ఉంది. పితృదేవతల ఆనందం మనుష్య ఆనందం కంటే నూరు రెట్లు ఎక్కువ. దానికంటే దేవా ఆనందం ఇంకా వంద రెట్లు ఎక్కువ. వేదాధ్యయనం చేసిన వాడి ఆనందం దానికంటే మరొక్క వంద రెట్లు అధికం. రాగద్వేషాలు లేని వేద పండితుడి ఆనందం దానికంటే వెయ్యి రెట్లు అధికం. అదే బ్రహ్మానందం. బ్రహ్మమంతా వెలుగు ముద్ద, అగ్నిమయం. కాలం, ప్రపంచం, మేఘం, మెరుపు, ఉరుము అంతా అగ్నిమయం. ఈ ప్రపంచంతో కూడి ఉన్న స్త్రీ పురుషులు అగ్ని స్వరూపాలే. "దహయతి ఇతి దేహః" దహింపబడేది గనుకనే అది దేహం. దేహం నుండి ప్రాణం విడిపోతే మరణం.మరణం అంటే మార్పే, మార్పుకు లోనైన దేహం అగ్నికి అర్పితం. కర్మలన్నీ జ్ఞానాగ్ని లో దగ్ధం కావాలి. నిజానికి వాక్కు అగ్ని స్వరూపమే. మూలాధారంలో ప్రారంభమైన వాయువే విశుద్ధ చక్రం వద్ద మాటగా బయటపడుతున్నది. దారెంతా యోగాగ్ని లో కాలుతూ వాయువు వాక్కు అవుతున్నది. నేను పరమైన మాటలన్నీ నేనుగా చలామణి అవుతున్నాయి. అంటే ఆత్మే దేహంగా వెలుగుతున్నది. దేహం బొమ్మ అందున్న చైతన్యమే బ్రహ్మ. చీకటి గర్భంలోనే వెలుగున్నది, వెలుగు లోగిలిలోనే చీకటి ఉన్నది. శబ్ద నిశ్శబ్దాల స్థితి నిజానికి ఇదే, ఇంతే. నేను నేనుల పరిస్థితి కూడా ఇదే. బయట ఉన్న వస్తువును కన్ను చూస్తున్నది, చూస్తున్న కన్ను చూడబడుతున్నది. అహంకారం వీటన్నింటినీ అన్నివేళలా చూస్తున్నది నేను. ఆ నేను పేరు ఆత్మ. ఆ నేను కదలదు కానీ అన్నింటినీ కదిలిస్తుంది. అదొక నిత్య సాక్షి. పుట్టదు, పెరగదు, నశించదు. నిజానికి ఆత్ అంటే ఏమి? మా అంటే లేదని శంకర భగవత్పాదుల నిశ్చితార్థం. అంటే ప్రత్యేకంగా లేదు అని. కనుక బ్రహ్మం అనేది ఆత్మకు మరొక పర్యాయపదం అన్నమాట. బ్రహ్మానుభవం పొందాలి అంటే ప్రాపంచిక చింతను విడిచి చింతన అలవాటు చేసుకోవాలి. ప్రతి దానిని ప్రశ్నించాలి, శోధించాలి, తర్కించుకోవాలి. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాతీతమైన సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. ఎవరికి వారే సాధన చేసుకోవాలి. అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను సక్రమంగా వాడుకోవాలి. దేహం వేరు, ఆత్మ వేరు కానే కాదు. పరస్పరాశ్రితంగా ఉన్న యదార్థ స్థితి అది. కుండ, నీరు, సముద్రం, అలలు, చంద్రుడు, చంద్ర కిరణాలు, సూర్యుడు, సూర్య కిరణాల వలె మరణం ఎరుగని ఆత్మ, శాశ్వతత్వం లేని శరీరం కలిసే ఉంటున్నాయి. ఇదే మహా పరిసత్యం. ఆత్మసాక్షాత్కారం అంటే మన లోపల మన వంటి మరొక వస్తువు ఉన్నదని, దానిని చూడటమని కాదు. ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది అని అర్థం. ఆస్పృహే ఎరుక. ఎరుక కలిగిన వాడికి ప్రపంచంతో పనిలేదు. ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మ మని, అదే ఆత్మని, అదే చైతన్యం అని, నిత్య సత్య శాశ్వతమైన ఆనందం అని అనుభవం కలిగిన తర్వాత తన కంటే మరొక వేరు వస్తువు లేదన్న భావన సంస్థిత అవుతున్నది. ఉన్నదంతా బ్రహ్మమే అన్నది సత్యం. అదే పరమ సత్యం. శ్రీ శంకరయతీంద్రుల దయావీరంలో ఎగిసిన వెలుగు రవ్వ ఈ ఆత్మబోధ. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి రాశారు అని తెలుసు. శివానందలహరి రాశారు అని తెలుసు. ఆనందలహరి రాశారు అని తెలుసు. ప్రపంచానికి అంతగా తెలియనిది, ఆయన శ్రీ కృష్ణానందలహరి ని కూడా రాశారు. దాన్ని విచారణ చేద్దాం. ఈ శ్రీ కృష్ణానందలహరి పరమ కవితాత్మకంగా, భావాత్మకంగా, లయాత్మకంగా, సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి ఒక భావనా భూమికగా మన ముందుకి వచ్చి మనల్ని ఆనంద పరవశుల్ని చేసేటువంటి పరమ విశిష్టమైనటువంటి ఒక కవితా నిర్మాణం. అందుకనే శంకర భగవత్పాదులు శివ పరంగా మనం చదువుతాం. శంకరా అనగానే శివుడని, ఆయన విష్ణువు గురించి ఎక్కువ చెప్పలేదని కానీ అద్వైత మూర్తి అని పొరపాటు పడుతూ ఉంటాం. ఆయన అద్వైత మూర్తి కనుకనే శ్రీకృష్ణ పరంగా ప్రబోధ సుధాకరం రాశారు. శివ స్వరూపులైన శంకర భగవత్పాదులు జగత్తుకు అనుగ్రహించిన దివ్య కవితాధార ప్రబోధ సుధాకరం. పరమాత్మ తాను ఒక్కడుగా తనను పెక్కు జీవాత్మలు గా పరిచ్ఛిన్నం చేసుకొని జీవుడు గా అనేక సాధనా మార్గాలను ఆశ్రయించి చివరకు సర్వమూ తానేనన్న భావనలో అందంగా ఒదిగించే పూర్ణాద్వైత బోధ ఈ ప్రబోధ సుధాకరం. కృష్ణత్మకమైన ఈ దివ్య ప్రబోధం శంకర హృదయ గీతం. ఆహ్లాద పరిమళం. రెండు వందల యాభై ఏడు శ్లోకాలలో పద్దెనిమిది సోపానాలుగా సాగే ఈ ఆధ్యాత్మిక భావగీతం మధురమూ, మనోహరమూ, మోహనమూ, మనోజ్ఞమూ. పరమాత్మ ఒక్కడే నాయకుడు, జీవులన్నీ నాయికలే, జీవాత్మ పరమాత్మల సంగమానంద లీలను శంకరులు శుభగశయ్యతో, కుశల శైలితో, సమృద్ధ భాషా వైదుష్యంతో, సమర్థంగా ఆత్మానుసంధాన విధానంగా సాగిస్తారు. ఏం చెప్తున్నారు? ప్రబోధ సుధాకరమని. సుధ అంటే అమృతం. ఆకరము అంటే నెలవైనది అని. అందులో ప్రబోధ ఉన్నది. ప్రబోధ అంటే కేవలం ప్రచారపు సంబంధమైనది కాదు. ప్ర అంటే దగ్గరగా. ప్ర అంటే పాప సంహారం. ప్ర అంటే సమీపంగా. ప్ర అంటే మరింత సన్నిహితంగా. అనేక అర్థాలున్నాయి. ఈ బోధ దేనికి దగ్గరగా? మనసుకి, హృదయానికి దగ్గరగా. ఆలోచనకు, అంతఃసాక్షికి దగ్గరగా. అనుభవానికి, అనుభూతికి దగ్గరగా. ఇది పరమ రమణీయమైనటువంటి కృష్ణానందలహరి. విందాం. ఏం చెప్తున్నారు? భక్తి జ్ఞానాలు రెండూ బ్రహ్మానందం అందుకోవటానికి దివ్య మార్గాలు. భక్తి జ్ఞానాలు రెండూ బ్రహ్మానందం అందుకోవటానికి దివ్య మార్గాలు. నిజానికి అవి రెండుగా కనిపిస్తున్నా స్థూలంగా ఒకటే. మనసు హృదయాల స్థితుల వలె, తల్లి బిడ్డల వలె, సూర్యుడు సూర్యకిరణాల