Skip to content
Transcript తెలుగు
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. శంకర మహా స్మృతికి మరొక్కసారి నమస్కరిస్తూ సత్యసాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శంకర భగవత్పాదులే ప్రపంచంలో ఎన్ని ఉన్నా ఉండవలసినది మనం పొందకపోతే ఏమి లాభం అని ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఏమిటి? దాని వలన ఏమిటి లాభం అని ప్రశ్నిస్తున్నారు. దేని వలన మానవుడు సుఖజీవి? మానవుడు ఆనందం కోసం ఆరాటపడతాడు కానీ ఆనందం యొక్క స్వభావమే ఎరగని వాడు మానవుడు గనుక సుఖ సంతోషాలను ఆనందంగా భ్రమిస్తూ ఉంటాడు గనుక అనేకమైన ప్రాపంచికమైన వస్తువులు భౌతిక సంపదలన్నీ ఏర్పడినప్పుడు "నాకన్నీ లభించినాయి, నాకేం లోటు లేదు" అంటాడు. ప్రాపంచికమైనవన్నీ సత్యసాయి భగవానుని మాటల్లో "కూడి ఉన్నవన్నీ ఏదో ఒకనాడు ఊడిపోయేవే ఉండేవి కావు." మరి ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచంతో ఉన్నాం, మనతో కొంత ప్రపంచం ఉన్నది, ప్రపంచంలో ఉన్న వస్తువులు కూడా మనతో ఉన్నాయి. అయినా ఏమిటి? అని అడుగుతున్నారు శంకర భగవత్పాదులు. విచారణ చేయాలి మనం. సుందర శరీరం, అతి సుందరియైన భార్య, మాలిన్యం లేని కీర్తి, మేరువంత సంపద, ఇవన్నీ మంచి పనులు చేయుట వలన లభించినవే. అంటే ఎన్నో మంచి పనులు చేస్తే ఇవన్నీ ఏర్పడ్డాయి. కానీ ఇవి ఏవీ శాశ్వతమైనవి కావు. ఇవన్నీ మారిపోతే, ఇవన్నీ జారిపోతే గతి ఏమి అని గురుపాద పద్మముల యందు మనసు లగ్నం కాకపోతే తర్వాత ఏమిటి? ఆదర వాక్యంగా శంకర భగవత్పాదులు ఒక జిజ్ఞాస రేకెత్తిస్తున్నారు. నిజమే! సుందరమైన శరీరం నాది. నా భార్య నాకంటే సుందరి. మా ఇద్దరికీ కావలసిన మాలిన్యం లేని విమల కీర్తి ఉన్నది. అపార భౌతిక సంపదలున్నాయి మేరు పర్వతమంత. అయితే ఇవన్నీ గతించిన కాలంలో మంచి పనులు చేసినందువలన ఇవి ఏర్పడ్డాయి. కానీ ఇవాళ నేను శాశ్వతమని అనుకుంటున్నానా? అంటే భగవత్పాదులు వైరాగ్య భూమిక లో బోధ చేస్తున్నారు, కాదు ఇవి ఉండేవి కాదు అని. ఇవన్నీ వీటన్నింటికీ విలువ ఎప్పుడు అంటే, నీ మనస్సు గురువు యొక్క పాదపద్మముల యందు లగ్నమైతే వాటికి విలువ. లేకపోయినట్లయితే వయస్సుతో పాటు శరీరం మార్పు చెందుతుంది. దహయతి ఇతి దేహః, దహింపబడుతుంది గనుక దేహం. శరియతి ఇతి శరీరః, మార్పు చెందుతుంది గనుక దీని పేరు శరీరం. పైన పాంచభౌతికంగా ఉన్నది గనుక అస్థిపంజరం మీద చర్మము కప్పబడి ఉన్నది గనుక దీనికి కవచం అని పేరు. అలాగే దశేంద్రియాలతో కూడి నడుస్తున్నది గనుక రథం అని పేరు. చివరకు పరమేశ్వరుడు నీ యందు ఉన్నాడు కనుక దీనికి దేవాలయం అని పేరు. శరీరమే దహింపబడేది, మార్పు చెందేది శాశ్వతమైనది కాదు. ఇది కూడా కూలిపోయేదే. మరి ఆనందము, నీ భార్య యొక్క సౌందర్యము, సంపద, అది ఇచ్చే సుఖము శాశ్వతమా? కానే కావు. గురుపాద పద్మముల యందు గనుక నీ మనసు లగ్నం కాకపోతే కాదంటూ శంకర భగవత్పాదులు మరొక స్థాయిలో విచారధార కొనసాగిస్తున్నారు. వంశ సంపద, బంధు సంపద, వేదాధ్యయనం, శాస్త్ర విద్యా సంపద, మధుర వాక్కులు, పాండిత్యం, కవిత్వం, ఇవన్నీ మార్పు చెందేవే, నశించేవే. తర్వాత ఏమిటి? తతః కిం? తర్వాత ఏమిటి? వేదాధ్యయనం చేశాం నిన్ను నీవు ఎరిగావా? వేదాలను మాత్రమే ఎరిగావా? సంపద బాగా సంపాదించావు ఎవరికన్నా దానం ఇచ్చావా? ఎవరికన్నా సేవ చేశావా? ప్రశ్నించుకోవలసినది. అలాగే బంధువులు ఎందరు అన్నప్పుడు అనేకమంది, మాకు చాలామంది ఉన్నారు అని మనం చెప్తాం. కానీ ప్రాణ నిర్గమన వేళ మనతో కూడి ఉన్న పంచ ప్రాణాలు ఒకటొకటిగా దేహాన్ని వదిలి పెడుతున్న వేళ నీకు అచ్చమైన, నిజమైన, శాశ్వతమైన బంధువు ఎవరు అంటే నీ యందున్న పరమాత్మ మాత్రమే. మార్పు చెందే, నశించే వాటిని పట్టుకొని ఇది శాశ్వతం అని అనుకుంటున్నావే. అంతేకాదు విదేశాలలో గౌరవం, స్వదేశంలో ధన్యత, సదాచారం వలన కలిగే ప్రాబల్యం, దాని వలన లభించేటువంటి ఉత్తమోత్తమ అగ్రస్థానం. నిజానికి ఇవి శాశ్వతం కాదు. గురుపాద పద్మముల యందు మనస్సు నిలకడ చెందకపోతే ఇవి వృధానే అంటున్నారు భగవత్పాదులు. అలాగే భూపాల మండలమంతా, అంటే రాజులంతా చేసే పాదపూజ, వారు చేసేటువంటి సేవ కూడా తాత్కాలికమే. రాజాస్థానానికి వెళ్తాం, మన ప్రజ్ఞ నిరూపించుకుంటాం, భళా అంటాడు, గౌరవిస్తాడు కొన్ని క్షణాలు మాత్రమే శాశ్వతం కాదు. అవి సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వవచ్చునేమో కానీ నిజానికి అవి కూడా క్షణికాలే. గౌరవాలన్నీ కాసేపు మనసుకు సంతోషం కలిగిస్తాయి కానీ ఆనందాన్ని ఇవ్వవు. ఇవి కూడా రూపురేఖలు మార్చుకుని ఏనాటికైనా మాసిపోయేవే. గురుచరణ లగ్నం కాని మనస్సు వీటిని నిలబెట్టుకోలేదు. దానిని వదిలిపెట్టండి. తర్వాత ఏమి? అంటే భోగంలోనూ, యోగంలోనూ, పశుసంపదలోనూ, భార్య ముఖంలోనూ, ధన విషయంలోనూ మనస్సును లగ్నం చేస్తే ఏం ప్రయోజనం? ఇవి శాశ్వతం కాకపోగా దుఃఖానికి కారణం అవుతున్నాయి.ఆనందం కలగాలి అంటే పరమాత్మ యందే మనసు నిలిపి ఉంచాలి. మాత్రము ఏమరుపాటుగా ఉన్నా దుర్గతి తధ్యం. అదే జరిగితే తర్వాత ఏమిటి అని? అక్కరకు రావాలి కదా, ఇవన్నీ శాశ్వతం అనుకున్నాం కాదు అని నెమ్మది నెమ్మదిగా జీవితానుభవం మనకు నేర్పుతూ ఉన్నది. జీవితం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ జారిపోతే, మారిపోతే మన నుంచి దూరమైపోతే ఏమిటి అని? సన్యాసం తీసుకుందాం, వైరాగ్యం ఏర్పడింది కదా అనుకున్నట్లయితే భగవత్పాదులు హెచ్చరిక చేస్తున్నారు. అరణ్యం మీద, వానప్రస్థ ఆశ్రమం మీద, ఇంటి మీద అంటే సంసారం మీద, ఏవేవో కార్యకలాపాల మీద, అశాశ్వతమైన శరీరం మీద మనసు లగ్నం చేసి ఏం లాభం? అన్నీ మారేవే. స్వామి అంటారే, "కాశీ వెళ్ళొస్తాను స్వామి, మీ ఆశీర్వచనం కావాలి, మీ blessings కావాలి" అని అధునాతనమైన భాషలో అడిగితే, "కాశీ ఒక్కడివే వెళుతున్నావా, నీ మనసును వెంబడి పెట్టుకు వెళుతున్నావా?" అని అడిగారు స్వామి. మనసునే వెంబడి పెట్టుకొని వెళ్ళేట్లయితే కాశీ వెళ్లటం దండగ. ఒకవేళ మనసుతో అక్కడి దాకా వెళితే, మనసును అక్కడ వదిలిపెట్టి రాగలిగితే కాశీ యాత్ర పూర్ణమైనట్లు అన్నారు స్వామి. అది. ఇవన్నీ మారేవే, అన్నీ నశించేవే. మనసుని గురుపాద యుగళిపై నిలపలేకపోతే ప్రయోజనం శూన్యం, ఫలితం సున్నా. దుస్థితి ఏర్పడిన తర్వాత ఏమిటి? ఇవన్నీ ఏర్పడుతున్నాయి. సుందర శరీరంతో మొదలు పెట్టారు శంకర భగవత్పాదులు. విదేశాలలో గౌరవం, ఆస్థానంలో కలిగినటువంటి సన్మాన వేడుకలు వీటన్నింటినీ ప్రతి అంశాన్ని స్పృశిస్తూ ప్రతి చోట ఒక హెచ్చరిక "నువ్వు ఏం చెయ్యి, నీ మనసును మాత్రం గురుపాద పద్మముల యందు నిమగ్నం చెయ్యి" అంటున్నారు. ఎందుకనంటే, గురుపాదముల యందు ఎందుకు లగ్నం చేయాలి అంటే श्रीभूयुत श्रीहरि चिन्हिताभ्यां अगश्च रेखा दविरंचिताभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्यां మానవుడి చేతులలో అరచేతులలో కర్మ రేఖలున్నాయి. గురువు యొక్క పాదముల యందు అగస్త్య రేఖలున్నాయి. గురువు పాదముల మీద జీవుడి యొక్క అరచేయి పడినట్లయితే, తాకినట్లయితే కర్మ రేఖలన్నీ అగస్త్య రేఖల కారణంగా పటాపంచలై పూర్ణ ముక్తి లభిస్తుంది గనుక గురువు యొక్క పాదాన్ని నమస్కరించాలి. అయితే అగస్త్య రేఖలు ఎక్కడున్నాయి? శ్రీతో ఉన్నాయి, భూతో ఉన్నాయి. శ్రీ అంటే జ్ఞానము, భూ అంటే భోగము. రెండూ అక్కడ ఉన్నాయి దాన్నే సత్యసాయి భగవానుడు