No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వయోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ ఈరోజు భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో నిజానికి మన అందరి జీవితాలలో ఒక పరమోత్కృష్టమైనటువంటి రోజది. ప్రతి సాయంకాలం సాయికాలం కావటం స్వామి అనుగ్రహం. ఇదే ఈ సంధ్యా సమయాన్ని పరమేశ్వరుడు అమ్మవారితో కూడి లాస్యం చేసేటువంటి ప్రదోష కాలమిది పరమ పవిత్ర కాలం. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి భగవాన్ సత్యసాయి మానవ దేహాన్ని తీసుకుని వచ్చి ఎనభై ఆరు సంవత్సరాలు అవనీ సంచారం చేసి మానవాళి సమస్తానికీ సనాతన సారథి అయి అనేకమైనటువంటి మహాద్భుత పరిసత్యాలని ఆవిష్కరించారు. నెమ్మదిగా, గంభీరంగా కానీ చాలా లోతుగా. మానవుడు మానవుడుగా జీవించగలిగితే అది ఉత్తమమైన అధ్యాత్మ అన్న స్వామి మాట చాలా గొప్ప మాట. మానవుడు దేవుడు కానక్కరలేదు మానవుడు దేవుడే అన్న సత్యసాయి భగవానుడి మాట ప్రతి వ్యక్తిని సాధకుడుగా తీర్చిదిద్దాలి, దిద్దుతుంది. పరమ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తి కేవలం కొన్నాళ్ళు ఇక్కడ ఉండి ఏమి సాధించుకోకుండానే మనల్ని మనం ఎరగకుండానే ఈ జీవితాన్ని గనక ముగించుకున్నట్లయితే ఇన్నాళ్ళుగా చేసుకున్న తపస్సు వ్యర్థమైపోయినట్లు లెక్క. కనుకనే ఆత్మాన్వేషణకి అనువైనటువంటి జన్మ మానవ జన్మ. ఇది మాధవత్వానికి నిజానికి అతి సన్నిహితమైన జన్మ. భగవంతుని గురించి మాట్లాడాలన్నా, భగవంతుని గురించి సంకీర్తనం చేయాలన్నా, భగవంతుడి యొక్క రూప భావ తత్వ విచారణ చేయాలన్నా మానవ దేహమే అవసరం. మానవ జన్మే ఉత్తమమైనది. ఇందులో పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని ఎన్ని లక్షల కోట్ల మంది జనులు పుట్టినా అందులో అతి కొద్దిమంది భగవత్ తత్వాన్ని ఎరిగే ప్రయత్నం చేస్తారు. అందుకనే భగవద్గీతలో యోగేశ్వర కృష్ణుడు ఒక మాటన్నాడు. "నన్ను దర్శించు వారిలో కొన్ని కోట్ల మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను గ్రహించగలడు." అంటే పరమాత్మని అర్థం చేసుకునేవాడు కోటి మందిలో ఒక్కడు ఉంటాడట. మరి ఎన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో పుడితే అన్ని పదుల మంది ఈ ప్రపంచంలో పరమాత్మను గురించి అర్థం చేసుకోగలరు అని విచారణ చేసినప్పుడు అతి పవిత్రమైనటువంటి ఈ భారతావని ఇది తపోభూమి, ఇది కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి. కాలే స్థలే జలే అని మూడు మాటలున్నాయి. జీవితంలో ప్రతి కాలాన్ని ప్రతి సమయాన్ని పుణ్యకాలం చేసుకోవాలి. పుణ్య స్థలానికి వెళ్ళాలి. పుణ్య తీర్థానికి వెళ్ళాలి. తీర్థం అంటే నదీ స్నానం కాదు. ఇవాళ మనందరం ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి వచ్చాం. ఈ ప్రదేశంలో భగవన్నామ సంకీర్తన జరుగుతుంది. భగవంతుని గురించిన తలపులే అనబడతాయి, వినబడతాయి. భగవంతుని యొక్క దివ్య లీలా వైభవాన్ని మనసారా తనివితీరా