Skip to content
Transcript తెలుగు
పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు యోగ భూమికలలో రెండవది అయినటువంటి భక్తి యోగంలోకి ప్రవేశిద్దాం. క్రితం సారి కర్మ యోగాన్ని గురించిన విచారణ చేశాం. ప్రాపంచికంగా మానవుడు చేయవలసిన పనులు చేస్తే దాని పేరు కర్మ అని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరుడి యందు విశ్వాసాన్ని జత చేసుకొని సమాజహితమైనటువంటి కర్మలు గనుక చేస్తే అది మాత్రమే కర్మ యోగమని విచారణ సాగింది. మరి ఈరోజు భక్తి యోగాన్ని గురించిన విచారణ. భక్తి అనగానే పూజింపబడే వాడు పూజ చేసేవాడు ఇద్దరు ఉన్నట్టు లెక్క. అంటే జీవుడు దేవుడు అన్నమాట. లేదా సాధకుడు బోధకుడు అన్నమాట. లేదా శిష్యుడు గురువు అన్నమాట. లేదు అనేవాడు వినేవాడు ఇద్దరు అని మాట. ఇది భక్తి. భక్తికి మరొక పేరు విశ్వాసం, నమ్మకం. ఒక గట్టి నమ్మకం, అచంచలమైనటువంటి నమ్మకం. భక్తి ఒక రూపానికి, ఒక నామానికి, ఒక గుణానికి లోబడి ఉంటుంది. అసలు భక్తి అంటే భా అంటే ప్రకాశం అంటే వెలుగు. పరమాత్మ రసో వై సః అంటే పరమాత్మ రస స్వరూపుడు. ఆయనకు నిజానికి ఆకారం లేదు. స్వామి చెప్పినట్లుగా నీళ్లు తీసుకొని టంబ్లర్ లో పోయి, కూజాలో పోయి, కడవలో పోయి, వెండి గిన్నెలో పోయి, బంగారు చెంబులో పోయి, ఎక్కడ పోస్తే వస్తువు పాత్ర యొక్క ఆకారాన్ని నీరు పొందుతూ ఉన్నదో పరమాత్మ అనేటువంటి చైతన్యం కూడా ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తం వచ్చేటువంటి పరమాత్మ ప్రకాశాన్ని అనేక రూపాలుగా తీసుకొని వస్తాడు. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శ్రీ మత్స్య కూర్మ వరాహ వటు నరసింహులు కావచ్చు, షిరిడి సాయి సత్య సాయి కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రకాశము నందు ప్రకాశముతో కూడి ఉన్నట్లయితే దాని పేరు భక్తి అని. అంతే. ప్రకాశంతో కూడి ఉన్నామా? మనం విడిపోయి ఉన్నామా? అని. ప్రకాశంతో కూడే ఉన్నాం గాని చాలా సుదూరంగా ఉన్నాం. సూర్య కిరణాలు ఎట్లాగైతే సూర్యమండలం నుంచి భూమిని తాకుతున్నటువంటి కొన్ని లక్షల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి మా మూలాలు సూర్య మండలమే అని చెప్పినా చెప్పకపోయినా సూర్యుడి నుంచి ఎట్లా విడిపడినట్టుగా కనిపిస్తున్నాయో జీవుడు కూడా పరమాత్మ నుంచి అట్లాగే విడిపడ్డట్టుగా కనిపిస్తున్నాడు కానీ విడి లేడు. ఎందుకంటే సూర్యుడు లేక సూర్యకిరణం లేదు, భగవంతుడు లేక భక్తుడు లేడు. అంటే రెండూ అవినాభావంగా ఉన్నాయి, కలిసి ఉన్నాయి, స్వస్వామి సంబంధంగా ఉన్నాయి అన్నారు శంకర భగవత్పాదులు. స్వామి ఏమన్నారంటే భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తులు లేరు అన్నారు. ఎంత అందమైన మాటో చూడండి. మీరందరూ లేకపోతే నేను లేను బంగారు, నేను లేకపోతే మీరెవ్వరూ లేరు బంగారు అన్నారు. అంటే సూర్య కిరణాలు సూర్యుడి వలె, చంద్ర కిరణాలు దానిలో వచ్చే సుషుమ్నా కిరణాలు చంద్రుడి నుంచి ఎట్లా భిన్నం కావో, సముద్రంలో పుట్టినటువంటి అలలు, తుంపరలు, బిందువులు, కెరటాలు సముద్రం నుంచి ఎట్లా భిన్నం కావో, పరమాత్మ నుంచి జీవుడు భిన్నం కాదు కానీ భిన్నంగా గోచరిస్తాడు. ఎందుకు గోచరిస్తాడు మరి? గోచరించ కూడదు కదా. అంటే అణోరణీయాన్ అన్నాడు. ప్రతి అణువులోనూ నేనున్నాను అన్నాడు. అంటే ప్రతి అణువులోనే ఉన్నప్పుడు ప్రతి జీవిలోనూ ఉన్నట్లు లెక్క. ప్రతి జీవిలోనూ జీవుడు ఏం చేస్తాడు? తనలో ఉన్న పరమాత్మను తాను కొనుగొనే ప్రయత్నం చేయడు. ఎదుటి వాడిలో పరమాత్మ ఉన్నాడో లేదో వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కనుక జీవితం భక్తి మార్గంలో ప్రవేశించటానికి ముందు తాను సాగించిన కర్మల అన్నింటికీ కూడా ఒక విజయాన్ని సంపాదించటానికి, ఒక సాఫల్యతను ఇవ్వటానికి అంటే ఒక లాభం పొందటానికి భక్తి అనేటువంటి ఒక మీడియం దాన్ని జీవుడు వాడుకుంటాడు. అది ఒక స్థాయి. రెండవ స్థాయిలో పరమాత్మని ఉపాసన చేసేవేళ పరమాత్మకి ఆకారం లేదని మనమే అనుకున్నాం గనుక రాముడుగా, కృష్ణుడుగా, సాయిగా, మరొకరుగా అనేక రూపాలు. వేదం కూడా ఒక పరిష్కారం చెప్పింది మనకి. ప్రతిమా ఈశ్వరః అన్నది. అయ్యా బొమ్మలో బ్రహ్మ, బ్రహ్మలో బొమ్మ ఇది దీని