ఇవాళ మనకు అర్థమయ్యే భాషలో "పరమాత్మ దగ్గర రెండు లడ్డూలు ఉంటాయి బంగారు. ఒకటి లౌకికమైన లడ్డూ, రెండవది జ్ఞానపరమైన పారలౌకికమైన లడ్డూ. ఎవరికి ఏది కావాలో అది వారికి లభిస్తుంది" అని చెప్పారు. కాబట్టి అగస్త్య రేఖలు పాదముల అడుగున ఉంటాయి. మరి జీవుడి యొక్క అరచేతులు గురువు పాదముల కిందకు వెళ్లలేవే, ఎట్లా తాకుతాయీ అంటే గురువు యొక్క పాదములు, కుడి పాదము ఏదైతే ఉన్నదో, ఎడమ పాదము ఏదైతే ఉన్నదో దాని బొటనవేలు కింద మన వేళ్ళు ఉంచి నమస్కరించుకున్నట్లయితే కర్మలన్నీ కూడా పటాపంచలవుతాయి. అంటే క్షణాన అహాన్ని వదిలి, మమకారాన్ని వదిలి, మమత్వాన్ని వదిలి, దేహాభిమానం వదిలి, పరమాత్మ యందున్న విశ్వాసం చేత గురుపాద పద్మములను నమస్కరిస్తున్నప్పుడు కర్మ రేఖలన్నీ నశించి దివ్య రేఖలు ఏర్పడతాయి. అట్లాగే అనేక వర్గాల వ్యక్తులున్నారు ప్రపంచంలో. యతి గాని, భూపతి గాని, సన్యాసి గాని, సంసారి గాని, బ్రహ్మచారి గాని ఎవరైనా సరే ప్రశ్నలను సందిన్చుకొని, చింతన అలవరచుకొని, ప్రామాణికమైన గురువాక్యముల యందు మనసు కూర్చి ఉంచాలి. ఎందుకనంటే సూత పురాణంలో ఒక శ్లోకం ఉంది. సూత పురాణంలో గురువుని గురించి చెప్తూ ब्रह्मचारी गृहस्थस्य वानप्रस्थस्य भिक्षुकः अतिवर्णाश्रमी चे इतिक्रमात् श्रेष्ठा विचक्षणानि అంటే బ్రహ్మచారి కంటే గృహస్తు, గృహస్తు కంటే వానప్రస్తుడు, వానప్రస్తుడు కంటే అతివర్ణాశ్రమి ఒకడి కంటే మరొకడు క్రమంలో అధికుడు అని చెప్తున్నారు. దానినే ఇక్కడ శంకర భగవత్పాదులు యతి గాని, భూపతి గాని వాడు యతి కావచ్చు, రాజు కావచ్చు ఎవరైనా సరే గురుపాద పద్మముల యందు మనసును లగ్నం చేయాలి. శ్రీరామచంద్రుడు తన మనసుని వశిష్టుల వారి యందు లగ్నం చేశారు గనుక యోగవాశిష్టాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. ఉత్తరోత్తరా తమ అవతార కార్యక్రమంలో జ్ఞానాన్ని వినియోగించి ధర్మోద్ధరణ చేశారు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరుడు అయిన తర్వాత అంటే యోగేశ్వర స్థితిలో అర్జునుడికి బోధ చేసినప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని యందు మనసును లగ్నం చేసినందువలన అజ్ఞానం పటాపంచలై విషాద భూమికలో నుంచి వినూత్నమైన యోగ భూమికలోకి ప్రస్థానం చేశాడు. అంటే ఇక్కడ జరిగింది గురుపాద పద్మముల యందు మనసును లగ్నం చేసినందువలననే. అలాగే నిరంతర విచారణ, ఆచరణ, సత్య సంచారణ వీటి వలన విచారం నశించి, ప్రాపంచిక కోరికలు తీరి, బ్రహ్మానంద పదం లభిస్తుంది. సర్వ ఆనందమయ జీవితం సిద్ధిస్తుంది. ఇంతకీ గురువు ఎవరు అని? ईश्वरो गुरुरात्मेति मूर्तीतर विभागिने ఈశ్వరుడు, గురువు, ఆత్మ ముడు ఒకటే. కనపడని ఈశ్వరుడు, కనుగొనవలసిన ఆత్మ రెండు ఒక సహకారం గనక అయినట్లయితే, మన ముందు నుంచున్నట్లయితే అది గురు స్వరూపము అని అర్థం. గురువు ప్రత్యేకంగా లేడు. ఈశ్వరుడన్నాఆత్మ అన్నా గురువు అన్నా ఒక్కటే. ప్రత్యేకంగా వస్తువుగా కనిపించని ఈశ్వరుడు చైతన్యంగా శక్తిగా ప్రకాశించే ఆత్మ రెండింటి అందమైన కలనేతే గురువు. గురువు సాకారుడు గురువు నిరాకారుడు గురువు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అన్నిటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అన్నీ తానై ఉన్నాడు. గురుపాదమన్నా భగవంతుడి పాదమన్నా నిజానికి ఒక్కటే. లౌకిక విషయాలలో మనస్సును నిలిపి వగచేయకంటే భగవంతుని అంటే గురువు యొక్క పాదపద్మములపై నిలిచి జీవించగలిగినట్లయితే జన్మే ధన్యం జీవితమే ఆనందమయం. శ్రీ శంకర భగవత్పాదుల సూటి బోధ ఇది చూపించినటువంటి దీటైనటువంటి బాట. మార్గంలోనే స్వామి గురువుని గురించి అనేక విషయాలను బోధిస్తూ మనస్సును గురువు యందు లగ్నం చేసినట్లయితే నీ మనస్సు గురువు యొక్క వశమవుతుంది. అది పరవశం పర అంటే గురువు అని ఈశ్వరుడు అని అర్థం. అదే మనస్సు భౌతిక విషయాలయందు గనుక ఆసక్తి కలిగి ఆకర్షణావలయంలో ఉన్నట్లయితే అది పరవశం కాదు మొత్తంగా పరవశమైపోతుంది. కాస్త ఆనందాన్ని అధికంగా అనుభవిస్తుంది. అది పరవశమే ఇది పరవశమే. పరవశం వేరు పరవశం వేరు. పరవశ స్థాయి నుంచి పరవశ స్థాయికి వెళ్ళాలి. కాస్త మధ్యలో చిన్న విరామాన్ని గనుక సరిచేసుకోగలిగినట్లయితే పూర్ణ ఆనంద తారక స్థితిలోకి వెళ్ళవచ్చని సత్యసాయి భగవానుడి యొక్క దివ్యామృత బోధ ఇటువంటి దివ్యమైన అద్వైత బోధని అందించినటువంటి ఆచార్య సత్తములైన భగవత్పాదులకి గురూనాం గురువు జగద్గురువు సద్గురువు ఆత్మగురువై ఆనంద తారక స్వరూపుడైనటువంటి సత్యసాయి భగవానుడికి మరొక్కసారి నమస్కరిస్తూ శంకర విచార ధారణి సత్యసాయి ప్రబోధంతో సమన్వయం చేస్తూ సాగుతున్నటువంటి విచార ధారలో జనకల్యాణ మాలిక. పరమేశ్వరుడు ఉత్తమ శ్రోత నిజమేనా అని ఇది విచారణ చేయాలి. నవవిధ భక్తుల్లో శ్రవణం ప్రప్రథమము ప్రధానము కాబట్టి చక్కగా వింటేనే విషయం అర్థమవుతుంది. విషయం అర్థం కావాలి అంటే మరణం చేయాలి. మరణం చేసిన తర్వాత విషయం మన సొంతమవుతుంది. సొంతమైనటువంటి విషయంలో నుంచి అర్థం స్పురిస్తుంది. అర్థంలో నుంచి అనుభవం ఏర్పడుతుంది. అనుభవంలో నుంచి అనుభూతి కలుగుతుంది. అనుభూతిలో నుంచి విభూతి స్థాయికి వెళ్ళాలి. ఇది జీవుడి అధ్యాత్మ ప్రస్థానం. ప్రస్థానంలో భాగంగా నిజానికి భగవంతుడు వినమ్రుడు. భగవంతుడు ఉత్తమ శ్రోత కూడా. శ్రీకృష్ణ పరమాత్మకి అనటము కొత్త కాదు, వినటము కొత్త కాదు. అన్నప్పుడు భగవద్గీత బయటికి వచ్చింది. విన్నప్పుడు విష్ణు సహస్రనామం బయటికి వచ్చింది. భీష్ముడు బోధిస్తుంటే పాండవులతో కూడి తాను శ్రవణపేయంగా విష్ణు సహస్రనామ అమృతపానం చేశాడు కృష్ణుడు. అరిషడ్వర్గాలు తొలగిపోగా కౌరవ భుక్తాన్న రూపంగా మిగిలిన రక్తమంతా అంపశయ్య యోగంలో పోగా మనసంతా విష్ణుమయమైనటువంటి వేళ భీష్ముడు విష్ణు గుణగణాలను కీర్తించిన సన్నివేశం మహనీయం. అది వర్ణనీయం. అదొక అత్యద్భుత అధ్యాత్మ మణిమాల. వేదాంత భావనా సుమమాల. అశాంతము సాత్వికాహంకారంతో ఉన్నటువంటి భీష్మ హృదయం మహాభారత సంగ్రామ వేళకి నెమ్మదించటం ప్రారంభించింది. కానీ ఒకానొక రోజున తన ధీరవీర గంభీరమైనటువంటి అస్త్రశస్త్ర విన్యాసంతో కౌరవ సేన తరఫునుంచి పాండవ సైన్యాన్ని అతలాకుతలం చేసినప్పుడు అర్జునుడు కలవరపడ్డాడు. అర్జునుడే కాదు అర్జునుడి రథసారథి అయిన సనాతన సారథి అయిన శ్రీకృష్ణ పరమాత్మ కంగారు పడ్డాడు. అర్జునుడు జీవితంలో ఇది చిట్టచివరి రోజా అన్నట్టు భీష్ముడు చలగిపోతున్నాడు. ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను ఊరకే చూస్తుంటానన్నటువంటి కృష్ణుడు కూడా పరిధి దాటి ఆవేశానికి లోనై విరిగిన రథచక్రాన్ని సుదర్శన చక్రం చేసి భీష్ముడి వైపు ఆవేశంతో ఆవేగంతో పరిగెత్తుతూ వెళుతున్నాడు. అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లావణ్య రూపు రేఖా విలాసాలని మనోజ్ఞంగా అతి సుందరంగా హృదయం మీద ముద్ర వేసుకుని అర్జునుడిని రక్షించాలని పరిగెత్తుకు వస్తున్నాడో శ్రీకృష్ణ పరమాత్మే నాకు కూడా దిక్కు కదా అన్నాడు. కాబట్టి నన్ను రక్షించు అన్నాడు. ఇక్కడ రక్షించు అంటే అర్జునుడిని రక్షించటము అంటే అర్జునుడి ప్రాణాలు నిలబెట్టటం. భీష్ముడు కృష్ణుడిని తనను రక్షించమని వేడటం అంటే తనకు సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్యాలని వరదానం చేయమని ప్రత్యక్షంగా ముఖతః అడగటమే అది పూర్వరంగం. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ఆలోచన చేశాడు. జీవితమంతా ఎలా గడిచింది విచారణ చేశాడు. ఉన్న జీవితమంతా తాను చేసిన ఒక భీష్మ ప్రతిజ్ఞ చుట్టూ తిరిగింది. తన సేవ వలన తన త్యాగం వలన ఒక వంశం నిలబడిందన్న సాత్వికాహంకారం ఉన్నది. అలాగే పుట్టుగుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడు అతని సంతతి భద్రంగా ఉండాలని నిజానికి కోరుకున్నవాడు భీష్ముడు కూడా. అయితే మరి పాండవుల సంగతేమి? అది శ్రీకృష్ణుడి బాధ్యత అనుకున్నాడు భీష్ముడు. రెండింటి మధ్య పరమ చరమ సన్నివేశం ఏర్పడింది. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడి శరీరంలో నుంచి రక్తము కాలువలు కట్టి నెమ్మది నెమ్మదిగా జారిపోగా బొట్లు బొట్లుగా జారుతున్నటువంటి వేళ కౌరవులఅనంతిని దాని వలన ఏర్పడినటువంటి రక్తమంతా పోగా మిగిలినటువంటి శుద్ధ రక్తము శుద్ధ చైతన్యము విష్ణువుని తలచుకున్నది. విష్ణువుని తలచుకున్నటువంటి వేళ ఆశువుగా శాంతి పర్వంలో విష్ణు సహస్రనామం బయటకు వచ్చింది. అంటున్నప్పుడు భీష్ముడు అంటున్నప్పుడు విన్నవాడు వినమ్రమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. విష్ణు సహస్రనామం ఈవేళ జీవనోపాధిగా మానసిక శాంతికి ఉపాదానం చేసేట్లుగా ఒక సర్వోత్కృష్ట స్థాయిలో నిలబడింది. దీనికి కారణం ఒకటే భీష్ముని వంటి పరిణిత హృదయం పాడిందది, పరమాత్మ స్వయంగా విన్నాడిది. అందువలన స్థలం ఎక్కడ? రణక్షేత్రం. సమయం ఎప్పుడు? జీవన చరమాంకం. ఆర్ద్రమైన సన్నివేశంలో ఒక గొప్ప మాట భీష్మ హృదయంలో నుంచి వస్తుంది. వర్ణనీయ సన్నివేశంలో "తత్వం తత్వమిత్ విత్ ఏకాత్మ జన్మ మృత్యు జరాతిగా" అని కదా! అంటే పరమ సత్యము అంటే భగవంతుడే. దాని పేరే బ్రహ్మం. తత్త్వం ఎరిగిన వాడే తత్వవిదుడు. అంటే అతడే బ్రహ్మవేత్త. తత్త్వమూ బ్రహ్మమూ ఎరిగిన వాడే ఏకాత్మ. ఆత్మ కంటే రెండోదంటూ లేదని అది రెండుగా లేదని అర్థం. విషయమే ఎరిగినవాడు ముక్తుడవుతున్నాడు. జన్మనూ, మృత్యువునూ, వృద్ధాప్యాన్నీ దాటినవాడు ముక్తుడు. సన్నివేశంలో బ్రహ్మమును ఎరుగుతున్న వాడు భీష్ముడు. తానే బ్రహ్మ అని చెప్తున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. తత్వాన్ని బోధిస్తున్న తత్, త్వం తాను అంటే భీష్ముడు. అంటే భీష్ముడు కృష్ణుడు రెండుగా-- రెండు రూపాలుగా కనిపిస్తున్న రెండు ఏకమైన అద్వైత స్థితి అది. కనుకనే జన్మ లేదు, మృత్యువు లేదు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు, ఆలోచన లేదు. ఏమున్నది అంటే సర్వాంగీనమైనటువంటి ఒక సమర్పణ, ఒక శరణాగతి, ఒక వినయ పూర్వకమైన నివేదన, సంవేదన, ఆవేదన దాటినటువంటి స్థితి. కాబట్టి ఇది దాటిన వాడు మాత్రమే ముక్తుడు. అయితే దేవుడు వీటన్నింటికీ అతీతుడు. జీవుడు వీటిని దాటవలసిన వాడు, దాటగలిగిన వాడు. విష్ణు సహస్రనామం అన్నవాడు భీష్ముడు, విన్నవాడు విష్ణువైన కృష్ణుడు. వేదిక మహాభారత సంగ్రామ రంగం. సమయం సంధ్యా సమయం. భీష్ముడి అవనీ సంచారంలో నిజానికి అది నిజమైన శాంతి పర్వం. ఎందుకంటే భీష్ముడి జీవితమంతా అశాంతి పర్వమే. శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానంలో తాను ఏకాత్మ అయి నిశ్చలమైనటువంటి భక్తితో గా గుణగానం చేయటం భగవంతుని యొక్క సంకీర్తన చేయడమే భీష్ముడు సాధించుకున్నటువంటి ఒక తపస్సాఫల్యం. రమణీయ భగవన్నామస్మరణంతో సాధించుకున్న ఇచ్ఛామరణం. అది పూర్ణ ముక్తి. సంచారమూ, విచారమూ సమసిపోగా మిగిలిన దివ్య విభూతి. విశ్వంతో ప్రారంభమై విష్ణువుతో ముగిసే విష్ణు సహస్రనామం విరాట్ మూర్తి యొక్క వైభవం. ఇక్కడ నిజానికి తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అని సామెత. భీష్ముడు అనుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి రోహిణీ నక్షత్రంలో అష్టమి నాడు శరీరాన్ని వదిలిపెట్టాలి అని ఆయన కోరిక. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దానిని అనుగ్రహించలేదు. ఏకాదశి నాడు మాత్రమే ప్రాణం పోయేట్టుగా చూశాడు. అందుకనే అది భీష్మ ఏకాదశి అయింది. అంటే పుట్టుక కానీ, మరణం కానీ మన చేతుల్లో లేవని, విధి రాతను ఎవరు తప్పించుకోలేరని, తప్పించుకో ప్రయత్నం చేసినా పరమాత్మ కూడా సహకరించడని మనకు అర్థం అవుతున్నది. కాబట్టి మన మరణాన్ని ఇచ్ఛాపూర్వక మరణము అంటే ఇక చాలు అనుకోవటం ఇచ్ఛాపూర్వకమే తప్ప మనం పెట్టుకున్న ముహూర్తంలో మనం మరణించామని మాత్రం అర్థం కాదు. సరే, విష్ణు సహస్రనామం అంతా మంత్రాత్మకం, యంత్రాత్మకం, తంత్రాత్మకం. భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థితులలో అర్థం చేసుకోవలసినటువంటి విష్ణుత్వం, విష్ణుతత్వం, సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, సంపూర్ణత్వం ఇది. పూర్ణం కావాలి, సర్వమూ తెలియాలి. సర్వమూ తెలియటం అంటే ప్రపంచాన్ని ఎరగటం కాదు, సర్వ ప్రపంచ భావనని ఎరగటం కాదు, తనను తాను ఎరగటమే సర్వాత్మ, సర్వజ్ఞత. అన్నిటా వ్యాపించి ఉండటం అంటే విష్ణువు వలె మనం నిగూఢంగా ఉండటం కాదు, అన్నిటియందు మనమే ఉన్నాము, మన చైతన్యమే అన్నిటియందు ఉన్నదని, అన్నింటి యందున్న చైతన్యమూ మనలోనే ఉన్నదన్నటువంటి భావన అదే అభేదమైన అద్వైత అద్వితీయ స్థితి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అవి కేవలం మూడు దేవతా స్వరూపాలు మాత్రమే కాదు, అవి మూడు కలాపాలు. అంటే మూడు కార్యక్రమాలు. అవి సృష్టి, స్థితి, సంహార. మూడింటిలో సృష్టి సంహారం సంకల్ప వ్యవహారాలు. అంటే సృష్టించాలి అనేది ఒక సంకల్పం. అదొక మానసిక వ్యాపారం. దీన్ని సంహారం చేయాలి, లీనం చేయాలి, లయం చేయాలి, లేకుండా చేయాలి, అరూపం చేయాలి అనుకోవటం అదొక మానసిక కార్యకలాపం. కానీ సుదీర్ఘమైనటువంటిది స్థితి. ఎందుకని అంటే తల్లి గర్భం నుంచి శిశువు బయట పడటానికి అతి కొద్ది క్షణాలు మాత్రమే అవసరం. అలాగే ఎన్నేళ్ళు ఇక్కడ బతికినా శరీరం నుంచి ప్రాణం పోవటానికి కొన్ని సెకన్లు చాలు. కానీ పుట్టటానికి, గిట్టటానికి మధ్య ఉన్న కాలం అది స్థితి. అది సర్వవ్యాపకత్వం. అది సంపూర్ణమూ, విశాలమూ, విస్తృతమూ, గంభీరమూ, అనంతమూ, అచ్యుతమూ కనుక సుదీర్ఘమైనది కూడా అయినది. అది జీవుడు, జగత్తు.నట రంగస్థలాలుగా సాగేటువంటి ఒక నాటకం జీవితం. అంటే పుట్టిన దాదిగా నాటకము నటన ప్రారంభమవుతుంది. నాటకం ఆగటము అంటే మార్పు ఏర్పడటమే. మార్పు ఏర్పడటం అంటే మరణం సంభవించడమే. మరణం సంభవించడమంటే దేహాత్మ భావం నుంచి దేహం నుంచి విడిపోయి విశ్వ చైతన్యంలో కలిసిపోవటమే. కనుక ఆడించేవాడు వాడి పేరు దేవుడు. అసలు దేముడు అని శబ్దం లేదు. దేవుడు అని అనాలి. దేవా అంటే ఆట అని అర్థం. ఆడించేవాడు ఆయనే, ఆట ఆయనే, ఆడుతున్న వాడు ఆయనే. కాబట్టి ఆట మూడు రకాలుగా మూడు పాయలుగా సాగుతుంది గనుక సత్యసాయి భగవానుడు కూడా దేవుడనగ వేరు దేశమున లేడు అంటూ ఒక మాట. రామచంద్రుడే రామచంద్రుడై అనే ఒక పద్యంలో పరమాత్మ అను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థానాల నెలిపి ఆడించు ఆనాటి ఆటలరసి అన్నాడు. ఆనాటి ఆటలరవండి అంటే తెలుసుకోండి అని. ఏనాటి ఆటలు? త్రేతాయుగంలో రాముడు ఆడిన ఆటలు, ద్వాపరలో కృష్ణుడు ఆడిన ఆటలు, కలియుగంలో సత్యసాయి భగవానుడు ఆడుతున్న ఆడిస్తున్న తాను ఆనందిస్తున్న ఆటని చూసి సుంత తెలుసుకోండి. చాలా కొద్దిగా మీకు అర్థమవుతుంది తెలుసుకోండి అన్నారు. కాబట్టి