అనుభవించేటువంటి ఒక యోగ భూమిక. కనుక ఇది పరమ పవిత్రమైనటువంటి పుణ్య స్థలం అవుతుంది. కాలం ఎలాగో అనుకున్నాం ఇది సాయంకాలం, సంధ్యాకాలం, ఇది శివుడి కాలం, పరమేశ్వరుడి కాలం. కాలమే పరబ్రహ్మ స్వరూపం అందుకే "కాల గర్భాయ నమః, కాల స్వరూపాయ నమః, కాలాయ నమః" అని మనకి రుద్రం చెప్తూ ఉన్నది. ఇక తీర్థప్రజ నదులు లేవే, ఇక్కడ నది ఎక్కడుంది అని ఎవరన్నా అడిగితే, ఎక్కడ భక్తజనులందరూ కూడి ఉంటారో అది మహా నదీ ప్రవాహం. అది తీర్థప్రజ అంటామే, అంటే తీర్థానికి వెళ్ళిన ప్రజలు కాదు ప్రజలందరూ, భక్తులందరూ పరమేశ్వరాయత్తమైన చిత్తంతో ఎవరైతే ఎక్కడైతే గుమిగూడి ఉంటారో, కూడి ఉంటారో, వనగూడి ఉంటారో, ఏకాత్మ భావనతో ఉంటారో, పరమేశ్వర భావన తప్ప అన్యం లేకుండా ఉంటారో అది మహా తీర్థంగా మనం భావన చేయాలి. కనుక స్థ--కాలే, స్థలే, జలే మూడు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. ఈ ఏర్పడటానికి పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం తప్ప మరొకటి కారణం కాదు ఇదే సత్యం అనేటువంటి దివ్య భావనలో మానవుడు తన జీవితాన్ని పండించుకోవాలి. జీవితాన్ని నడపటం పెద్ద కష్టం కాదు, గడపటం కష్టం కాదు. జీవితాన్ని జీవించటం కష్టం. ఈ జీవితాన్ని జీవించాలి అంటే మనకు ఎవరో స్ఫూర్తిని ఇవ్వాలి. తత్వవేత్తలు, జ్ఞానులు, తపస్సులు, ముముక్షువులు, భక్తులు వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడి యొక్క భావనలో నిలకడ చెంది.పరమేశ్వర తత్వాన్ని సంపూర్ణంగా అనుభవించేటువంటి ఒక దిశలో తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందులో భారతీయమైనటువంటి తత్వ సిద్ధాంతంలో తత్వ విచారణలో యోగులది ఒక ప్రముఖమైనటువంటి పాత్ర. ఈ యోగులు ఒక ప్రమాణం ఆసేతు సీతాచలం. ఈ భారతదేశాన్ని గురు స్థానంలో నిలబెట్టేది ఎవరు అంటే యోగులే. ముప్పై ఆరు వేల మంది యోగులు ఈ ప్రపంచంలో భారతదేశాన్ని అన్నివేళలా కాచుకొని ఉంటారు. అవ్యక్తంగా ఉంటారు కనపడరు. ఈ ముప్పై ఆరు వేల మంది మనకు తెలియకుండానే భారతీయమైనటువంటి ఈ తత్వాన్ని, సిద్ధాంతాన్ని, విచారణని, భగవద్భక్తిని, యోగ త్రివేణిని పారిస్తూ ఉంటారు. అందునా దక్షిణాపథంలో తెలుగునాట అంటే ఆంధ్రదేశంలో మూడు వేల ఆరు వందల మంది యోగులు అన్నివేళలా ఈ ప్రదేశాన్ని కాపాడుతూ ఉంటారు. ఈ ప్రదేశం ద్వారా దీన్ని వేదిక చేసుకుని ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటారు. అందుకనే ఇది త్రిలింగ దేశము అని అన్నారు. మూడు లింగాలున్నాయి ప్రధానంగా మూడు ప్రాంతాలని కలుపుతున్నటువంటివి. ఆ మూడు కూడా పరమ పవిత్రమైనటువంటి శైవ క్షేత్రాలు. ఆ శైవ క్షేత్రాలలో నుంచి నిర్గమించేటువంటి, ప్రసరించేటువంటి ఓంకార నాదమే తెలుగు త్రిలింగ దేశానికి ఆరక్షణ. భారతదేశంలో ఎవరు జన్మ ఎత్తినా వాడు ముక్తుడై పుడతాడని అందునా ఆంధ్రదేశంలో గనక జన్మ ఎత్తినట్లయితే అంటే తెలుగునాట త్రిలింగ దేశంలో జన్మ ఎత్తితే వాడికి పరముక్తి లభిస్తుంది అని