అర్థం. అంటే ఏమిటి అంటే నేను దేవుణ్ణి చూడాలండి, నేను రాముణ్ణి చూడాలి, ఎలా చూడ్డం? రాముడా, ఇగో ఇలా ఉంటాడు. కిరీటం పెట్టుకుంటాడు, కోదండం పెట్టుకుంటాడు, ఫలానా నామం పెట్టుకొని ఉంటాడు. అటువైపు ఇటువైపు అమ్మవారు, తమ్ముడు, కింద దాసుడు అందరూ ఉంటారు అని ఒక ఊహ, ఒక రూపం. మరి కృష్ణుడు ఎలా ఉంటాడు? కోదండం మొదలు వేణువు ఉంటుంది, కిరీటంలో పించం ఉంటుంది. ఆయన కృష్ణుడు అన్నాం. అంటే నామ రూపాలు రెండూ ఒక పరమాత్మ యొక్క తత్వాన్ని గుర్తించటానికి ప్రతిమలుగా రెప్లికా అంటామే. ప్రతిమా ఈశ్వరః. రాముడి బొమ్మలో రాముడున్నాడు. రాముడుగా కనిపిస్తున్న ఆయనలో బ్రహ్మ కూడా ఉన్నాడు. కనుక కనిపిస్తున్న బొమ్మలన్నీ బ్రహ్మలే. బొమ్మలు అంటే జీవుడు. దానిలో బ్రహ్మ ఉన్నాడు అని అర్థం. స్వామి పద్యం చెప్పారు, చాలా అందమైన పద్యం. చుక్కలన్నియు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాళ్ళభ్యమది బ్రహ్మ, స్వర్గమన్నది బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ప్రారబ్ధమది బ్రహ్మ, కర్మలన్నియు బ్రహ్మము, కాలం బ్రహ్మ, స-సర్వమును తెలియు సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు సాయి బ్రహ్మ అన్నారు. అంటే సత్యాన్ని బోధించటానికి వచ్చిన స్వామి కూడా నేను బ్రహ్మమునైనా బొమ్మలా మీ దగ్గరికి రాలేదా? నేను అంతే అన్నారు. ఎందుకన్నారు మాట అంటే భక్తి కుదురుకోవాలి.భక్తి పాదుకోవాలి. భక్తి భగవంతుడికీ భక్తుడికీ మధ్య ఒక బేరసారాలు ఆడుకునే విధానం కాకూడదు అని. సత్యసాయి భగవానుడి అవతారం వచ్చే దాకా గురు స్వరూపాలన్నీ మాట చెప్పినయి. ఏం చెప్పినయి అంటే, "నీలోనే దేవుడున్నాడు" అని చెప్పినయి. సత్యసాయి భగవానుడు మాట చెప్పలే. "నీలో దేవుడున్నాడు కాదు బంగారు, అసలు నువ్వే దేవుడివి. నేను దేవుణ్ణే అని నాకు తెలుసు, నువ్వు దేవుడివి అని నీకింకా తెలియలేదు, అంతే తేడా. నీవు దేవుడివి అని తెలుసుకోవాలి అంటే నీకూ నాకూ ఉన్నటువంటి అంతరం చెరిగిపోవాలి. నేను ఒక పెద్ద canvas మీద చాలా చాలా గొప్ప పనులు చేసి మీ అందరికీ చూపిస్తున్నానే, వాటన్నింటినీ మీ మీ స్థాయిలలో మీరు చక్కగా అభివ్యక్తి చేయండి. ప్రపంచానికి అందించండి. అది భక్తి మార్గంలో, శ్రేయోమార్గంలో వెళ్ళండి. భక్తిని గనక మీ వ్యక్తిగత లాభాల కోసం వాడుకున్నట్లయితే దానివలన ఏం ప్రయోజనం లేదు, ఎవరికీ, నీతో సహా. నీక్కూడా రోజున కోరికలు కోరి కోరి కోరుకోవటానికి కోరికలే లేని రోజు భగవంతుణ్ణి ఎలా తలుచుకోవాలి?" అని విచారణ మొదలయ్యేసరికి కాలమంతా హరించిపోతుంది గనుక భక్తి అంటే మన యందు ఉన్నటువంటి శక్తిని యంతా, ప్రజ్ఞనంతా కూడా పరమాత్మ యొక్క శక్తితో కూర్చి ఉంచటమే. అందుకే స్వామి భక్తిని ఏమన్నారంటే, "జీవ ప్రజ్ఞ, దైవ ప్రజ్ఞ రెండూ కలిస్తేనే ప్రపంచానికి సాఫల్యం ఉన్నది" అన్నారు. కేవల జీవుడి ప్రజ్ఞ hundred percent లాభం ఇవ్వదు. "మనం ఏమీ చెయ్యం, స్వామి అనుగ్రహమే అంతా నడిపిస్తుంది" అంటే అది నడవదు, అది పనిచేయదు అన్నారు స్వామి. "నీవు చేస్తూ ఉంటే, పరమాత్మ యందు విశ్వాసం గనక నీవు పెంచుకుని ఉన్నట్లయితే, నీ విశ్వాసానికి నా అనుగ్రహం తోడై ఫలితాలు తొందర తొందరగా వస్తాయి" అన్నారు. ఇది భక్తి యోగం. ఇవాళ మనం ఈశ్వరార్చన చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అలంకారాలు చేస్తున్నాం, యజ్ఞయాగాదులు చేస్తున్నాం. ఇవన్నీ కూడా నిజానికి పంచకోశాల బయట జరుగుతున్న తంతు. బయట జరుగుతున్నాయి. ఎక్కడ పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఐదు కోశాల బయట జరుగుతున్నవి వేరు, దీని వలన కలిగే ఆనందం మాత్రం ఆనందమయ కోశంలో మాత్రం మనకు లభిస్తున్నది. అసలు మనమే ఆనందమయ కోశంలో ఉండే ప్రయత్నం చేస్తే మార్గం ఉన్నదా? అదే భక్తి మార్గం. ఎట్లా? ఆత్మాత్వం గిరిజామతిం సహచర ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నువ్వే ఆత్మవు. నీలో ఉన్నటువంటి intellect ఏదున్నతో అది గిరిజామతి. ఎవరు? అమ్మవారు. అయ్యవారు, అమ్మవారు ఇద్దరూ నీలోనే ఉన్నారు. శరీరం గృహం. ప్రపంచ దేశాలన్నీ చుట్టి తిరిగి ఇంటికి వస్తాం. మన ఊర్లో దిగ్గానే, "అమ్మయ్య! మా ఊరు వచ్చింది" అంటాం. మా ఊర్లో-- మన ఊర్లో దిగ్గానే, మన