ఆట అంటే దైవము అని అర్థం. మన జీవితం కూడా ఒక ఆట. ఆట అదే దేవుడు ఆడుతూ ఆడుతూ జీవుడితో కలిసి సాగించే దివ్య ప్రయోగమే మానవ జీవితం. ప్రయాణమే ప్రస్థానం. ప్రయాణం జీవితం అంటే ఏమిటి అని అడిగినప్పుడు సత్యసాయి భగవానుడి సమాధానం ఏమిటంటే మాతృ గర్భం నుంచి సమాధి వరకు సాగేటువంటి ఒక నాటకం. నాటకం వింత నాటకం కాదన్నారు స్వామి సుంత నాటకమే. కాసేపు ఆడుకునే ఆటే. ఆటలో అందరూ భాగస్వాములే. అరమరికలు లేక, అసూయాద్వేషాలు లేక, రాగమోహాలు లేక ఎవరు పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి జీవిస్తారో వారి జీవితము సాధనామయం అవుతుందని, జీవితమంతా శోధనాలయం అవుతుందని సత్యసాయి భగవానుడు మనకు పదే పదే జనకల్యాణ మాలికగా ఒక్కొక్క పువ్వుని, పువ్వులో ఉన్న ఒక్కొక్క రేకని, ఒక్కొక్క రేకలో ఉన్న సొబగుని, ఒక్కొక్క సొబగులో ఉన్న సౌందర్యాన్ని, సౌందర్యాన్ని ఆఘ్రాణించటానికి వీలైనటువంటి దివ్య పరిమళాన్ని పరమాత్మ మనకు చక్కగా విశదీకరించారు. అయితే ఆట రక్తి కట్టాలి అంటే ఏం కావాలి? జీవితం బాగా సాగింది అని మనం అనుకుంటాం. భోగంతోనా, యోగంతోనా, భోగ యోగాలు రాని రోగంతోనా? విచారణ చేసినట్లయితే రోగము శరీరానిది, భోగము శరీరానిది, యోగము మనస్సుది. మూడు దాటినటువంటి ఒక రమ్య స్థితి ఏదైతే ఉన్నదో అది పరమాత్మతో కూడినటువంటి అనుసంధాన ప్రక్రియ గనుక దానికి కొన్ని విశేషాలు కావాలి. అవి ఓర్పు, నేర్పు, కూర్పు, మార్పు. ఇవి ఉండకూడాలి. మారుతూ ఉండాలి. ఓర్పు ఉండాలి. దానిని చాలా నేర్పరితనంతో జీవితాన్ని సాగించాలి. అనేక సంఘటనలని, అనేక వ్యక్తులని, అనేకమైనటువంటి మనస్తత్వాలని అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వాటితో సహ ప్రయాణం చేయగలిగిన నిబ్బరం కావాలి. అలాగే ఎవరి పట్ల ఒక తీర్పు పరితనాన్ని ప్రదర్శించకూడదు. మార్పు అనివార్యం. ప్రకృతిలో, దేహంలో మనమే చూడండి. తల్లి గర్భంలో మన రూపం ఒట్టి అండం. అండం నెమ్మది నెమ్మదిగా పిండమైంది. పిండమే శిశువయింది. శిశువు పుట్టిన తర్వాత బాలుడైనాడు. కౌమార యౌవన దశలు దాటి, మధ్య వయస్సు దాటి వృద్ధుడవుతున్నాడు. ఆపై జీవితరంగం నుంచి తాను వచ్చి ఆడవలసిన ఆట ముగించుకొని ఇక్కడ నుంచి ప్రయాణం తిరుగు ప్రయాణం ప్రారంభిస్తున్నాడు. తిరుగు ప్రయాణం ఎక్కడికి అని విచారణ చేస్తే మళ్ళీ తన మూలంలోకే. ప్రపంచంలో అంకోల వృక్షము అని ఒకటి ఉన్నది. ఒక మేడి చెట్టు అంటే ఔదుంబర వృక్షము, రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు ఇవన్నీ ఎట్లాగైతే పౌరాణికంగా ఒక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నాయో అంకోల వృక్షం వీటన్నింటికంటే భిన్నమైనది, విశిష్టమైనటువంటిది. మిగతా చెట్లలో ఏర్పడేటువంటి బీజాలన్నీ కూడా గాలి వాటున మరొక చోటికి ప్రయాణం చేసి అక్కడ మళ్ళీ జన్మ ఎత్తుతాయి. కానీ అంకోల వృక్షంలో ఏర్పడినటువంటి విత్తనాలు గాలి వాటికి దశలోకి, దిశలోకి ప్రయాణం చేసినా మళ్ళీ తన మూలంలోకి ప్రయాణం చేస్తాయి. మూలంలోకి వచ్చి అతుక్కుంటాయి. అట్లాగే జీవుడు ఎన్నెన్ని శాఖలు మారినా, ఎన్నెన్ని ప్రాంతాలు మారినా, ఎన్నెన్ని ప్రయాణాలు చేసినా, ఎన్నెన్ని అనుభవాలు పొందినా మళ్ళీ తన మూలంలోకి తాను సత్యాన్వేషణ చేస్తూ ప్రయాణించాలి. అటువంటిదే జీవన ప్రస్థానంగా మనం భావన చేయాలి. అలాగే ఓర్పు, నేర్పు, కూర్పు, మార్పు వనగూడాలి. అవన్నీ ఒక చోట ఉంచుకోవాలి. గెలవటానికి మనోశక్తి కావాలి. గెలుపు లక్ష్యంగా ఆట సాగాలి. విష్ణు సహస్ర నామంలో నామానికి నామమే విడివిడి కాదది. ఒకదానితో మరొకటి ముడిపడినటువంటి శక్తి మాల, నిజానికి అది భక్తి మాల, ఆనంద మాల. పూర్తై ముడి పడుతున్నటువంటి వేళ ముడి విప్పే యుక్తి మాల. విష్ణు సహస్రనామం భీష్ముడి యొక్క ఆత్మ గానం. పరితృప్త భావము భక్త జీవులకు సర్వ పాపం సంహార చక్రం. అది నిత్య సుదర్శనం, శాశ్వత రక్ష. మహా మంత్ర రాజాన్ని జగతికి అందించిన వేదవ్యాస భగవానులకు వేవేల వందనాలు. ప్రతిరోజూ ప్రతి సాయంత్రం చదువుకోవలసిన జన జాగరణ గీతిక, జన కళ్యాణ మాలిక విష్ణు సహస్రనామం. అంటే విష్ణువు లేని విశ్వం లేదు.