Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] భారతీయ పురాణ గాథలు పురాణాంతర్గతమైనటువంటి మార్మికమైన విషయాలన్నీ కూడా సన్మార్గానికి ఉపదేశ సోపానాలు అవి. సన్మార్గం ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక మానవుడికి మాత్రమే నిర్దేశింపబడినై. సన్మార్గంలో ఒక సంస్కృతి, సంస్కారము, భాష, భావన అనేకమైనటువంటి విషయాల కలయికగా మనం భావన చేసినట్లయితే భారతదేశం అనాదిగా సమస్త ప్రపంచానికి కూడా ఒక మార్గోపదేశనం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి భూమి. భూమి ఇదే! భూమిక ఇదే! భూమికలో అనేక సార్లు పరమాత్మ అనేక రూపాలలో అవతరించి జగద్ధితంగా, జగత్ కల్యాణకారకంగా, జగత్ శోభితంగా ఉపదేశ, సందేశ, ఆదేశాలను అనుగ్రహించి మానవుణ్ణి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఆపై కడగా యదార్థ స్థితికి నడిపించడమే సన్మార్గం. సన్మార్గ ప్రస్థానంలో భారతీయమైనటువంటి అవతార వైభవంలో శ్రీకృష్ణావతారం పరమ పవిత్రమైనటువంటిది. ఇది పూర్ణావతారం. రామకృష్ణాది అవతారాలు అంట, అంటే ముందు రాముడు పూర్ణపురుషుడిగా వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ గురువుగా వచ్చాడు. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి వైఖరి. వైఖరిని జాగ్రత్తగా గమనించినట్లయితే మామూలుగా మానవ జీవితానికి మూడు మార్గాలు చెప్పబడ్డాయి. ఒకటి కర్మ యోగం, రెండవది భక్తి యోగం, మూడవది జ్ఞాన యోగం. కర్మ, భక్తి, జ్ఞాన మూడు యోగాల యొక్క మహా త్రివేణి ఏది అంటే కడగా భగవద్గీత అని ఇవాళ మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీనికంటే కాస్త ముందుగా పూర్వరంగాన్ని గనక విశ్లేషించుకున్నట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో, అంటే ఒక చైతన్యం మూడు భాగాలై కృష్ణ నామంతో విరాజిల్లినటువంటి సందర్భం. ఏమి కృష్ణ నామం అంటే మనకు తెలిసిన కృష్ణ పరమాత్మ నామము కృష్ణ. రెండవ వారు ద్వైపాయనుడు. ద్వీపంలో పుట్టాడు గనుక ద్వైపాయనుడు అయినాడు. ద్వైపాయనుడి పేరు కూడా కృష్ణయే. ఆయనే వ్యాసుల వారు. ఉన్న విషయాన్ని విస్తృతంగా చెప్పాడు గనుక, అనేక విషయాలను ఏకకాలంలో చెప్పాడు గనుక, ఒక జాతికి అంటే రాబోయేటువంటి ఒక యుగానికి వాఙ్మయ భాండాగారాన్ని అందించాడు గనుక ఆయనకి వ్యాసుడు అనేటువంటి ఒక పేరు వచ్చింది. అంటే ఒక కృష్ణుడు ద్వీపంలో పుట్టినందువలన ద్వైపాయనుడై, వ్యాసుడై, భగవత్ తత్వాన్ని జీర్ణించుకొని తానే భగవంతుడై, ఒక మహా సరస్వతీ ప్రవాహంగా తనను తాను ఆవిష్కరించుకున్నాడు గనుక భగవాన్ వ్యాసుడై అంటే వ్యాసో భగవాన్ కృష్ణః అని కూడా ఒక మాట ఉంది. కాబట్టి కృష్ణ నామంతో వచ్చిన రెండవ పార్శ్వము వ్యాసుడైనట్లయితే మూడవది స్త్రీ చైతన్యంగా స్త్రీ రూపంగా వచ్చినటువంటి ద్రౌపది పేరు కూడా కృష్ణయే. ద్రౌపది కృష్ణజూచి రంభోరు నిజోరు దేశమున అని అంటాడు. అంటే కృష్ణజూచి అంటే ద్రౌపదిని చూసి. ద్రుపద రాజకుమార్తె గనుక ద్రౌపది అయింది. ఆమె పేరు అది కాదు నిజానికి కృష్ణ. అయితే ఆమె అగ్నిసంభూత. అగ్నిలో నుంచి పుట్టింది. శ్రీకృష్ణ పరమాత్మ యోగ మాయలో నుంచి వచ్చాడు. వ్యాసులవారు ఒక పరమాద్భుతమైన సాంఘిక నేపథ్యాన్ని ఆవహించుకొని, ఆవేశించుకొని ప్రపంచానికి ఆదేశించేటువంటి దేశిక స్వామిగా వచ్చాడు. కాబట్టి ద్వాపర యుగం ఒక చైతన్యం మూడు భాగాలైనప్పుడు