పేటలోకి వెళ్ళగానే, "మన పేటలోకి వచ్చాం" అంటాం. మన పేటలోకి రాగానే, మనం ఉండే సందులోకి వెళ్ళగానే, "మా సందులోకి వచ్చాం" అంటాం. మన ఇంటి వాకిలి దగ్గరకు వెళ్ళి, "మా వాకి-- ఇంటి దగ్గరకు వచ్చాం" అన్నాం. "వాకిలి దగ్గరకు వచ్చాం" అన్నాం. మన ఇంటి లోపలికి వెళ్ళి, మనం పడుకునే ప్రదేశానికి వెళ్ళి, "నడుము వాల్చి అమ్మయ్య! చేరుకున్నాము" అన్నాం. అంటే ఇల్లు ఎక్కడ ఉన్నది అని. ప్రపంచమంతా పెద్ద ఇల్లు అయితే అసలు ఇల్లు నీ లోపల ఉన్నది అని అర్థం. భావనా చమత్కృతి, భావనా సంస్థితి జీవుడికి ఏర్పడటానికి ముందు భక్తి ప్రధానం. భక్తి రమణీయము, భక్తి మాధుర్యం. నిజానికి మనం రెండడుగులు వేస్తున్నాం నడక సాగించటానికి. రెండడుగులు ఒక్కసారి వేయటంలా. ఒక అడుగు ముందు, అది కూడుకునే లోగా రెండో అడుగు వచ్చి దానికి జత కలుగుతున్నది. అంటే simultaneous గా అవుతుంది, alternate గా అవుతుంది. సంచార పదయో అంటే కుడి కాలు ముందు, ఎడం కాలు వెనక అయితే రెండింటి మధ్య ఉన్నటువంటిదంతా విష్ణు వ్యాపకమైన బ్రహ్మ అయితే, కుడి కాలు ఎడమ కాలు ఒక ఆవృత్తం పూర్తిగాగానే ఒక ప్రదక్షిణ చేసినట్లు లెక్క. సంచార పదయో ప్రదక్షిణ విధి. స్తోత్రాణి సర్వాగిరో, మాట మాట్లాడినా దాని నిండా స్తోత్రం ఉండాలి. నతులు, నుతులు, స్తుతులు, గీతులు, గీతికలు, గమకాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? పరమేశ్వరుడి యొక్క వాక్కు అగ్ని స్వరూపమై ఇక్కడి నుంచి బహుముఖీనమై బహిర్గతమవుతున్నటువంటి వేళ, ఇదంతా కూడా పరమేశ్వరుడి యందు మనకున్నటువంటి భక్తి భావన వలన, పరమేశ్వరునితో మనం కూడి ఉన్న విధానం వలన వాక్కులన్నీ స్తోత్రాలై బయటకు వస్తున్నాయి. అందుకే పరమేశ్వరుడి భావనలో మాటలు మంత్రాలు అవుతాయి. జీవుడికి మంత్రాలన్నీ మాటలైపోతాయి. అంటే మంత్రాల బలం లేకుండా మాటలు సాగుతాయి. పరమాత్మ ఏమీ శ్లోకాలు చెప్పడు. "అంతా బాగుంటుందిలే పో" అంటారు స్వామి. "నేను చూసుకుంటాలే బంగారు, నేను కాచుకుంటాలే బంగారు" అంటారు. అది మహా మంత్రం. చూచుకుంటా, కాచుకుంటా అన్నవాడు ఒక్కడే పరమాత్మ. మనం అనలేం. చూసుకుంటా అంటే మొయ్యాలేమో, కాచుకుంటా అంటే చెయ్యాలేమో. కనుక రెండూ మినహాయించి అన్ని పనులు చేస్తాం. పరమాత్మ "నేను చూస్తా, నేను కాస్తా, నేనున్నా, నీ పని నువ్వు చేసుకో, పరమేశ్వరుడి యందు అచంచల విశ్వాసం ఉంచుకో" అంటారు. అంటే భక్తి అంటే విడదీయరాని బంధం ఏదైతే ఉన్నదో అది భక్తి గనుక, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మనం ఇవన్నీ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాం గనుక, కర్మ యోగాలన్నీ పరిపూతమవుతున్నటువంటి వేళ, పావన భావనామయమైనటువంటి వేళ పరమేశ్వరుని యొక్క గుణాన్ని, పరమేశ్వరుడి యొక్క విశేషణాన్ని, పరమేశ్వరుడి యొక్క గాథని అంటే నిజానికి పరమేశ్వరుడికి కథ ఉన్నదా అని ప్రశ్న. పరమేశ్వరుడికి కథలు లేవు. కథ లేనివాడే పరమేశ్వరుడు. మన అందరి కథలకి నాయకుడు కథా నాయకుడు ఆయన గనుక భాగవతం తీసుకోండి. భాగవతంలో కృష్ణుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళాడు. విష్ణువు అనుకోండి. మరి అక్కడ ఉన్నదంతా భాగవతమంతా ఎవరున్నా? భాగవతులు అంతా ఉన్నారు అక్కడ. భగవత్ తత్వాన్ని అనేక మార్గాలలో ఉపాసన చేసిన వారందరి కథలు ఒకచోట ఉంటే దానికి పరిష్కార యోగ్యమైనటువంటి అనుగ్రహ వరదానం చేసిన పరమాత్మ కూడి ఉన్నాడు గనుక అది భాగవతమైంది.భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ ముక్తుల యొక్క ముక్త సమాహారమే భాగవతం గనుక కథలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని పరమేశ్వరుడి యొక్క వ్యాజమైన అంటే కారణం లేనటువంటి నిరుపమానమైనటువంటి ఒక కరుణా విశేషాన్ని మనం చక్కగా అనుభవిస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడు మనకు అనుగ్రహించేటువంటి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క విషయము, ఒక్కొక్క అనుభవము, ఒక్కొక్క అనుభూతి మనకి అమదానంద స్థితిని ఇస్తుంది. అంటే భక్తి అంటే కేవలం పూజ మాత్రమే కాదు. పూజ దేహం దేహానికి చేసినట్లు లెక్క. స్తోత్రం ఆయన గుణ విశేషాలను సంకీర్తనం చేసినట్లు లెక్క. భజన ఆయన గుణగానాన్ని సం-సంకీర్తనం చేసినట్లు లెక్క. మరి ఏమవుతున్నది భక్తిలో అంటే పరమాత్మ ఒకడున్నాడని, ఆయనకు షోడశోపచారాలు చేసి ఆయనకు సేవ చేస్తే మనకి తగిన ఫలితాన్ని ఆయన ఇచ్చి మనకెట్టి కష్టము లేకుండా జీవితాన్ని అవతల గట్టుకు తీర్చు-తీసుకుని వెళ్ళేటువంటి ఒక గొప్ప నావికుడు అని ఒక భావన కలుగుతుంది. అన్నివేళలా భగవంతుని యొక్క అనుగ్రహం మన యందు ఉన్నది అని అనుకోవటమే భక్తి, అచంచల విశ్వాసం. ఎట్టి పరిస్థితులలోనూ స్వామి అంటారు సుఖంలో-- "కష్టంలోనే కాదు బంగారు సుఖంలోనూ నన్ను తలుచుకోండి" అంటారు. ఎందుకంటే సుఖమే జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కష్టంలో మనం ఎలాగూ భయం వల్ల జాగ్రత్తగా ఉంటాం. బాగా సుఖపడుతున్న వేళ చాలా అజాగ్రత్తగా ఉంటాం. సుఖం అన్నివేళలా మనకి ఇట్లాగే ఉంటుందనుకుంటాం, ఉండదది. పడుగు పేకల వలె ఉంటుంది. అంటే నిలువు పోగు అడ్డం పోగు రెండు ఉంటేనే వస్త్రం తయారవుతుంది. కష్టం, సుఖం రెండూ కలబోతా ఉంటేనే ఆధార వస్త్రం, జీవన వస్త్రం ఏర్పడుతుంది గనుక నిలువు పోగు ఎంత perfect గా వేశావో అడ్డం పోగు కూడా అంత perfect గా ఉండు. కష్టంలో నువ్వు పరమాత్మకు ముడుపు కడుతున్నావు, కొండ ఎక్కుతున్నావు, ప్రదక్షిణ చేస్తున్నావు. "స్వామి పని అయితే మళ్ళీ నీకిదేదో చేస్తాన"ంటున్నావ్. సుఖంలో కూడాను. "పరమాత్మ సుఖించటానికి ఇంత ఇచ్చావయ్యా, నీ ద్వారా నేనేం చేయాలి, నీకేం చేయాలి?" స్వామి అంటారే, "కింకరుడైన వాడే శంకరుడు అవుతాడు తప్ప, నేనేం చేయాలి అని అడిగేవాడే శంకరుడు తప్ప, మీరు నాకేం చేస్తారన్న వాడు శంకరుడు కాదు." కనుకనే సత్య సాయి భగవానుడి దివ్య అవతారం అంతా అడిగిన వారికి, అడగని వారికి, అడిగి అడగని వారికి, నమ్మినవారికి, నమ్మని వారికి, నమ్మి నమ్మని వారికి అందరికీ ఒకే సమమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం స్వామి అనుగ్రహించటానికి కారణం భక్తిని జాతిలో పెంపొందించటానికి. పరమాత్మ యందు లక్ష్యమున్న వాడు, పరమాత్మని గమ్యంగా పెట్టుకున్నవాడు, పరమాత్మతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడు వాడి జీవితం ఒక మాధురీ వసంతంగా ఉంటుంది. అది అత్యద్భుతమైనటువంటి ఉదాత్త అనుదాత్త స్థాయిలతో కూడిన సంగీతమయంగా ఉంటుంది. ఎక్కడ ఉదాత్తత ఉన్నదో ఉదాత్త స్థాయి ఉన్నదో అనుదాత్త స్థాయి కూడా ఉన్నది. ఎక్కడ ఉచ్ఛైశ్వర్యం ఉన్నదో కింద స్థాయి కూడా ఉన్నది. ఎక్కడ ఎగుడు ఉన్నదో అక్కడ దిగుడు ఉన్నది. అంటే చీకటి వెలుగులు, ఎత్తు పల్లాలు, జనన మరణాలు, ఆశాభంగాలు, జయాపజయాలు, ఉదయ-ఉదయాస్తమయాలు ఎట్లాగైతే ద్వంద్వంగా రెండుగా ఉన్నాయో, మానవ జీవితం అంతా ద్వంద్వంగా ఉన్నది గనుక ద్వంద్వమైన అంటే రెండుగా కనిపిస్తున్న భగవంతుడు, భక్తుడు అన్నటువంటి రెండు భావనల నుంచి నెమ్మది నెమ్మదిగా భక్తి యోగంలో జీవుడు, సాధకుడు యోగవంతమైనటువంటి ఆధ్యాత్మిక భూమికలోకి వెళ్ళాలి. ఆధ్యాత్మిక భూమికలో నిలకడ చెందినప్పుడు, "పరమాత్మ వలె నేను కూడా ఉండగలనా ఎప్పటికైనా? పరమాత్మ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు?" ఒక సూర్యుడు సమస్త జీవులకు అంటాడు పోతన. ఒక్క సూర్యుడే సమస్త జీవులకు ఏమేం కావాలో ఇస్తున్నాడు. scientist D vitamin అన్నాడు, ఇంకోడు A vitamin అన్నాడు, chlorophyll అన్నాడు, ఇంకోడు శరీరానికి కావలసినటువంటి శక్తి అన్నాడు, చైతన్యాన్ని ఇచ్చాడన్నాడు, ప్రాణం పోశాడన్నాడు, ఆహ్ తామర పూలు వికసించటానికి భాస్కరుడి వలె వచ్చాడన్నారు. అంటే ఒక సూర్యుడు ఇంతమంది జీవులకి ఎవరెవరికి ఏయే సన్నివేశాలలో అవసరమున్నదో కనిపెట్టి తీరుస్తున్నాడో అటువంటి శక్తి నాలో కూడా ఉద్దీపనం చెయ్య అనటానికి వీలుగా మనం భక్తి యోగంలో ఉండాలి. భక్తి యోగంలో ఉన్నప్పుడు, భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మనం సుఖంగా నిద్రపోతాం. ఒక మంచి రాజు రాజ్యం చేస్తున్నప్పుడు రాజ్యము చిట్టచివర సరిహద్దులలో ఉన్న సైనికుడు కూడా నిద్రపోతాడు. అలాగే సరిహద్దులను పహరా కాస్తున్న సైనికుడు సమర్థవంతుడు, నిజాయితీపరుడు, విశ్వాసం ఉన్నవాడైతే రాజు కూడా తన అంతఃపురంలో గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోతాడు. అంటే రాజు, బంటు యొక్క సంబంధం ఎట్లా ఉన్నదంటే, రాజు వలన బంటు, బంటు