Skip to content
Transcript తెలుగు
ఓం శ్రీ సాయిరాం! ఈరోజు భగవద్భక్తుడు, దాసుడు, అనుజుడు, పూర్ణుడు అయినటువంటి అద్వైతమూర్తి హనుమం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. "కృతం హనుమతా కార్య సమవిద్విహు దుష్కరం మనసాపి యదన్యేన శక్యం ధరణీతలే" అంటాడు వాల్మీకి రామాయణంలో. అంటే, నిజానికి రామకథ పూర్ణమై రామపట్టాభిషేకమైనటువంటి మహా సంమంగళ వేళ రాముడు శాలంకృతుడై ఉన్నాడు. అంతఃపురం అంతా కూడా సభాభవనం అంతా కూడా ఒక గొప్ప వేడుకగా ఉంది, మన పుట్టపర్తి లాగా. అందరి కళ్ళు రామస్వామి మీద ఉన్నాయి. కానీ, రామస్వామి మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నారు. ఇంతమంది పురోహితులు, హితులు, సన్నిహితులు, పురప్రముఖులు, అంతఃపుర స్త్రీలు, వానర సమూహం, వీళ్లంతా కూడా రాముడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ పరవశించి పోతున్న వేళ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైనటువంటి నేత్రాలు దేనిని వెతుకుతున్నాయి అని అందరి యందు కలిగిన ఒక ప్రశ్న. సమాధానంగా కాసేపైన తర్వాత రామచంద్రుడు సింహాసనం దిగి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లారు. వ్యక్తి ఎక్కడ ఉన్నాడయ్యా అంటే రెండు సింహాసనాల వెనక పద్మాసనంలో ధ్యాన ముద్రాంకితమై ఉన్నాడు. కనుల వెంట అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. అశ్రుధారలతో ఆనంద పరవశం చెంది ఉన్నాడు చూసేవాడికి సమాధి స్థితిలో ఉన్నాడు. "నేను వచ్చాను" అన్నాడు రాముడు. ఎక్కడా జవాబు లేదు. మళ్ళీ "ఇదిగో నేను వచ్చాను చూడు" అన్నాడు, జవాబు లేదు. క్షణంలో శ్రీరామచంద్ర ప్రభువు తన దివ్య హస్తం చేత ఒక స్పర్శ చేసి తాకి "హనుమా! నేను వచ్చాను" అన్నాడు. అన్నాస్పృహ లేదు. "హనుమా! నీకోసం నేను వచ్చాను" అన్నాడు. క్షణం నెమ్మదిగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేసి హనుమంతుడు కళ్ళు తెరవలేకపోయినాడు. "కన్ను తెరువు, నీకోసం నేను వచ్చాను" అంటున్నాడు రామచంద్రుడు. తెరవలేనంటున్నాడు హనుమ. "నీ దివ్య నామస్మరణంతో అజపమైనటువంటి మహా ధ్యానంతో నా కళ్ళ నిండా ఆనందాశ్రువులు నిండిపోయినాయి. ఇంత ఆనందంతో కూడిన భాష్పాలు తెప్పించిన తండ్రి నీవే. కన్నీరు తప్పిస్తే తప్ప రెప్ప ఎత్తలేను" అన్నాడు. "లే లే" అన్నారు రామచంద్రుడు. చూశాడు దివ్యమంగళ విగ్రహాన్ని. మహా పరవశం చెందాడు. దేనిని ధ్యానించాడో, దేనిని నిజంగా స్మరించాడో, దేనిని ఒక తపస్స్వాధ్యాయంగా మార్చుకున్నాడో అటువంటిదే సాకారమై ప్రభువు తన దగ్గరకు వచ్చినటువంటి వేళ. రాముడు నవ్వుతూ ఒక మాటన్నాడు. "అంతఃపురం అంతా అయోధ్య అంతా పండగ చేసుకుంటున్నదే. నీకివేమీ పట్టలేదా? కన్ను తెరిచి చూసినట్లయితే ఎంత అందంగా ఉన్నదో చూశావా?" అన్నాడు. "వాటితో నాకేమి పని స్వామి? నాకు నీతో పని. నీ దివ్యమంగళ విగ్రహం కంటే, నీ సత్య సౌందర్యం కంటే మరొక సౌందర్యమైన వస్తువు ప్రపంచంలో ఉన్నదా?" అంటూ హనుమ లేచాడు. లేవటానికి శ్రీరామచంద్రుడు తన చిటికెన వేలు అందించాడు. శ్రీరామచంద్రుడి యొక్క చిటికెన వేలు రామావతారం మొత్తంలో రెండు చోట్ల మాత్రమే జరిగింది. ఒకటి సీతా స్వయంవర వేళ, కళ్యాణ వేళ. తర్వాత హనుమంతుడికి చిటికెన వేలు అందించాడు. హనుమంతుడు అని మనకు తెలుస్తున్నది గాని సభలో ఉన్నవారు ఎవరికీ హనుమ ఇంకా పరిచయం కాలే. నెమ్మదిగా చిటికెన వేలు పట్టుకొని అందించి హనుమంని సింహాసనం దాకా నడిపించాడు రామచంద్రుడు. సభ పరికించి చూస్తున్నది. మహా నిశ్శబ్దంగా ఉన్నది. అప్పుడు ఇందాక