Skip to content
Transcript తెలుగు
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకర భగవత్పాదుల దివ్య మహా స్మృతికి సత్య సాయి భగవానుని దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ శంకర విచార ధారలో అమృతోపమానమైనటువంటి శివానందలహరి ను గురించి విచారణ చేద్దాం. ఇది శివ ఆనందలహరి. శివ స్మరణ ఆనందం, శివనామ సంకీర్తన ఆనందం, శివుని తలపు ఆనందం. అసలై ప్రకృతి అంతా శివాయేతనమే. శంభు జ్యాన వసంత సంగిని హృదారామే అఘజీర్ణచ్ఛదా స్రస్తా భక్తిలతాచ్ఛట విలసిత పుణ్యప్రవాళ శ్రితాః దిశ్యంతే గుణకోరక జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతి జ్ఞానానంద సుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతి ప్రకృతిలో పరమాత్మని, పరమాత్మలో ప్రకృతిని చూట్టానికి శివ స్వరూపాన్ని మించినటువంటి మరొక స్వరూపం లేదు. అయితే శంకర భగవత్పాదుల వంటి అవతార మూర్తి శివుడ్ని గనక ధ్యానించిన ట్లయితే ఏం కోరుకుంటాడు? ఏం చేస్తే ధన్యత్వాన్ని పొందాను అని ఆయన అనుకుంటారు. ఆయన ధన్యుడే కానీ ఒక ఉత్తమ మానవుడు లేదా ఒక అవతార మూర్తి జగత్తులో వేసే ప్రతి అడుగుని లోకం పరమ పవిత్రంగా స్వీకరిస్తుంది. భావనలోనే శంకర భగవత్పాదులు శివానందలహరి లో ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. సారూప్యం తవ పూజనే శివ మహా దేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చరాచరాత్మక తనుజ్జనే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. పరమేశ్వరుడు సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య అనేటువంటి నాలుగింటిని అనుగ్రహ వర్దానం చేస్తాడు. పరమేశ్వరుడు లోకాతీతంగా ఉంటే జీవుడికి ప్రయోజనం లేదు. కనుకనే జనార్ధనుడై జనంతో కలిసి ఉంటాడు. ఉంటూ తన యొక్క దర్శనాన్ని అనుగ్రహం చేస్తూ ఉంటాడు. అందుకనే అది సాలోక్యం. సామీప్యం సన్నిహితత్వాన్ని కూడా అనుగ్రహిస్తాడు భౌతిక స్థాయిలో. అలాగే సాన్నిధ్యం ఇస్తాడు నిత్య నామ సంకీర్తనంతో. నామస్మరణాంచితమైన దేహంతో పరమాత్మకు గనక దగ్గరగా ఉండగలిగినట్లయితే నిజానికి అది సాన్నిధ్యం. మూడు ఏర్పడిన వాడికి సాయుజ్యం సులభంగా లభిస్తుంది. లభిస్తుంది అంటే పరమాత్మ ఇస్తాడు అని అర్థం. సాక్షాత్తు శంకరులైనటువంటి భగవత్పాదులు ఒక కవితా హృదయంతో ఆలపించినటువంటి హృదయ గానమే, భక్తి స్తోత్రమే, భక్తి పారవశ్యమే శివానందలహరి. నిజానికి ఆధునిక కాలంలో సత్య సాయి భగవానుడు అనుగ్రహించింది కూడా ఇదే. సాలోక్య, సామీప్య, సాన్నిధ్యాలు అనుగ్రహించి సాయుజ్య మార్గాన్ని సాధకుడికి సుగమం చేశారు. పరమేశ్వరుడి యొక్క భావనకి, తలపుకి చాలా దగ్గరగా ఉండాలి. అలాగే పరమేశ్వరుడికి జీవితాన్ని కైంకర్యం చేసేటువంటి ఒక సాన్నిధ్యాన్ని కోరుకోవాలి. ఎప్పుడైతే