Skip to content
Transcript తెలుగు
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకర భగవత్పాదుల దివ్య శ్రీ చరణారవిందాలకు సత్య సాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ శంకర విచారధారలో సత్యసాయి ప్రబోధ సుధామరందల్లో ఒక అంతర్లీనమైనటువంటి విచారధారకు పునఃస్వాగతం పలుకుతూ అద్వైతము దాని వలన కలిగేటువంటి ఆనందము విచారణ చేద్దాం. ఆత్మ అనాత్మల విచారణ పూర్తయినప్పుడు మనకు ఒక దివ్య భావన కలుగుతుంది. అనాత్మ అంటే అవిద్య శరీరాన్ని నేనుగా భావించటమే అనాత్మ భావం. దీనికి మూలమైనటువంటి చైతన్యం మరొకటి ఉన్నది అని ఎరుకలో నిలకడ చెందటమే ఆత్మ భావన. రెండింటి విచారణ దాటిన తర్వాత ఏమి ఒక భావన కలుగుతుంది అంటే నేను బ్రహ్మమునై ఉన్నాను అని. అది ఒక స్పురణ. నిజానికి బ్రహ్మమన్నా ఆత్మ అన్నా ఒకటే. బ్రహ్మం అంటే తన కంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదని ఉన్నదంతా ఒకటే నని నిశ్చితమైనటువంటి అభిప్రాయం కలగటమే. వేదాలు ఉపనిషత్తులు సైతం ఇదే భావాన్ని మనకు స్పష్టం చేస్తున్నాయి. స్థితిలో నిలకడ చెందిన వాడినే మహర్షి అంటున్నాం. స్థితినే అద్వైతంగా భావిస్తున్నా అంతటి అద్వైత స్థితిని పొందిన వాడుంటే వాడు నేను ఒకటే అని యోగేశ్వర కృష్ణుడు భగవద్గీతలో ప్రకటన చేస్తున్నాడు. అద్వైత స్థితిలో నిలకడ చెందిన వాడికి ఆత్మకు ఏమీ భేదం లేదు అంటున్నది బృహదారణ్యక ఉపనిషత్. అంటే అఖండ చైతన్యానికి నేను ఆత్మనన్న స్థితిని పొందిన వాడికి ఏమీ తేడా లేదన్నమాట. ద్వైత అద్వైతాలు రెండూ నిజానికి ఇవి సిద్ధాంతాలు కావు భావనా స్థితులు మాత్రమే. ఆలోచన అనుభవ స్థితులలో జరిగిన భావ విభజనే అది. ఒక వంకర కట్టె కాలి కాలి చివరకు బూడిద అయినా తన ఆకారాన్ని మాత్రం కోల్పోవటం లేదు పైగా నిలబెట్టుకుంటున్నది. అయితే కాలిన కట్టెను చేత పట్టవచ్చు కట్టె ఆకారంలో ఉన్న బూడిద మాత్రం చేత పట్టరాదు. విధంగానే విచారణ మార్గంలో మనసు దగ్ధమైన వాడు ఆత్మభావంలో నిలకడ చెందిన మహర్షి స్థాయి వాడు. శరీరంలో ఉన్నట్లున్నా దేహాతీత దేహాతీత స్థితిలో ఉన్నందున భౌతిక స్థాయిలో మన అనుభవ పరిధిలో ఉండడు. మన పరిమితి అనుభవ క్షేత్రం మహర్షి అపరిమిత అనుభూతి క్షేత్రం రెండుగా ఉంటాయి. పరిమితి నుంచి అపరిమితికి ప్రయాణమే సాధన. దేనిని పొందాలని మనం సాధన చేస్తామో చివరకు మనం అది కావాలి. కాగలగటమే అనుభవం అప్పుడు కలిగే భావస్థితే అనుభూతి. ఇకపై ఇవేవీ లేని స్థితే విభూతి స్థితి. తీవ్ర సాధన అనంతరం ఆత్మ స్థితిని అనుభవించిన వాడు అన్నిటా తానుగా ప్రతిఫలిస్తుంటాడు. నీటి కుండలన్నిటా ప్రతి-- ఫలిస్తున్నటువంటి సూర్యుని వలె. నీటి కుండల అన్నిటియందు ప్రతిఫలిస్తున్నటువంటి సూర్యుని వలె