ప్రధానంగా అష్టాదశ పురాణాలు కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి, పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణమునినా. ఆయన పురాణముని అయినటువంటి, అంటే పురాణ అంటే పురాణం చెప్పినవాడు అని కాదు. పురా అంటే చాలా సనాతన అని, పునః అంటే ఆధునిక అని. పురా-పురాణమునినా మధ్యే మహాభారతం అని వ్యాసులవారు అలాగే ద్రౌపది ముగ్గురూ కలిసి ఒక యుగాన్ని శాసించినటువంటి వాళ్ళు, నడిపించినటువంటి వారు. ముగ్గురిలో ద్రౌపది కర్మ యోగాన్ని, వ్యాసులవారు కర్మతో కూడిన భక్తి యోగాన్ని, శ్రీకృష్ణ పరమాత్మ కర్మ, భక్తి యోగాలను సమన్వయం చేసినటువంటి జ్ఞాన గురువుగా ఆవిష్కృతమైనటువంటి ద్వాపర యుగం సన్మార్గ ఉపదేశనం చేసినటువంటి మహత్పూర్ణమైనటువంటి ఒక యుగంగా మనం భావన చేయాలి. ఇక కృష్ణ పరమాత్మ రావటానికి ముందు రాముడు వచ్చాడు. ఒక్క నిమిషం రాముడి గురించి విచారణ చేసినట్లయితే ఆయన ఎక్కడా తాను దేవుడు అని చెప్పుకోలేదు, చెప్పలేదు. చెప్పడానికి రాలేదు. నేను దశరథ రాజనందనుడిగా వస్తాను. విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడిపిస్తాను. అంతేకాదు కేవలం మానవుడిగా జీవించటానికి వస్తున్నాను అని చెప్పాడు. ఒక శక్తి కేవలం మానవుడిగా జీవించినట్లయితే సమస్త ప్రపంచము ఆయన్ని దైవంగా కొలిచింది. కృష్ణ పరమాత్మ దైవంగా వచ్చినా ఆయనని దైవము అన్నవారు లేరు. పంచ పాండవులు, కుంతి, ద్రౌపది, విదురుడు, అక్రూరుడు, భీష్ముడు వీళ్ళు తప్పఆయన్ని కులం చేత, గుణం చేత, చూపు చేత, సౌందర్యం చేత, భావన చేత, చేతన చేత, చేష్ట చేత నువ్వు దేవుడు కాదు అన్నారు. ఆయన ఏమన్నాడంటే, అసలు దేవుడంటూ ఉంటే అది నేనే. నాలుగు వేదాలలో వేదాన్ని సామవేదాన్ని నేనే, అలాగే పక్షులలో గరుడ పక్షిని నేనే, మార్గములో మార్గశిర మాసాన్ని నేనే అన్నప్పుడు నేనే అన్నటువంటిది మనకు కనిపించే కృష్ణుడు కాదు. అఖండమై, చిద్ఘనమై, అనంతమై, అవ్యయమై, అచ్యుతమై, సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మ. పరమాత్మను నేనే అన్నటువంటి భావనలో ఆయన నేను అనేటువంటి దానిని నేనుని దాటి నేనుని ప్రదర్శన చేశాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జీవిత గాథ అత్యంత అపూర్వమైన అటువంటిది. నిజానికి అది ఒక మధుర విషాద గాథ. మాధుర్యంతో కూడి ఉంటుంది. "జిహానం జిహానం సుజానేన మౌధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైహి లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్" అంటాడు లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. అంటే ఏమయ్యా నీకు ముసలితనం రాదా? నీ వేణుగానాన్ని నేను ఎన్నిసార్లు అమృతం లాగా తాగుతున్నానే, మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది ఏమిటి? అవని ఆకాశము కలిసినట్లుగా సర్వము వ్యాపించి ఉన్నావే, నువ్వు ఎవరివి అంటే నిన్ను పెంచిన నందుడికి ఆనంద సర్వస్వానివి నువు. అది మాకు అనుభవమే కానీ అది కాదు, అది మాత్రమే కాదు. "మహానంద సర్వస్వమే తన్ నమస్తాత్" మహానందము అంటే బ్రహ్మానందము, పరమానందము, చరమానందము, అత్యద్భుతమైనటువంటి ఆనందము. ఆనందము యొక్క సాకారము, స్వభావము, సగుణము, రూపము అన్నీ నీవే. నీకు నమస్కరిస్తున్నాను అంటాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటి ఒక ఆత్మకి సంకేతం, పరమాత్మకి