సమర్పణ, శరణాగతి, వినయం అన్న మూడు భావనలు ఉంటాయో పరమేశ్వర అనుగ్రహం సహజంగానే సాధకుడికి లభిస్తుంది. దీనిని అనేక రీతులలో అనేక భావాలతో శంకర భగవత్పాదులు పరమ రమణీయాస్పదంగా ఆవిష్కరించారు శివానందలహరిలో. ఇంతకీ శివానందలహరి ఒక ఆనంద ప్రవాహం. అది ఎలా ప్రవహించింది? దాంట్లో ఏముంది? ఎట్లా ఆయన ఈశ్వరుడ్ని చల - అచల స్థితిలో, జడ - చైతన్యాలలో, అర్చా మూర్తిగా, నిర్గుణ పరబ్రహ్మ తత్వంగా ఎలా ఉపాసన చేశారు? చేస్తూ ఎలా చేయమని జాతికి బోధించారు? విచారణ చేద్దాం. అద్వైత బోధ, వేదాంత ప్రబోధ, వైరాగ్య సుబోధ ఒక ఎత్తయితే భక్తి ప్రబోధం మరొక రస స్థాయి. భగవత్పాదుల విచారధారలో భక్తి ఒక ఆనంద ప్రవాహం. ప్రవాహము అంటే లహరులు ఏర్పడక తప్పదు. పూజలు, వ్రతాలు, దీక్షలు దాటి పరమాత్మను కేవలం భావనా స్థితిలో అనుభవించగలిగితే ఆనందం అవిచ్ఛిన్నం, అనవరతం, అమృతమయం.శంకరులు తమ శ్రీశైల పుణ్యక్షేత్ర యాత్రలో హృద్గీతగా ప్రవాహ సదృశ్యంగా సాగించిన దివ్య కవితా వ్యాసంగమే శివానందలహరి. భగవంతుని యందు భక్తుడికుండే పరమానురాగమే భక్తి. సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్యాలను అనుభవ పరిధిగా అనుభూతి పరమావధిగా అనుగ్రహించేది భక్తి. అంటే వెలుగు, క్తి అంటే కూడి ఉండటం. భక్తి అంటే వెలుగుతో కూడి ఉండటం అంటే లో వెలుగుతో అని అర్థం. సాధారణంగా లోకరీతిలో కవులందరూ జ్ఞానం కోసం, జన్మ రాహిత్యం కోసం కవిత్వం చెప్తారు, రాస్తారు. భక్తి రసాన్ని అంతరంగ సాధనా ఫలంగా అనుభవిస్తారు. కానీ జ్ఞాని, పరమాత్మే, శంకరులే కవిత్వమయంగా భక్తిని స్తోత్ర పూర్వకంగా ఆలపిస్తే అదొక ఆనంద రస ధుని. సర్వజనులు పాడుకోగలిగిన, పాడుకోవలసిన కవితా స్వరూపం అవుతుంది. అదే శివానందలహరి. భాషా, భావం, అలంకారం, శాస్త్రం ఇవన్నీ బహుసుందరంగా మారిన ఆనందలహరిగా శివానందలహరి సాగుతుంది. కేవలం స్తోత్ర స్థాయిలోనే కాక శివతత్వాన్ని ఆవిష్కరిస్తారు శంకరులు. శివానుగ్రహం పొందటానికి భక్తే ఏకైక మార్గం అని స్పష్టంగా బోధిస్తారు. ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు సాగే కోతి ఆటవలె మానవుడి మనసు ఊగుతున్నప్పుడు భగవంతుడే భక్తి అనే తాడును విసిరి మనసనే కోతిని బంధించి తనవైపు తిప్పుకుంటాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఎంత అధ్యయనం చేసినా, సన్యాస స్వీకారం చేసినా భగవంతుణ్ణి పొందాలి అంటే భక్తి భావనే బలీయమైన సాధన. శివ పాద పద్మ లగ్నమైన భక్త హృదయం శివవశం అవుతుందని, పరమయోగత్వం లభిస్తుందని, చివరగా కైవల్యం పొందుతుందని శంకరుల ప్రమాణం. కొందరు లౌకికమైన భౌతికమైన కోర్కెలను సాధించుకోవాలని గ్రహాలను శాంతింపజేసి దేవతారాధన చేసి లాభం పొందుతారు. సంసారికి ఇది తప్పనిసరి. కానీ మానవ జన్మ లక్ష్యము, గమ్యము అయిన బ్రహ్మ పదాన్ని పొందాలి అంటే