సమస్త దేహాలయందు ప్రతిబింబిస్తున్న ఆత్మ సైతం నిజానికి ఇంతే. ఆత్మ బింబం. దేహం స్థాయిలో ప్రతిబింబం. ఆత్మ చైతన్యం. దేహం స్థాయిలో మాయ. బింబం లేని ప్రతిబింబం లేదు ఇది అద్వైతం. కుండ పగిలి నీరు పోతే సూర్యుడు లేకుండా ఉన్నాడా? దేహం నశిస్తే ఆత్మ పోతుందా? పోయేది దేహమే పోనిది ఆత్మ ఇది అద్వైతం. దేహాత్మలో నిరంతరం జరిగే కదలికలు మెదలికలు ఆత్మకు లేవు. అది కదలకుండా అన్నింటినీ కదిలిస్తుంటుంది. కళ్ళకు కనిపిస్తున్న ప్రపంచం అంతా చరాచరంగా ఉన్నది. ఒకే సూర్యుడి వెలుగులో ప్రయాణిస్తున్నది. విధంగానే పదార్థాలన్నీ ఒకే బ్రహ్మ పదార్థం వలననే కదులుతున్నాయి. పదార్థానికి భిన్నత్వం సహజం యదార్థానికి భిన్నత్వం లేదు. నీరు ఒకటే దివ్య పరిమళాలు వెదజల్లే పూలకి ఉల్లికి మూలం నీరే. వాసనలలోనే తేడా అంతా వస్తువులోనే ఉంది. మూలమైన నీరు మాత్రం వాసనారహితంగానే ఉన్నది. స్థితులు, లక్షణాలు, మార్పులు ఇవన్నీ పాత్రధారికే సూత్రధారికి ఇవేమీ లేవు. తెర వెనుక ఉండి తెరమీద బొమ్మల సంచారానికి తాను కారణంగా ఉంటున్నాడు. కదులుతున్న దేహం వెనుక కదలని ఆత్మ ఉన్నట్లు ఆడించేవాడు ఆడుతున్న వాడు ఆట ఒకటే ఇది అద్వైతం. ఆభరణాలు ఎన్ని రకాలుగా ఉన్నా వాటి మూల వస్తువు బంగారమే. తీపి వస్తువులు ఎన్ని ఉన్నా మూలం తీయదనమే. ఆకారం, స్వభావం, కార్యకలాపాలు, పరిమాణం, రూపురేఖలు, రంగులు ఎన్ని విధాలుగా ఉన్నా ప్రపంచం దాని మూలం ఆత్మే. బాటసారి అన్నం మూటను మోస్తున్నంత సేపు ఎవరు కాజేస్తారో, ఎక్కడ పారేసుకుంటానో, తినవలసిన సమయం ఎప్పుడు వస్తుందో అని వ్యాకుల పడుతుంటాడు. అన్నాన్ని తినటంతో బాధంతా ఒక్క క్షణంలో తొలగిపోతున్నది. మోసినంత సేపు బరువు అనిపించింది తినగానే తేలికై పోతున్నది. ప్రపంచ భావన మనసుని ఆక్రమించి ఉన్నంతసేపు బరువే. అద్వైత భావన మనసుకు తాకగానే ప్రపంచం తన కంటే భిన్నం కాదని అంతా ఒకటే నని నిశ్చితానుభవం కలుగుతుంది. అది అధ్యాత్మ అదే అద్వైతం. ప్రపంచం వేరు నేను వేరు అనుకున్నంత కాలం ద్వైతం వదలదు. ద్వైతం అంటే రెండు ఉన్నవి అనుకున్నంత కాలం భయం, బాధ, అభద్రతా తప్పవు. అంతా ఒకటే అనుకోవటమే హాయి అదే శాంతి అదే దివ్య ప్రేమ రెండంటూ లేవు ఉన్నది ఒకటే అది ఆత్మే.ఈ ఆనందాన్ని అనుభవిస్తున్న వాడే జ్ఞాని. ఆనందం మన స్వభావం, ఆనందం మన స్వరూపం, ఆనందం ఒక తారక స్థితి అదే అద్వైత స్థితి. నిజానికి అద్వైతమే ఆనందం శంకర అద్వైతా మృత వాహిని మానసోల్లాస కారిణి ఆనంద స్వరూపిణి శంకర ప్రబోధం ప్రాతఃస్మరణీయం. అందుకే [గొంతు సవరించిన శబ్దం] సత్యసాయి భగవానుడు వేలాది ఉపన్యాసాలలో దివ్యోపన్యాసాలలో జీవులందరినీ కూడా దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా అని సంబోధించారు