ఒక ప్రమాణం. ఓంకార స్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాజ్యమై భువన రక్షా దక్షమై తాండవాహంకార స్థిరచంద్రయశ్శకల శైత్య ప్రాప్త శాంతత్వమై శంకా సంకులమైన నీవునికి ఆశాసిద్ధి కల్పించు తన్. ఈ త్రిలింగ దేశంలో ఉన్నటువంటి మూడు శైవ క్షేత్రాలలో నుంచి ధ్వజస్తంభాన ఉన్నటువంటి చిరుమువ్వల మరుసవ్వడిలో నుంచి నిస్తంద్ర మంద్రమైనటువంటి ఒక ప్రణవ శబ్దం ఓంకారం ఏదైతే ఉన్నదో అది తెలుగు ప్రదేశాన్ని తెలుగు జాతిని ఒక భద్ర జాతిగా తీర్చిదిద్దుతుంది. కనుకనే సకల కళలు సకల వాంగ్మయం మహాయోగులంతా కూడా ఈ ఆంధ్రదేశాన జన్మ ఎత్తారు. యోగులు జన్మ ఎత్తడం కొత్త కాదు ఇది చాలా ప్రాచీనమైనటువంటి విషయం. శ్రీరామచంద్రుడు ఉత్తరాదిన అయోధ్యా నగరంలో జన్మ ఎత్తితే కౌసల్యా గర్భనందనుడై వస్తే శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరంలో జన్మ ఎత్తితే చరసాలలో పూర్ణమైనటువంటి రెండు అవతారాలు ఏర్పడినటువంటి భారతదేశం ఉత్తర దేశం. దక్షిణాపథంలో కలియుగంలో వచ్చినటువంటి ప్రప్రథమ అర్చా మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి కాగా కృతయుగం నుంచి ప్రారంభమైనటువంటి శ్రీ వేంకటేశ్వర వైభవం విజయం అన్ని యుగాలు దాటి దాటి ప్రధానంగా కలో వేంకట నాయకః కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడు అర్చా మూర్తి మనం పూజించ దగిన పూజించవలసినటువంటి మూర్తి అంటే బొమ్మ ప్రతిమా ఈశ్వరః. అర్చా మూర్తి బొమ్మగా ఉంటే ఆయన మనతో మాట్లాడడు. మనకు మాట్లాడే బ్రహ్మ కూడా కావాలి. కనుకనే కృతయుగం నాటి సత్యం త్రేతాయుగం నాటి ధర్మం ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమలు కలియుగం నాటి అహింస సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా స్వరూపంగా సర్వాంగీణమైనటువంటి బహుసుందర వేషధారియై సర్వ జగత్తుకి సనాతన సారథియై అవతరించినటువంటి ప్రప్రథమ అవతార మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అది. అర్చా మూర్తి శ్రీ వేంకటేశ్వరుడు కాగా ఆయన మనందరికీ కులదైవం తెలుగువారికి కులదైవం. సత్యసాయి భగవానుడు ఇల దైవం. ఈ ప్రపంచంలో అందుకనే రామకృష్ణాది అవతారాలన్నీ దక్షిణాపథంలో ప్రాచుర్యం పొందక కంటే కూడా దక్షిణాపథంలో ఉన్నటువంటి సత్యసాయి భగవానుడు సర్వ ప్రపంచాన్ని ప్రశాంతి నిలయానికి తీసుకు రాగలిగారు. ఇది ఒక పరమాద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్య రేఖ. సత్యసాయి భగవానుడు అనేకమంది యోగులను సృష్టించిన వైనం కూడా మనం వింటాం. వారందరూ బయటికి నేను యోగిని నాకేయన గురువు అని చెప్పరు. స్వామి యొక్క దర్శన, స్పర్శన, సంభాషణ, తలపు అనబడేటువంటి ఈ నాలుగు మార్గాల ద్వారా మనిషి మనీషి అవుతున్నాడు. మనీషి ఋషి అవుతున్నాడు. ఋషి బ్రహ్మర్షి అవుతున్నాడు. బ్రహ్మర్షి మహర్షి అవుతున్నాడు. బ్రహ్మమును గురించి ఎవరైతే నిరంతరము ఆలోచిస్తూ ఉంటారో బ్రహ్మము తప్ప ఈ ప్రపంచంలో అన్యం లేదని ఎవరు మనీషాయక్తమైన చిత్తంతో అంటే నిశ్చితంగా ఉంటారో కన్విక్షన్తో ఉంటారో వాడు బ్రహ్మమే అవుతున్నాడంటాడు యోగేశ్వర కృష్ణుడు. బ్రహ్మం వేరుగా లేడు ఎవరు బ్రహ్మమును గురించి విచారణ చేస్తున్నాడో వాడు బ్రహ్మమే. అందుకనే సత్యసాయి భగవానుడు దేవుడనగా వేరు దేశమున లేడు. వాడు వేరే దేశంలో లేడు.