శివుణ్ణి ఆశ్రయించటమే శ్రేయం. శ్రమలో, తీవ్ర సాధనలో, శివుణ్ణి ప్రార్థించటంలో భక్తుడు వేడుకగా వేడుకోవాలి. ఆదికి రాతుడా శంకరా! ఎందుకయ్యా అరణ్యంలో అమాయకంగా స్వేచ్ఛగా తిరుగాడే మృగాలను వేటాడుతావు? నాయందే అరిషడ్వర్గాలనే మృగాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నీ బాణాన్ని నా వైపు సంధించి వాటిని సంహరించవచ్చు గదా? అంటారు ఆచార్య స్వామివారు. ఇక్కడ సత్యసాయి భగవానుడి ప్రబోధం ఏమంటే, గ్రహాలు నిన్ను ఏం చేయగలవు భగవంతుని అనుగ్రహం నీ దగ్గర ఉంటే అంటారు. గ్రహాలు వాటి దారిన వాటి పని చేస్తుండనివ్వండి. వాటిని శాంతింపజేయటం, శమింపజేయటం, వశపరచుకోవటం నీ పని కాదు. కేవలం భగవంతుని అనుగ్రహం ఒక్కటి ఉన్నట్లయితే సర్వ గ్రహాలు నీ యందు దయ చూపుతాయి అంటారు స్వామి. మేరు పర్వతము, కుబేరుడు, కల్పవృక్షము, చింతామణి, కామధేనువు నీ అధీనం. నీవు ఇవ్వలేని వంటూ ఏదన్నా ఉన్నదా? అని కీర్తిస్తూనే, అటువంటి నీకు మేమేమివ్వగలము అంటారు శంకరులు వినయంగా. ఒక్క సూర్యుడు క్రమం తప్పకుండా సమస్త లోకాన్ని ఆవరించిన చీకటిని పోద్రోలి మాకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కోటి సూర్యుల వెలుగుకు మూలమైన నీవు నాకెందుకు కనపడవు? అంటారు చమత్కారంగా. భక్తిభావంతో. శివుడంటే వేదమే. సకల భువన క్షేమంకరుడు, సర్వవ్యాపి, సర్వవేది, రసాలయుడు, పశుపతి, నిత్యుడు అంటూ శివగుణగణాలను అగణితంగా వర్ణిస్తారు శంకరులు. సానందంతో. ఒక్కొక్క గుణ వర్ణన శివతత్వ విచారణకు దారి తీస్తుంది. శివుణ్ణి సగుణంగా, స్వరూపంగా, నిర్గుణంగా భావించగలగాలి. అది శంకర హృదయంతో. త్రిశూలం జడం. చంద్రుడు మచ్చగలవాడు. మృగంలో పశుత్వం. పాముల నడకలో వంకరటింకర్లు. ఇన్ని దోషాలున్న వాటిని ఆదరించి, ధరించి, ధరింప చేయటం కేవలం శివుడికి మాత్రమే సాధ్యమని, వాటన్నిటితో పాటు నన్ను అనుగ్రహించలేవా అంటున్నారు శంకర భగవత్పాదులు. మానవుడు స్వభావ రీత్యా కఠినాత్ముడు. జన్మ పరంపరను తేలికగా అధిగమించలేడు. పశు ప్రవృత్తిని అంత సులభంగా వీడనూ లేడు. నివృత్తి మార్గం కోసం ప్రయత్నం ప్రారంభించనూ ప్రారంభించడు. జీవితం అనుకూలించనప్పుడే దైవాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తాడు. గండం నుండి బయటపడగానే మళ్ళీ తన ప్రవృత్తిలో ప్రవేశిస్తాడు. భయాన్ని భక్తి ద్వారా దూరం చేసుకునే విధంగా అలమటిస్తాడు. భక్తి అంటే సమర్పణ. భక్తి అంటే శరణాగతి. భక్తి అంటే వినయం. భక్తి అంటే అభేద అచల అద్వైత స్థితి. దైవాన్ని సగుణంగానూ నిర్గుణంగానూ ఉపాసించాలి, నమ్మాలి. ప్రపంచ శాసనకర్తను గుర్తించాలి, గుర్తెరిగి వర్తించాలి. భక్తి ద్వారా జ్ఞానానుభవాన్ని పొందాలి. మూర్తి ఏదైనా స్ఫూర్తిని పొందాలి. పశుత్వం నుంచి పశుపతి స్థాయికి ఎదగాలి. భగవన్నామ స్మరణము, ధార్మిక