తప్ప శరీరానికి పెట్టబడిన పేరునీ స్వామి ఉచ్చరించలేదు అనలేదు. కారణం ఏంటంటే అది మనం కాదు గనుక. స్వామికి మనకి ఉన్నటువంటి సంబంధం కూడా పరమాత్మకి ఆత్మకి ఉన్న సంబంధమే కానీ దేహానికి దేహానికి ఉన్నటువంటి సంబంధం కాదు. కనుకనే స్వామిని చూచినా, స్వామిని తలచినా, స్వామి స్పురణకు వచ్చినా, స్వామి మాట విన్నా, స్వామి పాట విన్నా, స్వామి యొక్క ఆలోచనలు గుండెను తాకిన ఆనందమే కలుగుతున్నది. దీనికి కారణం ఏమిటి అంటే మూలమైన బ్రహ్మానంద పదార్థమే ఒక సాకార స్వరూపంగా జగత్తులోకి వచ్చింది గనుక స్వామి అంటే జ్ఞాని అని స్వామి అంటే ఆనంద స్వరూపం అని స్వామి అంటే ఆనంద స్వభావం అని అది జీవుడికి మూలమైనటువంటి దివ్యత్వానికి సంకేతమని మనం నిత్య స్పురుహలో ఉండగలిగితే సత్యసాయి భగవానుడి యొక్క పరతత్వాన్ని పరిపూర్ణంగా మనం గ్రహించగలం. గ్రహించటానికి కావలసిన ఒక అంతర్ దృష్టిని, అవగాహనని, ఆత్మ శక్తిని, సర్వేశ్వరుడైన స్వామి మనందరికీ అనుగ్రహించు గాక. అద్వైతమే పూర్ణానుభవము అన్న విచారణ మనం కొనసాగించాలి. అద్వైతం మతం కాదు. ఆచరణ వలన కలిగిన అనుభూతిని భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థాయిలలో ఉదాత్త స్థాయిలో సమభావనగా అనుభవించగలగటమే అద్వైతం. అంటే తనను తానున్న ప్రపంచాన్ని రెండింటికీ మూలమైన దానిని ఒకటిగా అనుభవించగలిగిన విశాల భావనే అద్వైతం. కరుణామూర్తి అయిన శంకర భగవత్పాదులు సాధకుడికి సాధనా మార్గాన్ని నలభై సూత్రాల ద్వారా బోధిస్తున్నారు. వేదాధ్యయనం ద్వారా ధర్మాధర్మ విచారణ నిత్యానిత్య వస్తు వివేకం సాధించుకొని నిత్య జీవితంలో కర్తవ్య నిర్వహణ చేయాలి. అర్థం తెలియకుండా చేసే పనైనా వ్యర్థమే కదా అంటున్నారు భగవాన్ సత్యసాయి. సత్వ రజస్తమో గుణాలున్న సాధకుడు సత్వగుణాన్ని ఆశ్రయించి కర్మలు చేస్తుండాలి. దీని వలన తనకు ప్రపంచానికి క్షేమం కలుగుతుంది. సాధ్యమైనంత వరకు మిగిలిన రెండు గుణాలను దూరంగా ఉంచుకోవాలి. సంపదను, కీర్తిని కోరి పూజలు, యజ్ఞాలు చేయకూడదు. ఆత్మోన్నతి కోసమే యాగం చేయాలి. లోకహితం కోరి చేసేవన్నీ సత్కర్మలేనన్నా స్థిర మనసుతో కర్మలు చేయాలంటారు భగవాన్. లోకానికి హాని కలిగించే రీతిలో సాగే ఆలోచనే పాపం. అందుకున్న ఆధ్యాత్మిక స్థితి నుంచి దిగజారినా, మంచి దారిలో ఉన్నట్లుండి చెడు మార్గంలో అడుగుడినా నిజానికి పాపమే. అంటే ఆలోచనా స్థాయిలోనే పాప భావనను తుంచివేయాలి. ప్రాపంచిక సుఖాలను శాశ్వత సుఖాలని భావిస్తూ చేసిందే చేస్తూ పొందిన దాన్నే పొందుతూ ఉండకూడదు. వివేకము, విచక్షణ ఆధారంగా ఉన్నత స్థితికై నిరంతరము శ్రమిస్తుండాలి. దేహంతో సహా అన్నీ మనం సంపాదించుకున్నవే. కూడినవన్నీ ఏదో ఒకనాడు మనను వీడిపోయేవే. వీడని, వాడని, కూడని వస్తువే ఆత్మ ఎరుక నిశ్చితంగా ఉండాలి అంటారు భగవాన్ సత్యసాయి. భగవంతుని యందు శ్రద్ధ, భక్తి నిశ్చలంగా నిలబెట్టుకోవాలి. శక్తి, జ్ఞానం, తేజస్సు, వీర్యం, బలంతో పాటు సత్, జ్ఞానము, చైతన్యము, వెలుగు, ఆనందం అనే లక్షణాలు అన్నీ దైవమే. వీటన్నిటినీ సాధన ద్వారా అనుభవంలోకి తెచ్చుకోవాలి. మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, భోగం వదులుకోగలగాలి. ఓర్పు, శ్రద్ధలను అలవరచుకోవాలి. ప్రపంచ వ్యాపారాలన్నిటినీ జాగ్రత్తగా నడపాలి. ఆత్మోన్నతికి అడ్డంగా మారే దేనినైనా వదులుకోవాలి. ఉత్తమ స్థాయికి చెందిన గురువును ఆశ్రయించాలి. బోధను వినాలి, విన్నదాన్ని ఆచరించాలి. అందుకే సత్యసాయి భగవానుడు ఒక హెచ్చరిక చేశారు సాధకుడికి. లోకంలో బోధ గురువులతో పాటు బాధ గురువులు, లోక గురువులు, శోక గురువులు ఉంటారు జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఓంకారాన్ని నిరంతరం మానసికంగా ఉచ్చరిస్తూ నిశ్శబ్ద నిర్మల నిశ్చల స్థితిని సాధించుకోవాలి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నది ఋగ్వేదం. తత్వమసి అంటున్నది సామవేదం. అహం బ్రహ్మాస్మి అంటున్నది యజుర్వేదం. అయమాత్మా బ్రహ్మ అంటున్నది అధర్వణ వేదం. వాక్యాల అర్థం, అంతరార్థం ఎరగాలి. మహా వాక్యాలను వినాలి, మరణం చేయాలి, స్వయంగా అనుభవ పరిధిలోకి తెచ్చుకోవాలి. జీవుడు, దేవుడు ఇద్దరు కారణి ఒకటేనని గుర్తించుకోవాలి. వితండవాదం చేయకూడదు కానీ ప్రశ్నించాలి, తెలుసుకోవాలి. అంతా ఒకటేననే నిశ్చిత భావం కలిగిన తర్వాత ఇక వాదించటానికి ఏం మిగిలింది? అద్వైతం అంటే పూర్ణాంగీకారం. అది పూర్ణ వాదం, అది పూర్ణానుభవం. అద్వైత భావనలో నిశ్చల వైరాగ్యము, సహజ త్యాగము కలుగుతాయి. విషయం తెలుసుకోగలిగాను అనుకుంటే అహంకారం. విషయము తనకంటే భిన్నం కాదనుకుంటే అహంస్ఫురణ. దేహాత్మ భావన వీడని వాడు జీవన్ముక్తుడు కాలేడు. వాసనలు, కీర్తి, ప్రచారం, దంభం, ప్రగల్భం ఇవన్నీ అడ్డంకులే తొలగించుకోవాలి.సత్యాన్ని బోధించాలి గాని తన స్వీయ సిద్ధాంతాన్ని మతంగా ప్రచారం చేయరాదు. ప్రయత్నమంతా రజో గుణానికి గుర్తు. సాధకుడు సత్యసాధకుడు కావాలి. అందువలననే సత్యసాయి భగవానుడు “పాతది ఏది ఉన్నదో మళ్ళీ మీకు గుర్తు చేయడానికి వచ్చానే తప్ప మరొక కొత్త విషయాన్ని చెప్పటానికి వచ్చిన అవతారం కాదిది” అంటూ “అహం సత్యబోధకః” అన్నారు. అంటే సృష్టికి పూర్వమే ఉన్న సత్యం ఏమిటో అర్థం చేసుకున్నట్లయితే సృష్టి, విశ్వం, ప్రకృతి, అవిద్య, దేహం, దేహాంతర్గతమైన విషయాలు చక్కగా అవగాహన అవుతాయి. సత్యాన్ని బోధించాలి కానీ తన స్వీయ సిద్ధాంతాన్ని మతంగా మనం ప్రచారం చేసినట్లయితే అది కేవలం కొన్నాళ్ళు మాత్రమే ఉండి వసివాడి పోతుంది. వ్యాధికి చికిత్స వలె ఆకలిని పోగొట్టుకోవటానికి అన్నం తినాలి, ప్రవృత్తి మార్గం నుంచి నెమ్మదిగా వైదొలగాలి, వ్యర్థ ప్రసంగాలు చేయరాదు, జ్ఞాన భిక్షను అడిగి పొందాలి, అడగవలసిన వారినే అడగాలి, ఇవ్వగలిగిన వారినే అడగాలి. రుచికరమైన భోజనం, సుఖాన్నిచ్చే పడక, తామసం కలిగించే నిద్ర కోరుకోరాదు. లభించిన దానితో తృప్తి పొందాలి, లభించని దానికై పోరాటం వదిలిపెట్టాలి. విషయంలోనైనా ఉదాసీనంగా ఉండాలి, ఉదాత్త స్థాయిలోనే ఆలోచనలు సాగాలి. అమిత దయ, తీవ్ర నిష్ఠూరం ఎవరి యందు ప్రదర్శించరాదు. ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు, కష్టసుఖాలు వీటన్నిటినీ సహజంగా భావించాలి. వాక్కు అగ్ని స్వరూపం అది ప్రతిభామంతం, అర్థ స్వరూపం, అవసరమైనప్పుడే వాడాలి, మితంగా మాట్లాడాలి. అందుకే “మితభాష మతిహాయి” అన్నారు స్వామి. ఏకాంతాన్ని కోరుకోవాలి, సహజానందాన్ని అనుభవించాలి ఇది అద్వైత సుఖం. అద్వైత సుఖం అంటే నీతో నీవే కూడి ఉండాలి. అద్వైత సుఖం ఒక చైతన్య స్పర్శ అంటే నిన్ను నీవు తాకటం. పరవస్తువును తాకటం భోగం, నిన్ను నీవే తాకటం యోగం. స్థితిలోనే సాధకుడికి ఆత్మ దర్శనం అవుతుంది. దర్శనం వెలుగు రూపమై ఉంటుంది. సాధకుడికి ఇది సిద్ధి స్వరూపం. దర్శనం ఫలితంగా గత కర్మల అనుభవాలు తెరమీద బొమ్మల వలె, నీడల వలె తనను అంటక కదిలిపోతూ ఉంటాయి. జరిగిన దానివలన బాధ, జరగబోయే దానివలన భయం కలగని స్థితి అద్వైతం. అద్వైత స్థితే ఆనంద స్థితి, అద్వైతా ఆనంద స్థితే సాక్షీభూత స్థితి, సాక్షీభూత స్థితే జీవన్ముక్త స్థితి. ఇదే విదేహ కైవల్యం. పరమాత్మ సత్యసాయి భగవానుడు సర్వ ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ “దేహాత్మ భావం వదిలిపెట్టండి, మీరు ఆత్మ స్వరూపులుగా వెలగండి. దివ్యాత్మ స్వరూపుల వలె, ప్రేమాత్మ స్వరూపుల వలె జీవితాన్ని చక్కగా జీవించండి. అంతే కానీ దేహమే మేమనుకున్నటువంటి భావనలో పరమ ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని నిరర్థకం చేసుకోకండి” అంటూ సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి మనకు బోధ చేస్తూ వచ్చారు. బోధని మనం అన్నివేళలా స్మరిస్తూ, మననం చేస్తూ, అనుష్ఠాన పూర్వకంగా అనుభవాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. శ్రీ కృష్ణానంద లహరిలో సత్యసాయి భగవానుడు ఉపదేశించిన మార్గాన్ని, శంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని, ఆనంద భూమికని అనుభవంలోకి తెచ్చుకునే స్థితిలో మన విచారణ సాగిద్దాం. అద్వైతం అంటే రెండూ ఒకటే అని సామాన్య అర్థం. నిజానికి రెండు లేవని, ఉన్నది ఒకటే అని అసలు అర్థం. శంకరులకు ముందే అద్వైతం ఉన్నది. అది మతం కాదు, అది