వలె, చంద్రుడు సుషుమ్నా కిరణాల వలె. శరీరం, దాని పరిమితి, ఇంద్రియాలు, వాటి చర్యలు, మనసు, దాని స్థితి, ఇంద్రియ నిగ్రహం, మనో నియంత్రణ, నిర్మోహత్వం, ఆత్మ, దాని ఉనికి, మాయ, దాని అస్తిత్వం, సూక్ష్మ కారణ శరీరాల నిర్వచనం, అద్వైతం, దాని నిరూపణ, కర్తృత్వం, దాని అనుభవం, ఆత్మ, దాని యందు స్వయం ప్రకాశ స్థితి, ధ్యానధారణలో సూక్ష్మ మనస్సు మనస్సుని మలగించటం, ఆత్మజ్ఞాన ప్రకాశం, భక్తిభావం, ధ్యానరీతి, ఏకత్వం, దివ్యానుగ్రహం ఇవన్నీ కృష్ణానందలహరి లో సాగిన సాధనా లహరులు.ఇవన్నీ ఆధునిక మానవుడికి అక్కరకొచ్చే విషయాలు. రోగాలు పోగొట్టుకోవటానికి ప్రాపంచిక సుఖాలు జారిపోకుండా నిలబెట్టుకోవటానికి పడే యాతన, తాపత్రయం, వ్యామోహం కారణంగా అధ్యాత్మను ఆశ్రయించకూడదు. అధ్యాత్మ అంటే పునః పునః అనుకుంటూనే ఉన్నాం. అది మరణానంతర సుఖం కాదు. అది ఒక దివ్య జీవన విధానం. మనిషి తాను ఈ భూమిపై సంచరించినంత కాలం ఆనందంగా జీవించాలి. ఆ ఆనందం ఆత్మవిద్య ద్వారానే సాధించుకోవాలి. ప్రేమను పొందాలి, ప్రేమను పెంచాలి. అమరిన ప్రేమ ఆనంద రసానికి ఒక అభివ్యక్తి, ఒక అభిజ్ఞ అంటే గుర్తు. ప్రేమ ఆనందం కలిస్తేనే భక్తి. భక్తి అంటే దేనినీ కోరని సమర్పణ. కోరికలు తీర్చుకోవటం కోసం ఎవరినో ఆశ్రయించటం భక్తి కాదు. భక్తి పారవశ్యము కాదు. It's not fervour and emotion. శంకర భగవత్పాదులు ఎంత నిర్దుష్టంగా వ్యాఖ్యానం చేస్తున్నారో చూడండి. భక్తి పారవశ్యము కాదు, పరాత్పరుడికి అంటే ఆత్మకు వశం కావటమే భక్తి. భక్తి వివేకాన్ని, విచక్షణను కలిగించాలి. అవి కలిగితే ఆ స్థితి పేరు జ్ఞానం. తెలియవలసిన దానిని తెలుసుకునే ప్రయత్నమంతా విజ్ఞానమే. విచారణ, విశ్లేషణ, ఆచరణ, సంచారణ ఇవన్నీ సాధనా స్థితులే. జ్ఞానం అంటే ఏమీ తెలుసుకోవలసిన అవసరం లేని స్థితి. భక్తి అంటే ఏదీ అక్కరలేదు అని చెప్పే స్థితి. ఈ రెండు స్థితులను మానవుడిని అధ్యాత్మ ప్రబోధంగా అందుకోమంటున్నారు శంకరులు. శ్రీకృష్ణ పరంగా శంకరులు ప్రసారించిన ఈ దివ్యబోధ ఒక అనాహత నాదం. సానంద సుమధుర సాదర సుందర గీతం. జ్ఞానామృత జలధిలో శ్రీ కృష్ణానంద హరిపై ప్రయాణం మహా ఆనంద యానం. ఆత్మానుభవం కోసం మనము మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఎట్లా? ఇది ప్రశ్న. దీనిని శంకర భగవత్పాదులు ఇంకా దేహంతో ప్రారంభించి విచార ధారని కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని మనం నెమ్మదిగా అర్థం చేసుకోగలిగినట్లయితే ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క మాటని తనివితీరా, తమితీరా జీర్ణం చేసుకొని పునః పునః స్మరణం చేసుకుంటూ నిధిధ్యాసనంలో గనుక పెట్టుకోగలిగితే ఈ ఒక్కొక్క వాక్యము కూడా శంకరుల వారు మనందరినీ కూడా దేహ స్థితి