వలన రాజు. అట్లే భగవంతుని వలన భక్తుడు, భక్తుడి వలన భగవంతుడు ఇద్దరూ ఏకకాలంలో రెండు రూపాలుగా, రెండు స్వభవా-స్వభావాలుగా, రెండు స్వరూపాలుగా, రెండు గుణాలుగా ద్వంద్వంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వారి లక్ష్యం ఒకటే. చేరవలసిన వాడు జీవుడు, చేర్చవలసిన వాడు దేవుడు. మధ్యలో ఏమున్నదయ్యా? సంసార సాగరం ఉన్నది. అందుకే భగవాన్ సత్యసాయి చక్కని మాటన్నారు. ఏమిటా మాట? దుస్తర భవసాగర తరణం. ఏమిటది? మానస భజరే గురు చరణం. మానస భజరే మనసులో గురువుని అన్నివేళలా తలుచుకో. ఇక్కడో విశేషం ఉన్నది భక్తి అంటే ఎవరి యందు భక్తి ఉండాలి అని. పోనీ దేవుడు రోజూ మాట్లాడడు. రోజూ మాట్లాడేవాడు ఎవడన్నా దొరుకుతాడా మనకి అని. ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగిని. ఈశ్వరుడు అంటే కనుగొనవలసిన ఈశ్వరుడు, కనపడవలసిన ఆత్మ, గురు స్వరూపంగా జగత్తులోకి వచ్చాడు అని అర్థం. ఈశ్వరో, గురు, ఆత్మ ఇతి మూర్తిత్రయ విభాగిని. మూర్తి అంటే బొమ్మ. మూడు బొమ్మలుగా వచ్చినాయి కానీ మూడు ఒకటే. ఇడుగో దేవుడు అని చెప్పేవాడు ఒకడుండాలి. వచ్చినవాడు దేవుడా అని గమనించగలిగిన శిష్యుడు ఉండాలి. ముగ్గురూ ఏర్పడితేనే దృశ్యం ఏర్పడుతుంది గనుక కబీరు జీవితంలో భక్తి యోగంలో ఒక పరమాద్భుతమైన సన్నివేశం మనం గుర్తు చేసుకోవాలి. కబీర్రామనామ జపం చేసుకునేటువంటి చోటికి ప్రతిరోజు గురువుగారు, ఆయన గురువుగారు వచ్చేవారు. కబీరు ఎలా ప్రయాణం చేస్తున్నాడో చూడటం ఆయనకిష్టం. ప్రతిరోజు వచ్చే గురువుగారు ఒకరోజున ఎవరో కొత్తవాడిని ఒకాయన్ని వెంబడి పెట్టుకొని వచ్చాడు. కొత్తగా వచ్చినటువంటి వాడు తన గురువుతో సమానంగా వెలిగిపోతున్నాడు. అది ఆశ్చర్యం! "అరే! ఇంతవరకు ఇంత గొప్ప వ్యక్తిని నేను చూడలేకపోయానే, ఇవాళ గురువుగారు తెస్తున్నారే, ఎవరు ఈయన?" అని అనుకుంటూనే, ఇంత సాధనా పరిపక్వమైనటువంటి కబీర్ మనస్సు కూడా "ఇందులో ముందు ఎవరికి నమస్కరించాలి?" అని మనస్సు ఆరాటపడ్డది. రోజు వచ్చేటువంటి, కనపడేటువంటి మా గురువుకా? ఇవాళ వచ్చిన అతిథి రూపంలో వచ్చిన పక్కవారికా? ఎవరికి? అని తొట్రుపాటు పడింది మనస్సు కదా, సాధకుడి మనస్సు. రోజు వచ్చే గురువుగారేలే అనుకోలేదు మనస్సు, క్షణంలో వివేకం మేల్కొని "గురు గోవింద్ దోనో ఖడే కాకే లాగో పాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే" అన్నాడు. అనుకున్నాడాయన. అంటే, ఎంత అందమైన దోహానో చూడండి. వచ్చాడు, నా గురువు వచ్చాడు. గురువుతో ఎవరో ఒక వ్యక్తిని ఉంచుకొని ఉన్నాడు. దోనో ఖడే, ఇద్దరూ నించొనే ఉన్నారు నా కళ్ళ ముందే. అందులో నా గురువు మాత్రం ఏం చెప్పాడంటే, "కబీర్! ఇవాళ నీకోసం దేవుణ్ణి వెంబడి పెట్టుకొచ్చానోయ్" అన్నాడు. "దైవాన్ని చూపించిన నా గురువుకే నేను నమస్కారం చేస్తున్నాను" అన్నాడు. "గురు గోవింద్ దోనో ఖడే కాకే లాగో పాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే" అంటే, దైవాన్ని చూపించే గురువు మనకు కావాలి. ఇక్కడ రెండు విశేషాలున్నాయి. త్రేతాయుగాన్ని ప్రభావితం చేసిన రామచంద్ర ప్రభువు, ద్వాపర యుగాన్ని పరమాద్భుతంగా చాకచక్యంతో నడిపించిన కృష్ణ చైతన్యము గుర్తొస్తే, శ్రీరామచంద్రుడికి ఇద్దరు గురువులు. ఒకడు బోధ గురువు వశిష్టుడు బ్రహ్మర్షి. రెండవ వాడు ఆచార్య గురువు. ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు. సాధక గురువు అన్నమాట. విశ్వామిత్రుడు, రెండవ బ్రహ్మర్షి. రాముడు అనబడేటువంటి పూర్ణ అవతారానికి ఇద్దరు గురువులు ఏర్పడ్డారు. కృష్ణుడి యొక్క అవతారంలో సాందీపుడు ఏర్పడ్డాడు బోధ గురువుగా. సత్య సాయి భగవానుడు అంటే భగవంతుడే కలియుగ మానవులకి గురువై వచ్చాడు. స్వామికి గురువు లేడు. ఎందుకని? గురోర్గురువు గనుక రామకృష్ణాది అవతారాలకు కూడా ఇదిగో ఈయన గురువు, ఈయన గురువు అని చెప్పడానికి ఉంది. మరి స్వామికి ఎవరు గురువు? ఎవరూ లేరు. ఎందుకనంటే గురువు గురువులకి అతీతమైనటువంటి, అన్ని గురువులకి మూలమైనటువంటిది కాబట్టి గురు స్థానానికి స్వామి వేళ దివ్యత్వాన్ని, దివ్యుడైనటువంటి భగవత్ తత్వానికి గురుతత్వాన్ని, రెండింటితో పాటుగా ఒక పితృత్వాన్ని, పితృత్వంతో పాటు మాతృత్వాన్ని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్న