Skip to content
Transcript తెలుగు
యుక్తేశ్వరులు వచ్చేదాకా శ్యామాచరణులు ప్రపంచానికి అందించిన క్రియా యోగ మరుగున పడిపోయింది. అసలు ఒక యోగం ఉన్నదని కూడా జాతి మరిచిపోయింది. యోగం అంటే ఏదో భగవంతుడితో ఆయన గురించి కాసేపు మాట్లాడేవాడు వినేవాడు అందరం కలవటం. సత్సంగం అంటే ఇప్పటికి కూడా ఉపన్యాసం అనే కదా మన అర్థం. సత్సంగం అంటే ఉపన్యాసం కాదు. ఉపన్యాసం అంటే కాలక్షేపానికి చేసేది. ఉబుసుపోక కోసం చేసేది. సత్సంగం అంటే సత్ ను గురించిన విచారణ. ఆత్మ విచారణే సత్సంగం. సత్ సాంగత్యం అంటే అటువంటిది కోరుతున్న వారితో కూడి ఉండేది సత్ సాంగత్యం. మళ్ళీ సద్గోష్ఠి అన్నా అంతే గోష్ఠి సత్పదార్ధాన్ని గురించి, సద్విద్యను గురించి, సదాత్మ చిదాత్మను గురించి నిరంతరము మాట్లాడుకునేటువంటిదే సద్గోష్ఠి అంటుంది. స్వాధ్యాయం అన్నా కూడా అంతే పుస్తకాలు చదవటం స్వాధ్యాయం కాదు. మనల్ని మనం చదువుకోవటం స్వాధ్యాయం. ప్రపంచం మొత్తాన్ని చదువుతాం మనం, మనల్ని చదువుకోవటం మర్చిపోతాం. చివరికి ప్రపంచంలో ఎవరి గురించి అన్నా చెప్పండి అంటే గంటలు గంటలు చెప్తాం. కాస్త మీ గురించి చెప్పండి అనంగానే ఆలోచిస్తాం, ఏముంది చెప్పడానికి? చాలా ఉంది గానీ మనకు తెలియదు. దాన్ని ప్రబుద్ధమానం చేయటానికి సత్య సాయి భగవానుడు కలియుగంలో అవతరించినటువంటి మహా పరిపూర్ణ అవతారం. స్వామి ప్రస్తావన పదే పదే యోగ ప్రవాహంలో రావటానికి కారణం ఒకటుంది. స్వామి ధ్యాన, జ్ఞాన, యోగాల గురించి ఎక్కువగా చెప్పలేదని, సేవ చేసుకుంటే చాలని, భ్రమసి ఉన్నటువంటి వారికి ఇది ఒక కనువిప్పు కావాలి. ఎవరికి యోగం బోధించాలో వారికి యోగం బోధించారు. ఎవరికి జ్ఞానం బోధించాలో జ్ఞానం బోధించారు. ఎవరు దానం చేస్తే వాడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళతారో వాడికి చారిటీ నేర్పారు. లోక విద్యతో పాటు పారలౌకికమైన ఆధ్యాత్మిక విద్యానుగ్రహాన్ని సంపూర్ణమూ పరిపూర్ణము చేశారు స్వామి. ఇది మనం గనక కంట కనిపెట్టక పోయినట్లయితే నష్టపోతాం. స్వామి అంటే కేవలం మహిమా స్వరూపుడని, ఆత్మ విచార మార్గం వైపు మనందరినీ సిద్ధం చేయలేదని, స్వామి ఎక్కువగా సేవా యోగాన్ని గురించి మాట్లాడారని మనం ఆగిపోతాం. సేవా యోగంలో అన్ని యోగాలు కలిసి ఉన్నాయి గనుక సేవా యోగాన్ని ప్రతిపాదన చేశారు. సేవా యోగాన్ని చాకిరీగా కాక ప్రేమతో చేసినట్లయితే అది ఒక తపస్సు దాని ఫలితం పూర్ణం కాబట్టి సేవా యోగంలో ప్రేమ యోగాన్ని కూడా రంగరించారు. ప్రేమ అమలిన ప్రేమ, దివ్య ప్రేమ కాబట్టి సమస్త మానవాళి కూడా పరస్పరం సహకరించుకుంటూ, సహనా భవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై అని రోజు చదువుతాం. చదువుతాం కానీ అట్లా ఉండం అంతే, దురదృష్టం. దాని అర్థం తెలుసుకుంటే అనుకున్నప్పుడల్లా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అయ్యో ఉండటం లేదేమో మనం. ఇట్లా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. కలిసి ఉండాలి, కలిమి పెంచాలి, కలిమిని పంచుకోవాలి. ఇది వేద ప్రామాణికమైనటువంటి మంగళాశాసనం. అది కేవలం ఒక స్వస్తి వాక్యంగా గనక మనం ఆలోచించినట్లయితే మళ్ళీ మన అధ్యాత్మ సాధనకు ఉంటుపడుతుంది గనుక మధ్య మధ్యలో శ్యామాచరణుల వంటి వారు వస్తూ ఉంటారు. యుక్తేశ్వరులు శ్యామాచరణుల దగ్గర ఉన్నప్పుడు కొంతకాలం వారు వారిని అనేక ప్రశ్నలు వేశారు సమాధానాలు పొందారు. కానీ బాబాజీ శ్యామాచరణులకి చెప్పారు క్రియా యోగం మరుగున పడిపోయింది. మళ్ళీ ప్రపంచానికి దాన్ని ఉపదేశనం చెయ్. దాన్ని నీ కర్తవ్యంగా భావన చెయ్. నీవు దేని ద్వారా ఇంతటి ఆనందాన్ని సిద్ధిని పొందావో దానిని అరచేతి ఉసిరిక చెయ్, కరతలామలకం చెయ్. చదువుకున్నవాడు, చదువు లేనివాడు ప్రతి వాడు సాగించవలసినటువంటి క్రియా యోగాన్ని ప్రపంచానికి నలుదిశలా చాటమని సందేశం ఇచ్చారు. క్రియా అంటే పని అని అర్థం. పని? ఏమి చేసినా యోగించి చేయాలి. అది క్రియా యోగ. మన లోపల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని మనం రోజూ చదువుతాం. బ్రహ్మార్పణం ప్రతి పూటా చెప్తాం. కానీ లోపల వైశ్వానరుడున్నాడని, వాడు జాగ్రదవస్థలో విశ్వసుడిగా, నిద్రావస్థలో తేజస్సుడిగా, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడుగా, మూడు రకాలుగా ఉన్నాడు అని మాట్లాడుతున్నాం గాని మనకు అనుభవాలు లేకుండా పోతున్నాయి. మనము అనంగానే రాలిపోయే, జారిపోయే దేహాన్ని చూపించి ఇది నేను అని చెప్తున్నాం. ఇది నీవు కాదు, ఇది మాత్రమే కాదు. నీవు ప్రపంచంలో ప్రకాశమానంగా మరొక వస్తువు వలే వెలిగిపోతున్నావ్ అంతే. వస్తువు వెలగటానికి, అందరూ కనుగొనటానికి మూలమైనటువంటి ఒక కాంతి ఉన్నది. కాంతి సర్వే సర్వత్రా జగత్తుని ఆవరించి, ఆవహించి, ఆవేశించి ఉన్నది. అది నీ యందు ఉన్నది. నీ యందు ఉన్నది అని తెలియాలి అంటే నీవు నిద్రావస్థ లోకి వెళ్ళాలి. నిద్ర అంటే అజాజ్య నిద్ర అన్నారు యోగతారావడిలో శంకర భగవత్పాదులు. అజాజ్య నిద్ర. జాజ్యం ఎరుగని, రోగం ఎరుగనటువంటి ఒక నిద్ర యోగ నిద్ర అనమాట.