మనం అనుకున్న శ్లోకం చెప్పాడు రాముడు. అంటే శ్లోకంలో-- శ్లోకం ద్వారా తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించాడు రాముడు. అన్నాడు, "ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామి కార్యక్రమాన్ని, స్వామి యొక్క ఆజ్ఞని పాటించటంలో మరొకడు ఉన్నాడా? ఒకవేళ ఉన్నా వాడికి ఇట్లా చేయాలన్న మనస్సు ఉంటుందా అంటే ప్రపంచంలో మాత్రం మా హనుమ కంటే మరొకడు లేడు." అని రెండవ సారి ఆలింగనం అనుగ్రహించారు. మొదటిసారి ఎప్పుడయ్యా అంటే సీతాన్వేషణలో అమ్మవారిని దర్శనం చేసి రాముడి దగ్గరకు వచ్చి ఉన్నది ఉన్నట్లుగా దృశ్య సాక్షాత్కార భాజకంగా అంటే కన్నులకు కట్టినట్టుగా అమ్మవారి యొక్క స్థితిని చెప్పినప్పుడు రాముడు ఆనంద పరవశుడైపోయినాడు. దుఃఖం నుంచి బయట పడ్డాడు. అప్పుడు ఆలింగనం ఇచ్చాడు సముద్ర తీరంలో. మళ్ళీ సభామధ్యంలో రెండవ సారి ఆలింగనం ఇచ్చాడు. రెండు కౌగిలింతలు పరమాత్మ నుంచి స్వయంగా అనుభవించినటువంటి భాగవతోత్తముడు, భక్తుడు ఎవరు అంటే ఇదిగో మన హనుమ. నిజానికి మహామండలేశ్వరి అయినటువంటి అమ్మవారు దేవీ భాగవతంలో మాటన్నది. త్రేతాయుగంలో ఎనిమిది మంది మంత్రులతో కూడి నేను శ్రీరాముడై వెళ్తాను. శ్రీరాముడి యొక్క శక్తి, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు మూడు అవి నేనే. ఎనిమిది మందిలో ఒకడు పరమ ఉత్కృష్టమైనటువంటి మంత్రి ఉంటాడు. మంత్రి హనుమ అన్నది. మరి ఎవరు హనుమ? హనుమ అంటే వాళ్ళ అమ్మ అంజని దేవి పెట్టుకున్నటువంటి పేరు సుందరుడు. తల్లికైనా తన బిడ్డ సుందరుడేగా? కనుకనే ఆమె కూడా పేరు పెట్టుకుంది.అయితే సుందర అనేటువంటి ఆమె పెట్టుకున్నటువంటి పేరు కంటే ఇంద్రుడి యొక్క వజ్ర సంఘాతం చేత హనువులు అంటే దవడలు వాచిన కారణంగా ఆయన హనుమంతుడు అయినాడు. వాయుపుత్రుడు అంటే వాయువుకి ఆత్మజుడై పుట్టాడు గనుక వాయుపుత్రుడు అని. ఇవన్నీ కూడా గూఢం విశేషణాలతో కూడినటువంటి పేర్లు. కానీ అసలు పేరు సుందరుడు. మరి హనుమ మన పురాణ ప్రకారంగా చూసినట్లయితే పంచముఖ ఆంజనేయస్వామి అని మనం వింటాం. పంచముఖ ఆంజనేయస్వామి అంటే పౌరాణికమైనటువంటి విశేషణలతో ఒక్కొక్క దిక్కును చూస్తున్నప్పుడు ఆయనకు ఒక్కొక్క పేరు ఇవ్వబడింది. కానీ స్వామి అంటే మన స్వామి. పంచ ముఖాలకి ఇచ్చిన వ్యాఖ్యానం చాలా వినూత్నమైనది, విశిష్టమైనది, అర్థవంతమైనది, సత్యార్థమైనది. ఏమున్నాయి అంటే ఆంజనేయస్వామికి ఐదు ముఖాలు లేవు బంగారు. ఆయనలో ఉన్నటువంటి వీరత్వమే ఐదు పాయలుగా ప్రస్ఫుటించింది ఆయన జీవిత కాలంలో. అందులో దయావీరం, దానవీరం, విద్యావీరం, ధర్మవీరం, రణవీరమని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ధర్మవీరం. ధర్మవీరం ఎట్లా ఉన్నదయ్యా అంటే పూలతో కూడినటువంటి ఒక దారానికి వాసన ఎట్లా ఏర్పడుతుందో, సుగ్రీవుడి దగ్గర కర్మవశాత్తు కొంతకాలం మంత్రిగా ఉన్నా, స్వామిగా ఆయనను భావించినా, శ్రీరామచంద్ర ప్రప్రథమ దర్శనంతో భార్యలను పోగొట్టుకున్నటువంటి ఇద్దరు పురుషులు, ఒకరు లోకానికి చెందినవారు, ఒకరు లోకాతీతమైన పురుషోత్తముడు. రెండు దుఃఖాలు వాళ్లది ఏకం కనుక వీళ్ళ మధ్య స్నేహం బాగుండాలి అనుకున్నాడు. కనుక రామచంద్రుడికి ఒక ఆప్త వాక్యాన్ని, ఆత్మీయ వాక్యాన్ని, మధురమైనటువంటి వచో వినాణంతో సంభాషణా చాతుర్యంతో రాముడి యొక్క హృదయాన్ని మొదటి కలయికలోనే మొదటి స్పర్శలోనే అనుభవించాడు పొందాడు హనుమ. లక్ష్మణుడు ఎంత వారించినా రాముడు అన్నాడు, "లక్ష్మణా! హనుమంతుడి మాటల వెనుక ఉన్నటువంటి నిజాయితీను నువ్వు గమనించటం లేదా? భక్తి గమనించటం లేదా? శరణాగతి గమనించటం లేదా? ఒక అనంతమైనటువంటి సత్య పారమ్యాన్ని గమనించటం లేదా? కనుక ఇతనిని నేను గ్రహిస్తున్నాను" అన్నాడు. ఎలా గ్రహించాడు? ఆత్మ యొక్క ఒక ప్రతిధ్వనిగా గ్రహించాడు. అయితే హనుమ చూడండి ధర్మవీరంలో శ్రీరామచంద్ర ప్రభువు పరిచయం అయ్యేదాకా తన యొక్క శక్తి యుక్తులు అన్నింటినీ కూడా తను-మన అంటామే రెండింటిని కూడా సుగ్రీవుడి కోసము మాత్రమే వెచ్చించాడు. అయితే తాను భావించినటువంటి సుగ్రీవుణ్ణి కాపాడగలిగినటువంటి శక్తి ఉన్నా మరొక బలవత్తరమైన శ్రీరామచంద్రుడు రాగానే సుగ్రీవుడితో ఒక మాటన్నాడు. "ఈ క్షణం నుంచి రామచంద్ర ప్రభువు నీకూ నాకూ స్వామి" అన్నాడు. అది. ప్రపంచంలో ఒక గురువు దొరికి అసలు గురువులకే గురువు గనక దొరికినట్లయితే [గొంతు సవరించుకుంటూ] సాధకుడు గురువుని గురు గురోర్ గురువు దగ్గరకు తీసుకు వెళ్ళాలి. ఇది ధర్మవీరం. అంతే కాదు, రాముడి కార్యక్రమంలో తన మనస్సును నిమగ్నం చేశాడో, రామాజ్ఞని ఒక అదృష్టంగా యోగంగా భావించాడో, రకమైన అపేక్ష లేకుండా ఒకే ఒక్క భావనతో నా చర్యల వలన, నా చూపు వలన, నా కదలిక వలన, నా మెదలిక వలన నా స్వామి అయినటువంటి రాముడికి ఎంత ఆనందం కలుగుతుంది అది ఒక్కటే పెట్టుకున్నాడు ఆయన. కనుకనే శ్రీరామచంద్రుడి యొక్క కార్యక్రమాన్ని తన కార్యక్రమంగా, శ్రీరాముడి యొక్క ఆజ్ఞని దాటటానికి వీలులేని ఆజ్ఞగా, శ్రీరామచంద్రునికి మించిన పరదైవం మరొకటి లేదన్న భావనతో ధర్మవీరాన్ని ప్రతిపాదించాడు. ఇది ఒక ముఖం. ఇక రెండవ ముఖం ఆయనది విద్యావీరం. ఆయన గురువు ఎవరో తెలుసునా? సూర్యుడు సాక్షాత్. సూర్యుడు ఈయనకి బోధ చేశాడు. అందుకనే విశ్వనాథవారు శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థ భూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు అలహుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్ గురుత్వమునకున్ జగదక్షునకున్ నమస్కరించెదన్ అన్నాడు. జగదక్షుడు ఎవడయ్యా అంటే సూర్యుడు. ఒక కన్ను పగలుగా ఒక కన్ను రాత్రిగా అంటే సూర్యచంద్ర నాడీ మండలాలుగా జగత్తుని వెలుగుమయం చేస్తున్నవే వెలుగుకు మూలం ఎక్కడ ఉన్నదని అన్నట్లయితే గురువైన సూర్యుడైనట్లయితే దానికి మూలం ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభువే అని నమ్మినటువంటి విద్యావీరం. అందుకనే జ్ఞానగుణసాగర అన్నారాయన్ని. జ్ఞానసాగరుడు, గుణసాగరుడు. విజ్ఞానం ఉండి అనేక శాస్త్రాలన్నీ పుక్కిటబెట్టి శీలం లేకపోతే వాడి ప్రపంచానికి బరువు. జ్ఞానము ఉండి, వినయము ఉండి, సద్గుణాలు ఉండి, సత్వగుణ ప్రధానమై ఉన్నటువంటి వ్యక్తి గనుక ఒక ఉత్తమ వ్యక్తి గనుక ఉన్నట్లయితే వాడు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయగలడు. కనుక ఆంజనేయస్వామి సకల శాస్త్ర పండితుడాయన. రణ పండితుడు, వ్యాకరణ పండితుడు అన్నాడు రాముడు. రణ పండితుడు అంటే యుద్ధం చేశాడా చేయలేదా కాదు. యుద్ధం చేస్తున్న వేళ రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా రకమైన అపాయము కలగకుండా మనస్సుని కేంద్రీకరించి యుద్ధనీతిలో రాముడు ఎట్లా వెళితే రాముడు చక్కగా ఉంటాడో, లక్ష్మణస్వామి మార్గాన వెళితే ఆయన భద్రంగా ఉంటాడో అన్ని వేళలా తన కనుగుడ్డుకి తన కనురెప్ప ఎట్లా ఉన్నదో తాను నమ్మిన స్వామికి స్వామి యొక్క అనుజుడికి బంటై నిలబడ్డాడాయన. కనుక మనకున్నటువంటి విద్యలన్నీ కూడాస్వామి అంటారే "The end of education is character" ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని వేదాలు చదువు స్వామి చెప్తారు "బ్రహ్మవిద్య