నాలుగు సోపానాలు ఏకకాలంలో దర్శనమిచ్చినటువంటి మహా పరిపూర్ణ అవతారి భగవాన్ సత్యసాయి కనుక స్వామికి మనం నమస్కరించాలి. అన్ని వేళలా, అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో, అన్ని క్షణాలలో. ఎందుకంటే ఒక్కటే. ఏం పుణ్యం చేసుకున్నామో! భరద్వాజ మహర్షి దేవుణ్ణి చూడాలి అని అనుకున్నాడు. తపస్సు ప్రారంభించాడు. వందేళ్ళు లక్ష్యం పెట్టుకున్నాడు. వందేళ్ళు అయిపోయింది. వందేళ్ళు అయిపోగానే భగవంతుడు వచ్చాడు. "ఏం కావాలి నీకు?" అని అడిగాడు. "భగవంతుణ్ణి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. నాకెక్కడా మొదలు కాలేదు. ఇంకొక వందేళ్ళు అనుగ్రహం ఇస్తావా?" అన్నాడు. "అట్లాగే, మంచి పని కదా, చెయ్యి" అన్నాడాయన. వందేళ్ళు, రెండొందలేళ్ళు, మూడొందలేళ్ళు, నాలుగొందలేళ్ళు అయిపోయింది. నాలుగొందల ఏళ్ళు అయిన తర్వాత భగవంతుడు మళ్ళీ భరద్వాజ మహర్షికి కనిపించాడు. "ఏం కావాలి?" అన్నాడు. "ఇక నిన్ను అడగను. ఎందుకంటే, ఇట్లా నాలుగు లక్షల సంవత్సరాలు నాకు వయసు ఇచ్చినా భగవత్ తత్వాన్ని నేను పొందలేను, గ్రహించలేను. ఇది అనంతమైనటువంటి, చాలా విస్తృతమైనటువంటి విషయం గనుక నాకిక్కడితో ఈ-ఈ కోరికని సమసింపజేయమని" అడిగాడు. మరి ఆధునిక మానవుడు, కలియుగంలో మానవుడు భరద్వాజ మహర్షి కంటే గొప్ప తపస్సు చేసి ఉండాలి. నాలుగొందల ఏళ్ళు తపస్సు చేస్తే దర్శనమే పొందలేదు భరద్వాజుడు. మరి మనమేమి తపస్సు చేశామో స్వామిని నాలుగొందల సార్లు చూడగలిగాం. ఇంతకు మించిన అదృష్టం ఉన్నదా అని విచారణ చేస్తే భక్తి వలననే ఇది సాధ్యమైంది అని మనకి... మనకి స్వామి యందు భక్తి తగ్గుతూ వచ్చింది అనుకోండి, "ఆ చూశాం కదా, ఇంకా ఏముంది స్వామిని చూట్టానికి" అంటుంది మనస్సు. భక్తి స్వామి యందు కుదురుకొని ఉన్నది అనుకోండి, "నిన్నటిదాకా చూశానయ్యా, అదంతా పాచిమాట. అయిపోయింది అది. కొత్తగా మళ్ళీ నాకు మధ్యాహ్నం దర్శనం ఇవ్వబోతున్నారు స్వామి? దానికోసం నేను కూర్చొని ఉండాలి. నిన్న చూశానయ్యా, మళ్ళీ ఈవేళ బతికానుగా, ఈవేళ పుట్టానుగా, మళ్ళీ ఈవేళ స్వామిని చూడాలి." ఇది భక్తిలో పారమ్యం. ఎవరి మనస్సు ఆర్ద్రమై ఉంటుందో, ఎవరి మనస్సు పరమాత్మ యందు లగ్నమై ఉంటుందో, నిత్య నూతనమై ఉంటుందో, ఎవరి మనస్సు భయం లేకుండా ఉంటుందో, ఎవరి మనస్సు సమర్పణ భావంతో కూడి ఉన్నదో, ఎవరి మనస్సు శరణాగతి పొందిందో, ఎవరి మనస్సు ఆయన తప్ప అన్యమైన మరొక్క గతి లేదని ఒక నిశ్చితమైనటువంటి భావనకు లోనయ్యిందో, ఎవరు తమను తాము పూర్ణముగా సమర్పించుకొని నిస్సేషంగా, అంటే ఇంకా ఏమీ మిగలనంత స్థాయిలో సమర్పణ చేసుకోగలిగారో వాడు పూర్ణమైన భక్తుడు వలె ఉంటాడు. రెండవది, భక్తుడు అనటానికి భగవంతుని బోధ వినటానికి మాత్రమే కాదు, భగవంతుడు చెప్పినవి నిత్య జీవితంలో ఆచరించాలి. గురువుకి గానీ, భగవంతుడికి గానీ ఆనందం కలిగించే విషయం ఒక్కటే. మనం చేసే ఆరాధనలు గానీ, ఉత్సవాలు గానీ, వేడుకలు గానీ, జాతరలు గానీ భగవంతుణ్ణి కూడా నిజానికి కదిలించవు. అవన్నీ మనం మన ఆనందం కోసం చేసుకునే పనులు. మరి నిజానికి పరమేశ్వరుడికి సంతోషం కలిగించే పని ఏమి? పరమేశ్వరుడు చెప్పిన మాట విని దానిని జీవితంలో ఎవరు ఆచరిస్తారో వారియందు పరమాత్మకు ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానము.ప్రత్యేకమైనటువంటి ఒక అనుగ్రహము ప్రేమ కరుణ ఇవన్నీ ఉంటాయి గనుక భక్తి యోగంలో అంటే పరమాత్మతో కూడి ఉన్నటువంటి భక్తి విశేషంలో అన్నివేళలా పరమాత్మతో కూడి ఉండాలి మనం. పని మీద అన్న వెళుతుంటాం వెళుతూ వెళుతూ పని మీద వెళుతున్నాను స్వామి నువ్వే చూసుకోవాలి అని అడగటం ఒక ఎత్తయితే, ఇన్ని పనులు ఎలా చేయగలిగారండి మీరు అంటే నేను పరమాత్మతో కూడి ఉన్నాను పరమాత్మ కూడా నాతో కూడి ఉన్నారు గనుక పనులు జరుగుతున్నాయి అని చెప్పుకోగలగాలి. అంతే తప్ప మన కష్టాన్ని మన సుఖాన్ని పరమాత్మ ఒళ్ళో వేసేసి నువ్వు పరిష్కారం చేయ్యనటంలో న్యాయం లేదని, మన భావనలో పరమాత్మ భావనను నింపుకొని పరమాత్మ యొక్క స్థితిని మనం అన్నివేళలా అనుభవిస్తూ ఇదిగో శరీరం ద్వారా మనస్సు ద్వారా అనుభవం ద్వారా ఆలోచన ద్వారా పరమాత్మే సమస్తన్ని ఆచరింప చేస్తున్నాడు