No transcript for this section.
[స్టార్టింగ్ థీమ్ మ్యూజిక్] ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా శ్రీ సత్యసాయి సూక్తములు అనగా స్వామివారు స్వయంగా రచించినటువంటి కొన్ని పద్యము పైన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగాన్ని మీరు వింటారు. తదుపరి అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను శ్రీ ఎం.ఎల్.ఎన్. స్వామి గారు మనకు వినిపిస్తారు. ఈ కార్యక్రమం రేడియో సాయి వారి మాసపత్రిక అయినటువంటి Heart to Heart ఆధారంగా రూపొందించడమైనది. తదుపరి భగవాన్ చదువుకుంటున్న రోజుల్లో స్వామి వారి క్లాస్ టీచర్ గా ఉన్నటువంటి శ్రీ మంచిరాజు తమ్మిరాజు గారి అనుభవాలను జ్ఞాపకాల జాజిమాల శీర్షిక ద్వారా మీరు వింటారు. ఇప్పుడు శ్రీ సత్యసాయి సూక్తములు అనగా స్వామివారు స్వయంగా రచించినటువంటి కొన్ని పద్యముల పైన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగాన్ని మీరు వింటారు. [సితర sitar music playing] అవతరించే నేడు ఆంధ్ర దేశము నందు జగతినుద్ధరింప సత్యసాయి ఆ తడు పన్యసింప యావత్ ప్రపంచాన దేవ భాషయే తెలుగు నేడు. సత్యసాయి భగవానుడి అవతారం ఆంధ్రదేశంలో జరగటం సాక్షాత్తు స్వామి వచ్చే వరకు దేవతలు మాట్లాడే భాష సంస్కృతంగా చెప్పబడింది అది అమర భాష. అయితే స్వామి ఈ ఆంధ్రదేశంలో అవతారం తాల్చిన కారణంగా స్వామి యొక్క భాష తెలుగు కావటం అంతేకాదు స్వామి ఆ తెలుగుని మాట్లాడినందు వలన తెలుగు దేవభాష అయింది. అంటే దైవం ఎంచుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి సందర్భం ఇది. స్వామి తరచుగా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ముందుగా ఒకటి రెండు పద్యాలు చదువుతారు. ఈ రెండు పద్యాలు స్వామి ఉపన్యాసానికి కీలకమైనటువంటివి. ఆ తర్వాత స్వామి ఉపన్యాసం అంతా దీని మీద ఆధారపడి దీన్ని విస్తృత పరుస్తూ వెళ్తుంటుంది. అయితే మామూలుగా కవులకి పండితులకి ఉండేటువంటి భాషాభేషజం లేకుండా మామూలు చక్కని అచ్చ తెలుగులో స్వామి యొక్క పద్యాలు సాగుతాయి. చాలా తేలికైన పదాలుగా మనకు అనిపిస్తాయి కానీ దాని వెనుక ఉన్నటువంటి మర్మాన్ని తత్వాన్ని గనక గ్రహించటం ప్రారంభిస్తే మహాద్భుతమైనటువంటి ఆత్మ విచార మార్గం. అంతేకాదు భక్తుడు ఎలా ఉండాలి, సాధకుడు ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, దైవం ఎలా ఉంటాడు, ఈ దేవుడు జీవుడు కలిసి ఎలా ఈ ప్రపంచంలో ఉండాలి, వీరిద్దరూ ఉన్న ఈ ప్రపంచం ఎట్లా ఉంటుంది వీటన్నింటినీ కూడా ఈ ఎనభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వామి అవతారంలో ప్రధానమైనటువంటి సన్నివేశంగా మనం చెప్పుకోవాలి. కేవలం పద్యాలు రాగయుక్తంగా పాడుకోవటమే కాకుండా ఆ మాటల వెనుక ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించగలిగిన స్వామి పద్యాలను చక్కగా కంఠస్తం చేసి పదే పదే మరణం చేసుకున్న మనకి పరమాత్మ యొక్క తత్వం, జీవుడి యొక్క తత్వం, జగత్తు యొక్క తత్వం పరిపూర్ణంగా బోధపడుతుంది గనుక దీనిని సత్యసాయి సూక్తంగా భావిస్తూ, సూక్తం అంటే వేద ప్రామాణికమైనటువంటి భావమే సూక్తం. సూక్తి అంటే లోకానికి కావలసింది. స్వామి సూక్తిని సూక్తంలో నుంచి తీసుకుని మనకు అందిస్తున్నారు గనుక సత్యసాయి సూక్తం ఎలా ఉంటుందో స్వామి మాటలలోనే, స్వామి పదాలలోనే స్వామి ఇంతవరకు చదివినటువంటి అనేకమైనటువంటి పద్యాలలో నుంచే మనం గ్రహించి ఆ స్వామి యొక్క రూప భావ తత్వార్దాలలోకి చక్కగా నెమ్మదిగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దాం. చూడండి మొదటిగా ఓ పద్యం. అంతరాత్మకన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఒక వేదసారం ఇది. ఒక ఉపనిషత్ సారం. స్వామి ఏం చేస్తున్నారో తెలుసునా? ఏం బోధిస్తున్నారో తెలుసునా? అంతరాత్మను మించినటువంటి గురువు లేడయ్యా బోధకుడు లేడు. నీ అంతరాత్మే నీకు గురువుగా లోపల బోధకుడిగా ఉన్నాడు. అంతేకాదు ఈ అంతరాత్మని నీవు జాగ్రదవస్థలో, నిద్రావస్థలో, సుషుప్తిలో అన్ని అవస్థలలో గనక వినగలిగిన శక్తి నీకు ఉన్నట్లయితే అరయ కాలమే మీకు పరమ గురువు. కాలమే అన్ని నేర్పుతుంది మీకు. ప్రత్యేకంగా బెత్తం పట్టుకొని క్లాస్ రూమ్ లో బోర్డు మీద రాసినట్లుగా కాకుండా కాలం నీకు అనేక అనుభవాల ద్వారా అనేక సన్నివేశాల ద్వారా బోధిస్తుంది. అయితే మరి ప్రత్యక్షంగా ఉన్న ఈ లోకం ఏమిటంటే గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే. ఏం పుస్తకాలు చదవాలి, చదివితే లోకాన్ని చదువు. ఈ లోకంలోనే పుస్తకాలలో నిక్షిప్తమైన పరమ రహస్యాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అటువంటి ప్రపంచంతో నువ్వు కూడి ఉన్నావు. అయితే పరమమిత్రుడు, పరమగురువు, అధ్యాపకుడు ఉన్నారు గాని స్వామి మాకు స్నేహితుడు ఎవడు అని గనక మీరు చింతించినట్లయితే స్నేహితుండెవ్వడు ఈశ్వరుండే. నీకు నిజమైన స్నేహితుడు మైత్రి నెరిపేవాడు ఎవడు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుని మించిన స్నేహితుడు నీకు లేడు సుమా. ప్రపంచాన్ని మించిన గ్రంథరాజం మరొకటి లేదు సుమా. నీ అంతర్వాణిని మించిన పరమగురువు లేడు సుమా.