తాను చేయు పనుల యందు తగిలి ఉండు అన్నారు. మనం చేసే పనులే భగవంతుని యొక్క కార్యక్రమాలు అవుతాయి. భగవంతుడు లేకపోతే ఆకు కదలదు, భగవంతుడు లేకపోతే వాక్కు పలకదు, భగవంతుడు లేకపోతే ప్రపంచంలో ఏ అణువు కూడా ఇక్కడి నుంచి అక్కడికి కదలదు. కాబట్టి కదులుతున్నదంతా పదార్థం అయినట్లయితే కదిలిస్తున్నది మాత్రమే యదార్థం అవుతున్నది. ఆ యదార్థమైనటువంటి ఒక అతి వాస్తవిక భూమికని ఈ ప్రపంచానికి పరిచయం చేసి మానవుడు మానవునిగా జీవిస్తే పరమోత్కృష్టమైన అధ్యాత్మ సాధన అని, ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి మానవుడు ఏదో ఒక రోజున తన ప్రయాణాన్ని, తన పరిశ్రమని, తన ప్రయత్నాన్ని ప్రారంభించాలని, ప్రాకృతమైనటువంటి లౌకిక భౌతిక ప్రభావంలో నుంచి అజరామరమూ, అచ్యుతమూ, అనన్యమూ, అతుల్యమూ అయినటువంటి ఆత్మానుసంధానం వైపు జీవుడు వెళ్ళాలని చెప్పినటువంటి ఒక మహా పరిపూర్ణమైనటువంటి అవతార భూమిక భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిది. ఆయన కేవలం మనిషికి ఉన్నటువంటి ప్రాపంచిక ప్రలోభాలను శమింప చేయటానికో, కోరికలు తీర్చటానికో, ఒక ఉంగరమో, గొలుసు ఇచ్చి తృప్తి పరచడానికో వచ్చిన అవతార మూర్తి కాదు. మానవుడిలో ప్రబుద్ధమానం కావలసినటువంటి ఆత్మ జ్యోతిని శ్రీమయంగా, చరాచరమయంగా, వాంగ్మయంగా ప్రస్తారించి ఉన్నటువంటి దీనినంతా కూడా సర్వ ప్రపంచానికి పరిచయం చేసేటువంటి దిశగా స్వామి యొక్క అవనీ సంచారం ఎనభై ఆరు సంవత్సరాలు సాగింది. అందులో డెభై రెండు సంవత్సరాలు అది ఒక బౌద్ధ అంటే ప్రబోధాత్మకమైనటువంటి రీతిలో సాగింది డెభై రెండు ఏళ్ళు. ప్రపంచంలో ఒక గురువు, ఒక సద్గురువు, ఒక జగద్గురువు ఇంత సుదీర్ఘ కాలం బోధించిన విషయం కూడా ఎక్కడా record కాలే. శ్రీ కృష్ణ పరమాత్మ మహాభారత సంగ్రామ ఆరంభవేళ ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి యోగశాస్త్రాన్ని మొదటి ఆరు అధ్యాయాలు కర్మ యోగంగా, మధ్యలో ఉన్న ఆరు భక్తి యోగంగా, చివరి ఆరు జ్ఞాన యోగంగా అర్జునుడిని అడ్డం పెట్టుకొని కలియుగానికి ప్రసారించినప్పుడు ఆయన ప్రబోధం చేయలేదు, వ్యాఖ్యానం చేయలేదు. మరి ఏం చేశాడు? transmit చేశాడు, ప్రసారం చేశాడు. కేవలం మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్లలో అర్జునుడికి చెప్పవలసింది ఏదో చెప్పేశాడు. దానిలోని వాదము, సంవాదము, ప్రబోధము, ఉపదేశము, సందేశము, ఆదేశము, దివ్య ప్రభా సంపన్నమైనటువంటి విశ్వరూప దర్శనము, విరాట్ మూర్తి ప్రభావము అన్నీ దాని యందే ఆ క్షణంలో నిక్షిప్తం చేశాడు. అది పరమేశ్వరుడి యొక్క ప్రభావం. కనుకనే పరమేశ్వరుడు "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం" మనందరం