పరమాత్మే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆనందం అనేటువంటి వెల్లువలో నేను కూడా కొన్ని క్షణాలు నిలబడగలిగాను అన్నటువంటి సంపూర్ణ శరణాగతి భావమే భక్తిగా మనం భావన చేయాలి. రామాయణంలో చిన్న సన్నివేశం ఉంది. శబరి మాతంగ మహర్షి ఆశ్రమంలో సేవ చేస్తుంది గిరిజన పుత్రిక ఆమె. మాతంగ మహర్షి రోజు సాయంకాలం శబరిని పిలిచాడు. రేపు పొద్దున రామచంద్ర ప్రభువు ఇక్కడికి రాబోతున్నాడు. ఆయన్ని సేవించి దర్శనం చేసుకో. సరేనా నువ్వు ఇంతకాలం ఆశ్రమంలో చేసిన దానికి ఫలితం ఇది అని చెప్పాడు ఆయన. శబరి ఆశ్చర్యపోయింది. అంటే మీరు రాముడిని చూడరా, రాముడే మన ఆశ్రమానికి వస్తున్నాడని మీరే చెప్తున్నారు కదా స్వామి మరి మీరు రామదర్శనం చేసుకోరా అని. రామదర్శనం చేసుకోవటానికి అర్హత నువ్వు పొందావు. నేను ఇంకా పొందవలసి ఉన్నది. కనుక నేను ఇక్కడి నుంచి వైదొలుగుతున్నాను. నీవు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన శరణాగతి పొందిన భక్తురాలివి గనుక, నేనెవరో నీకు తెలియకపోయినా నాకు సేవ చేసినందువలన ఏం కలుగుతుందని ప్రశ్న లేకుండా ఆశ్రమంలో చేయవలసిన సేవ చేసినందుకు ఫలితమే భగవంతుడు నీ వాకిట దాకా నడిచి వస్తున్నాడు. ఆయన్ని చక్కగా దర్శనం చేసుకో అన్నాడు. మర్నాడు మధుర క్షణం రానే వచ్చింది. శబరి కనుగుడ్లన్నీ కూడా ఎండిపోయినాయి. ఎదురు చూసి చూసి. ఒళ్లంతా సృష్టించి పోయింది వయస్సు చేత, తపస్సు చేత, భావన చేత, పరమాత్మ యందు మనస్సు లగ్నమైన కారణంగా. రాముడు వస్తూనే అన్నాడు. ఎందుకు తెచ్చావు అవ్వ నేను ఎలాగూ వచ్చా కదా నీకు కనపడకుండా ఎలా వెళ్తాను. మళ్ళీ ఇంత దూరం ఎందుకు నడిచి వచ్చావు, పూలేమిటి పళ్ళేమిటి అంటే, చేతులునికి పూని పూలు తెచ్చితిని స్వామి సతనువగుటను పండ్లు తెచ్చితిని స్వామి అన్నది. అంటే నాకు ఇంకా చేతులు ఆడుతున్నాయి కనుక పూలు కోసి తెచ్చాను రామా. ఇంకా దేహం ఆశ్రయించి నేను ఉన్నా ఇంకా దేహంలో ఉన్నాను కదా, అందుకని మా రామచంద్రుడి కోసం కొన్ని పళ్ళు తీసుకువచ్చా. భక్తిభావంలో ఇది పరాకాష్ట. ఎందుకంటే మన కోరికలు తీరే దాకా ఉండే భక్తి భక్తి కాదు. అన్ని వేళలా ఆనందం అనుగ్రహించేదే భక్తి అనుకుంటే అది భక్తి కాదు. ఆనందాన్ని దుఃఖాన్ని సమస్థితిలో అనుభవించగలిగిన ఒక మానసిక స్థితిని మనకు ఏది కలిగిస్తుందో అది భక్తి. శరీరంలో ఉన్నాను గనుక పళ్ళు తెచ్చానయ్యా, చేతులున్నాయి గనుక పూలు తెచ్చానయ్యా అని వృద్ధ స్త్రీ అయినటువంటి శబరి వలె మన మనసుని కూడా చేతులు ఉన్నందుకు సేవ చేస్తానయ్యా, శరీరంలో ఉన్నాను గనుక నీ సంకీర్తనం చేస్తానయ్యా, సర్వ ప్రకృతికి నీ యొక్క భావనలు అందిస్తానయ్యా, నే చేయగలిగిన సేవ నా శరీరం ద్వారా, నా తనువు ద్వారా, నా మనసు ద్వారా, నా చేతుల ద్వారా, చేతల ద్వారా, నీ యొక్క భావనా పరివ్యాప్తిలో నేనుంటానయ్యా అన్నటువంటిది భక్తే తప్ప విడదీసేది విభక్తి కలిపి ఉంచేది భక్తి. పరిపూర్ణమైనటువంటి భక్తి యోగాన్ని స్వామి చూడండి సర్వమతాలని ఒక గొడుగు కిందకు తెచ్చారు. ముక్కోటి దేవతలని గొడుగు కిందకు తెచ్చారు. రాముడి మీద, శివుడి మీద, కృష్ణుడి మీద మీకు ఎవరిష్టమైతే వాడి మీద హాయిగా పాడుకోండి అన్నారు. నువ్వు మతంలో ఉంటే నాకేమి మతాన్ని మాత్రం నమ్మి ఉండు. మతం ఏమి బోధించిందో దానిని నువ్వు అనుష్ఠానం చెయ్. నువ్వు గనుక నిజంగా హిందువు అయినట్లయితే ఒక నిజమైన హిందువుగా జీవించు. నువ్వు ముస్లింవి అయినట్లయితే నిజమైన ఇస్లామిక్ భావనతో జీవించు. నీవు ఒక మంచి క్రిస్టియన్ గా ఉండాలి క్రిస్టియానిటీని పాటించు. అంతేతప్ప మతం అనేటువంటిది మానవుడికి అడ్డుకోడ కాకూడదు, అడ్డదారి కూడా కాకూడదు, అది రాచబాట కావాలి. మన మతిని ప్రభావితం చేయాలి, వెలిగించాలి. వెలుగు దారిలో మనం వెన్నెల పుంతలు తొక్కుతూ వెళ్ళాలి. వెళుతూ వెళుతూ పరమాత్మ కనిపిస్తున్న పెను వెలుగులోకి చిన్న వెలుగులన్నీ కూడా చక్కగా ప్రస్థాన పరిమళంగా సా-సాగాలి. సాగి రెండూ కలవాలి, యోగించాలి. ఇదే పూర్ణమైనటువంటి భక్తి యోగంగా భావన చేస్తూ కార్యక్రమాలు చేసినా పరమాత్మను ముందు పెట్టుకుందాం. ఒకటే అనుకోవాలి. పరమాత్మ పని మీద వెళుతున్నాను నువ్వు అనుగ్రహించని అడగొద్దు. పరమాత్మ నీకు ఎట్లా తోస్తే నాకు ప్రాప్తి ఉంటే