కాలాన్ని మించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి బోధకుడు లేడు సుమా అని ఎంత అందంగా దివ్యంగా బోధించారో చూడండి. ఈ స్వామి ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవన విధానాన్ని అన్ని ఉన్న పరమాత్మ అనుగ్రహం మనకు ఎట్లా అక్కరకు వస్తుందో మరొక పద్య సూక్తంలో మనకు చెప్తున్నారు విందాం. అనుకూలవతియైన అర్ధాంగి ఉన్నను తనను పూజించెడి తనయుడున్న తగిన సేవలు చేయు దాసదాసీలున్న గుణవంతురాలైన కోడలున్న అమిత ప్రేమగ జూచు అక్క చెల్లెండ్రున్న తన ఆజ్ఞ పాలించు తనయులున్న మైత్రి నిత్యము గోరు మిత్ర బృందం ఉన్న తగు అధికారము ఉద్యోగమున్న విశ్వవ్యాప్తిని గాంచు కవిత్వమున్న నవనిధులు మించిన ధనములున్న దైవ ప్రేమయే లేకున్న ధరణి యందు సర్వమును వ్యర్థమై పోవు చనడు వేళ. జీవించి ఉన్నంత కాలం అనుకూలవతి అయిన భార్య పూజించేటువంటి కొడుకు సేవలు చేయటానికి దాసదాసీలు గుణవంతురాలైన ఓ కోడలు అమితమైన ప్రేమను చూపించేటువంటి అక్క చెల్లెళ్ళు చెప్పిన మాటని వేదంగా భావించి ఆచరించే కొడుకులు నిత్యము మైత్రి స్నేహం ఇచ్చేటువంటి మిత్ర బృందాలు అధికారము ఉద్యోగం కవిత్వం పాండిత్యం నవనిధులను మించినటువంటి ధనం ఇవన్నీ ఉన్నా దైవ ప్రేమ గనక లేకపోయినట్లయితే ఈ అన్నీ కూడా సున్నా అయిపోతాయి. ఎప్పుడు చనడు వేళ మనం ప్రాణం వదిలిపెట్టినటువంటి వేళ. ఇవన్నీ ప్రపంచంలో ఉండగా అక్కరకు వస్తాయి గాని ఈ దేహాన్ని పరిత్యాగం చేసి మనం కూడా ఈ అవనీ సంచారాన్ని పూర్ణం చేసుకుని శరీరాన్ని వదిలి పెడుతున్నటువంటి వేళ ఏమిటయ్యా నీకు కావలసింది అక్కరకు వచ్చేది అంటే దైవ ప్రేమయే. అంటే అనిత్యమైనటువంటి వస్తువులలో నుంచి నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక దివ్య వైభోగాన్ని స్వామి ఈ జగత్తుకు పరిచయం చేస్తున్నారు. దైవ ప్రేమ గనక నీకు ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే అన్నీ ఉండి గనక దైవ ప్రేమ ఒక్కటి లేకపోయినట్లయితే వాటి వలన ఏం ప్రయోజనం లేదు. నరుడా జాగ్రత్త! మానవుడా జాగ్రత్త! సాధకుడా జాగ్రత్త! అని స్వామి హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ స్వామి తాను ఎందుకు వచ్చారో ఎట్లా వచ్చారో ఎప్పుడెప్పుడు వచ్చారో ఈ అవతారానికి ముందు అనేక అవతారాలను స్వామి స్వయంగా స్పృశించారు. వాటిని స్వామి మాటల్లో స్వామి చెప్పిన ఒక పద్యంలో మనం గనక అర్థం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడు మానవ దేహాన్నే ధరించి వస్తాడు అని స్పష్టంగా మనకి బోధపడుతుంది. ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు కరినిగా జడి తరి కమలనయనుడు ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు ధ్రువ కుమారుని సాక వైకుంఠవాసి ఏ గుణంబు గణించి ఏతెంచెనో నాడు పేద కృచేలుని బ్రోవ వేద చరితుడు ఆ గుణంబు గణించి అమరవంజుడు ఆర్తజనులను పాలింప అవతరించే అనాధ నాథ శ్రీనాథ లోకనాథ సచ్చిదానందమూర్తి పుటపర్తి సత్య సాయి. ఎంత అందంగా తానేమిటో చెప్పారు. ఏదో ప్రహ్లాదుడిలో ఉన్న ఒక్క గుణాన్ని గణించి ఆ రోజున లక్ష్మీ నరసింహుడినై వచ్చారు. అట్లాగే గజేంద్రుని రక్షించటానికి ఒక గుణాన్ని గణించి నేను శ్రీ మహావిష్ణువునై ఈ జగత్తులోకి వచ్చా. ధ్రువ కుమారుడిని ఒకే ఒక్క గుణాన్ని గుర్తించి సాకటానికి వైకుంఠవాసిగా నేను వచ్చాను. అంతే కాదు పేద కుచేలుడిని బ్రోవటానికి శ్రీకృష్ణ చైతన్యంగా వచ్చాను. అటువంటి గుణాన్నే అనేక యుగాలు దాటిన ఏదో ఒక్క గుణాన్ని మాత్రం నేను గుర్తించి ఈవేళ అమరవంజుడు ముప్పై మూడు వేల కోట్ల దేవతలని ఆనంద పరుస్తూ అనుగ్రహ వరదానం చేస్తున్నటువంటి నేను ఆర్తజనులను పాలించి రక్షించటానికి ఇదిగో ఎట్లా వచ్చానో తెలుసా అనాధ నాధుడినై శ్రీనాధుడినై లోకనాధుడినై సచ్చిదానంద గురుమూర్తినై పుటపర్తి సత్యసాయినై వచ్చాను. ఎంత అద్భుతమైన ప్రకటన ఇంకా సాయి దేవుడా అన్న ప్రశ్న ఎక్కడ నేను దేవుడ్నే అని ప్రకటించి ఎట్లా ఎట్లా వచ్చానో స్వామి స్పష్టంగా చెప్తున్నారు. దేవుడ్నే అని ప్రకటించటం సాయికి కొత్త కాదు కృష్ణావతారంలో కూడా అసలు నేను దేవుడ్నే అని చెప్పాడు. ఆ తత్వమే మళ్ళీ ఈ రోజున సాయి తత్వంగా స్వామి తన మాటలలోనే తన నిజ తత్వాన్ని ప్రకటన చేశారు. ఈ ఆనందాన్ని మనం అనుభవించే దిశగా మన అధ్యాత్మ సాధన కొనసాగిద్దాం. ఇదంతా బానే ఉంది స్వామి దేవుడు ఈ ప్రపంచం ఒక గ్రంథ రాజ్యం అని చెప్పారు కదా ఇంకో పద్యంలో భక్తుడు ఎలా ఉండాలో స్వామి చెప్తున్నారు. అంటే స్వామి ఆవరణంలోకి స్వామి భావనావరణంలోకి ఒక జీవుడు ఒక సాధకుడు ప్రవేశించిన తర్వాత స్వామి పరదైవమే అన్న ఎరుక కలిగిన తర్వాత వీడు చేయవలసినటువంటి సాధకుడు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని స్వామి స్పష్టంగా బోధిస్తున్నారు."కులమత ద్వేషాలు కులదోయుడటంచు చేయెత్తి బోధనల్ చేయవలయు. దీనుల సేవయే దివ్యమా-ర్గమటంచు పలుమార్లు గట్టిగా పలుకవలయు. నామచింతన నరున్ నామి సన్నిధి చేర్చి అమృతతత్త్వమందించు అనగవలయు. భక్తి విశ్వాసముల్ బగుగా కలిగిన వారలు మనవారలని వచించు జ్ఞానబోధలు నరులకు చేయువారు. ఇష్టులౌదురు స్పష్టము ఎంతయేని భేదభావంబు విడనాడి ప్రీతితోడ కలసియున్నచో సాయికి కలుగు ప్రేమ" భక్తులు ఏం చేయాలట అంటే కులమతాతీతమైనటువంటి ఒక దివ్య భవ్య సామ్రాజ్యాన్ని ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని సృష్టించే బోధన చేయమంటున్నారు. దీనుల సేవను మించిన దివ్య మార్గం లేదు అంటూ దీనజనోద్ధరణని స్వామి పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. పరమేశ్వరుడి యొక్క నామాన్ని గనుక స్మరిస్తూ ఉన్నట్లయితే నామి అంటే పరమేశ్వరుడి దగ్గరకు చేరుస్తుంది అని చెప్పాలి. అది అమృతత్వాన్ని సిద్ధింపజేస్తుంది అంటే మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తుంది. భక్తి విశ్వాసాలు పరమేశ్వరుని యందు ఎవరికి కలిగి ఉన్నారో వారు మనవారలు అని యదార్థత చెప్పమంటున్నారు స్వామి. అటువంటి వారలట స్వామికి చాలా ఇష్టమట. స్వామికి మనం ఇష్టులమని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇవన్నీ చేస్తేనే ఇష్టమని. అంతేకాదు భేదభావం లేకుండా పెద్దవారు, గొప్పవారు, చిన్నవారు, జ్ఞానులు, అజ్ఞానులు, పామరులు, పండితులు అన్న భేదభావం లేకుండా మనమందరం ఒక్కటే అనేటువంటి స్వామి బోధించే యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. ఆ మూడు గనుక ఎక్కడ కలిసి ఉన్నాయో వారందరియందు స్వామికి ప్రేమ కలుగుతుంది. అంటే అట్లా అనువర్తించమని స్వామి మనకు బోధ చేస్తున్నారు. వేదాంత భూమికలో సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఒక భావన. అంటే ఈ కనిపిస్తున్నదంతా బ్రహ్మమే తప్ప అన్యం కాదు. చెట్టు, పుట్ట, గుట్ట, మిట్ట, నది, కొండా, కోన, వాగు, వంక, నేల, నింగి, నిప్పు అన్నీ కూడా. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమేనా అని గనుక మనం అనుకున్నట్లయితే అసలు ఈ బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి? బ్రహ్మ పదార్థంలో నుంచి బ్రహ్మంలోకి వెళ్ళాలి. పదార్థంలో నుంచి పరమార్థం, పరమార్థంలో నుంచి యదార్థం. ఇది మహా-- ఒక అందమైన ప్రస్థానం, ఒక ఆధ్యాత్మిక ప్రస్థానం. దానినే స్వామి సర్వం ఖల్విదం బ్రహ్మ అన్న దాంట్లో చాలా అందమైనటువంటి ఒక పద్యం, సూక్తం చెప్పారు. ఏమిటది అంటే కనిపిస్తున్న ప్రతిదీ బ్రహ్మమే అని అనుకో. ఏమిటి కనిపిస్తున్నది నీకు? చూడు. "చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ స్వర్గమన్నను బ్రహ్మ వైకుంఠమది బ్రహ్మ తల్లియన్నను బ్రహ్మ మరియు తండ్రి బ్రహ్మ భాగ్యమన్నను బ్రహ్మ వాలభ్యమది బ్రహ్మ జీవరాసులు బ్రహ్మ జీవి బ్రహ్మ పుట్టించుటది బ్రహ్మ పోషించుటది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలుంబు బ్రహ్మ ప్రకృతంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును బ్రహ్మ ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సత్యసాయి బ్రహ్మ" స్వామికి మాత్రమే సాధ్యమైనటువంటి ప్రకటన ఇది. ఎందుకంటే బోధించేవాడు మీరంతా బ్రహ్మ పదార్థం అంటాడు గానీ తానేమిటో చెప్పడు. అందమైన ఈ తెలుగు పద్యంలో చుక్కలు అంటే నక్షత్రాలు, చంద్రుడు, తల్లి, తండ్రి, ప్రపంచం, మనసు ఊహిస్తున్న కైలాసం, వైకుంఠం అన్నీ కూడా బ్రహ్మమయమై ఉన్నాయి. కాలమే బ్రహ్మం, కర్మలన్నీ బ్రహ్మం, ప్రకృతి బ్రహ్మ, దీనికి మూలమైన చిచ్ఛక్తి బ్రహ్మ. అంతేకాదు ఈ మాటలన్నీ వింటున్న ఈ సభ బ్రహ్మ. అంటే స్వామి ఎలా అవుతారు? అన్నీ చెప్తూ అసలు సత్యమును తెలుపుతున్న ఈ సాయి కూడా బ్రహ్మంలో భాగమేనన్నారు. ఈ అందం అది పరమ రమణీయంగా ఉంటుంది. ఎక్కడో లోకలోకాంతర ప్రాణాలలో శ్రీదళాలు వికసిస్తాయి. అది స్వామి యొక్క దివ్య బోధ. చూడండి కనిపిస్తున్న దాన్ని అంతటా బ్రహ్మాన్ని చూడగలిగితే దానిని మించిన పూర్ణద్వైత స్థితి ఉన్నదా? పరిపూర్ణమైనటువంటి అధ్యాత్మ యోగంలోకి స్వామి ఎంత అందంగా నడిపించారు. చుక్క వేరు చంద్రుడు వేరు అనలేదు, అంతా బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ. అయితే ఇదే స్వామి నేను ఎప్పుడో ఒకసారి స్వామిని చూశాను, నాకో ఇంటర్వ్యూ ఇచ్చారు, ప్రపంచాన్ని నేను కొల్లగొట్టేశాను అని గనుక నువ్వు ఆనందపడుతుంటే ఈ సాయి అంత తేలికగా అర్థమయ్యే సాయి కాదని తన గురించి తాను స్వామి చెప్తున్నారు. అంటే పరమాత్మ అనేకమైన డైనమిక్స్ ని, అనేక డైమెన్షన్స్ ని మనకు పరిచయం చేస్తున్నారు. స్వామిని పరీక్ష చేయడం మానేసి అనుభవించటం గనుక మొదలు పెడితే మన అంతరంగం శుద్ధి చెందుతుంది. దానికే ఏ రకంగా బోధ చేస్తున్నారో చూడండి. ఇది బహుశా అంటున్నా వింటున్నా మనందరికీ ఎప్పుడో ఒకరోజున కలిగిన అనుభవమే. "చింత జేరెనటంచు సంతసించెదరన్న వెంటనే ఎడబాటు చింతకూర్చు. ఏడిపించుటే సాయి వేడుకందురా కడుపుబ్బన వెల్చు నడువ నడుమా. పొగడుచున్నాడని పొంగిపోయెదరేము తప్పుకు అప్పుడే ఎగతాళి చేయు. అభయమిచ్చెను గాన హాయిగా ఉండెదరన్న పడు బాధలకు అంతుపట్టకుండు"వెనుకకేగ నీడు చన నీడు ముందుకు మనసు మరులు గొల్పి మదన పెట్టు ఇట్టి చిన్ని సాయి చిన్మయ మూర్తిని ఎటులెరుగ గలరు ఇలను మీరు. స్వామి మాకు ఎప్పుడో అర్థం అయిపోయారండి, ఎప్పుడో మాకు ఆయన దేవుడని తెలిసిపోయింది అన్నవాళ్ళకి ఇది హెచ్చరిక. ఇది తొలి హెచ్చరిక, సదా హెచ్చరిక. పొగిడారు స్వామి వేళ పొద్దున్నే అనుకుందామా, సాయంకాలం కల్లా ఎగతాళి చేస్తారు. స్వామి ఇస్ వెరీ క్లోస్ టు మీ, ఐ యామ్ వెరీ క్లోస్ టు భగవాన్ అని గనక మనం అనుకున్నట్లయితే, అంటే స్వామికి నేను ఎంతో సన్నిహితుడిని అని గనక అనుకుంటే ఎంత దూరమో మనకు వెంటనే తెలియజెప్తారు. అభయమిచ్చేశారు ఇంకేం భయం లేదు హాయిగా ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు అనుకున్నట్లయితే పడుతున్న బాధ అంతుపట్టకుండా ఉంటుంది. స్వామి, త్వమేవ శరణం మమ అన్యదా శరణం నాస్తి అనే భావనలోకి స్వామి తీసుకొని వెళతారు. ఎట్లా తీసుకెళతారు అంటే ముందుకు పోనివ్వరు వెనక్కి రానివ్వరు. ఆ మదన రాచిరంపాన అంటారు చూడండి, అలా పెట్టే ఈ స్వామి ఎలా మీకు అర్థమవుతాడు? ఇట్టి చిన్ని సాయి చిన్మయ మూర్తిని ఎట్టులెరుగ గలరు ఇలను మీరు. మీరు ఎరుగలేరు. అందుకే స్వామి ఎప్పుడో చెప్పారు, నన్ను పరీక్షించటం మానేసేయండి first. ఈయన దేవుడా కాదా అని మీమాంస అదిరి పెట్టండి. నా ఆవరణంలోకి రండి, అనుభవాన్ని పొందండి, ఆనందాన్ని మూటలుగట్టుకొని వెళ్ళిపోండి అన్నారు స్వామి అనేక ఉపన్యాసాలలో. కానీ జీవుడిగా మన మూటలు మన దగ్గర ఉంచుకోవటమే మనకిష్టం. పరమేశ్వరుడు, జీవుడు, జగత్తు ఏకకాలంలో ఒకేచోట ఉంటాయి. అది ఏ యుగం కానివ్వండి. జగత్తు ఒక భూమిక, పరమేశ్వరుడు భావనా భూమిక, జీవుడు సాధనా భూమిక. ఈ మూడు కలిస్తేనే పూర్ణం. జీవుడు లేక జగత్తు, జగదీశ్వరుడు లేడు. ఆయన ఆడుకోవాలంటే ఆయనకు ఒక భూమిక కావాలి, అది ప్రపంచం. ప్రపంచం లేకపోతే ప్రపంచం ద్వారా, ప్రపంచం అనే అద్దం ద్వారా మాత్రమే పరమేశ్వరుని చూడగలం గనుక జీవుడికి ప్రపంచం కావాలి. ప్రపంచానికి జీవుడు కావాలి, దేవుడు కావాలి. ఎందుకంటే, రాలుతున్న ప్రతి ఆకు మళ్ళీ చిగురించాలన్నా, మొగ్గ వికసించాలన్నా, కాయ కాయాలన్నా, పండు పండాలన్నా పరమేశ్వరుడి యొక్క దివ్య కృప కావాలి. అలాగే ఈ దివ్యమైనటువంటి ఈ పరిణామ క్రమాన్ని అనుభవించటానికి జీవుడు కావాలి. ఈ ముగ్గురూ సమాన కర్తలు, ఇందులో అధికులు లేరు. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగిని, ఈశ్వరుడు, గురువు, ఆత్మ మూడు ఒకటే అన్నట్లుగా జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఒకటే. మూడు స్థితులు అవి. దానిని ఈ జీవుడికి సమన్వయం చేస్తూ స్వామి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడో స్వామి చెబుతున్నారు చూడండి. మనం అనుకుంటాం, ఎంత సంపాదించాం, చిన్న చినుకుగా ప్రారంభమయినాం మహా ప్రభంజనమైపోయినాం, రూపాయి బిళ్ళ పెట్టాం కోటీశ్వరులం అయిపోయాం అని ఇవ్వాళ అనుకుంటాం. స్వామి మూలంలోకి వెళ్ళమంటున్నారు. ఒక వేదాంత భూమికలో వైరాగ్య భూమికను మనకి బోధ చేస్తున్నారు. జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలనేవి కానరావు, మంచి ముత్యపు సరుల్ మచ్చునకు లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారముల్ రంజిల్లగా లేవు, పచ్చల కెంపులు పొదగ లేదు, వజ్రాల హారముల్ వర్ధిల్లగా లేవు, గోమేధికంబులు తోడలేవు. కలదు కలదొక్క మాల మీ కంఠమందు, ఎన్ని చేసిన అవియన్ని ఎంచి ఎంచి మంచియైన చెడునైన తుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల, కర్మలన్నియు చేర్చిన కంఠమాల. ఇంత అందంగా ఏ అవతార పురుషుడైనా బోధ చేశాడా? తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాం? కంఠంలో మాలలు లేవు, దండలు లేవు, ముత్యాల సరాలు లేవు, బంగారు దండలు లేవు, గొలుసులు లేవు, రత్నాల హారాలు లేవు, పచ్చలు లేవు, గోమేధికాలు లేవు, వజ్రాలు లేవు. కానీ ఒక్క మాల మాత్రం ఉన్నదట. మంచి చేశామో చెడు చేశామో పరమేశ్వరుడు కేవలం మంచి ఇవ్వలేదు, కేవలం చెడు ఒక మాల చేయలేదు. నువ్వేం చేశావో ఆ కర్మల యొక్క పుణ్యాల మాల, పాపాల మాల రెండు ఎంచి ఎంచి ప్రారబ్ధాన్ని అనుభవించటానికి దానిని మాలగా చేసి గుదిగుచ్చి నీ మెడలో వేసి ఒక బరువు మాలగా పంపాడు. ఆ బరువు మాల ఏమిటో తెలుసునా? కర్మలన్నియు చేర్చిన కంఠమాల. కనబడుతున్నదా? అయ్యో నేను సత్యసాయి భగవానుడికి చాలా ప్రీతిపాత్రమైన భక్తుడినే, నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి అంటే, నీ కర్మమాల నీది, నీ పుణ్యాలు నీవి, నీ సాధన నీది, నీ ప్రాప్తి నీది, నీ అనుభవం నీది, దాటవలసిన స్థితి నీది. అందుకే యోగీశ్వర కృష్ణుడైనటువంటి, పరమేశ్వరుడైన కృష్ణుడు సత్యసాయి భగవానుడి బోధ ఎంత సామీప్యంగా ఉన్నదో చూడండి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. ఇదిగో నీకీ జీవమూ, ఈ జగత్తు, ఈ జన్మ ఇచ్చాను. ఎలా వాడుకుంటావో చూసుకో. నీ మెడలోనే ఒక కంఠమాల ఉన్నది. పుణ్యాలున్నాయి, పాపాలున్నాయి. పుణ్యాల వలన ఆనందాన్ని అనుభవించు, పాపాలను పోగొట్టుకునేటువంటి సాధన చెయ్. దానికి నేను శరణు, నేనే నీకు అక్కరకు వస్తానంటున్నారు భగవాన్. సాధారణంగా స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళిన ప్రతి వాళ్ళు తమ ఇంటికి వెళ్ళి తమ మిత్ర బృందానికి ఒక మాట చెప్తారు. మేము మొట్టమొదటిసారిగా భగవంతుణ్ణి మానవ దేహంతో చూశాం ఒకటి.అసలు స్వామి మాతో ఏం మాట్లాడలేదు కానీ ఆ దర్శనం ఇస్తూనే అనేకమైనటువంటి ఆనందాలు పొందాం. అంతేకాదు మనం జీవిస్తున్న ఈ జీవన విధానం సరిగా లేదు దీనిని మార్చుకోవాలి అని అనిపిస్తుంది అని భక్తుడికి అనిపిస్తే మార్గ నిర్దేశనం చేస్తూ గురు స్వరూపమైన సచ్చిదానంద గురుమూర్తి అయిన స్వామి ఏం చెప్తున్నారో వినండి. "ధనము రాసిగ పోసినను కానగరాని ఆనందమిచ్చట మీరు అందుకొనుడి. తీర్థయాత్రలు ఎన్నో తిరిగి నన్ కనరాని ఆనందమిందు మీరు అందుకొనుడి. విద్యలల్లియు వలవేసినన్ కనరాని ఆనందమును మీరలు అందుకొనుడి. ప్రాణముల్ బిగబట్టినను కానగ రాని ఆనంద మిందు మీరు అందుకొనుడి. కాసు ఖర్చు లేదు కాయ కష్టము లేదు లేదు లేదు లేదు చదువు సాధనాది బాధ మన సొ కింత ఇచ్చి మరి సాయి కడ నున్న అందరాని ఫలము పొందుడయ్యా" ఎంత అందం అండి ఈ పద్యం! మీరు ఏం చేయొద్దు. అనేకమైనటువంటి శాస్త్రాలు చదివాం. మా దగ్గర అపారమైనటువంటి సంపద ఉంది. సంపదతో ఆనందం కొనుక్కుంటాం అంటే మీ వల్ల కాదు. తీర్థయాత్రలు ఎన్నో చేశాను ఆనందం కలిగిస్తున్నది అంటే దాని ఆనందం వేరు. అనేక విద్యలు అనేక శాస్త్రాలు పుక్కిట పట్టాను కానీ అదిచ్చే ఆనందం కంటే ఇక్కడ ఈ పుటపర్తికి మీరు రండి. డబ్బుతో పని లేదు తీర్థయాత్రలు చేసిన పుణ్య ఫలాలు అన్నీ ఆనందాలు అన్నీ ఇక్కడే లభిస్తాయి. ప్రాణాలు విగబట్టి ప్రాణాయామం చేసి యోగాభ్యాసం చేసి అనేకమైనటువంటి యోగ మార్గాలలో నీవు ప్రయాణం చేసిన కనరాని ఆనందాన్ని మీరు ఇక్కడ పొందండి. కానీ ఖర్చు లేదు, కాయ కష్టం లేదు, చదువు సాధన అనేటువంటి బాధలు లేవు. మరి ఏమున్నదయ్యా అంటే "మన సొ కింత ఇచ్చి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా" మీరు చేయవలసింది ఒకటే. మీకున్న మనసులో ఆ మనసులో కొంత భాగాన్నైనా అంతా అనటం లేదు మళ్ళీ స్వామి. కొంత స్వామికి ఇచ్చేసి సాయి కడనున్న స్వామి దగ్గర గనుక మీరు ఉన్నట్లయితే అంటే భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక మూడు స్థితులలో స్వామి దగ్గర ఉండాలి. కేవలం సాయి కడనున్న అంటే స్వామి దగ్గరే ఉండమని కాదు. స్వామి మూడు స్థితులలో ఎందుకంటే అవస్థాత్రయాతీతుడైనటువంటి స్వామి గనుక, దేశకాలాది అవచ్ఛన్నమైనటువంటి పరమాత్మ స్వరూపం గనుక, స్వామి లేని ప్రదేశం ఏది అని భావించుకొని స్వామి ఆవరణలో, భావనావరణలో గనుక మీరు ఉన్నట్లయితే కొంత మీ మనసును నాకు ఇచ్చినట్లయితే ధనము వలన, తీర్థయాత్రల వలన, అనేకమైనటువంటి కార్యకలాపాల వలన, అనేక విద్యల వలన, అనేకమైన యోగాభ్యాసనాల వలన కలగనటువంటి ఆనందం ఈ మాత్రం మీరు గనుక చేసుకున్నట్లయితే మీకు లభిస్తుంది. ఇదిగో ఈ మార్గం మీకు సూచిస్తున్నాను అంటున్నారు. అంటే మనం చేయవలసింది ఇవాళ ఒక్కటే స్వామికి మన మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఇచ్చేద్దాం. స్వామి యొక్క దివ్యమైనటువంటి భావనావరణలో ప్రవేశిద్దాం. స్వామే సంకల్పం చేస్తారు, స్వామే నడిపిస్తారు, స్వామే అంతా చూసుకుంటారు అన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని స్వామి యందు మనం ప్రకటన చేసి హాయిగా ఈ ప్రపంచంలో సంచారం చేద్దాం. వీటన్నింటితో పాటు మనకు గనుక గుర్తున్నట్లయితే స్వామి ఇంకో పద్యం చెప్పారు. చాలా చిన్న పద్యంగా అనిపిస్తుంది అది. కానీ దాన్ని చదువుతూ ఉన్నప్పుడు, మరణం చేసుకున్నప్పుడు ఒళ్ళు పులకలు తేలిపోయి నేను ఈ పంచభౌతిక దేహంలో ఇటువంటి జీవితాన్ని గడుపుతూ కూడా పరమాత్మని దర్శనం చేసుకున్నానా ఎంత అదృష్టవంతుడిని అనేటువంటి ఆనందం కలిగించారు స్వామి. చూడండి. "ఏను దైవంబు తద్భిన్నమేమి కాను ఆ అఖండ పరబ్రహ్మ మౌదు నేను వ్యధయు క్లేశము నన్ను స్పృశింప గలేవు సచ్చిదానందుడ సచ్చ సాయి విభుడా" ఇంతకంటే ప్రమాణం ఏం కావాలి. ఏను దైవంబు, ఏ దైవాన్ని రాముడిగా, కృష్ణుడుగా, శివుడిగా, భవుడిగా, మాధవుడిగా, కేశవుడిగా ఉపాసన చేస్తూ నువ్వు వెళుతున్నావో ఆ ఏను నేను ఆ దైవాన్ని. నాకంటే భిన్నమైనది లేదు. "తద్భిన్న మేమి కాను" తత్ అంటే దట్. తత్త్వమసి లో ఉన్నటువంటి ఆ తత్ ఏ బ్రహ్మమును గురించి మీరు విచారణ చేస్తున్నారో, ఏ బ్రహ్మ లోక సాధన, బ్రహ్మ పదాన్ని మీరు పొందాలని అనుకుంటున్నారో దానికంటే నేను భిన్నం మాత్రం కాదు. అది నేనే. నేనే దైవాన్ని. అంతే కాదు "ఆ అఖండ పరబ్రహ్మ మౌదు నేను" అఖండ పరబ్రహ్మం, మీరంతా పరబ్రహ్మం ఖండ ఖండాలుగా ఉందేమో, కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు ఉండదేమో అనుకుంటున్నారేమో, మీరున్నా లేకపోయినా నేనున్నా. ఇది అఖండమైనటువంటి చిద్ఘన రసమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించారు. అంతే కాదు వ్యధ గాని ప్రాపంచికమైనటువంటి క్లేశము గాని నన్ను స్పృశించలేవు. నా దగ్గరకు రావు, తాకవు అన్నారు. మనకి దుఃఖం తప్ప తెలియదు. స్వామికి ఆనందం తప్ప తెలియదు. స్వామికి తెలియని ఒకే ఒక్క విషయం ఏమన్నా ఉన్నదా ప్రపంచంలో అంటే దుఃఖం. మనకు తెలియని విషయం ఏదన్నా ఉన్నదా అంటే అది ఆనందం. కాబట్టి ఆనందం తెలియాలి అంటే ఎవరు ఆనంద స్వరూపుడో ఆయన దగ్గరికి వెళ్ళాలి. దుఃఖం పోవటం సుఖం కాదు. కష్టం తీరటం ఆనందం కాదు. ఆనందాన్ని పొందటమే ఆనందం. అది ఆనంద స్వరూపుడైనటువంటి స్వామి మాత్రమే అనుగ్రహించగలిగిన వరదానం గనుక స్వామి ఇంకో మాట అంటున్నారు.సచ్చిదానంద ఉడను సత్ చిత్ ఆనందము మూడు త్రిపుటీకరణం చెందిన అటువంటి నేను ఎలా ఉన్నాను అప్పుడు రాముడిని ఆ తర్వాత కృష్ణుడిని ఆ తర్వాత మరొకరిని కానీ ఇవాళ సత్య సాయి విభుడా! విభుడు అంటే ప్రపంచాన్ని భరించిన వాడు ప్రపంచాన్ని నడిపించేవాడు ప్రపంచమే తానైన వాడు ప్రపంచానికి మూలమైన సృష్టికర్త అయిన వాడు గనుక ఆ నేనే ఈరోజున సత్యసాయి రూపంలో మీ ముందున్నాను గ్రహించుడి అన్నారు స్వామి. స్వామిని అంటే అనేకమైన కారణాల వలన ఈతి బాధల నుండి ప్రాపంచికమైనటువంటి ఇబ్బందులు అననుకూలాల నుండి స్వామికి ఒక ఉత్తరం రాస్తాం ఒక ఫాక్స్ ఇస్తాం ప్రార్థన చేస్తాం భజనలు చేస్తాం ఏదో ఒకటి చేసి స్వామి నుంచి అనుగ్రహాన్ని ప్రేమని పొంది ఆ కష్ట నుంచి బయట పడదామనుకుంటాం ఇది సాధారణ స్థితి. కానీ స్వామిని తలచుకున్నప్పుడు స్వామి మాటలలోనే మనం ఆయన ఏం కోరాలో చెప్పారు. అసలు మీరు నన్ను ఏది అడగండి అని చెప్పిన వాడు ఎవడు? అడిగితే తీర్చిన వాళ్ళు ఉన్నారు గాని కోరిక కోరితే తీర్చినట్లయితే దాని పేరు వరం. మనం అసలు ఏదీ కోరలేదు కానీ అన్నీ తీరుస్తున్నాడు దాని పేరు కరుణ. వరం కావాలా కరుణ కావాలా అంటే సాయి నుంచి వరాలు పొందేకంటే సాయి కరుణ పొందితే చాలు. కరుణ ముందు వరం చాలా చిన్నమాట. ఎందుకంటే మనసు ఉన్నంతవరకు దేహం ఉన్నంతవరకు జీవితం ఉన్నంత వరకు కోరికలు ఆగవు. కోరికలు ఉన్నంత వరకు అవి తీర్చుకునే దాకా వ్యధ ఆగదు. మన కోరికలు తీర్చేదాకా స్వామి ఆగరు. కనుక కరుణ ఒక్కటి ఉన్నట్లయితే కోరికలే లేనటువంటి పరిపూర్ణ నిర్మల నిశ్చల నికేతన నిరంజనమైనటువంటి ఆ ఆనంద రేఖ మనకు కలుగుతుంది గనుక మనం స్వామిని ఇలా ప్రార్థించాలట ప్రతిరోజు పటం ముందు కూర్చొని. సిరులకేమి ప్రసన్న చిత్తుండవైనచో చాలు నాకు అదే పదివేలు తండ్రి సుఖ సంపదలకేమి సుముఖుండవైనచో చాలు నాకు అదే పదివేలు తండ్రి కోర్కెలకేమి నీ కటాక్షమున్నచో చాలు నాకు అదే పదివేలు తండ్రి విభవానికేమి నీ అభిమానమున్నచో చాలు నాకు అదే పదివేలు తండ్రి ఇచ్చినవి ఏవో ఉన్నవి ఇంతే చాలు అధికములకేమి అవి ఎప్పుడైనా కలుగు వీడు నా భక్తుడని ఎల్లవేళలా నీకు ఒక్కరీతి అనుగ్రహమున్న చాలు. ఇది అడగాలట. ఏమనంటే సిరులన్నీ వాటిని పక్కన పెడదాం స్వామి నా యందు ప్రసన్న చిత్తుడవై ఉండవయ్యా ఇవి ఒకటి చాలు సిరులు తర్వాత చూద్దాం సుఖ సంపదలు అంటావా వాటిని పక్కన పెడదాం ఎందుకంటే సుముఖుడువై గనుక ఉన్నట్లయితే నీ దివ్యమైనటువంటి ముఖారవిందాన్ని అన్నివేళలా దర్శించగలిగినటువంటి స్థితిని నాకు అనుగ్రహించి నా పట్ల సుముఖుడువై గనుక ఉన్నట్లయితే అదే పదివేలు తండ్రి అంతేకాదు కోర్కెలంటావా వాటిని ఉండని నీ కటాక్షం గనక ఒక్కటి ఉంటే చాలు తండ్రి అది నాకు పదివేలు. ఈ విభవం వైభవానికేమున్నదిలే నీ అభిమానం ఉంటే చాలు స్వామి అది నాకు పదివేలయ్యా ఇచ్చినవేవో ఇచ్చావ్ ఇచ్చినంతవరకు ఇప్పటికి చాలు ఇంకా ఏవో అది కావాలి ఇది కావాలి అంటే అవి ఎప్పుడైనా నీ అనుగ్రహం ఉంటే ఎలాగూ కలుగుతాయి. కానీ వీడు నా భక్తుడే అని అన్నివేళలా ఒక్క భావన గనక ఒకే రీతిలో ఉండాలి స్వామి నేను పుట్టిన దాదిగా తల్లి గర్భంలో గర్భస్థ పిండంగా ఉన్నప్పటి నుంచి ఒక జన్మ ఎత్తి జగత్తులో సంచారం చేసి నా ప్రాణం వదిలిపెట్టే వేళ వరకు అంటే ఈ జన్మ ఈ తనువు చాలించే వరకు నీ యొక్క అనుగ్రహము నా యందు ఒక్కరీతిలో ఉండాలి స్వామి. మార్పు లేకుండా ఉండాలి స్థిర సంపదలు వైభవాలు సుఖ సంపదలు కోరికలు ఇవన్నీ పక్కన పెట్టవయ్యా ఇచ్చినవేవో ఇచ్చావు ఇంతవరకు చాలు ఇంకా కావాలంటే ఎప్పుడైనా ఇస్తావ్ అనుకున్నాం కదా కానీ వీడు నా భక్తుడే అన్నటువంటి ఒక్క భావన నా యందు ఒక రీతిలో నిలుపు తండ్రి అది నాకు పదివేలు పదికోట్లు పది జన్మల యొక్క సారం అని సత్యసాయి భగవానుడిని మనం కోరుకుంటే ఇలా గనక అంటే సిరులు ఇస్తాడు వైభవం ఇస్తాడు కోరికలు తీరుస్తాడు ఆనందాన్ని ఇస్తాడు ఇవ్వకుండా ఏదీ ఉండదు. అయితే జీవుడు ఒకటి గమనించాలి భగవంతుడు మనం అడిగింది ఇవ్వడు మనకి ఏం కావాలో ఇస్తాడు. మనం అడిగిందంతా ఇవ్వడు ఎంత ఇస్తే మనం బాగుపడతామో అంతే ఇస్తాడు. అడిగిన అన్ని వస్తువులు ఇవ్వడు ఏది ఇస్తే మనం అధ్యాత్మ మార్గంలో ఉండి పరమేశ్వరుడిని మనం భావించగలుగుతామో దానిని ఇస్తాడు. అంతేకాదు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతార వైభవంలో ఉన్న మనం స్వామి అని పరదైవంగా భావించి దైవతంగా భావించి గనుక మన అధ్యాత్మ జీవితాన్ని గడిపినట్లయితే ఏమిస్తాడయ్యా? సలోక్యంగా ఉన్నారు మనతోనే ఉన్నారు ఇదే లోకంలో మనం ఉన్న లోకంలోనే వారు ఉన్నారు సామీప్యంగా ఉన్నారు మనం స్వామికి దగ్గరగా ఉన్నామని మనం అనుకుంటున్నాం స్వామి కూడా మనకు దగ్గరగానే ఉన్నారు. సాన్నిధ్యంగా ఉన్నారు అంతా కలిసి ఉన్నాం. ఏమివ్వటానికి వచ్చారు? సాయుజ్యం ఇవ్వటానికి వచ్చారు. ఆ సాయుజ్యం ఎప్పుడిస్తారంటే ఈ రీతిగా జీవితాన్ని గనుక మనం ఒక సద్భక్తుడిగా ఒక అంతర్వాణి విలసితమైనటువంటి భావనా భూమికలో సంచారం చేస్తే పరమాత్మ సాయి అన్నివేళలా వీడు నా భక్తుడు అనేటువంటి ఒక్కరీతి ఆ అనుగ్రహాన్ని మాత్రం మనకు అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం కోసం మనం మన జీవితాన్ని చక్కగా అధ్యాత్మ జీవితంగా మార్చుకోవాలి. ఆ యోగాన్ని స్వామి మనకు అనుగ్రహించుగాక. సాయిరాం.