చారణము, ఆత్మ విచారణము సాగించుకొని, సాధించుకొని, తారణం అంటే ముక్తిని పొందాలి. శివానందలహరిని రసగంగా ప్రవాహంగా మన ముందు నిలిపి లలిత, మార్ధవ, మార్మిక, కవితా ధోరణిలో శివ సాక్షాత్కారం చేయిస్తారు భగవత్పాదులు. శివానందలహరిలో దాగిన ఎన్నో విషయాలను మరింతగా విచారణ చేసి ఆనందాన్ని అనుభవించాలి, విభూతి స్థాయికి వెళ్ళాలి. భగవంతుణ్ణి స్తుతించాలి అంటే అమిత భావ సంపద ఉండాలి. భాషా సంక్రాంతం ఉండాలి. సిద్ధత్వము, శుద్ధత్వము, అనుభూతి, దర్శనము ఉండాలి. అప్పుడే కీర్తన సంకీర్తనైసంయక్ స్వరూపాన్ని సంతరించుకుంటుంది. పరశివావతారమైన ఆదిశంకరుల అనుభూతి పారమ్యానికి భక్తినిష్ఠకు దర్శన శోభకు అడ్డం పడుతుంది శివానందలహరి. వంద శ్లోకాలలో శివానందలహరి పరమాద్రంగా శివభావామృత వృష్టిలో భక్తుడి హృదయం తడిసి ముద్దవుతుంది. ఎలా అన్నారో చూద్దాం. ఉమామహేశ్వరులుగా అద్వైత సిద్ధి స్వరూపం శివ శివానీలది. మూడు కన్నుల వాడు, మూడు పురాలను ధ్వంసం చేసిన వాడు, మూడు వేదముల ద్వారా ఎరగవలసిన వాడు, జ్ఞానమునకు ఆధారమైన వాడు అయిన పశుపతికి వందనం. అల్ప ఫలాలు ఇచ్చే వేల వేల దేవతల కంటే నీ పాదారాధనా ఫలమే సర్వోత్కృష్టం. తర్కశాస్త్ర వాదాల కంటే నీ పాదసేవయే సుఖదాయి. మనస్సు, వాక్కు, చేతులు, చెవులు, కళ్ళు నీ స్వరూప దర్శనంలో నిమగ్నం కావాలి. మనస్సును నీకు అర్పించటమే అసలు పూజ. మనిషి స్థితిలో ఉంటే ఏమి హృదయం నీ అధీనంలో ఉండాలి. బ్రహ్మత్వము, విష్ణుత్వము కేవలం పదవులే. నాకు కావలసిన మోక్షాన్ని ఇవ్వు. సారూప్య, సామీప్య, సాలోక్య, సాన్నిధ్య, సాయుజ్యాలను అనుగ్రహించేవాడవు నీవు. విషాన్ని మింగక కంఠంలోనే నిలిపి సర్వభువన జీవకోటిని దయతో రక్షించిన పరమేశ్వరా! నీకు వందనం. ప్రళయ కాలంలోనూ నీవు అచలుడవు. ఆనంద సముద్రుడవు. యోగం, క్షేమం, శ్రేయస్సు, సాధనారీతి ఇటువంటి వాటిని వరదానం చేస్తూ అన్నివేళలా సర్వజ్ఞ స్థితిలోనే ఉంటావు. సమస్థితమై ఉంటావు. నీవు మా మానస మందిరంలో ఉంటే ధర్మం నాలుగు పాదాల ప్రవర్తిస్తుంది. అంతరంగ శత్రువులు నశిస్తారు. నీవు మాయందు వసిస్తే అనంత జ్ఞానౌషధం మాకు లభిస్తుంది. శివ ధ్యానమే నవ వసంతం. శివ ధ్యానమే నవ వసంతం. శంభుధ్యాన వసంత సంగినీ హృదారామే అఘజిర్ణచ్ఛదా శ్రస్తా భక్తిలతాచ్ఛటా విలసితా పుణ్యప్రవాళశ్రితాః దియన్తే గుణకోరక జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. సాయం సంజలో సాగే తాండవ నృత్యం, ఉపనిషత్తులు, బ్రహ్మరాంబా దేవి దివ్య ప్రేమ, సమస్త దేవతల పూజ, నిత్యమూ సాగే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవించాలి. ఉపనిషద్విహారి సత్య స్వరూపుడు చిన్మూర్తి తాండవానంద సాంద్రుడవైన నీకు నమస్కారం. అరిగిన పాత చెప్పు నీ పాలభాగాన్ని తాకినా, పుక్కిట బట్టిన నీళ్ళు నిన్ను