గురించి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ప్రపంచంలో తక్కువే లేరు కానీ ఆచరించేవాడు కంటికి ఒక్కడు కానరాడే" అన్నారు స్వామి. బ్రహ్మవిద్య చెప్పటం వేరు, బ్రహ్మవిద్యని అనుభూతిమయం చేసుకోవటం వేరు, అదే బ్రహ్మవిద్యను విభూతిమయంగా జీవించటం వేరు. అట్లా జీవించినటువంటి వాడు హనుమ. ఇది రెండవ ముఖం. ఇక మూడవ ముఖం దయావీరం. దయావీరం ఇది కరుణావీరం అనొచ్చు కదా అంటే కరుణ అనేటువంటిది కేవలం పరతత్వానికి చెందిన భావన. దయా, జాలి, సానుభూతి మానవ జీవ సంస్కారానికి సంబంధించింది గనుక ఆంజనేయస్వామి కూడా వానర రూపంలో వచ్చాడు గనుక దయావీరం ఎట్లా ఉన్నది అంటే [గొంతు సవరించుకుంటూ] సీతమ్మవారిని దర్శనం చేసినప్పుడు ఆమెకు ఆనందం కలిగించాలి. ఆమెకు ఏం ఆనందం కలిగిస్తుంది? రాముడు వస్తాడు, రావణుడిని చంపుతాడు, నిన్ను అయోధ్యకు తీసుకెళతాడు, మనమందరం కలిసి వెళతాం, అదిగో రాముడు ఇట్లా ఉన్నాడు, నీకోసం ఇంత వియోగంలో ఉన్నాడు అని ఒక ఆత్మీయుడుగా ఒక ఆప్తుడుగా చెప్పగలిగినటువంటి దయావీరాన్ని ప్రకటన చేశాడు. అందుకనే లవకుశులను జన్మ ఇత్వటానికి ముందే అమ్మవారు హనుమాన్ చాలీసాలో రఘువర అన్నది ఎవరినంటే రాముడిని కాదు ఆంజనేయస్వామిని. రఘువర అంటే రఘువంశంలో ఆమెలో కలిగినటువంటి ఒక మాతృభావన. మాతృత్వాన్ని ఒక్కసారి తాకినటువంటి వాడు హనుమ. ఆమె అనుకున్నది ఉంటే ఇటువంటి హనుమ వంటి ఒక కొడుకు ఉంటే చాలు కదా అన్న భావన అంత శోకంలోనూ ఆమెకు కలిగించినటువంటి వాడు ఆంజనేయస్వామి గనుక అది దయావీరంగా ఉన్నది. అలాగే లంక నుంచి విభీషణుడు వచ్చినప్పుడు అందరూ ఆయన్ని శంకించారు. రాముడు తప్ప. రాముడు ఇంకా నిర్ణయం చేయలేదు. విభీషణుడు అంటున్నాడు నన్ను నమ్మండి అంటున్నాడు. నువ్వు లంక నుంచి వచ్చావు పైగా నువ్వు రావణుడి యొక్క తమ్ముడివి గనుక నిన్ను నమ్మము అంటున్నారు వీళ్ళు. విభీషణుడి గురించి నూటికి నూరుపాళ్ళు పక్కన నిలబడి సత్వగుణ ప్రధాన సంపన్నమైనటువంటి వాడు విభీషణుడు. రాజస గుణ ప్రధానమైనటువంటి వాడు రావణుడు. తమోగుణ ప్రధానమైనటువంటి వాడు కుంభకర్ణుడు. కనుక సత్వగుణ ప్రధానంతో ఉన్నటువంటి విభీషణుడు రామచంద్రుడి దాకా రాగలిగాడు. ముగ్గురూ రాగలిగారా? కుంభకర్ణుడు రాగలిగాడా? రాముడిని వెతుక్కుంటూ వచ్చాడే, శరణాగతి పొంది వచ్చాడే, రామచంద్రుడి యొక్క వాక్యం ధర్మ పరిపాలన గనుక ఎవరు అధర్మంలో ఇంతకాలం జీవించినా ధర్మాన్ని ఎరిగినటువంటి వేళ ఆచరించటానికి సంసిద్ధులవుతారు వారు నా వారు అన్నాడు రాముడు. అని అన్నప్పుడు విభీషణుడు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆంజనేయస్వామి దయావీరం చేత, పరిపూర్ణమైనటువంటి సానుభూతి చేత, జాలి చేత రాముడి దగ్గరకు తీసుకుని వెళ్లి విభీషణుడు మన వాడే అన్నప్పుడు రాముడు కూడా కరుణాసముద్రుడు కదా ఒక మాట అన్నాడు. నేనే కావాలి నన్నే శరణు వందుతున్నాను అన్నప్పుడు నేను మాత్రం ఎందుకు వదిలిపెడతాను విభీషణుడ్ని నాతోనే ఉండని అంటూ కాదు మనతోనే ఉండని. నాతోనే మనతోనే మాటలు త్రేతాయుగంలో రాముడి నోట వింటాం మళ్ళీ కలియుగంలో మన స్వామి నోట వింటాం. మనకో కష్టం వచ్చింది, నీ కష్టం అనరు మన కష్టం అంటారు స్వామి. మాట్లాడేటువంటి మాటల్లో మనం కలిసి ఉందాం, మనం కలిసి చేద్దాం. మనలో స్వామి యొక్క అభిన్న అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి పూర్ణ కరుణ ఆవిష్కరణ అవుతూ ఉంటుంది. నీ కష్టం, నీ ఇబ్బంది ఇవనరు. అననుకూలాలు మనకు ఏర్పడుతుంటాయి బంగారం అవే తొలగిపోతాయి అంటారు. చూశారా ఎంత మన అనుకోవటంలోనే పూర్ణత్వం