ఎందుకంటే విశ్వము అనేదానికి అర్థము సృష్టి అని. సృష్టింపబడాలి అంటే సృష్టించేవాడు ఒకడు ఉన్నాడన్నమాట. సృష్టి కంటే ముందు. సృష్టి కంటే ముందున్నవాడు రాముడు కాదు, కృష్ణుడు కాదు. వాళ్ళంతా తర్వాత సృష్టిలో ఏర్పడిన వారు. సృష్టి కంటే మూలం ఉన్నటువంటి ఒకేఒక పదార్థం, దాని పేరు సత్. సత్ అనేటువంటి నిత్యమైన సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి భావన లో నుంచి ఒకటి ప్రవేశించింది, ప్రభవించింది, దానిలో నుంచి అనుప్రవేశం చేసింది, ప్రసారమైంది. ప్రసారమైనటువంటిదే సత్యము నుంచి ఏర్పడింది గనుక సృష్టి, విశ్వం అని రెండు పేర్లున్నాయి. రెండింట్లలో విశ్వంతో ప్రారంభమై మళ్ళీ విష్ణు నామంతో ముగిసేటువంటి విష్ణు సహస్రనామము శంకర భగవత్పాదుల భాష్యమే భాష్యం. ఎందుకని అంటే దేనినైనా విష్ణువు అనగానే వైష్ణవులు మా వాడు అంటారు, శివుడు అనగానే శైవులు మా వాడు అంటారు. మా వాడు కాదు, మన వాడు. ఆయన అందరి వాడు. కాసేపు విష్ణువుగా, కాసేపు బ్రహ్మగా, కాసేపు శివుడుగా ఉండే మూడు కార్యకలాపాలకి స్థితి రూపము, స్వభావమే తప్ప ముగ్గురు లేరు. దానినే సత్యసాయి భగవానుడు పరమ రమణీయంగా, చాలా అందంగా, చక్కగా చెప్పారు. ఏమని అంటే "నీ మనసే బ్రహ్మ" ఆలోచనలు అక్కడ పుడుతున్నాయి గనుక అది బ్రహ్మ స్థానము. "నీ హృదయమే వైకుంఠము" ఎందుకంటే ఆత్మ హృదయ కుహరంలో ఉన్నది గనుక. మరి శివుడు, లయసంహార కారకుడైన శివుడు ఎక్కడున్నాడు అంటే ప్రతిక్షణమూ నీవు మరణిస్తూనే ఉన్నావు. ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు జరిగే ప్రాణాయామ ప్రక్రియలో ఒక్కొక్క దాని మధ్య విరామ కాలంలో జీవుడు మరణిస్తున్నాడు, మళ్ళీ జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు. ఇవి రెండూ కూడా simultaneous గా alternate గా అంటామే, పడుగు పేకల వలె సాగుతూ ఉంటాయి. జనన మరణాలు రెండూ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఇమిడి ఉన్నాయి గనుక జీవితం ఎంత అని విచారణ చేసుకున్నప్పుడు అత్యంత పరిమితమైనదే జీవితం. పరిమిత జీవితంలో నుంచి అపరిమిత ఆనందాన్ని సేవ ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సద్గోష్ఠి ద్వారా, సదాచారం ద్వారా, సమ్యక్ సంకీర్తన ద్వారా దీనిని అనుభవించవలసి ఉన్నదని జగత్తికి బోధించినటువంటి సత్యసాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ, సాయిరాం.
SSSMC · audio

Advaitamrutha Dhara - 04

Home

Advaitamrutha Dhara - 04

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 33:01

More in this series

Advaitamrutha Dhara

9 episodes · 4 hr 4 min

  1. 22 min 1

    Advaitamrutha Dhara - 01

  2. 36 min 2

    Advaitamrutha Dhara - 02

  3. 31 min 3

    Advaitamrutha Dhara - 03

  4. 33 min 4

    Advaitamrutha Dhara - 04

    Now playing
  5. 34 min 5

    Advaitamrutha Dhara - 05

  6. 27 min 6

    Advaitamrutha Dhara - 06

  7. 20 min 7

    Advaitamrutha Dhara - 07

  8. 16 min 8

    Advaitamrutha Dhara - 08

  9. 21 min 9

    Advaitamrutha Dhara - 09