నుంచి దేహాతీత స్థితికి ఎలా వెళ్ళాలో మార్గోపదేశనం చేసే దిశగా సాగిస్తున్నారు. విచారణ చేద్దాం. అధ్యాత్మ సాధన, విస్తృత శాస్త్ర జ్ఞానం, విపరీత భక్తి ముక్తిని ప్రసాదిస్తాయా? ప్రశ్న వేస్తున్నారు ఆయనే. తీవ్రమైనటువంటి భక్తి ముక్తినివ్వదు. అలాగే శాస్త్రగతమైన విస్తృత పాండిత్యం ఉంటుంది, ముక్తినివ్వదు. అలాగే అధ్యాత్మ సాధన బాగా చేస్తున్నాను, చేస్తున్నాను అని అనుకుంటాం. అది ముక్తినివ్వదు. ప్రాపంచిక బంధాల నుండి భావ స్థాయిలో దూరం కానంత వరకు ముక్తి లభించదు. అంటే ఎక్కడ ఆలోచన పుడుతున్నదో, ఎక్కడ భావం పటమరిస్తున్నదో మూలంలోకి వెళ్ళమంటున్నారు శంకర భగవత్పాదులు. ఆత్మజ్ఞానం, భక్తి వస్తువుల యందు ఉపేక్ష ముక్తికి మార్గాలే. ముక్తికి మార్గాలు కావాలి. ప్రతి వాళ్ళు అడుగుతాం ముక్తినివ్వండి, ముక్తినివ్వండి అని. ఆత్మజ్ఞానం ఉండాలి. అంటే నేను ఆత్మను అన్న ఎరుక ఉండాలి. భక్తి ఉండాలి. వస్తువుల యందు ఉపేక్ష ఉండాలి, అపేక్ష కాదు. ఇంద్రియ పరమైన కార్యకలాపాల యందు ఉపేక్ష చాలా ప్రధానమైనటువంటిది. నేను, నాది అనే అహంకార మమకారాలే అపేక్ష. ఇదే నిజమైన బంధన. దేహంతో కూడి ఉన్న ఇంద్రియాలు, వాటి చలనాల వలన కలిగే స్పందనలు ఇదంతా బంధన. ఈ బంధన నుంచి బయట పడటమే ముక్తి. మరి దేహం లేకపోతే జీవన వ్యాపారం సాగేదెట్లా? నిజమే. దేహం కావాలి. దేహమే సాధనాలయము, దేహమే శోధనాలయము. కానీ దేహం పరిమితమైనది. ఎప్పటికైనా దహింపబడేది గనుక దేహమని, నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది గనుక శరీరమని, చర్మంతో కప్పబడి ఉన్నది గనుక కవచమని, చలనశీలమైనది గనుక రథమని, ఆత్మగా ప్రాణ చైతన్యంగా ఉన్నది గనుక మందిరమని దేహానికి అనేక పేర్లున్నాయి. ఇంతకీ ఏమిటి ఈ దేహం? దానికి ఇంద్రియాలకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ విచారణ పూర్తయినప్పుడు నేను, నాది అనే భావం నశిస్తుంది. ఆ వినాశమే ముక్తి. అదే విముక్తి. శుక్ల శోణితాలు గర్భాశయ ప్రవేశంతో దేహం ఏర్పడుతున్నది. గడచి వచ్చిన జన్మల అనుభవాల ఆధారంగా వర్తమాన జీవితం ఏర్పడుతున్నది. దేహం తల్లి గర్భ వేదికపై తొమ్మిది నెలల కాలంలో మలమూత్రాది పదార్థాల మధ్య జఠరాగ్నిలో వేగుతూ ఉన్నది. నిర్ణీత కాలంలో తల్లి గర్భం నుంచి బయట పడుతున్నది. బయట పడటంతోనే జీవుడి వేదన ప్రారంభమవుతున్నది. మనోవ్యధ, వ్యాధి, వియోగం, దారిద్య్రం వంటివి అనుభవంలోకి తెచ్చుకుంటున్నది దేహమే. పరిణామ దశలో మానవ దేహం ఉన్నతమైనది. మేధావులమని భావించుకునేవారు సైతం దేహ పరిమితి ఎరుగక దేహమే తామన్న భావనతో ఉంటారు. దేహమే తమనుగా భావించుకున్నా దేహం అంటే ఏమిటో పూర్తిగా ఎరుగనందువలన కాలాన్ని వృధా చేసుకుంటారు. దేహ స్థితే ఎరుగకుండా ముక్తిని దేని నుంచి