ఉంది. నువ్వు నేను అనగానే ద్వైతం కాబట్టి స్వామి కూడా పూర్ణ అద్వైత మూర్తే. అంతేకాదు అసలు పూర్ణ అవతార మూర్తి గనుక ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కూడా అన్ని వీరాలకి లోబడే ఉంటాయి. ఇక విద్యావీరం ఉన్నది. విద్యావీరం చెప్పుకున్నాం జ్ఞానగుణ సాగరుడు. రణవీరం ఉన్నది. రణవీరం అనేకమైనటువంటి బలాలు [గొంతు సవరించుకుంది] ఆయనకు ఏర్పడి ఉన్నాయి. లంకాదహనం చాలా ప్రధానమైనటువంటిది. లంకాదహనం చేయమని రాముడు ఏం చెప్పలే. అమ్మవారు ఎలా ఉందో చూసిరా అన్నాడంతే ఆజ్ఞ. కానీ సమయజ్ఞుడైనవాడు, కాలం ఎరిగినవాడు, సమయాన్ని పరమాత్మ స్వరూపంగా భావించినవాడు వెళ్ళిన కార్యక్రమాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని ఒక స్పష్టమైన నిర్ణయానికి రాగలిగినటువంటి నిర్ణాయక శక్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ముందు పరిసరాలు చూస్తాడు. ఏమైంది లంక నగరంలో? లంకా ప్రవేశం చేశాడు అంతఃపురం లోకి వెళితే ఒక స్త్రీమూర్తి శాలంకృతయై సర్వాభరణాలతో కూడి ఉన్నటువంటి ఒక జగదేక సుందరి పడుకొని ఉందో మంచం మీద. ఆంజనేయస్వామి ఒక జీవలక్షణం చేత ఈమె సీత అని భ్రమించాడు. అయితే చూడండి జ్ఞానగుణ సాగరుడులో జ్ఞానసాగరుడు గనుక ముందు స్త్రీమూర్తిని ఇలా నేను చూడకూడదు అని గుణసాగరత్వాన్ని విచక్షణా వివేకం అనేటువంటి జ్ఞానం చేత అటు శ్రీరామచంద్రుడిని వదిలిపెట్టిన అమ్మవారు శాలంకృతయై పరపురుషుడు ఇంట శయ్యా గృహంలో ఒక పట్టు మంచం మీద రకమైనటువంటి దుఃఖం లేకుండా వివశయై పడుకొని ఉంటుందా? కారణం వల్ల ఈమె అమ్మవారు కావటానికి వీలు లేదు అని నిర్ణయించాడు. అంతేకాదు జగదేక సౌందర్యం కనిపిస్తున్న మండోదరిది బాహ్య సౌందర్యమే. అమ్మ యొక్క సౌందర్యము ఆమె జగజ్జనుని గనుక ఆత్మ సౌందర్యం కాబట్టి ఆమె స్వరూపం ఇట్లా ఉండటానికి వీలు లేదు అనుకున్నాడు. అది విచక్షణా పూర్ణమైనటువంటి ఒకానొక స్థితి. అలాగే అమ్మవారికి చెప్పాడు. ఆనందాన్ని కూడా మనందరం అనుభవించాలి అని చెప్తూ రణవీరంలో మొట్టమొదట ఆయన సీతమ్మవారిని చెట్టు పై కొమ్మ నుంచి చూసినప్పుడు దభేలుని కింద పడ్డాడు.పడగానే ఆమె లంకానగరంలో వానరుడు ప్రవేశించటం అది మొట్టమొదటి సన్నివేశం. కనుక లంకానగర ప్రజలు ఎవరికీ మనుషులు తెలుసు, రాక్షసులు తెలుసు కానీ వానర రూపంలో ఉన్న వాళ్ళు తెలియరు. అందునా చిన్న కోతిగా కనిపించాడు ఆయన. భయపడింది ఆమె. భయపడి, కలవరపడి వీడు మరొక రాక్షసుడేమో అనుకుంది. అప్పుడు శరీరాన్ని అమితంగా పెంచి తన యొక్క స్వస్వరూపాన్ని చూపించాడు. అంటే ఆయన దగ్గర అనిమాది సిద్ధులు అన్నీ కూడా కైవసం అయి ఉన్నాయి. సముద్రోల్లంఘన వేళ సముద్రంలో పైన వెళుతూ ఉన్నప్పుడు శరీరాన్ని కుంచించాడు. ఇక్కడ వ్యాకోచింపజేశాడు. అలాగే "కార్యాతురాణాం సుఖం నిద్ర" అన్నట్లుగా రామాజ్ఞ పాలించేటువంటి వేళ హనుమ రకమైన సుఖానికి నోచుకోలేదు. మనస్సుని దానివైపు తిప్పలేదు. మొట్టమొదట సింహిక, మయాకుడు వీళ్లందరూ కూడా అనేక ఆకర్షణా వలయాలు. కాసేపు విశ్రాంతి తీసుకో అంటే విశ్రాంతికి తావు లేదన్నాడు. అలాగే లంకానగర ప్రవేశం చేసినప్పుడు లంకానగరానికి రక్షిణిగా ఉన్నటువంటి లంకిణి ఆయనను అడ్డుకున్నప్పుడు ఒక్కసారి ఒక ఆ.. ముష్టిఘాతంతో దెబ్బ కొట్టినప్పుడు ఆమెకి సహజమైనటువంటి రూపం వచ్చి శాపవిముక్తి కలిగినప్పుడు లంకిణి ఒక్క మాట చెప్పింది."ఏ మహాత్ముడి యొక్క స్పర్శ చేత మళ్ళీ నా దేహం నేను పొందుతానో, నా స్వస్వరూపాన్ని నేను పొందుతానో ఆనాడే లంకానగరానికి వైభవం నెమ్మదిగా పతనమయ్యేటువంటి ఆ.. పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కానీ నువ్వు వచ్చావు కదా! నీ వెనక రావలసిన వారంతా వస్తారు. రావణ రాజ్యం నశించిపోతుంది." అంటే తమస్సు అనేటువంటి అంధకారం చీలిపోయి పరిపూర్ణమైనటువంటి సత్వగుణమైనటువంటి ఒక సామ్రాజ్యం ఇక్కడ ఏర్పడుతుందని ఆమె చెప్పినప్పుడు లంకిణికి నమస్కరించాడు హనుమ. అంటే ఆమెలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, ఆమెలో ఉన్నటువంటి శక్తిని ఆయన గమనించుకున్నాడు. అంతే కాదు గాఢాలింగనం పొందినటువంటి హనుమ ఎంత పరవశం చెందాడంటే పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత అందరూ సేవలు అడిగారు. ఎవరెవరి సేవ ఎవరికి కావాల్సింది వాళ్ళు అడిగి తీసుకున్నారు. లిస్టులో రాయించుకున్నారు అనుకోండి. హనుమను మాత్రం అందరూ కావాలని పక్కన పెట్టారు. తమ తమకి కావాల్సిన సేవలన్నీ మిగిలిపోగా నిజానికి ఏమి మిగలలేదు. హనుమ కూడా వెళ్లి నాకు సేవ ఇవ్వమని ఆయన అడగలేదు. ఎవరు సేవ ఇస్తే అది చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సరే! రాముడు గనక ఆవలిస్తే ఆవలింతలు లెక్కబెట్టే పని అని ఈయన అనుకున్నాడు. కారణంగా నేను నా స్వామికి దగ్గరగా ఉండే అవకాశాన్ని వీళ్ళందరూ కలిసి నాకు ఇచ్చారు. రాముడు ఆవలిస్తున్నాడా లేదా గమనించాలి అంటే నేను ఆయన దగ్గరే ఉంటా ఒకటి. ఎప్పుడు ఆవలిస్తాడో అని నా మనస్సంతా రాముడి మీద తప్ప ప్రపంచం మీద ఉండదు రెండవది. కాబట్టి వీరందరూ కారణాలు ఏవైనా నాకు అనుగ్రహం ఇచ్చారు. అనుగ్రహం ఇచ్చినది, ప్రేరణ, స్ఫూర్ణ, సంకల్పము నా తండ్రి శ్రీరామచంద్రుడిదే కనుక సేవను నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. కనుక శ్రీరామచంద్రుడి యొక్క సాలోక్య, సామీప్య, సాన్నిధ్య మూడు స్థితులు పొందాడు. ఇక సాయుజ్యమా? చెప్పాడు ఆయన. "రామా! ఒకానొక సమయంలో గమనించినట్లయితే నీవు దశరథ రాజనందనుడివి, రఘురాముడివి, ప్రజారాముడివి. నేను అంజనీ సుతుడిని, ఆంజనేయుడిని. మానసిక స్థాయిలో విచారణ చేసినట్లయితే నీవు నాకు యజమానివి, నీకు బంటును నేను. మూడవ స్థాయిలో విచారణ చేస్తే నీవు పరమాత్మవి, నేను ఆత్మను. నీకూ నాకూ తేడా ఏం లేదు. సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, సుషుమ్నా కిరణాలు చంద్రుడి నుంచి ఎట్లా భిన్నం కావో, ఆత్మలన్నీ పరమాత్మ నుంచి భిన్నం కావు గనుక రామా! నీవు నేను ఒక్కటే. ఒక ఆధ్యాత్మిక స్థితిలో." కనుక స్వామి అంటారే "యు ఆర్ మీ, యామ్ యు" అనేదానికి అర్థం ఇదే. నువ్వు నేను ఒక్కటే అంటే భౌతిక స్థాయిలో కాదు, మానసిక స్థాయిలో కాదు కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ప్రతి జీవుడు పరమాత్మ యొక్క తత్వాన్ని, అంశాన్ని పుణికి పుచ్చుకొని వచ్చాడు గనుక ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు చేసేటువంటి ప్రాణాయామ ప్రక్రియ అంతా కూడా సముద్రోల్లంఘనమే. ఆయన కూడా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు చేస్తూ చేస్తూ వెళ్ళాడు. సముద్రోల్లంఘనం అంటే పైకి కనిపించే భౌతిక సముద్రం కాదది. సంసార సాగరాన్ని దాటటానికి ప్రాణాయామ ప్రక్రియని జపంగా, అజపంగా, తెలిసినా, తెలియకపోయినా ఇరవై ఒక్క సార్లు, ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు ప్రతి రోజూ చేసినట్లయితే సంసార పారావారాన్ని పరమాత్మ యందు లగ్నం చేసినటువంటి మనసుతో హనుమ ఎట్లా పరమాత్మ యొక్క ఆలింగనాన్ని లోక పురుషుడే కానీ లోకోత్తరుడు అయినటువంటి, జగదీశ్వరుడు అయినటువంటి రామచంద్రుడి యొక్క ప్రశంసని ఎలా పొందాడో మనం కూడా