ఇంతవరకు శ్రీ సత్య సాయి సూక్తములు అనగా స్వామివారు స్వయంగా రచించినటువంటి కొన్ని పద్యము పైన శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారి ప్రసంగాన్ని మీరు విన్నారు. ఇప్పుడు అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను శ్రీ ఎం.ఎల్.ఎన్. స్వామి గారు మనకు వినిపిస్తారు. ఓం శ్రీ సాయిరాం! మీరు సంతోషంగా ఉన్నారా సార్? ప్రేమ స్వరూపులైన స్వామి వారే మన జీవితాల్లో నిజమైన ప్రేరణ అని మనం చేసే ప్రతి పనికి వారే కర్త అని మనకు తెలుసు. అంతటా అన్ని వేళలా వ్యాపించి ఉన్న ఆ దివ్యమైన ప్రేమని రుచి చూసేంతవరకు గ్రహించలేకపోతున్నాం. ఒకసారి రుచి చూశామా, ఇంక ఏదీ రుచించదు. డల్లాస్ లో ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఒకనాటి శీతాకాలపు ఉదయం నాకు అంతవరకు తెలియని విషయం ఒకటి తెలిసింది. అదేమిటంటే సిరిసంపదలకు క్రమపద్ధతులకు ఆలవాలమైన ఈ నగరంలో కొందరు మనుషులు వీధులలో పడుకుంటున్నారని. ఇల్లు లేని వారి గురించి షెల్టర్ లేని వారి గురించి నాకు తెలుసు కానీ ఇల్లు లేని కొందరికి తలదాచుకోవడానికి గూడున్నా లేదని ఎన్నడూ గ్రహించలేదు. ఆ ఉదయం వణికిపోతూ కళ్ళలో నిప్పులు కక్కుతున్న ఆ వ్యక్తి వలనే ఈ విషయం నాకు తెలిసింది. "నేను చెప్పేది మీకు వినబడుతుందా? నన్ను ఎవ్వరూ నమ్మడం లేదు. నేను తీవ్రమైన చర్య ఏదైనా తీసుకుంటాను. ఇక ఆ వంతెన కింద నేను పడుకోలేను" అని అన్నాడతను నాతోటి. "మీరు నిజంగా వీధిలో పడుకున్నారా? ఎక్కడ?" అని అడిగాను నమ్మశక్యం కాక. "అదే నేను చెప్తున్నాను ఇందాకటి నుంచి. అక్కడ ఆ బ్రిడ్జి కింద" అన్నాడు. అటు చూసి అర్థమైనట్లుగా తల ఊపాను. అతను అక్కడినుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని ఇంకొక ప్రాంతానికి వెళ్ళదలచాడు. నేను నా ప్రొద్దున్న సేవా కార్యక్రమం ముగిశాక అతనిని అక్కడికి తీసుకు వెళ్తానని చెప్పాను. వాగ్దానం చేసినట్లుగానే నేను అక్కడికి తిరిగి వచ్చాను. కానీ అతను కనబడలేదు. స్వామి అతని ద్వారా నాతో మాట్లాడి ఇల్లు లేని ఇతర డల్లాస్ వాసుల బాధల గురించి నేను వివరంగా తెలుసుకునేలా చేశారని భావించాను. ఆ రాత్రి మేము కొంతమందిని కలిసి వీధులలో పడుకునే వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళాం. చల్లటి గాలి వీచడం వల్ల ఆ చల్లని వాతావరణం ఇంకా చల్లగా మారిపోయింది. ఎవరికన్నా అవసరం రావచ్చుననే భావంతో మేము కొన్ని రగ్గులు తీసుకుని వెళ్ళాం. ఎత్తైన రహదారులలో పడుకున్న కొందరిని మేము చూశాం. మేము వారికి రగ్గులు ఇస్తుండగా ఒక వ్యక్తి "మీ వద్ద ఒక అరటిపండు ఉన్నదా? నేను ఈ రోజు ఏమీ తినలేదు" అని అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు మా వద్ద ఆహార పదార్థాలు ఏమీ లేనందున స్వామిని ప్రార్థించుకుంటూ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో చూడగా ఆ రాత్రివేళలో ఒక restaurant తెరిచి ఉండడం కనిపించింది. ఇంకెవరికైనా అవసరం పడవచ్చు అని కాస్త ఎక్కువ ఆహారాన్ని ఆ restaurant లో నుంచి తీసుకుని వచ్చాము. ఈ restaurant కి చేరడానికి ముందు ఒక traffic signal వద్ద ఆగవలసి వచ్చి అనుకోకుండా ఎడమ పక్కకు తిరిగి చూశాను. అక్కడ God is love అని పెద్ద అక్షరాలతో ఒక భవంతి పైన వ్రాసి ఉంది. అది చూడగానే స్వామి మాతోనే ఉన్నారు అని అనిపించింది. మేము ఆహారం తీసుకుని వచ్చేసరికి ఆ వ్యక్తి "God bless you all" అని అన్నారు. రాబోయే నెలల్లో ఈ ప్రేమ స్వరూపులు మాపై వర్షించబోయే వేల కృతజ్ఞతాభావాలతో కూడిన పదాలలో ఇవి మొదటి మాటలు. drugs తీసుకోవడం వంటి వ్యసనాలు, మానసిక రుగ్మత లేదా ఉద్యోగం పోవడం వంటి కారణాలతో తలదాచుకోవడానికి ఇల్లు లేకుండా అయిపోతారు. అప్పుడు ఏదన్నా ఒక గూడు కోసం ప్రయత్నిస్తారు. అది దొరకకపోతే వీధుల్లోకి వెళతారు. అది కొన్ని రోజులు లేదా వారాల వరకే అని అనుకుంటారు. కానీ, రోజులు, వారాలు సంవత్సరాల్లోకి జారుకుంటాయి. ఇక అందులో నుండి బయటపడే మార్గం ఏదీ కనిపించదు. సుమారు ఏడు సంవత్సరాలు వీధులలో ఉన్న వ్యక్తి మాతో ఈ విధంగా అన్నాడు. "ఎంతకూ పూర్తి కాని సుడిగుండంలో క్రింద క్రిందకు పడిపోతాం. పైకి చూస్తుంటే మసక వెలుతురు కనిపిస్తుంటుంది. ఈ సుడిగుండం నుండి బయటపడే మార్గం ఆ వెలుతురే. ఆ మసక వెలుతురే మాకు ప్రతిరోజూ ఆశాకిరణంగా నిలుస్తుంది" అని చెప్పాడు. ఆ వ్యక్తి మమ్మల్ని బ్రిడ్జి కింద ఇంకొక చోటుకు తీసుకు వెళ్ళాడు. బ్రిడ్జి కింద స్తంభాలకు రోడ్డుకు మధ్య సందులలో కూడా కొందరు ఆ చలిగాలి నుండి తలదాచుకొని పడుకుంటారని చెప్పాడు. నా చీలమండలం బెణకడం వల్ల నేను పైకి ఎక్కలేకపోయాను. నన్ను కారులో వదిలి నా స్నేహితులు పైకి వెళ్లారు. వారు వచ్చే వరకూ కారులో కూర్చుని ఉండగా స్వామి ప్రేమతో నా హృదయం నిండిపోయింది. వారు తిరిగి వచ్చేసరికి ఆ ప్రేమ నాతో ఇలా చెప్పించింది. "వీరు ఎంతో కష్టపడుతున్నారు కదా, ఎంతో చలిగా కూడా ఉంది. వారు ఆకలితో కూడా ఉన్నారు. స్వామి దయవల్ల మనము ప్రతిరోజూ రాత్రి ఇక్కడకు వచ్చి వారిని చూసుకుందాం. స్వామి దయవల్ల మనం వారికి మంచి భోజనము, వెచ్చని దుస్తులు ఇచ్చి ప్రేమపూరితమైన మాటలు ప్రతి రాత్రి వారితో పంచుకుందాం. కనీసం ఈ చలికాలం ముగిసే దాకా ఈ రెండు నెలలు ఇక్కడకు వద్దాం" అని అన్నాను. ఈ విధంగా బాబా వారితో ఒక విధమైన ఒప్పందం కుదిరి.