అభిషేకించినా, ఎంగిలి మాంసం ముక్క నీకు నైవేద్యమైనా, తిన్నన్ని కన్నప్పను చేసిన నీ కరుణా నిరుపమానం. తిన్నడి నిశ్చల భక్తి నీ అనుగ్రహము ఎంత ఉద్ధికగా వర్ణించయ్యా! నీ ఆట కోసం నీవే సృష్టించుకున్న ప్రపంచంలో మాతోనే నీ ఆట. ఆడేది, ఆడించేది నీవే. గెలిపోటములు రెండూ నీవే. మమ్మల్ని రక్షించటం నీ బాధ్యతే. నీ పాదాల గోశాలలో ఉండి ఆనందం అనే పాలను పితకనిచ్చే నా భక్తి అనే గోవును సదా రక్షించు. నీ పాదార్చన, స్వాధ్యాయం, ధ్యానం, సమాధి వీటి వలన కలిగే ఆనందాన్ని నీకు సమర్పించటమే జీవన్ముక్తి. నీ ఆజ్యంతములు ఎరుగని నిన్ను ఎలా పూజించను? హంస, వరాహాలుగా మారిన బ్రహ్మ విష్ణువులకే ఇది సాధ్యం కాలేదు. నాకు మాత్రం ఏం తెలుస్తుంది? మహోన్నతమైన యోగవిద్య తెలియక ఇంకా రూప ధ్యానంలోనే ఉన్నాను. జ్ఞానప్రదము, ముక్తిదాయకమైన నీ పాదారవింద ధ్యానం నాకు లభించింది. నీ చరితను చదవాలి. అదే అమృతపానం. నా కవితా కన్య సరళ పదాలతో కూడి అలంకార శోభితమై ధీమంతుల ప్రశంసలను అందుకున్నది. ఆమె ఒక ఆనంద రేఖ, వినయ జ్యోత. ఆమెను స్వీకరించి నన్ను అనుగ్రహించు అని శ్రీ శంకరులు సదాశివుడ్ని స్తుతిస్తున్నారు. అంటే భగవంతుడ్ని మనం ఎలా కీర్తించాలో, కీర్తించటానికి ఎటువంటి భాష వాడాలో, భావంతో నృతించాలో మనకి బోధిస్తున్నారు, సూచిస్తున్నారు శంకరులు. ఉపమా, శ్లేష, ఉత్ప్రేక్ష, రూపక, అర్ధాంతరన్యాస, వక్రోక్తి వంటి అలంకారాలు శివానందలహరిని అలంకరించిన కోకొల్లల అలలు. శివానందలహరి స్తోత్ర కావ్యం ఆజ్యంతం రమణీయం. రసవంతమైన పదప్రయోగం, ప్రసాద మాధుర్య గుణాలు, అర్ధ గాంభీర్యము పరిపూర్ణంగా నింపుకున్న కవితా రసమాలయం శివానందలహరి. సదామోహాదవ్యాం ధీయంత్రేణ కారుణ్యామృత వర్షిణం అమితముదమమృతం భక్తిర్మహేశ జడతాపశుతా జలధిమధన దక్షకాః సారసనా వంటివి మచ్చుకు కొన్ని దివ్య ప్రయోగాలు. లోకమును వీడి రసము లేదు. ఆచార్య స్వామివారు సాధారణ భక్తుని వలె అనితర సాధ్యమైన భక్తి పారమ్యంతో శివస్తుతిని కవితా స్వరూపంగా రచించి శివ పరమైన రూప భావ తత్వార్ధాలను రమణీయ భావనా స్థితులు ఆవిష్కరించారు. అగ్ని స్వరూపమైన వాక్కుకున్న వైభవాన్ని, విలాసాన్ని స్తుతిగీతగా వ్రాసి లోకోపకారం చేశారు శంకరులు. మళ్ళీ అదే ప్రశ్న. శివానందలహరిని చదవటం ఎందుకు? అందమైన భాష, దివ్య భావనలు, భక్తి పారమ్యం, శివగుణ కీర్తనం ఏకకాలంలో అనుభవంలోకి వస్తాయి. ధారణా సిద్ధి కలుగుతుంది. చదువుకున్నంత సేపు అది అపాత మధురం. ఆగి ఆగి చదువుకుంటుంటే అది ఆలోచనా అమృతం. సంస్కారము, సంస్కృతి కలబోసుకున్న దివ్యాకృతి శివానందలహరి. సత్యసాయి భగవానుని చరిత్ర.