ఒక దివ్య భావన. మనం కానిది మరొకటి ఉన్నదనే ఆలోచన మనకు భయాన్ని, ఆశను, భ్రాంతిని, కామనని, స్పర్ధను కలిగిస్తుంది. వీటన్నింటి నుంచి దుఃఖం, నిర్వేదం, అశాంతి ఏర్పడుతూ ఉంటాయి. అన్నిటా, అంతటా ఉన్నది ఒకటే అనుకోగలిగిన స్థితి పేరే అద్వైతం. ప్రపంచాన్ని, వస్తువుని చూడటం భౌతిక అవస్థ అయితే వస్తువు యొక్క గుణాన్ని, స్వభావాన్ని మనసుతో విశ్లేషించటం ఆదిభౌతికం. వస్తువును తనకంటే భిన్నంగా భావించకపోవటం ఆధ్యాత్మికం. శంకరుల అద్వైత భావన సర్వ సంప్రదాయాల సమన్వయ గీతిక. అద్వైత భావన మనకిచ్చే పరమ చరమ ఫలమే బ్రహ్మానందం, పరమానందం. ఇంతకంటే నిజానికి మనం పొందవలసినది ఏమున్నది? పరమ శాంతి, ప్రసన్న చిత్తం, పరమార్థ జీవితం కంటే బ్రహ్మపదం మరొక చోట ఉన్నదా? మనుషులంతా ఒకటే అంటుంటాం. నిజానికి భగవంతుడు ఒక్కడే. అంతెందుకు? మనిషి, దైవం ఒక్కటే. కనిపిస్తున్న ప్రకృతి, తోలు కళ్ళకు కనిపించని పరమాత్మ ఒక్కటే. సూర్యుడు, ఆదిత్య కిరణాలు భిన్నం కావు. చంద్రుడు, చంద్ర కిరణాలు భిన్నం కావు. అంతా బింబ-ప్రతిబింబ భావమే. రెండుగా మసలుతున్నవి నిజానికి మూలంలో ఒక్కటే. భావం బలపడటానికి మానసిక శిక్షణ అవసరం. నమ్మకం, తీవ్ర సాధన, సద్గోష్టి, సత్సంగం అన్నిటినీ మించి తెరచి ఉంచిన మనసు కావాలి. అప్పుడే దేనినైనా ఔదార్యంతో ఆహ్వానించ గలం, అందుకో గలం, అనుభవించ గలం, అనుభూతి పొందగలం, ఆనందాన్ని రసార్ద్ర స్థితిలో తళమగలం. ఆచార్య స్వామి వారు ఆలోచనా ధార స్థూలంగా నిజానికి ఇదే. సమన్వయం తప్ప సంఘర్షణకు తావులేని సమన్యాసం.అదే అచ్చమైన సన్యాసం. లోకాన్ని విడిచి భగవత్పాదుల ఆలోచనలు సాగవు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలిగిన నేర్పరితనం సాధించాలి. వ్యక్తి పూజను వదలి వ్యక్తిత్వ ఆరాధన చేయాలి. వ్యక్తి, సమూహం, ప్రపంచం, పరమాత్మ అనేవి భిన్న స్థితులే కానీ మూలం ఒక్కటే. ఇంతటి ఉదాత్త వైఖరి సాధించాలి అంటే ఏం చేయాలో శంకర భగవత్పాదులు స్పష్టంగా సూచించారు, బోధించారు, ఉపదేశించారు, ఆదేశించారు, ఆచరణ మార్గం ఆచరించి చూపించారు. అందువలననే ఆయన ఆచార్య శంకరులైనారు. కర్మ, భక్తి, యోగ, జ్ఞానయోగాలుగా విడమరచి అధ్యాత్మను కమనీయ కవితాధారగా అనుగ్రహించారు. స్తోత్రాలుగా, ఆరాధనా గీతికలుగా, వైరాగ్య బోధనలుగా, అద్వైత భావనా వీచికలుగా, భావ శ్రీ భాండాగారాలుగా, సామాన్యుడికి మాన్యుడికి కరదీపికలుగా అద్వైత సారాన్ని అందించారు. సార్వకాలికము, విశ్వజనీనము అయిన సత్యము ఒక్కటే. ఉన్నదంతా బ్రహ్మమే. మోక్షం అంటే మరణానంతర సుఖం కాదని సు-సుఖం కన్నా సంతోషం రెండింటికన్నా ఆనందమే పొందవలసిన స్థితి అని, ఇదంతా అనుభవంలోకి రావాలి అంటే ప్రపంచం అనివార్యమని, అదే సాధనా భూమిక అని, అదే