పిలిస్తే ఆయన వస్తాడు. మనందరం పిలవకపోతే చాలా తొందరగా వస్తాడు. అది. పిలిస్తే రావటంలో ఏం లేదు, పిలవకపోతే ఎందుకు పిలవలేదు అని తొందరగా వస్తాడు. మనం పిలవటం లేదు అంటే ధర్మ మార్గాన్ని దాటాము, ధర్మ మార్గంలో లేము అని అర్థం. ఎప్పుడైతే ధర్మ మార్గం పలచబడిపోతుందో, మానవుడు ధర్మాచరణ నుంచి దూరమవుతాడో దానికి గ్లాని ఏర్పడినట్టుగా అనిపిస్తుంది. ధర్మానికి హాని, గ్లాని రెండూ లేవు. ఉంటే అది ధర్మం కాదు. కానీ ఆచరించవలసిన స్వీయ ధర్మాన్ని గనుక మానవుడు ఆచరించకపోయినట్లయితే, పరధర్మాన్ని గనుక ఆశ్రయించినట్లయితే పరమేశ్వరుడు వస్తాడు. తాను సృష్టించినటువంటి అందమైన బొమ్మరిల్లుని చక్కదిద్దుకుంటాడు. దిద్దుకుంటూ "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" స్వధర్మాన్ని ఆశ్రయించు. ఏమిటా స్వధర్మం? కర్మ యోగంలో నువ్వు చేయవలసిన పని, నీ వయస్సును బట్టి నీకు నిర్ణయించబడిన దాన్ని నువ్వు చేయాలి. "బ్రహ్మచారి గృహస్తస్య వానప్రస్తస్య చ భిక్షుకః, అతివర్ణాశ్రమీ చైతి క్రమాత్ శ్రేష్ఠా విచక్షణా" సూత పురాణంలో ముక్తి ఖండంలో ఉన్నటువంటి మాట ఇది. మనకి నాలుగు అవస్థలు పెట్టారు. నువ్వు సన్యాసిగానే ఉండమని చెప్పలే. బ్రహ్మచారిగా ఉండు, గృహస్తుగా ఉండు, భిక్షకుడుగా ఉండు అంటే జ్ఞాన భిక్షకై ఒక మహాత్ముడిని సమాశ్రయించు. చివరికి నీతో నీవు, నీలో ఉండగలిగినటువంటి ఒక ధ్యాన యోగాన్ని నీవు సాధించుకో. ఇది భారతీయమైనటువంటి గురుబోధ. ఈ గురుబోధకి అనుగుణంగానే సత్య సాయి భగవానుడి యొక్క డెభై రెండు సంవత్సరాల బోధంతా కూడా మనందరినీ సంసారంలోనే ఉంచి, ఆ సంసారంలో నుంచి మీ అంతట మీరు దాటలేరు గనుక గురు నామస్మరణ చేసుకుంటూ, గురు పాద ద్వంద్వాన్ని అన్నివేళలా తలచుకుంటూ, "శ్రీ భూయుత శ్రీహరి చిన్హితాభ్యాం అగస్త్య రేఖాదభిరంచితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం" ఆ గురువు యొక్క పాదాలని మనసా స్మరించమన్నారు. అందుకనే సత్య సాయి భగవానుడి యొక్క దివ్య అవతారంలో భజన సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నప్పుడు "మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం" అంటూ ఉత్తమోత్తముడైనటువంటి గురువు కాబట్టి, సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తి కాబట్టి, ఈ సమస్త ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతార మూర్తి గనుక మానస భజరే, నీకు మనసు ఉన్నది కదా, నువ్వు మనోమయుడివి కదా, నీ మనస్సుని ప్రాపంచికమైన వస్తు జాలాల మీద నిమగ్నం చేసేకంటే భజరే అంటే భజన చేయమని కాదు, భజ అంటే స్మరించటం. తలస్తు ఉండు నువ్వు కార్యకలాపాలు చెయ్. మాట్లాడుతుండు, పాడుతుండు, పరిగెత్తుతుండు, ఆడుతుండు.