పొందాలి? రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ, పంచభూతాల వంటి పదార్థాల సమ్మేళనమే శరీరం. శంకరులు అంటారు, "మనందరం శవ వాహకులమే." మన శరీరాన్ని మనమే మోసుకుంటూ తిరుగుతుంటాం. మరణించాక దాన్ని మరొకరు మోస్తారు. అంతే తేడా. దేహమే నేనన్న భావన నుంచి దూరం కావటమే ముక్తి. కాలి గోటి నుంచి తల వెంట్రుక వరకు అంతా దుర్గంధమే. ఎముకల గూడు ఈ శరీరం. ఇదే యదార్థ స్థితి. ప్రాపంచికంగా ఎంత వైభవం అనుభవించినా ప్రాణం పోయినప్పుడు శరీరం నిస్సహాయ స్థితిలో నిమజ్జనానికి లోనవుతున్నది. తనివితీరా, కరవుతీరా, కనులారా చూడబడిన శరీరం శవంగా ఉన్నప్పుడు భయం కొలుపుతున్నది.కట్టుకున్న భార్య సైతం గడప దాటి బయటకు రాదు. ఎంత త్వరగా దహనం చేద్దామని బంధుజనం ఆతృత పడతారు. శరీరంలోని సర్వ శక్తులు, ప్రజ్ఞలు, అది అనుభవించిన సుఖ సంతోషాలు, స్థితులు, గతులు, చీకటి వెలుగులు, జయాపజయాలు, మాన అవమానాలు, ఎత్తుపల్లాలు అన్నీ ఏమవుతున్నాయి? అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. కథ కంచికి చేరుతున్నది. ఇది దేహ పరిమితి. వైరాగ్యంగా తోచినా నిజానికి యదార్థ స్థితి ఇదే. జీవితాన్ని స్పష్టంగా, అర్థవంతంగా, ఆనందంగా, పరమ ప్రశాంతిగా జీవించాలనుకునే వారికి తమ దేహం ఎంత అశాశ్వతమో అనే నిత్య స్పృహలో ఉండాలి. మృత్యు నీడ ఎప్పుడు పారుతుందో తెలియదు గనుక అప్రమత్తంగా ఉండాలి. కానీ, దేహాన్ని సర్వోపాయంగా వాడుకోవాలి. దానిని రక్షించుకోవాలి. యుక్తాహార యుక్త విహారాలలో దానిని పోషించి పాలించుకోవాలి. ఎందుకు? ఎంత అశాశ్వతమైన ఈ దేహమే ఆయుధం గనుక, అదే ఆధారం గనుక. కానీ, దాని పట్ల బంధం పెంచుకోరాదు. బంధం వలన బాంధవ్యం, దాని వలన మోహ వ్యామోహ వ్యసనాలు ఏర్పడి తెంచుకోలేనిదిగా దేహం వదులుచుకోలేని గుదిబండ అవుతున్నది. దాని పట్ల అమిత ప్రేమ, దాని వలన కలిగే అహంకారాన్ని తగ్గించుకోవాలి. పరిమిత దేహంలోనే అపరిమిత శక్తి ఉన్నదని, అశాశ్వత స్థితి నుంచి శాశ్వత స్థితిలోకి చేరాలని, దేహాన్ని ఉదాత్త పరికరంగా వాడుకుంటూ దేహంలోనే వెలుగుగా ఉన్న మూలాన్ని వెతకాలని, ఆ వెతుకులాటే సాధనాన్ని గ్రహించాలి. అందుకై ఇంద్రియ నిగ్రహం చేయాలి. ఆనందానికి నిత్య చైతన్యానికి దారులు వెతుక్కోవాలి. ఆ అన్వేషణ అంతరంగికంగా సాగాలి. దేహాన్ని ఆధారం చేసుకుని దేహాతీతమైన స్థితిని శక్తిని అందుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలి. సుఖము, సంతోషము దేహానికి సంబంధించిన విషయాలు. శాంతి, ఆనందం మనసుకు సంబంధించినవి. నిత్య సత్య శాశ్వత ఆనందం హృదయానికి సంబంధించినవి. ఇవన్నీ దేహం గానే అవి ఉండగానే పొందాలి. ఎట్లా? విచారణ చేద్దాం, చేయాలి. శంకర భగవత్పాదులు కరుణాలయం. ఆ కరుణా సుధా సింధువు అనుగ్రహించే ఆనంద