సత్యసాయి భగవానుని అనంత వాహిని సృష్టి వీటన్నింటిని గనక స్వాధ్యాయం చేయగలిగితే అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకొని చెప్పగలిగిన వాడిని ఆశ్రయించగలిగినట్లయితే సత్యసాయి భగవానుడు రచించిన వాహినులన్నీ శివానందలహరి లోని గంగా ప్రవాహము సౌందర్యలహరి లో నుంచి మంత్ర యంత్ర తంత్రాత్మకమైన భావనాసిద్ధి వైదిక సాంప్రదాయము వేదముల యందున్న అంతరార్థము ఉపనిషద్బోధ ఇతిహాస చాతుర్యము పురాణ వైదుష్యము కావ్యాలంకారము సర్వము ఒక్కటిగా గోచరించే ఒక అద్భుతమైనటువంటి వాఙ్మయ స్వరూపం నిజానికి సత్యసాయి భగవానుని వాఙ్మయాన్ని మనం చదవాలి చదివితే స్వామి మనకు అర్థమయ్యే రీతిలో కానీ అతి సుందరమైనటువంటి భాషలో అనేక విషయాలను ఎలా బోధించారో మనకు చక్కగా అర్థమవుతుంది అయితే మూలమైనటువంటి అమిత భావ సంపదని ఆధునిక మానవుడు అందుకోవాలి ఎన్నెన్ని సంపదలున్నా ఎంత కీర్తి ఉన్నా ఎంత సుఖసంతోషాలకు లోనైనా మానసిక ప్రశాంతి ఆనంద తారక స్థితి రెండు అందుకోవాలంటే శంకరులను చదవాలి సత్యసాయి భగవానుని వాఙ్మయాన్ని చాలా స్పష్టంగా శ్రద్ధగా భక్తితో అనుభవం పండించుకున్నటువంటి గుండెతో చదువుకోగలిగినట్లయితే శివానందలహరి సత్యసాయి వాహిని రెండు భిన్నం కావని రెండు పరమార్థమైనటువంటి కవితా స్వరూపాలని మనకి గోచరమవుతుంది ఎట్లాగైతే సరస్వతీదేవి అనుగ్రహంతో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించగలడని మానవుడికి శంకరులు బోధ చేశారో అట్లాగే సత్యసాయి భగవానుని ఒక్కొక్క వాక్కు అదొక్క వాక్విభూతి అది వాగ్విలాసం ఎందుకని అంటే స్వామే వాగీశ్వరి గనుక స్వామి సత్యసాయి భగవానుడే సరస్వతీ స్వరూపం గనుక సరస్వతికి మూలమైన మహాచైతన్యమే సత్యసాయి భగవానుడు గనుక సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ స్వామి అనుగ్రహ వశం చేత సర్వ సృష్టి స్వామి వాఙ్మయంతో పునీతమౌగాక స్వామి వాఙ్మయంతో వివేకము విచక్షణ విస్తృతమౌ గాక సర్వసిద్ధి కలుగు గాక జ్ఞానసిద్ధి వైరాగ్య బుద్ధి నిష్కల్మషమైనటువంటి మనస్సు పండిన హృదయము ఇవన్నీ ఏర్పడి ఎత్తిన మానవ జన్మ పూర్ణము పవిత్రము ధన్యము ముక్తి మంతము అవు గాక అని సత్యసాయి భగవానుడిని మరొక్కసారి వేడుకుంటూ సాయిరాం.
SSSMC · audio

Advaitamrutha Dhara - 07

Home

Advaitamrutha Dhara - 07

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 20:55

More in this series

Advaitamrutha Dhara

9 episodes · 4 hr 4 min

  1. 22 min 1

    Advaitamrutha Dhara - 01

  2. 36 min 2

    Advaitamrutha Dhara - 02

  3. 31 min 3

    Advaitamrutha Dhara - 03

  4. 33 min 4

    Advaitamrutha Dhara - 04

  5. 34 min 5

    Advaitamrutha Dhara - 05

  6. 27 min 6

    Advaitamrutha Dhara - 06

  7. 20 min 7

    Advaitamrutha Dhara - 07

    Now playing
  8. 16 min 8

    Advaitamrutha Dhara - 08

  9. 21 min 9

    Advaitamrutha Dhara - 09