కూడుతుండు వీడుతుండు నువ్వు ఏం చేసినా "యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ" శంకర భగవత్పాదులు. మన మనస్సు బ్రహ్మము నందు మన చిత్తము బ్రహ్మము నందు మన ఆలోచనలు పరబ్రహ్మము నందు ఎప్పుడైతే ఉంటాయో నందతి ఆనందాన్నిస్తుంది. నందతి అదే ఆనందం నందత్యేవ అది మాత్రమే ఆనందం. మరి అర్చామూర్తి అయినటువంటి శ్రీ వేంకటేశ్వరుడికి మనం మౌనంగా విన్నవించుకుంటాం ఆయన మౌనంగా పరిష్కరిస్తాడు. అనుభవాలు వైయక్తికం ఎవరివి వారివి. మాట్లాడే బ్రహ్మ కావాలి అనుకున్నప్పుడు సత్యసాయి భగవానుడు అక్కరకు వస్తాడు. ఆయనతో మాట్లాడచ్చు, ఆయన మనతో మాట్లాడతారు. ఏమి సమాచారం అంటారు, ఏం కావాలి అంటారు, ఏమి చేయాలో చెప్తారు, ఏం చేయక్కర్లేదు చెప్తారు. అది ఏ ఒక్క వ్యక్తినో ఉద్దేశించి చెప్పరు. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క తత్వమంతా కూడా ముక్తి వైపు దారి తీయించటానికి ఒక అనువైన దివ్య సాధనాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ముక్తిని నేను ఇస్తాను నువ్వు పుచ్చుకో అని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఏమన్నారంటే transformation ద్వారా నీవు ముక్తుడివి కావాలి అన్నారు. పరిణామం జరగాలి. నాలో ఉన్న negativities అన్నింటినీ పోగొట్టుకుంటూ నా ప్రయాణాన్ని నెమ్మది నెమ్మదిగా కొనసాగిస్తూ నాలో ఉన్న దానవత్వ, దీనత్వ, మానవత్వాలను దాటుకుంటూ నాలో అంతర్గతంగా ఉన్నటువంటి దివ్యత్వాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించుకుంటూ కన్నుమూసే సమయానికి "అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాస్మితి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానందదాయిని" అని శంకర భగవత్పాదుల మాట. అంటే "అహం బ్రహ్మాస్మి" అని "ప్రజ్ఞానం బ్రహ్మాణి" "అయమాత్మా బ్రహ్మాణి" కడగా చివరగా "తత్వమసి" అని. నీవు నేను ఒకటై ఉన్నాం అనే భావన గనక రాకపోతే మానవ జీవితం వృధా అయిపోతుంది గనుక ఇటువంటి వాటి అన్నింటినీ కూడా భగవంతుని యొక్క మహిమని, భగవంతుని యొక్క అనురాగాన్ని, భగవంతుడి యొక్క దివ్య శక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేయటానికి పరమేశ్వరుడు తల్లి గర్భంలో ఉండగానే ఆయా జీవులకి కొన్ని సిద్ధులను సంప్రాప్తింప చేస్తాడు. అవి పాతంజలిక యోగశాస్త్రంలో అణిమాది సిద్ధులు అని మనం చెప్తాం. ఈ అణిమాది సిద్ధులతో కొంతమంది తల్లి గర్భాలయం నుంచి ప్రపంచంలోకి వస్తారు. వస్తూనే వాళ్ళు మనలాగా లౌకిక విద్యల కోసం పాకులాడరు. అతిమానుషమైన అతి అసాధారణమైనటువంటి ప్రజ్ఞాభూమికలో నిలకడ చెంది మానవుణ్ణి ఒక్కసారి ఒక ఆశ్చర్యానికి, ఆనందానికి, భయానికి, గౌరవానికి గురిచేసి 'ఓహో! ఇతడే ఇట్లా అయితే పరమేశ్వరుడు ఎంతటివాడో' అని అనిపించే దిశగా అనేకమందిని ఆయనే సృష్టించుకుంటాడు. ఆ సృష్టించుకోబడిన వారిలో యోగులు ఉత్తమోత్తములు. యోగులు, అవధూతలు అని ఇద్దరున్నారు భారతదేశంలో. అవధూతలు తమలో తాము ఉంటారు. యోగులు తమతో తాము ఉంటారు. తమలో తాము ఉన్నటువంటి అవధూతలు తమతో తమలో సంచారం చేస్తుంటారు. కానీ వాళ్ళు ఆనందంగా ఉంటారు. "అమదానందము విమల ధామమై వర్తమాన వర్తిత అవ్యధాకారకమై ధూమ కామ రహిత ధ్యాన ధారణాతీత చారణమై తమోరహిత తపో తత్వ తారకమై నిలుచు నీ జగతి నిశ్చల నిర్మల సచ్చరిత" ఎవడు వాడు? అవధూత. అకార, వకార, ధూకార, తకారములతో కూడిన బీజాక్షరాలే. వాడి ఆనందమే అమదానందం. ఆనందానికి కారణం లేదు. వస్తువు అక్కర్లేదు. అసలు ఈ ప్రపంచం వాడికి అక్కర్లేదు. మహానందంగా ఉన్నాడు. మనకు ఆనందం కావాలి, ప్రపంచం కావాలి, వస్తువు కావాలి, అనేకం ఉంటే కాసేపు ఆనందాన్ని పొందుతాం. పొంది ఆనందం మారిపోతూ ఉంటుంది. కానీ అవధూత ప్రపంచాతీతమైన భావనలో ఉంటాడు. వర్తమాన వర్తిత మనతో పాటు ఉంటాడు. అవ్యధాకారకమై, అవ్యధకు కారణం అవుతాడు అంటే వ్యధ లేకుండా ఉంటాడు. మహాత్ముడి దర్శనంలో అనేకమైనటువంటి లాభాలు మనకున్నాయి. మహాత్ముడి దర్శనంలో నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు. ఆస్తికుడు భక్తుడవుతాడు. భక్తుడు ప్రేమమయుడవుతాడు. ప్రేమమయుడు జ్ఞాని అవుతాడు. కాబట్టి ఇది ఒక పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమంలో ధూమ కామ రహిత ఉంటాడా అవధూతకి ధూమం లేదు కామం లేదు. ధూమం అంటే ప్రాపంచిక వాసన. ఏమీ అక్కర్లేదు. పెడితే తింటాడు, పెట్టకపోయినా ఏం మాట్లాడడు. రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు. ఎక్కడా resistance ఉండదు. ఇవన్నీ అవధూత యొక్క లక్షణాలు. అలాగే తమోరహిత తపో తత్వ తారకమై తమస్సు లేకుండా ఉంటాడు. తపస్సుకి కారణమై ఉంటాడు. తమస్సు లేదు ఉన్నదంతా తపస్సే. కానీ తనలో తాను ఉంటాడు. మరి యోగి అనగానే ఎవరు ఈ యోగి? ఏమిటి యోగ ప్రవాహం? ఓ ఐదుగురా? ఆరుగురా? ముప్పై ఆరు వేల మంది యోగులను అనుకున్నామే. అందునా ఆంధ్రదేశంలో మూడు వేల ఆరు వందల మంది అన్నివేళలా ఉంటారని ఒక విచారణ చేశామే. ఈ మూడు వేల ఆరు వందల మందిలో ఉత్తమోత్తముల ఎవరన్నా ఉన్నారా? మహోత్కృష్టమైన శక్తి సంపన్నులున్నారా? యోగాత్ములుగా ఉన్నారా? యోగ భూమికలో నిలకడ చెందిన వారున్నారా? అన్నదే ఈ యోగ ప్రవాహం. సృష్టి ఆరంభమైన తొలినాళ్ల నుంచే యోగులున్నారు. వాంగ్మయం పుట్టినప్పటి నుంచి యోగులున్నారు. సర్వ ప్రపంచంలో జ్ఞానం కోసం అలమటించటం ప్రారంభమైన తర్వాత యోగులున్నారు.అంటే ప్రధానంగా యోగులంతా కూడా వారి అవసరమంతా ఇదిగో ఈ కలియుగాన. ఇది కేవల కలియుగమా? ఇది ఆకలి యుగం, అన్నమయ యుగం. అన్నమయ అంటే అన్నగత అని. కృతయుగమంతా కూడా యోగాత్మ భూమికలో ఉందది, అస్థిగతం అది. త్రేతాయుగమంతా మాంసగతం. ద్వాపర అంతా రక్తగతం. కలియుగమంతా అన్నగతం. ఇందులో పరిణామం జరిగింది. మాంసం దాటాం, రక్తం దాటాం, అస్థులు దాటాం, ఎక్కడికి వచ్చాం? పిడికెడు అన్నం ఉంటే చాలు దానిలో నుంచి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనబడేటువంటి five sheets అంటున్నామే. ఈ ఐదు కోశాలలో నుంచి పరమ చరమము చిరంతనము అయినటువంటి బ్రహ్మానంద పదాన్ని కోరుకుంటున్నామే. ఇది కలియుగం మహా పుణ్యకాలం. ఈ యుగంలో జరిగినంత దైవనామస్మరణ ఏ యుగంలోనూ జరగలేదు. కలియుగం పాపాల పుట్ట అంటాం. ఇది యోగాల