శ్రీరామదాసులుగా ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా స్వామి దాసులుగా, స్వామి అనుయాయులుగా, స్వామి భక్తులుగా, స్వామి యొక్క సమకాలీనులుగా మనం గనుక స్వామి చెప్పినటువంటి అనేకమైనటువంటి బోధనలలో కొన్ని మనం తీసుకొని హనుమంతుడు ఎలా ఉన్నాడో మనం కూడా ఉండగలిగినట్లయితే హనుమ వలె మనం కూడా చిరంజీవులమే. భవిష్యత్ బ్రహ్మలము అంటే బ్రహ్మము ఉండేదే భవిష్యత్తులో కూడా ఉండే బ్రహ్మ అని. అంతేగాని భవిష్యత్తు చెప్పే బ్రహ్మ అని మాత్రం అర్థం కాదు. భవిష్యత్తు ఎలా నిర్మాణం జరుగుతుంది? వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది. వర్తమానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? జరిగిపోయిన భూతకాలంలో జీవితం మనకిచ్చినటువంటి అనుభవాలు, పరమేశ్వరుడు మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహాలు వీటన్నింటినీ సమన్వయం చేసుకొని నిత్య నైమిత్తికమైనటువంటి జీవితాన్ని కర్మ, భక్తి, జ్ఞాన, యోగాలలో ఆంజనేయస్వామి తన జీవితాంతము కూడా, అశాంతము కూడా రకమైన అపేక్ష లేకుండా చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా, చాలా ధ్యాన ముద్రాంకితంగా, ఏకోన్ముఖంగా ఎలా ఆచరించాడో అలా ఆచరించాలి. అందుకనే మనమంతా స్వామి భక్తులమని చెప్పుకుంటాం. ఇంత చేసిన ఆంజనేయస్వామి ఏమన్నాడో తెలుసునా? "నేను భక్తుడిని ఇంకా కాలేదేమో"నేను రామదూతను మాత్రమేనేమో, రాముణ్ణి నేను ఎట్లా అనుభవించానో అది మాత్రమే చెప్పగలిగిన స్థితిలో ఉన్నాను తప్ప, నేను ఇంకా రామభక్తుణ్ణి అయినానో కాలేదో అన్నాడు. అందుకనే, విషయాన్నైనా విచారణ చేయాలంటే మూడు స్థాయిలు ఉన్నాయి కదా. మళ్ళీ రామాయణ కల్పవృక్షంలోనే ఆంజనేయస్వామి గురించి పద్యం ఉంది. "శైవంశంబని యందునా దశశిరస్సంత్రాస చండాకృతిన్ శ్రీ వాయుద్భవుడందునా అనిలు శాశించెన్మహాయోగియై పోవో కేసరికోతి కూనాననా ముక్తేంద్రియభ్రాతు నన్నావేశించిన రామచంద్ర పదపద్మాధీన చేతస్కునిన్" చమత్కారంతో కూడిన హనుమ వర్ణన ఇది. ఈయనని రుద్రాంశ రుద్రాంశ అంటున్నారే, ఎలా అనుకోనయ్యా? శివుడి అంశే గనుక నిజంగా అయి ఉన్నట్లయితే, తన నిజభక్తుడైనటువంటి రావణబ్రహ్మ తలలు పది నేలమీద పడటానికి ఈయన కారణం కాలేదా? లంక గుట్టంతా చెప్పాడే రాముడికి. ఈయన శైవాంశే ఎట్లా అయినాడు? భక్తుణ్ణి కాపాడాడా? సంహారం చేశాడే. అని ఒక చమత్కారం. పోనీ, మానసిక స్థాయిలో చూద్దామంటే, వాయుపుత్రుడి యొక్క కొడుకు అని అందామంటే, సముద్రోల్లంఘన వేళ ఈయన ఏం చేశాడు? తన తండ్రిని బంధించాడు. తండ్రి ఎవరు? వాయువు. వాయువు ఎక్కడున్నది? ఆయువు. ఆయువు ఎక్కడున్నది? లోపల ఉన్నది. ప్రాణ చైతన్యాన్ని ప్రాణాయామం చేత నిరోధించిన హనుమ వాయుపుత్రుడు అని ఎలా అనగలం-అనగలం? తండ్రిని బంధించాడు కదా. అనిలు శాశించెన్ మహాయోగియై. పోనీ రెండూ కాదు. కేసరి కోతి కూనాననా. కేసరి వంశంలో పుట్టిన కోతిపిల్ల అందామంటే ముక్తింద్రి-ముక్తేంద్రియ భ్రాతు. ఇంద్రియాలను జయించాడు. అంతేకాదు, జయించబడిన ఇంద్రియాలతో ఇంతకాలం జీవించాడే. ఈయనని నేను ఎ-ఎట్లా వర్ణించుకోగలను, అనుభవించగలను. అవన్నీ నాకేమి? ఇదిగో ఆయన కూడా లేదా ఆయన వలె నేను కూడా శ్రీ రామచంద్ర పదపద్మాధీన చేతస్కునిన్. నాకు ఆయనకు ఒక commonality ఉన్నది. సామీప్యం ఏమిటంటే, ఆయన ఎట్లా రామచంద్రుడి యొక్క దివ్య పాదాల యందు మనస్సును లగ్నం చేశాడో నేను అంతే. నేను ఎట్లా లగ్నం చేశానో ఆయన అంతే. అంటే, భక్తులలో కూడా వాడు పెద్ద, వీడు చిన్న అన్న రెండు మాటలు లేవు. భక్తుడు భక్తుడే, దాసుడు