చైతన్య సేవ ఆవిర్భవించింది. ఈ ఒప్పందం అమలులోకి రావడానికి భగవానుని సహాయ సహకారాలు ఏ కాక పరీక్షలు కూడా ఎదురయ్యాయి. ఏదో ఒక విధంగా తాను మాతోనే ఉన్నారని స్వామి మాకు గోచరింపచేసిన మా మార్గంలో ఎన్నో ఆటంకాలు సవాళ్లు ఎదురయ్యాయి. ఆ మరుసటి సాయంత్రమే మేము కారులో ఆ వీధిలోకి వెళ్లగా ఒక పొడవుగా సన్నగా ఉన్న పెద్ద మనిషి కనిపించారు. కొద్దిగా సూపు బ్రెడ్డు తీసుకుంటారా అని అడిగాము. అతను ఎంతో దిగులుగా తల ఆడించాడు. ఆ సూపును ఎంత ఆత్రంగా త్రాగాడో చూస్తే అతను బాగా ఆకలితో ఉన్నట్టు తెలుస్తోంది. మీరు ఆహారం తీసుకుని ఎన్నాళ్లయింది సార్ అని అడిగాను. రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు అని బదులిచ్చాడు ఆయన. ఇంకొంచెం సూపు బ్రెడ్డు తీసుకోండి అని అన్నాము. Thank you thank you అంటూ తీసుకున్నారు. ఆయన చలికి వణుకుతున్నట్లు నేను గమనించాను. కేవలం ఒక పలుచటి చొక్కా మాత్రమే ధరించి ఉన్నాడు ఆయన. అది ఆ వాతావరణానికి సరిపోదు. నేను అతనికి ఒక జాకెట్ తొడిగి అతన్ని కౌగలించుకున్నాను. మిమ్మల్ని దైవం పంపించారు అని అతను అంటుంటే మా ఇద్దరి కండ్లు చెమర్చాయి. మమ్మల్ని అక్కడకు లాక్కుని వచ్చింది స్వామి ప్రేమనే కదా. ఆ విధంగా ఆయనే కదా మమ్మల్ని అక్కడికి పంపించింది. ఇక్కడ ఇచ్చేవారు పుచ్చుకునేవారు ఎవ్వరూ లేరు. కేవలం ఒక హృదయం ఇంకొక హృదయపు పిలుపుకు స్పందించిన అనుభవము మరియు ఇరువురి సంతోషం మాత్రమే ఉంది. మొదలు పెట్టినప్పటి నుండి స్వామి కొన్ని అడ్డంకులు మా మార్గంలో వేసి వాటిని నిలదొక్కుకునేలా చేసి వాటిని అధిగమింపజేశారు. తొలుత కొద్దిమంది వాలంటీర్లు మాత్రమే ఈ పనికి ముందుకు వచ్చారు. వేరే వాళ్ళంతా అదే నగరంలోని వేరే ప్రాంతాలలో పాత నేరస్తులకు డ్రగ్స్ కు బానిసలైన వారికి రాత్రిపూట సేవ చేయాలని తలంచారు. మేమందరము ఇలా తలంచాం స్వామే ఇది జరిగేలా చూస్తున్నారు మనకు భయం ఎందుకు ఆయనే చూసుకుంటారు. మనము ఈ వీధులలో పడుకునే వారిని సాటి మనుషులుగా వీలైతే మన సోదరులుగా చూసుకోవాలి. వారిలోనూ మనలో కూడా ఉండే ప్రేమనే చూడాలి అనే ప్రార్థనతో పట్టు వదలలేదు. ప్రతి రాత్రి మా ఇళ్లలో సూపు హాట్ చాక్లెట్ తయారు చేసుకుని stores నుండి పండ్లు బ్రెడ్ మరియు ఆపిల్ పై కొనుక్కుని వారిని సేవించడానికి ప్రేమించడానికి వెళ్ళేవాళ్ళం. ఆహారంతో పాటు వెచ్చని దుస్తులు రగ్గులు సాక్సులు బూట్లు టోపీలు మున్నగునవి అత్యంత అవసరమని గుర్తించాం. ఇది ఇంకొక సవాలు ఎవరి వద్ద నుండి ధనం ప్రోగు చేయడం వంటివి చేయలేదు. కానీ ఏదో ఒక విధంగా శీతాకాలం మొత్తానికి వారికి సరిపడ్డ దుస్తులు ఏర్పాటయ్యాయి. ఇది విశ్వాసానికి ఒక పరీక్ష స్వామి నిజంగా మనతో ఏమి చేయించదలచుకున్నారో అది చేయడం అన్నిటికన్నా పెద్ద సవాలు. శీతాకాలం ముగిసింది కొద్దిమంది మాత్రమే ఈ సేవలో పాల్గొంటున్నారు. ఒప్పందం ప్రకారం సేవ కేవలం శీతాకాలం ముగిసే వరకే చేయాలని అనుకున్నాం. ఇంకా ఎంతకాలం ఈ సేవ కొనసాగించగలము? ఇటువంటి సేవ రోజూ చేయాలంటే ఎంత సామగ్రి అవసరం అవుతుంది అని ఆలోచిస్తే కొంచెం కష్టమే అనిపిస్తుంది. శీతాకాలం ముగిసే వేళకు ఈ సేవను నిలిపివేద్దామని ప్రయత్నించాము. ఈ ఆలోచనతో సేవకు వెళ్ళిన ప్రతిసారీ ఎవరో ఒకరు మీరు రోజూ ఇక్కడికి రావడం చేత నిజంగా దైవానికి కృతజ్ఞులం. మీరు పెట్టే ఈ ఆహారమే మాకు ఈరోజు మొత్తం మీద దొరికే ఆహారం అని అనేవారు. ఈ సేవా కార్యక్రమం మేము ఎలా నిలిపివేయగలము? మేము రాకపోతే వీరిలో కొందరికి ఆహారమే దొరకదు. స్వామి మా ఈ తప్పుడు ఆలోచనలు సరిదిద్ది ఆ కార్యక్రమం కొనసాగేలా చేశారు. అప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగాయి. చాలా మంది వాలంటీర్లు ఈ పనికి ముందుకు వచ్చారు. ఒక బేకరీ దుకాణం ఆయన రోజూ కొంత బ్రెడ్ ను ఉచితంగా అందించడానికి ఒప్పుకున్నారు. ఒక డోనట్ దుకాణం దారుడు రోజూ కొన్ని డోనట్లు ఉచితంగా ఇవ్వసాగారు. రెండు నెలల సేవగా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు పదిహేడు నెలలతో continue అవుతోంది. వీధులలో నివసించే డెబ్బై మంది పీడిత జనులు మరియు నలభై మంది వాలంటీర్లు రోజూ ఒకరినొకరు సేవించుకుంటున్నారు. స్వామి దయతో ఆయన సంకల్పిస్తే ఇది ఇలాగే కొనసాగుతుంది. స్వామి ఆశీర్వాదములు దండిగా మెండుగా ఉన్నాయి అనడానికి నిదర్శనంగా ఎన్నో సంఘటనలు జరిగాయి. మచ్చుకకు ఒకటి తెలియజేస్తాను. ఒకనాటి సాయంత్రం మాకు పంచడానికి మూడు రగ్గులు ఇవ్వబడ్డాయి. నేనే వాటిని స్వయంగా లెక్కపెట్టాను. ఆ మూడు రగ్గులు సేవ ప్రారంభంలోనే ఇచ్చివేయడం జరిగింది. ఇంకొక చోటికి మేము వెళ్ళేసరికి ఒక వ్యక్తి రోడ్డు పక్కగా తన సామాన్లు పెట్టుకుని పడుకోవడానికి సిద్ధమవుతున్నాడు. సూపు కావాలా అని అడిగితే కావాలన్నాడు. రగ్గు కూడా కావాలా అని అడిగితే సరేనన్నాడు. నేను కారు వద్దకు వెళ్తుండగా ఆ వ్యక్తి వీధుల్లోనే ఉండే ఇతర వ్యక్తులకు భిన్నంగా ఉన్నట్లు నాకు తోచింది. అతని శరీర వర్చస్సు ప్రవర్తన చాలా వేరుగా అనిపించాయి. నాకెందుకో అతను శ్రీ మహావిష్ణు అని అనిపించింది. అకస్మాత్తుగా రగ్గులన్నీ ఇదివరకే ఇచ్చివేశామన్న సంగతి గుర్తువచ్చింది. నా మాట నిలబెట్టి ఈ వ్యక్తికి రగ్గును ప్రసాదించమని నేను స్వామిని ప్రార్థించాను. కారులో వెనుక సీటుపై కూర్చున్న వాలంటీర్ ను ఒక రగ్గు ఇవ్వమని అడిగాను నేను. అతను మన వద్ద ఉన్న మూడు రగ్గులు ఇచ్చేశాము అని చెప్పాడు. ఆ క్షణమే అదే సీటుపై కూర్చున్న ఇంకొక వాలంటీరు సీటు కింద ఒక రగ్గు ఉండటం గమనించాడు.