ప్రాప్తిని మాత్రం నువ్వు నాకు అనుగ్రహించు ఒకటి. రెండవది నా అర్హత కంటే మించి కోరికలు రాకుండా నా మనసును నియంత్రించు. మూడవది నేను ప్రపంచంలో ఏది పొందాలన్నా పొందుతున్న దాంట్లో నా పాత్రను మాత్రం నిర్దిష్టం చెయ్. కేవలము నీ అనుగ్రహమే కేవలము నా ప్రజ్ఞే కాక, నా ప్రజ్ఞ అంటే నా సాధన, నా శోధన, నీ యొక్క అనుగ్రహము, నీ యొక్క దివ్యమైనటువంటి మహా అమృత వృష్టి వలె సాగేటువంటి ఒక కరుణా దృష్టి నాపై ఉంచి మన ఇద్దరం కూడా నీ అడుగుజాడల్లో మేము నడిచే అట్లుగా, నీ భావనలో మా మనసు రాగరంజితం అయ్యేట్లుగా, మనోజ్ఞ రమణీయ స్థితిలో సంచారం అయ్యేట్లుగా అనుగ్రహ వరదానం చేయమని భగవంతుణ్ణి ప్రార్థించడమే నిజమైనటువంటి భక్తి గనుక కూడి ఉండేటువంటి భక్తికై మనం ప్రయత్నిస్తూభగవంతుణ్ణి మెప్పించే పనులు చేస్తూ తద్వారా ఆనందాన్ని పొందుతూ ఆనందంలో మనము పాలుపంచుకుంటూ మనం పొందిన ఆనందాన్ని సర్వ జగత్తుకి ఇస్తూ మన ప్రస్థానం కొనసాగుగాక భక్తి యోగ మార్గంలో అని భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ భక్తి యోగాన్ని అనేకమంది భాగవతులు అంటే బలి, ప్రహ్లాదుడు, గజేంద్రుడు భాగవతంలో ఉన్నటువంటి మహా భక్తులు అందరి కథలు చూడండి. పరమేశ్వరుడు ఉన్నాడో లేడో అంటూ వెళ్ళిన వాడు కొందరు, ఉన్నా నాకెందుకు దక్కుతాడులే అని కొందరు, దక్కినా నా వాడు అవునో కాదో అని మరికొందరు. రకంగా అనేకమైనటువంటి స్థాయిలలో విచారణ చేస్తూ వెళ్ళినా అందరియందు విశేషమైనటువంటి కృపను చూపించిన వాడు కరుణాళువు, దయాళువైన పరమాత్మ గనుక పరమాత్మతో కూడి ఉండటమే భక్తి. భక్తి సామ్రాజ్యంలోకి మనం వెళ్ళాలి. జాగరాజ స్వామి అంటాడు, "రామచంద్ర ప్రభూ! నేను ఎంత తపస్సు చేసినా, ఎంత కీర్తి గుణగానం చేసినా, నీ దర్శనం నాకు లభిస్తుందో లేదో తెలియదు గానీ నిన్ను నమ్ముకున్నటువంటి ఒక సద్భక్తుడి యొక్క ఆవరణంలోకైనా నన్ను ప్రవేశింపజేయవయ్యా." రామ సామ్రాజ్యం, భక్తి సామ్రాజ్యంలోకి వెళ్ళేట్లుగా నాకొక చిన్న అవకాశం అంటారు జాగరాజ స్వామి. తరించి పాడిన వాడాయన. పాడి తరించిన వాడు కాదు. తరించి పాడిన జాగరాజ స్వామి అలా అన్నప్పుడు మనం ఎంత తరించాలి? ఎన్ని పొగొట్టుకోవాలి? ఎన్ని భావనా స్థితులు దాటాలి? పరమాత్మను ఎంతగా అనుభవించాలి? అనుభవించి, అనుభవించి అనుభవమే మనమై, అనుభవం కాగా, కాగా అనుభూతిమయం మ-మనమై, అనుభూతి కాగా, కాగా విభూతిమయమై పూర్ణమైన విభూతి స్థాయికి వెళ్ళమనే స్వామి యొక్క విభూతి ప్రసాదనం చేయటం వెనుక ఉన్న అంతరార్థంగా గ్రహిస్తూ, భావిస్తూ భక్తి యోగంలో విభూతి స్థాయికి షడైశ్వర్యాలలో ఇవాళ currency కి విలువ లేదు, చోటు లేదు. ఉన్నదే ఉన్నదయ్యా విభూతి స్థాయి. అత్యుత్తమమైన దానికి ఇవ్వటానికి వచ్చిన పరమాత్మని trivial and trash అల్పమైనవి, స్వల్పమైనవి అడక్కుండా కోరదగినది, కోరవలసినది అవకాశం ఉన్నప్పుడు కోరవలసిన స్వామినే కోరుకుంటూ భక్తి సామ్రాజ్యంలో మనందరం కూడా సుసుక్షితమైనటువంటి భక్త బృందంగా, పరిపూర్ణమైనటువంటి ఆనంద బిందువులుగా మన జీవితాలు కొనసాగాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio

Talk on Sri Sathya Sai - Part 05

Home

Talk on Sri Sathya Sai - Part 05

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 32:57

More in this series

Talks

14 episodes · 6 hr 52 min

  1. 24 min 1

    Talk on significance of festival of Sankranthi

  2. 52 min 2

    Talk - on Guru Tatwam

  3. 40 min 3

    Talk - Koti Samithi Hyd

  4. 28 min 4

    Talk - Bharata

  5. 23 min 5

    Talk on Dasara

  6. 6 min 6

    Talk on Rathasaptami

  7. 32 min 7

    Talk on Sri Sathya Sai - Part 05

    Now playing
  8. 33 min 8

    Talk on the character of Draupadi

  9. 30 min 9

    Talk on Gyana Yoga

  10. 29 min 10

    Talk on Hanuman Panchamukham

  11. 23 min 11

    Talk on Leela Kaivalya Vahini

  12. 35 min 12

    Talk on Sathya Sai Sukthamulu

  13. 24 min 13

    Talk on yoga Triveni

  14. 26 min 14

    Talk on the occasion of Avatar Declaration day