⁂
No transcript for this section.
Transcript begins at 0:00.
[ఇంట్రో మ్యూజిక్] తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు దశరథి, కృష్ణమాచార్యుల వారు. అంటే కోటి రతనాల వీణగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాదేశికంగా అంటే geographical గా చూస్తే, నైసర్గికంగా దీనికి కొన్ని సంస్కృతి సంస్కారాలున్నాయి. ఆ సంస్కృతి భావనలో బతుకమ్మ పండగ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది. బతుకమ్మ ప్రకృతి పూజ. ప్రకృతి అంటే వేదాంత పరిభాషలో అనాత్మ అని పేరు. ఆత్మ కనపడదు. ఆత్మ అంతటా ఉన్నది. సర్వం ఖల్విదం బ్రహ్మ. అసలు ఆత్మ అన్నిటా అంతటా ఆవరించి, ఆవహించి, ఆవేశించి ఉన్నది. అది తెలుసు. మరి పరమాత్మని ఎట్లా కనుక్కోవాలి? ఆయన రూపం ఏమిటి? ఒక రాముడు, ఒక కృష్ణుడు, మరొకడు, మరొకరు ఇంతేనా? అంటే కాదు. ఏ పరాప్రకృతి నీ కళ్ళ ముందు నదులై, వాగై, వంకలై, కోనలై, కొండలై, భూమై, దూరంగా ఉన్న ఆకాశమై అన్నింటికంటే పృథ్వీ స్థలం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా చిచ్ఛక్తి యొక్క అనాత్మ స్వరూపం ఇది. అనాత్మగా కనిపించే ఆత్మ. అంటే ఆత్మ కాదేమో ఇది. ఇదంతా materialistic గా ఉందేమో. అంతా భౌతికంగా ఉన్నది ఇది. భూమి, భూమి లోపల బంగారం, భూమి లోపల బొగ్గు, భూమి లోపల వజ్రం, భూమి లోపలే వృక్షం, భూమిలో విత్తనం పాడితే మహా వటవృక్షం అవుతున్నది. ఇదంతా భూమి ఆధార భూమిక అవుతున్నది గనుక, ఈ ఆధార భూమికలో నుంచి ఆయా దేశకాల పరిస్థితులని, ఆయా రుతువులని అనుసరించి అనేకమైనటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి గనుక, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ జాతి, తెలంగాణ సంస్కారం, తెలంగాణ సంస్కృతిలో ఒక అవిభాజ్యమైనటువంటి ఒక సంస్కృతి విభవము ఏది అంటే ఇదిగో ఈ బతుకమ్మ. ఆ పేరు కూడా ఎంత అందమైనటువంటి తెలుగు పేరో చూడండి. బతుకమ్మ. బతుకు అంటే మనిషికి బతుకు ఎక్కడ ఉన్నది? మెతుకులోనే బతుకు ఉన్నది. మెతుకు అంటే అన్నం. కదా. ఒక చిన్న అన్నం. అన్నపు మెతుకులో ఉన్నది అన్నం బహు కుర్విత ఉపనిషత్తులు చెప్పాయి. మరి ఈ అన్నం మనం తింటున్నాం రోజు ఎన్నో ఏళ్లుగా. ఉన్నంత కాలం తింటూనే ఉంటాం. తింటూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆనందిస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. అక్కడే ఆగిపోతున్నదా? ఆకలి తీరటంతో అన్నం పని అయిందా అంటే, ఆ అన్నపు మెతుకులో నుంచి ప్రాణమయ కోశం ఏర్పడుతున్నది. energy పుడుతున్నది. vital, vibrant గా లోపల ఏర్పడుతూ ఉన్నది. ప్రాణమయ కోశంలో నుంచి మనస్సు పుడుతున్నది. మనోమయ కోశం ఏర్పడుతున్నది. మనోమయ కోశంలో నుంచి విజ్ఞానమయ కోశం వస్తున్నది. కడగా ఆనందమయ కోశం ఏర్పడుతున్నది. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఈ ఐదు కోశాలకి మూలం అన్నం అయితే అన్నానికి మూలం ఏమిటి? అంటే పృథ్వీ. ఆ పృథ్వీ ఎందుకు, పృథ్వీలో ఈ అన్నం ఎందుకు ఉన్నది అంటే మెతుకే లేకపోతే బతుకు లేదు గనుక. బతుకు తల్లి ఎవరు? బతుకమ్మ అంటే బతుకు తల్లి. బతికించే తల్లి. బతుకుని ఇచ్చేటువంటి తల్లి. అది పూలుగా, కాయలుగా, ఫలాలుగా, అనేక సాఫల్యాలుగా, విజయాలుగా, అభివృద్ధిగా, పురోగమనంగా అనేకమైనటువంటి భావాలు ఎన్నెన్నో పుడుతూ ఉంటాయి. అటువంటి ఈ బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో భాగమని అనుకున్నాం. అంటే ఒక ప్రాంతీయమైనటువంటి ఒక భావన విస్తృతం కావటానికి, ఎందుకంటే వేదంలో ఓ మాట కూడా ఉంది, వసుంధరా బ్రహ్మదత్త అని. ఈ భూమి ఎవరి సొంతము కాదు. బ్రహ్మదత్త, బ్రహ్మ చేత, బ్రహ్మము చేత ఇవ్వబడింది. నిజానికి బ్రహ్మము వసుంధరే, భూమే. కాబట్టి దీనిని విచార మార్గంలోకి సంస్కృతిగా గనుక తీసుకున్నట్లయితే అదొక వ్యాసంగం, అది ఓ కోలాహలం, అది ఒక ఉత్సాహం, అది ఉరకలు వేసేటువంటి ఆనంద కెరటం, అది పైకి కనిపించేది. కానీ లోపల భూదేవతకి పూజ. పూల ద్వారా, పూల అంగి సేవ. మాతృమూర్తికి వందనం ఎలా చేస్తున్నాం అంటే పూలతో వందనం చేస్తూ ఉన్నాం. ఆ పూలతోనే దానిలోనే ఏర్పడినటువంటి అనేకమైనటువంటి విషయాలను తీసుకుని సంస్కృతిని, మన సదాచారాన్ని, కొ కట్టుబాటుని, కుటుంబ వ్యవస్థలో ఉండవలసిన జీవన మాధుర్యాలని, కుటుంబ వ్యక్తుల మధ్య ఉండవలసినటువంటి అత్యంత సహజ ప్రేమానురాగాలని, కలిసికట్టుగా united గా ఉండేటువంటి ఐక్యతా భావాన్ని, దానిలోని ఒక దివ్యాత్మ భావనని, దానిలో నుంచే ఒక పవిత్ర భావనని అంటే unity, purity, divinity కి ఉదాహరణ ఏది అంటే నా దృష్టిలో బతుకమ్మ పండగ. ఎందుకని అంటే అది స్త్రీలు మాత్రమే చేసేది కాదు. పురుషుడి యొక్క భావన కూడా దాని యందు ఉంటుంది. ఇంటి ఇల్లాలు, ఇవాళ house wife అంటున్నాం. వాళ్ళు గృహలక్ష్ములు. ఈ, ఈ బతుకమ్మ పండగ సమయంలో ఒక్కొక్క స్త్రీమూర్తిని చూసినప్పుడు వెలిగే దివ్వెలుగా, వెలిగించే దివ్వెలుగా, శక్తిమంతమైనటువంటి స్వరూపిణులుగా, దేవీ స్వరూపిణులుగా, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, ఆ ఒక సంభరితమైనటువంటి సంతృప్తి ఇవన్నీ కలబోసుకున్నటువంటి స్త్రీమూర్తులను మనం దర్శించినప్పుడు చెట్టుకి పూసిన పూలు ఎట్లాగో ఈ పుడమి మీదికి వచ్చినటువంటి ఈ పూబంతులందరూ అంటే స్త్రీమూర్తులందరూ కూడా మాతృమూర్తి స్వరూపులుగా మనకు భావన చేస్తూ ఒక దివ్యత్వాన్ని ఆవిష్కరించేటువంటి ఒక దివ్య సందర్భమే ఈ బతుకమ్మ. తర్వాత వరి ధాన్యం రావాలి, పంటలు పండాలి, బంగారం పండాలి, వజ్రాలు రావాలి, నదులు ప్రవహించాలి, సముద్రాలు ఇంకకుండా ఉండాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే భూదేవి, భూమాత, వసుంధరపృథ్వి అనబడేటువంటి ఇవన్నీ కూడా ఏక స్వరూపిణి గా ఉన్నప్పుడు అర్చనా భావంతో నీళ్లలో పూలు వేసి, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి సంస్కృతికి గొప్ప నిదర్శనంగా బతుకమ్మ పండగని మనం భావన చేయాలి. దీనిలో కట్టుబాట్లు ఉన్నాయి, విచారణలు ఉన్నాయి, కుటుంబాలన్నీ చక్కగా కలిసిపోవటం ఉన్నది. ఏకాత్మ భావంతో సంచారం చేసేటువంటి ఒక సంస్కృతి ఉన్నది. ఇందులో హెచ్చు తగ్గులు లేవు, స్థితిగతులలో మార్పులు లేవు. మరి ఏమున్నాయి అంటే ఉన్నదంతా పవిత్రమైనటువంటి ప్రేమ, అనురాగం, రాగము, అనురాగము, ప్రేమ, దివ్య ప్రేమ అన్నీ కలబోసుకునేటువంటి ఒక మంచి పండగ బతుకమ్మ పండగ. అంతే కాదు, జీవితాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, ఆయుర్దాయాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వీటన్నింటిని ఇవ్వాలి, ఇవ్వాలి, ఇది కావాలి, కావాలి అని మనం ఎట్లాగైతే చమకంలో, రుద్రంలో చెప్పుకుంటామో, సంస్కృతంలో ఒక జాను తెలుగులో ఈ బతుకమ్మ మాకిది ఇవ్వాలి, మాకిది ఇవ్వాలి అంటూ. నమకము అంటే నమస్కరించడం, చమకము అంటే అడగటం. ప్రార్థించాలి, అభ్యర్థించాలి. ఈ రెండూ ఏకకాలంలో సాగాలి. ఇటువంటి ఈ ఉదాత్త వైఖరి బతుకమ్మ పండగ జరిగేటువంటి రోజుల అన్నింట్లలో కూడా తెలంగాణ ప్రాంతం అంతా పూలమయంగా మనకు కనిపిస్తుంది. పువ్వు దేవతకి, దివ్యత్వానికి ఒక ప్రతీక. అంతే కాదు, అందానికి, సౌందర్యానికి కూడా అదే ప్రతీక. అందము ఇంద్రియాలను రెచ్చగొడుతుంది. సౌందర్యము ఇంద్రియాలను క్షమింపజేస్తుంది. క్షమము, దమము ఇటువంటి స్థితులన్నీ ఏర్పడాలి అంటే కూడా మనకి ఈ పూలు పూజ చేయటానికి కావలసినవి, ఇవన్నీ కూడా ఏర్పడటానికి బతుకమ్మ కేవలం ఒక ప్రాంతీయమైనటువంటిది మాత్రమే కాదు, ఇది దేశీయ, విదేశీయమైనటువంటి సర్వ సభ్య సమాజము దాని అంతరార్థాన్ని గ్రహించుకొని పాట ద్వారా, ఆట ద్వారా, మాట ద్వారా. పాట అంటే ఏమిటి? సమవేదం. మాట అంటే ఏమిటి? ఋగ్వేదం. ఆట అంటే ఏమిటి? యజుర్వేదం. ఈ మూడు జాను తెలుగులో తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత ఉల్లాసభరితంగా ఈ రోజులు గడుపుతారో చూస్తున్నప్పుడు ఒక సంస్కృతి కెరటం వలే లేచినట్లు గా, ఒక సంస్కృతి అప్పుడే విపారినట్టుగా, ఏ ఏడాది కాడా ఏడాది కొత్త, కొత్త ఆ గేయాలతో, పాటలతో, సనాతన, సనూతన వైవిధ్యంతో, వైరుధ్యంతో అద్భుతంగా సాగేటువంటిది గనుక ఇది ఒక జీవన విధానం. జీవితం పట్ల ఒక సౌందర్య ఉపాసన. ఇవన్నీ కావాలి. సౌందర్యోపాసనకి బతుకమ్మ పండగ చాలా గొప్ప సంకేతం. సౌందర్యాన్ని ఉపాసించని వాడు మానవుడు కాడు. ఎందుకంటే, మానవ జన్మలోనే సౌందర్యోపాసన ఉన్నది. ఆ సౌందర్యోపాసన దేహంతో ప్రారంభమవుతుంది. అందుకే ప్రతిరోజూ అద్దం ముందు నించొని మనల్ని మనం చూసుకుంటాం. మనం ప్రపంచానికి ఎలా present చేసుకోవాలో చూసుకుంటాం. ఇది, ఇది మాత్రమే కాదు, ప్రపంచం మొత్తము కూడా సౌందర్యమయం కావాలి. ఈ సౌందర్యమయం ఎందుకు కావాలంటే ఇంద్రియ నిగ్రహం పొందినటువంటి, ఇంద్రియాలను జయించినటువంటి, జితేంద్రియ స్థాయిలో ఉండేటువంటి, సంస్కారవంతమైనటువంటి ఒక జాతి గనుక నిర్మాణం జరిగినట్లయితే దాని పురోగమనాన్ని ఎవరూ ఆపలేరు, అడ్డుకోలేరు. అది మహా విస్తృతమై ఏర్పడుతూ ఉంటుంది. అది మళ్ళీ మరొక జాతికి పురుడుపోస్తూ ఉంటుంది గనుక