దాసుడే, పరమాత్మ పరమాత్మే. ఇవన్నీ కూడా జ్ఞానగుణ సాగరుడైనటువంటి హనుమ మనకి పరిపూర్ణంగా బోధ చేస్తాడు గనుక, హనుమ ఎక్కడ ఉన్నాడు అంటే శ్వాస రూపంలో మనలో ఉన్నాడు. అందుకనే, మనిషికిన్ని మహిమలా, ఘనసిద్ధుల గరిమలా, ఎదలోపల దైవమున్న హనుమలా ఎదిగితే, నీ హృదయం, నీ దేహం తిరిగే తిరుమలా. ఎక్కడ ఉన్నది తిరుపతి, ఒక పుట్టపర్తి, ఒక షిరిడి ఎక్కడున్నాయే అంటే, నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ కంటే నీవు అభిన్నంగా ఉండగలిగితే, పరమాత్మకి నీకు అద్వైత స్థాయి గనుక ఏర్పడినట్లయితే, నీ శరీరమే పుణ్యక్షేత్రం. దానిలోనే ఉన్న క్షేత్రంలో గనుక, హృదయం మీద గనుక నీవు శ్రీరామచంద్రుణ్ణి ఎట్లాగైతే హనుమ హృదయ స్థానంలో పెట్టుకొని సాకార స్వరూపంగా ఆత్మారాముడుగా జగత్తుకు చూపించగలిగాడో మనం కూడా స్వామి భక్తులుగా హనుమని ఆదర్శప్రాయం చేసుకోవాలి. జ్ఞానాన్ని, గుణాన్ని, రణవీరాన్ని, జీవితాన్ని స్వామి అంటారే, life is a challenge, meet it. అది, challenge ని మనం ఎదుర్కోవాలి. Challenge ని దాటకూడదు. అలాగే రణవీరం, విద్యావీరం, ధర్మవీరం అన్నింటికంటే కూడా స్వామి సత్య స్వరూపులు గనుక, ధర్మ స్వరూపులు గనుక త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సాంఘిక, కౌటుంబిక, రాజకీయ, ఆధ్యాత్మికమైనటువంటి ధర్మాన్ని ప్రబోధం చేశాడో దానినే సత్యసాయి రాముడు కూడా ఈరోజు చేశారు. అంతే. తేడా ఏం లేదు. రూపం వేరు, రూపం వేరు. పేరు వేరు, పేరు వేరు. ఉపాధి వేరు, ఉపాధి వేరు. కానీ ఉన్న చైతన్యం మాత్రం త్రేతలో ఉన్న రాముడు, ద్వాపరలో ఉన్న కృష్ణుడు, కలియుగంలో ఉన్నటువంటి భగవాన్ సత్యసాయి, మూడూ కూడా ఒక్కటేనన్న స్పృహలో హనుమంతుణ్ణి ఆదర్శంగా గనుక తీసుకుని జీవించగలిగినట్లయితే, రామకార్యంలో నిమగ్నమైనటువంటి హనుమ ఆదర్శం గనుక ఉన్నట్లయితే, భవిష్యత్ బ్రహ్మలం కాకపోయినా రాబోతున్నటువంటి సర్వ బ్రహ్మీమయమైనటువంటి జగత్తులో మన ఆయువు నిలకడగా ఉంటుంది, నిశ్చితంగా ఉంటుంది, అన్నివేళలా ఆత్మ స్వరూపంగా ఉంటుంది. దేహం రావచ్చు, పోవచ్చు. కానీ ఆత్మ అఖండమై, చిద్ఘనమై, అనంతమై, అచ్యుతమై, అనుపమానమై, అప్రమేయమై మనందరికీ కూడా అమదానంద స్థితిని కల్పిస్తుంది గనుక హనుమని గురించి అనేకమైనటువంటి విషయాలు, ప్రధానంగా సుందరకాండ. దానిని గురించి అనేక ముఖాలున్నాయి. వాటన్నింటినీ కూడా మనం సమయం వచ్చినప్పుడు తీవ్రంగా విచారణ చేద్దాం. సాయిరాం.
SSSMC · audio

Talk on Hanuman Panchamukham

Home

Talk on Hanuman Panchamukham

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:57

More in this series

Talks

14 episodes · 6 hr 52 min

  1. 24 min 1

    Talk on significance of festival of Sankranthi

  2. 52 min 2

    Talk - on Guru Tatwam

  3. 40 min 3

    Talk - Koti Samithi Hyd

  4. 28 min 4

    Talk - Bharata

  5. 23 min 5

    Talk on Dasara

  6. 6 min 6

    Talk on Rathasaptami

  7. 32 min 7

    Talk on Sri Sathya Sai - Part 05

  8. 33 min 8

    Talk on the character of Draupadi

  9. 30 min 9

    Talk on Gyana Yoga

  10. 29 min 10

    Talk on Hanuman Panchamukham

    Now playing
  11. 23 min 11

    Talk on Leela Kaivalya Vahini

  12. 35 min 12

    Talk on Sathya Sai Sukthamulu

  13. 24 min 13

    Talk on yoga Triveni

  14. 26 min 14

    Talk on the occasion of Avatar Declaration day