పుట్ట. నిరంతరము ఇట్లాగే ఇవాళ ఇక్కడ ఎట్లా జరుగుతున్నదో సర్వ ప్రపంచంలో భగవత్ చింతన జరుగుతూ ఉన్నది, భగవన్నామ సంకీర్తన జరుగుతున్నది, విచారణ జరుగుతున్నది, సేవలు జరుగుతున్నాయి. భగవంతుని పేరు మీద మాత్రమే జరుగుతున్నాయి. ఇది ఏ యుగంలో మనం వినం. మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే భగవంతుణ్ణి మూడు వందల అరవై డిగ్రీలలో అనుభవించగలిగినటువంటి ఒక పరమాద్భుతమైన అవకాశాన్ని ఈ జన్మ ఎత్తి మనం పొందాం. అందునా సత్య సాయి భగవానుడు పరబ్రహ్మమూర్తిగా సాలోక్య, సామీప్య, సాన్నిధ్యములు అనుగ్రహిస్తూ సాయుజ్యం వైపు నడిపించిన అటువంటి ఒకానొక కీలక ఘట్టంలో మనం భగవంతుడితో కలిసి జీవించాం. భగవంతుడితో మాట్లాడాం. ఆ భగవంతుని యొక్క దివ్య దేహాన్ని తాకాం. భగవంతుని తలపులతో మన తపస్సుని కొనసాగిస్తున్నాం. ఇంతకంటే ఏం కావాలి? మరణానంతరం వచ్చేటువంటిది సుఖం కాదు. మరణానంతరం ఏం లేదు. ఉన్నదంతా ఇక్కడే, ఇహమేవా, ఇప్పుడే ఇక్కడే now and here. కన్నుమూస్తే ఏముంది? కథ కంచికి మన ఇంటికి, ఏం లేదు అక్కడ. ఉన్నదంతా మనం జాగ్రత్ అవస్థ లో ఉండగానే జరగాలి గనుక. "జ్ఞాన లక్ష్మి జాగ్రత్ పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా" అంటాడు దుర్జటి. జాగ్రత్ అవస్థ లేదనుకోండి కళ్ళు, కాళ్ళు, కీళ్ళు ఏం పని చేయటం లేదు, ఏం చేయగలం? మాట్లాడలేని రోజు వస్తుందా? వస్తే ఏం చేస్తాం? పాడగలిగిన రోజు పాడగలం. పాడ-పాడే-పాటే, పాడలేని ఒక రోజు వస్తే దాన్ని మించిన ఒక పరిదీనత మరొకటి ఉన్నదా? మనస్సుండగా, హృదయముండగా, దేహముండగా, యవ్వనముండగా, కీర్తి, ధనము, సంపద సమస్త ఐశ్వర్యాలు మనకి పరమేశ్వరుడు ఒక విభూతి యోగంగా అనుగ్రహిస్తే దానిని పరమేశ్వరాయత్తం చేయకుండా, పరమేశ్వరోన్ముఖం చేయకుండా, పరమేశ్వర గతం చేయకుండా, కేవలం భౌతిక గతం చేసినట్లయితే జన్మ ఎత్తి ఏమి లాభం అని ప్రశ్నించుకోమంటాడు యోగి. యోగి మనకి నేర్పుతాడు, చాలా విషయాలు నేర్పుతాడు. మనతో మనం ఎలా ఉండాలో చెప్తాడు. దానికి ముందు పూర్వరంగం మనలో మనం ఉన్నట్లయితే దాని పేరు ధ్యానమని, మనతో మనం ఉండగలిగితే దానికి యోగమని మనం పేరు పెట్టుకున్నట్లయితే యోగ ప్రవాహం ఒక అనంత ప్రవాహం.
SSSMC · audio
Yoga Pravaham - 01
Yoga Pravaham - 01
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:43
More in this series
Yoga Pravaham
- 27 min 1
Yoga Pravaham - 01
Now playing - 34 min 2
Yoga Pravaham - 02
- 24 min 3
Yoga Pravaham - 03
- 30 min 4
Yoga Pravaham - 04
- 29 min 5
Yoga Pravaham - 05
- 41 min 6
Yoga Pravaham - 06
- 26 min 7
Yoga Pravaham - 07
- 42 min 8
Yoga Pravaham - 08
- 32 min 9
Yoga Pravaham - 09
- 29 min 10
Yoga Pravaham - 10
- 26 min 11
Yoga Pravaham - 11
- 40 min 12
Yoga Pravaham - 12
- 19 min 13
Yoga Pravaham - 13
- 28 min 14
Yoga Pravaham - 14
- 21 min 15
Yoga Pravaham - 15