సంకేతం. కృష్ణ శబ్దంలోనే "కర్షతి ఇతి కృష్ణః, కృషతి ఇతి కృష్ణః" కర్షతి ఆకర్షణ, కృషతి. ఆయన ఎన్నడూ రాజు కావాలని కోరుకోలేదు. కానీ అర్హత ఉన్న వాళ్ళని, యోగ్యత ఉన్న వాళ్ళని, ప్రాప్తి ఉన్న వాళ్ళని, సమాజానికి అవసరమైన వాళ్ళని రాజులను చేయటంలో ఆయన జీవితం గడిచిపోయింది. అంటే ఇవాళ భాషలో King Maker అంటున్నాం కదా, అదన్నమాట. రాజులను తయారు చేశాడు. రాజులుగా నిలబెట్టాడు. యుద్ధం చేయలేదు, యుద్ధం నడిపించాడు. తాను ఏదీ ముట్టుకోకుండా "పద్మపత్రమివాంభస" తామరాకు మీద నీటి బొట్టు వలే ఉండి తన అవతార కార్యక్రమాన్ని పరమాద్భుతంగా సాగించాడు కృష్ణ పరమాత్మ. అయితే కృష్ణ శబ్దంలో ఉన్నటువంటి కర్షతి, కృషతి. కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయము అంటే మనం చెప్పే ఇవాళ Agriculture కాదు. Culture తో కూడిన Agriculture. అంటే ఒక "అన్నం బహు కురువీత" అంటే అన్నమే ప్రధానము, అన్నమే అన్నింటికీ మూలము, అన్నం వల్లనే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ వస్తున్నాయి అని చెప్పటానికి శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితకాలం అంతా కూడా అన్నము ప్రధానంగా చేశాడు. అందుకనే ద్రౌపదికి అక్షయపాత్రలో ఒక అన్నపు మెతుకుతో అన్నంలో నుంచి ఏది వస్తుందనేది సమస్త భూతాలు దాని నుంచి సృష్టింపబడుతున్నాయని, మనస్సు దాని వల్లనే, ఆలోచన దాని వల్లనే, ఆకర్షణ, ఆనందము దాని వల్లనే, విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానములు దాని వల్లనే అని అన్నము యొక్క ప్రాధాన్యతని నిరూపించినటువంటి వాడు గనుక కృష్ణుడు కృషి, ఖుషీ, "ఖుషితీతి కృష్ణః". ఖుషీ అంటే ఆనందం. అదే వేళ మనకు ఉర్దూ పదం ఖుషీ అయింది. ఖుషీ ఆనందం. ఆయన పడ్డ అవమానాలు అవతారమూర్తి పడలే. ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఎవరూ ఎదుర్కోలే. కానీ తాను ఏర్పరచుకున్నటువంటి లక్ష్యము, తాను చేరవలసినటువంటి గమ్యాన్ని తాను చేరుతూ తనను, తాను పుట్టినటువంటి వంశాన్ని, తాను చెరించినటువంటి కాలాన్ని అన్నింటినీ తనతో పాటు నడిపించి నడిపించి నడిపించి తనలో లీలా మాత్రంగా, లీలా మానుషంగా లయం చేసుకున్నాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరమాద్భుతమైనటువంటి వైచిత్రి. వైచిత్రిని గనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే కృష్ణ పరమాత్మ ఇందాక చెప్పినట్లుగా ద్వాపర యుగంలో ధర్మసంస్థాపన జరగాలి. ధర్మం అధర్మం వైపు వెళుతున్నది. కాబట్టి ధర్మసంస్థాపన చేయటానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ తన రంగాన్ని తానే సిద్ధం చేసుకొని తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులని, యోగాలని ప్రపంచానికి అందించి ఒక యుగాన్ని పరిపూర్ణంగా నడిపించి "ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అనేటువంటి ఒక ప్రమాణానికి అనుగుణంగా తన జీవిత సాఫల్యాన్ని, జీవన వైభవాన్ని, జీవన సౌందర్యాన్ని, జీవన మాధుర్యాన్ని ఆవిష్కరిస్తూ వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కాలానికైనా సన్మార్గ పధాన్ని అంటే మార్గాన్ని ఉపదేశనం చేసేటటువంటి దేశకుడు ఆయనే, ఉపదేశకుడు ఆయనే, సర్వము తానే. అటువంటి కృష్ణ పరమాత్మ ఆదర్శప్రాయమైనటువంటి ఒక అవతారమూర్తి. [అవుట్ర్ో music]
YouTube · audio