ఆ రగ్గు ఆ అడిగిన వ్యక్తికి ఇచ్చేశాం. మేము తెచ్చినవి ఖచ్చితంగా మూడు రగులే. ఆ మూడు ఇచ్చేశాం. హృదయ పూర్వకంగా చేసిన మా ప్రార్థనను ఆలకించి స్వామి తెచ్చిన మూడు రగ్గులను నాలుగు రగ్గులుగా మార్చి వేశారు. ఈ సేవ ద్వారా మేము గ్రహించినది ఏమంటే వీధులలో నివసించేవారు పాత నేరస్తులు, drugs కు బానిసలు, హింసా ప్రవృత్తి కలవారు కావచ్చు కానీ వారి హృదయాలు భగవంతుని వలె నిర్మలమైనవి. రోజు అటువంటి ప్రేమలో మేము మునిగి తేలుతున్నాము. ఒక వ్యక్తి నవ్వుతూ "మనం జీవించి ఉండటం చాలా సంతోషంగా ఉంది" అని అంటున్నాడు. ఇంకొకరు "మీరు దైవం పని చేస్తున్నారు" అని అన్నాడు. ఇంకొకరు Bible వాక్యాలు చెప్తూ "మానవ సేవయే మాధవ సేవ" అని అన్నారు. మేము అందరం దానికి సంతోషంగా అంగీకరించాం. కొన్ని వారాల క్రితం వీధులలో నివసించే ఒక స్త్రీ "మీరు ఏ చర్చికి సంబంధించిన group వారు?" అని ప్రశ్నించింది. నేను "సత్య సాయిబాబా group" అని బదులిచ్చాను. "అంటే ఏమిటి?" అని ఆవిడ తిరిగి ప్రశ్నించింది. "విశ్వ ప్రేమ" అన్నాను. "చాలా సంతోషం" అంది ఆవిడ ఆనందంగా. ఒకరోజు సేవ ముగిశాక ఒక వ్యక్తితో మాట్లాడాను. అతనిని మేము బాగా చూసుకుంటున్నామా, అతను సంతోషంగా ఉన్నాడా అని తెలుసుకో గోరాను. అప్పుడు ఆయనతో "మీరు సంతోషంగా ఉన్నారా sir?" అని అడిగాను. అతను నవ్వుతూ నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని "మీరు సంతోషంగా ఉన్నారా?" అని అడిగాడు. ఎందుకు ఉండను? మరి ఇప్పుడే కదా ప్రేమ వాణిని విన్నాను. జై సాయిరాం. [సంగీతం] ఇంతవరకు అమెరికా దేశంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను గూర్చి Mln స్వామి గారు మనకు వివరించారు. ఇప్పుడు భగవాన్ చదువుకుంటున్న రోజుల్లో స్వామి వారి class teacher గా ఉన్నటువంటి శ్రీ మంచిరాజు తమ్మిరాజు గారి అనుభవాలను జ్ఞాపకాల జాజిమాల శీర్షిక ద్వారా మీరు వింటారు. [సంగీతం] ఓం శ్రీ సాయిరాం! బాల సాయి లీలలు ప్రత్యక్ష అనుభవం శ్రీ మంచిరాజు తమ్మిరాజు. శ్రీ భగవాన్ సత్య సాయి సుడు ఉరవకొండ హైస్కూలులో చదువుతుండగా గురువారము తప్పకుండా సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రత్యక్షముగా శ్రీ శిర్డీ సాయిబాబా గారి రూపముతో భక్తుల సంశయములను తీర్చువారు. కోరుకొను కోరికలు ఎట్లు జరుగునది చెప్పి వారికి ఇప్పుడు ప్రసాదించునట్లునే విభూతిని చేతి నుండి తీసి ఇచ్చి అభయమిచ్చి పంపుచుండిరి. మేము వానిని అన్నిటినీ ప్రత్యక్షముగా చూచి ఆనందపడిన వారలలో ఒకరము. శ్రీవారి కృపారసము జోరగుంటిని. మా కుమార్తె ఇరవై మూడు సంవత్సరముల వయసు గలది చనిపోయినది. అప్పుడు నా భార్య కామేశ్వరమ్మ పుత్రికాశోక భారముచే కృంగి కృశించి బాధపడుచుండెను. అప్పుడు శ్రీ భగవానుడు వీలు చూచుకొని మా ఇంటికి వచ్చి ఆమెకు జ్ఞానోపదేశము చేసి ఓరడించుచుండిరి. సాదరముగా శ్రీవారి అప్పటి ప్రేమామృత వాక్కులే ఆమెకు భక్తి నిలుచుటకు మూలకందము లాయెను. [నవ్వు] జూన్ నెలలో ఒక గురువారం నా భార్య సాయంత్రం శ్రీ సత్య సాయి సులు బాబా రూపులో భక్తుల కోరికలను చెప్పు సమయమున శ్రీవారిని దర్శించి వారి పాదములపై పడి మురికినది. వెంటనే శ్రీవారు ఆమెను లేవనెత్తి విభూతి నొసగి అభయమిచ్చిరి. అప్పటినుండి ఆమెకు కొంత మనశ్శాంతి కలిగినది. రెండవ గురువారం సాయంత్రం తిరిగి ఆమె భగవానులకు మురికినది. అప్పుడు "అమ్మాయి! నీ భక్తికి మెచ్చితిని, తృప్తి పడితిని, వచ్చే వారము నీకొక బహుమానం ఇత్తును రమ్మన"మని సెలవిచ్చి పంపిరి. మూడవ గురువారం ఆమె శ్రీవారి పాదములపై వ్రాలినంతనే లేవనెత్తి "అమ్మాయి! నేను షిర్డీలో సమాధిలోనికి వెళ్ళినప్పుడు ధరించిన కాషాయాంబరములోని కొంత భాగం ఇచ్చుచున్నానని" అప్పటికి తెరిచి ఉన్న వారి పిడికిటిని మూసి ఆమె చేతిలోనికి "ఇదిగో తీసుకొనుమని" నాలుగు అంగుళముల చతురము గల వస్త్రమును బెట్టిరి. "దీనిని నీవు భద్రపరచుకొని నా పీఠము వద్ద పూజ చేసుకొనుము. వచ్చే వారము కూడా నీకు ఇంకొక బహుమానం ఇత్తుననియు, మీ అందరి భారము నాయది, సంతోషముగా కాలము గడుపుచుండుననియు చెప్పిరి. నాలుగవ వారము శ్రీ భగవానుల పాదపద్మముల ఆమె మురికినది. "అంతట నీకు ఆశీర్వాదం ఇచ్చుచున్నానని" వస్త్రము ఇచ్చినట్లునే తమ పిడికిటిని మూసి ఆమె చేతిలోనికి "ఇదిగో తీసుకొనుమని" అక్షతలు వేసిరి. "వీనిని క్రిందటి వారము ఇచ్చిన వస్త్రములో కట్టుకొని పూజ చేసుకో. ఇంతటి నుండి నీకు పూర్ణమైన శాంతి కలుగును. ఏ విధమైన దుఃఖమును ఉండదు. ఆనందముగా ఉండుము. అనన్య భక్తి నీకిచ్చుచున్నాను. భయపడవలదని సెలవిచ్చి పంపిరి. ఐదవ వారము తిరిగి ఆమె వెళ్లి శ్రీవారికి మురికినది. "అమ్మాయి! మీ ఇంటి యందే ఒక పీఠము వేసుకొనుము. నేను ఎప్పుడునూ అక్కడకు వచ్చి దర్శనమిచ్చుచుందునని" సెలవిచ్చి శ్రీవారే ఒక పీఠమును వేయించిరి. ప్రత్యక్షముగా శ్రీ కృష్ణ రామ శివ మారుత్యాది రూపులగు శ్రీ సత్య సాయి సులు మా దంపతులకును మరి కొందరు భక్తులకును వారి అనంతకోటి అవతారములలో కొన్నిటిని శ్రీ కృష్ణాష్టమి రోజునను, రోహిణి నక్షత్రము రోజునను, వరుసగా రెండు రోజులు వచ్చి ఆ పీఠం మీద కూర్చొని వారిలోనే మాకందరికినీ చూపించి మమ్మందరినీ ఆనందాబ్ధిలో ఒలలాడించిరి. మేమప్పుడు చూచిన అవతారములను 1944వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మద్రాసు నుండి వెలువడిన సాయి సుధలోను, అదే వత్సరము నేను వ్రాసిన సాయినాథ శతకములోను శ్రీవారి లీలలను శీర్షిక క్రింద ప్రచురించితిని. సాయిరాం. [సంగీతం] ఇంతవరకు భగవాన్ చదువుకుంటున్న రోజుల్లో స్వామి వారి class teacher గా ఉన్నటువంటి శ్రీ మంచిరాజు తమ్మిరాజు గారి అనుభవాలను జ్ఞాపకాల జాజిమాల శీర్షిక ద్వారా మీరు విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం. [సంగీతం]
SSSMC · audio
Telugu Broadcast - 424
Telugu Broadcast - 424
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 56:16
More in this series
Telugu Broadcasts
- 57 min 394
Telugu Broadcast - 394
- 1 hr 396
Telugu Broadcast - 396
- 58 min 402
Telugu Broadcast - 402
- 58 min 420
Telugu Broadcast - 420
- 56 min 424
Telugu Broadcast - 424
Now playing - 57 min 427
Telugu Broadcast - 427
- 57 min 490
Telugu Broadcast - 490
- 56 min 491
Telugu Broadcast - 491
- 56 min 498
Telugu Broadcast - 498
- 58 min 555
Telugu Broadcast - 555
- 57 min 560
Telugu Broadcast - 560
- 58 min 561
Telugu Broadcast - 561