శోధనాలయమని, ప్రపంచం అంతా మేల్కొన్న కలవంటిదని, కలలు కనే మెలకువ అని, అన్నిటా నీవు ఉన్నావన్నదే సత్యమని, యెరుకే నిశ్చల నిర్మలానందమని సాహిత్య సర్వస్వంగా, సంగీతమయంగా, శాస్త్ర ప్రామాణికంగా, వేదమూలంగా, ఉపనిషద్ వ్యాఖ్యానంగా, మంత్రమయ వాణిగా, అద్వైత సిద్ధాంతంగా అన్ని కవితా ప్రక్రియలను సుసంపన్నం చేశారు. ఎన్ని విధాల బోధించవచ్చునో అన్ని విధాల ఎరుక పరచారు. జ్ఞానాన్ని ఇచ్చారు. స్ఫూర్తిని కలిగించారు. ఉత్తేజపరిచారు. ఆనందం కలిగించారు. ఆత్ అంటే ఏమి? మా అంటే లేదని వ్యాఖ్యానిస్తూ శంకరులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తారు. ఆత్మ అంటే ప్రత్యేక వస్తువు కాదని ఉన్నది ఒక్కటేనని అదే ఆత్మ తెలుసుకో అంటారు సాధికారంగా. తెలుసుకోగలిగిన స్థాయి పేరే అది ఆనందభూమిక. ఆనందభూమిక బయట ప్రపంచంలో లేదు. ఉన్నదంతా లోపలే ఉన్నది. లోపల ఉన్నటువంటి ఆనంద తారక స్థితిని అందుకోవటానికి జీవుడు తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తాను నివసిస్తున్నటువంటి సమాజాన్ని, తాను మెలగుతున్నటువంటి సంఘంతో సమన్వయం చేసుకుంటూ పరమేశ్వరుడు తనకు అనుగ్రహించినటువంటి ఒక జీవితాన్ని పరిపూర్ణము ఆనందమయము చేసుకోవాలని చెప్తూ ఎవరైనా అందుకోవలసిన భూమిక ఉన్నదా? అంటే లోకంలో ఉంటూనే ఆనంద భూమికను చేరుకోవాలని, చేరుకోవటానికి విశ్వము, దేహము భిన్నం కావని అంతా సృష్టి మూలంలో నుంచి అంటే సత్త పదార్థమని, అదే యదార్థమని, అదే నిత్యమని, అదే సత్యమని, అదే శాశ్వతమని బోధ చేస్తూ వచ్చారు. ఇంతటి పూర్ణాద్వైతాన్ని శంకర భగవత్పాదులు తదుపరి విచార ధారలో ఇంకా రమణీయంగా, ఇంకా ఆర్ద్రంగా, శాస్త్రీయంగా, తార్కిక వాదానికి అనుగుణంగా మనకి ఒక విచార ధారగా అనుగ్రహ వరదానం చేస్తున్నారు. అట్టి అనుగ్రహానికి పాత్రులం చేసినటువంటి శంకర భగవత్పాదులకు సత్య సాయి భగవానుడికి మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
SSSMC · audio

Advaitamrutha Dhara - 01

Home

Advaitamrutha Dhara - 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 22:01

More in this series

Advaitamrutha Dhara

9 episodes · 4 hr 4 min

  1. 22 min 1

    Advaitamrutha Dhara - 01

    Now playing
  2. 36 min 2

    Advaitamrutha Dhara - 02

  3. 31 min 3

    Advaitamrutha Dhara - 03

  4. 33 min 4

    Advaitamrutha Dhara - 04

  5. 34 min 5

    Advaitamrutha Dhara - 05

  6. 27 min 6

    Advaitamrutha Dhara - 06

  7. 20 min 7

    Advaitamrutha Dhara - 07

  8. 16 min 8

    Advaitamrutha Dhara - 08

  9. 21 min 9

    Advaitamrutha Dhara - 09