బతుకమ్మ పండగ వెనుక దాగినటువంటి భావం ఏమిటి అంటే నవనవోన్మేషంగా, నిత్య నూతనంగా, ప్రతిక్షణము ఒక కొత్తదనంతో, ఒక కొత్త ఆవేశంతో, కొత్త భావనతో, కొత్త కూర్పుతో, కొత్త మార్పుతో, కొత్త తీర్పుతో, కొత్త ఓర్పుతో జీవితాన్ని గడపాలి. అడుగులో అడుగు వేసి, చేతులు చేతులు, మనసులు మనసులు, తలపులు తలపులు కలిసి పూబంతి పూలన్నీ కూడా ఒక దారంలోకి గుదుగుచ్చినప్పుడు ఎట్లాగైతే ఒక పూమాలగా తయారవుతున్నదో ఈ పూల అలంకరణతో అమ్మవారిని అలంకరించి మళ్ళీ అమ్మవారికి నిరలంకారం చేసి సగుణ నిర్గుణ ఉపాసనని చాలా భద్రత్వమైనటువంటి ప్రేమతో, అనురాగంతో, ఒక చిన్న అమాయకత్వంతో, అంటే మాయతనం తెలియనిది అమాయకత్వం. అమాయకత్వం అంటే తెలివి లేనివాడని కాదు. మాయకుడు ఎప్పుడూ తెలివిగలవాడు. వాడి పక్కన ఉంటాడు. అమాయకుడు అంటే తనకున్న తెలివిని పవిత్రంగా ఉంచుకునేవాడు. ఆ జ్ఞానాన్ని తన కోసము, తన వారి కోసము, తన కుటుంబం కోసము, తన సమాజం కోసము, ఈ ప్రకృతి కోసము కలిపి ఒక ప్రార్థన చేసి, ఒక ఉపాసన చేసేటువంటి సన్మంగళ కాలమే ఈ బతుకమ్మ పండగ కాలం. ఇది దసరాలతో పాటుగా ఈ శరత్ పూర్ణిమా వ్రత శశాంక లలిత రోచర వితానం అంటారు. ఈ పూర్ణిమా వారికల మధ్య ఈ బంతులు, పూబంతులు, ఇంతులు అందరూ కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఒక జీవన సౌందర్యాన్ని, జీవన ఔదార్యాన్ని, జీవన ఆదర్శాన్ని, జీవన దృక్పథాన్ని, జీవన లక్ష్యాన్ని కలిసికట్టుగా సమాజానికి ఆవిష్కరించేటువంటి పరమాద్భుతమైనటువంటి యవనిక అంటే తెర, ఆ తెర తీయబడుతుంది. అలాగే సమాజంలో కొత్త వాళ్ళు రావాలి, కొత్త ఆలోచనలు పుట్టాలి. సమాజం కాలం సమాజాన్ని పరిగెత్తిస్తుంది. సమాజం ఏ తడబాటు లేకుండా ఒక సంస్కృతి విలసితమైనటువంటి, సనాతనమైనటువంటి ఒక సంప్రదాయాన్ని సనూతనం చేసుకుంటూ, సనూతన మార్గంలో ప్రవేశించి వెళుతూ వెళుతూ తన మార్గాన్ని తాను శుభ్రపరుచుకుంటూ, తాను శుభ్రపడుతూ ఎట్లాగైతే నది సాగర సంగమం చేస్తున్నదో జీవుడు కూడా ఇదిగో ఈ బతుకమ్మ పండగ ద్వారా తనను తాను శుభ్రపరుచుకుంటూ, తన దారిని శుభ్రం చేసుకుంటూ, తన వెనక వచ్చేవారికి ఆ మార్గాన్ని, శుభ్ర మార్గాన్ని ఆవిష్కరిస్తూ, చేతికి అందిస్తూ వారిని కూడా లక్ష్య గమ్యాల వైపు నడిపించేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వైఖరి. ఆ వైఖరి పేరే బతుకమ్మ పండగ. ఈ బతుకమ్మ పండగ వెనుక ఒక జీవుడి సంస్కారం ఉంది, జీవుడి వేదన ఉన్నది, జీవుని నివేదన ఉన్నది, అన్నీ ఉన్నాయి, అంతా ఉన్నాయి. సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటి వేద వాక్యానికి సప్రమాణికమైనటువంటి ఒక ఆ విజ్ఞాన, ప్రజ్ఞాన, సుజ్ఞాన భూమిక బతుకమ్మ పండగగా నేను భావన చేస్తూ ప్రజలు మనందరికీ కూడా అమ్మవారి యొక్క శక్తి, ఈ పృథ్వి శక్తి, ఈ నేల వసుంధరని మనం జాగ్రత్తగా కాపాడుకునేట్లుగా ఈ భూమిని ఆ పవిత్రమైనటువంటి మాతృభూమిగా, మాతృదేవతగా భావన చేసి వందనం చేసేటువంటి ఈ ఉపాసనా కాలానికి నమస్కరిస్తూ శుభం.