సన్మార్గం | Sanmargam

Home

సన్మార్గం | Sanmargam

Source: DD Yadagiri Telangana on YouTube

0:00 / 11:44

More in this series

సన్మార్గం · Sanmargam

19 episodes · 4 hr 16 min

  1. 12 min 1

    సన్మార్గం | Sanmargam

  2. 10 min 2

    సన్మార్గం | Sanmargam

  3. 11 min 3

    సన్మార్గం | Sanmargam | ugadi spl sanmargam

  4. 16 min 4

    సన్మార్గం | VIJAYADASAMI SPL. SANMARGAM | Sanmargam

  5. 13 min 5

    సన్మార్గం | బతుకమ్మ | Sanmargam | Batukamma Special

  6. 12 min 6

    సన్మార్గం | Sanmargam | SRIRAMA NAVAMI SPL. SANMARGAM

  7. 13 min 7

    సన్మార్గం | Sanmargam

  8. 14 min 8

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  9. 14 min 9

    సన్మార్గం | MAHANAVAMI SPL. SANMARGAM. | Sanmargam

  10. 11 min 10

    సన్మార్గం | Sanmargam

    Now playing
  11. 15 min 11

    సన్మార్గం | Sanmargam

  12. 16 min 12

    సన్మార్గం | విజయదశమి | Sanmargam | Vijayadshami Special | Dasara Festival

  13. 13 min 13

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  14. 13 min 14

    సన్మార్గం | Sanmargam | EXPERT

  15. 13 min 15

    సన్మార్గం | Sanmargam

  16. 13 min 16

    సన్మార్గం-గీతా జయంతి SPL | Sanmargam

  17. 13 min 17

    సన్మార్గం | Sanmargam

  18. 11 min 18

    సన్మార్గం | దుర్గాష్టమి ప్రత్యేకం. | Sanmargam

  19. 13 min 19

    సన్మార్గం | Sanmargam