బిందువే కృష్ణానందలహరి. ఈ బోధని కొనసాగిస్తూ శంకర భగవత్పాదులు ఆనంద భూమికలను గురించి చెప్తారు. ఈ ఆనంద భూమికలు చాలా పరమాద్భుతమైనటువంటివి. అతి గంభీరమైనటువంటి ఈ విషయాలన్నింటినీ శంకర భగవత్పాదులు చక్కగా, చాలా స్పష్టంగా, సూటిగా, ఉదాత్తంగా ఆవిష్కరిస్తున్నారు. అద్వైతం అంటే రెండూ ఒకటే అని సామాన్య అర్థం. నిజానికి రెండు లేవు ఉన్నది ఒకటే ఇది నిజమైన అర్థం. శ్రీ శంకరులకు ముందే అద్వైతం ఉంది. అది మతం కాదు. అది ఒక దివ్య భావన. మనం కానిది మరొకటి ఉన్నది అన్న ఆలోచనే మనకు భయాన్ని, ఆశను, భ్రాంతిని, కామన్ని, స్పర్ధను కలిగిస్తుంది. వీటన్నింటి నుంచి దుఃఖం, నిర్వేదం, అశాంతి ఏర్పడతాయి. అన్నిటా అంతటా ఉన్నది ఒకటే అనుకోగలిగిన స్థితి పేరు అద్వైతం. ప్రపంచాన్ని, వస్తువుని చూడటం భౌతిక అవస్థ అయితే ఆ వస్తువు గుణాన్ని, స్వభావాన్ని మనసుతో విశ్లేషించటం ఆదిభౌతికం. ఆ వస్తువును తనకంటే భిన్నంగా సంభావించకపోవటం ఆధ్యాత్మికం. అంటే physical, metaphysical and spiritual అని వాడుతూ ఉంటాం. దానికి నిర్వచనం ఇది. శంకరుల అద్వైత భావన సర్వ సాంప్రదాయాల సమన్వయ గీతిక. అద్వైత భావన మనకిచ్చే పరమ చరమ ఫలం ఏమిటి అంటే బ్రహ్మానందమే. అదే పరమానందం. ఇంతకంటే నిజానికి మనం పొందవలసినది ఏమున్నది? పరమ శాంతి, ప్రసన్న చిత్తం, పరమార్థ జీవితం కంటే బ్రహ్మపదం మరి ఎక్కడున్నది? మనుషులంతా ఒక్కటే అంటాం. అంటూ ఉంటాం. నిజానికి మనుషుల సంగతేమోగానీ భగవంతుడు మాత్రం ఒక్కడే. అంతెందుకు? మనిషి దైవం ఒక్కటే. కనిపిస్తున్న ప్రకృతి, తోలు కళ్ళకు కనిపించని పరమాత్మ ఒక్కటే. సూర్యుడు, సూర్య కిరణాలు భిన్నం కావు. ఇదంతా బింబ ప్రతిబింబ భావమే. రెండుగా మసలుతున్నవి నిజానికి మూలంలో ఒకటే. ఆ భావం బలపడటానికి మానసిక శిక్షణ అవసరం. నమ్మకం, తీవ్ర సాధన, సద్గోష్టి, సత్సంగం అన్నింటినీ మించి తెరచి ఉంచిన మనసు కావాలి. open mind అని వాడుతున్నాం కదా, అదన్నమాట. అప్పుడే దేనినైనా ఔదార్యంతో ఆహ్వానించగలం, అందుకో గలం, అనుభవించగలం, అనుభూతిని పొందగలం, ఆనందాన్ని రసార్ద్ర స్థితిలో తడమగలం. ఆచార్య స్వామి ఆలోచనాధార స్థూలంగా ఇది. సమన్వయం తప్ప సంఘర్షణకు తావులేని సమన్యాసం. అదే అత్సమైన సన్యాసం. లోకాన్ని విడిచి భగవత్పాదుల ఆలోచనలు ఎన్నడూ పైకి సాగవు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగిన నెర్పరితనాన్ని సాధించాలి. వ్యక్తి పూజను వదిలి వ్యక్తిత్వ ఆరాధన చేసుకోగలగాలి. వ్యక్తి, సమూహం, ప్రపంచం, పరమాత్మ అనేవి భిన్న స్థితులే గాని మూలం ఒకటే. ఇంతటి ఉదాత్త వైఖరి సాధించాలంటే ఏం చేయాలో శంకర భగవత్పాదులు చెప్తున్నారు. బోధిస్తున్నారు. ఉపదేశిస్తున్నారు, సందేశం ఇస్తున్నారు, ఆదేశిస్తున్నారు. ఆచరణ మార్గమేమిటో ఆచరించి చూపిస్తున్నారు. అందువల్లనే ఆయన ఆచార్య శంకరులు. కర్మ, భక్తి, యోగ, జ్ఞాన యోగాలుగా విడమరచి అధ్యాత్మను కమనీయ కవితాధారగా అనుగ్రహించారు శంకర భగవత్పాదులు. స్తోత్రాలుగా, ఆరాధనా గీతಗಳುగా, వైరాగ్య బోధనలుగా, అద్వైత భావనా వీచికలుగా, భావ సిరి భాండాగారాలుగా, మా సామాన్యుడికి మాన్యుడికి కరదీపికలుగా అద్వైత సారాన్ని అందించారు. సార్వకాలికమూ, విశ్వజనీనమూ అయిన సత్యము ఒక్కటేనని, ఉన్నదంతా బ్రహ్మమేనని, మోక్షమంటే మరణానంతర సుఖం కానే కాదని, సుఖం కన్నా సంతోషం, ఆ రెండింటికన్నా ఆనందమే పొందవలసిన స్థితి అని, ఇదంతా అనుభవంలోకి రావాలంటే ఈ ప్రపంచం అనివార్యమని, అదే సాధనా భూమిక అని, అదే శోధనా క్షేత్రమని, ఈ ప్రపంచమంతా మేల్కొన్న కలవంటిదని, కలలు కనే మెలకువ అని, ఈ అన్నిటా నీవు ఉన్నావన్న సత్యమని, ఆ యెరుకే నిశ్చల నిర్మలానందమని సాహిత్య సర్వస్వంగా, సంగీతమయంగా, శాస్త్ర ప్రామాణికంగా, వేదమూలంగా, ఉపనిషద్ వ్యాఖ్యానంగా, మంత్రమయ వాణిగా, అద్వైత సిద్ధాంతంగా అన్ని కవితా ప్రక్రియలను సుసంపన్నం చేశారు వాంగ్మి శంకర భగవత్పాదులు. ఎన్ని విధాల బోధించవచ్చునో అన్ని విధాల ఎరుక పరిచారు. ఆత్మ అంటే ఏమి? మా అంటే లేదని వ్యాఖ్యానిస్తూ శంకరులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఆత్మ అంటే ప్రత్యేక వస్తువు కాదని, ఉన్నది ఒక్కటేనని, అదే ఆత్మ అని తెలుసుకోమని అంటారు సాధికారంగా. [భారతీయ సంగీతం] ఇంతవరకు మీరు భారతీయం శీర్షికలో భాగంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారిపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారు అందించిన ప్రసంగ మాలికలోని మూడో ప్రసంగాన్ని విన్నారు. వచ్చే వారం భారతీయం శీర్షికలో శంకరుల వారి గురించి మూర్తి గారు అందించిన నాల్గవ ప్రసంగాన్ని వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం. [భారతీయ సంగీతం]
SSSMC · audio
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 03
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 03
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 31:44
More in this series
Sri Adi Shankara — Contribution to Indian Culture and Spirituality
- 27 min 1
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 01
- 26 min 2
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 02
- 31 min 3
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 03
Now playing - 31 min 4
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 04
- 31 min 5
Talk series on Sri Adi Shankaras Contribution to Indian Culture and Spirituality - 05