ఆ యోగనిద్ర సమాధికి సమానమైనటువంటి నిద్ర. యోగనిద్రా ముద్రాంకితమైనటువంటి జీవుడు సాధకుడు అయినటువంటి వాడు సమయంలో తనను విశ్వసుడుగా భావించడు. ప్రపంచంలో తనకున్న భార్య గాని, తనకున్న ఆస్తులు గాని, ప్రాపంచిక సంబంధాలు గాని, రెపరెపలాడుతున్న కీర్తి పతాకలు గాని, తన ఉనికి గాని, వ్యక్తిత్వము గాని, అస్తిత్వము గాని అన్నీ మరుగున పడిపోతాయి. మరుగున పడి దేనిని దర్శనం చేస్తుంటాడు అంటే తైజసుడుగా తనని తాను దర్శనం చేసుకుంటాడు. స్వప్నానుభవాలలో మనకి దేవీదేవత దర్శనాలు పెద్ద ప్రధానం కాదు. అది కూడా నిజానికి ప్రాథమిక దశే. ఒక స్వప్నానుభవంలో కలగంటున్నటువంటి వేళ తేజో రూపమైనటువంటి, తేజోమయమైనటువంటి ఒక అనుభవం గనక కలిగినట్లయితే, అది అనుభూతి మిగుల్చగలిగినట్లయితే అది ఆత్మానుభవంగా ఆత్మానుభూతిగా మనం పరిగణించాలి. అలాగే ఇటు కల అటు మెలకువ కాని సుషుప్తి సమయంలో మన యందున్నటువంటి మహాకారుణ శరీరం మన లోక లోకాంతర ప్రాణాలలో మన మూలల్లో లోపలికి వెళ్లి మూలాన్వేషణ జరిపి దానితో అనుసంధానమైనప్పుడు మనమే ప్రాజ్ఞుడుగా కనిపిస్తున్నాం. మనకు మూడు పేర్లు ఇప్పుడున్న పేర ఎవరో పెట్టిన పేరు అది మనం తెచ్చుకున్నది కాదు, మనతో ఉండేది కాదు, మనం పోగానే అది పోతుంది, ఏం ఉండేదేం కాదు. ఎక్కడో పుట్టాం, ఎవడో బారసాలు చేశాడు, పేరు పెట్టి ఇది నీది అన్నాడు. ఓహో! అదే మనం అనుకుంటున్నాం. చరిత్రలో నా పేరు సువర్ణాక్షరాలతో లిఖితం కావాలని అహంకరిస్తున్నాం. చరిత్రలో నీవు ఉండగలిగిన రీతిలో గనక ఉన్నట్లయితే, రాసేవాళ్ళు కోకొల్లలు ఉంటారు. నువ్వు ఉండకపోతే శరీరంతో పాటు అది కొట్టుకుపోతుంది. కానీ జాగ్రదవస్థలో విశ్వసుడుగా లేదు విష్వుడుగా, నిద్రావస్థలో తైజసుడుగా, సుషుప్తిలో ప్రాజ్ఞుడుగా మూడు నీ అసలు పేర్లు అని. అందుకే స్వామి అన్నారు, "పుట్టు మచ్చలు కొన్ని అయితే పెట్టు మచ్చలు కొన్ని బంగారు." మనం పెట్టుకున్నదంతా తుడుచుకోగానే పోతుంది. మనం తెచ్చుకున్నవే మనతో ఉంటాయి. మనం ఏం తెచ్చుకున్నామో అది అనుభవించడానికి తెచ్చుకున్నాం, ఆనందించడానికి తెచ్చుకున్నాం. జీవితం అనేటువంటి పరమాద్భుత వేదిక మీద నీ పాత్రను నీవు సక్రమంగా పోషించు. మళ్ళీ పునః జన్మలేనటువంటి జన్మరాహిత్య స్థితిని అందుకునే దిశగా నీ ప్రస్థానాన్ని కొనసాగించు. అందుకని నీవు యోగివికా. క్రియా అంటే పని అని అనుకున్నాం కదా. క్రియాయోగం మామూలుగా ఇవాళ ఎవరినన్నా అడగండి, పదివేలు కడితే దాని గురించి చెప్తాడు. పది పైసలు కూడా కట్టక్కర్లే, అంత తేలిక క్రియాయోగ. కాస్త practice చేయాలి అంతే. ఎలా చేయాలి? ఏం చేస్తే అది practice అవుతుంది? దీన్ని శ్యామాచరణ లాహిరి, నిజానికి భగవాన్ సత్యసాయి, యుక్తేశ్వరులు, మొన్న మొన్నటి వరకు పరమహంస యోగానంద. ముగ్గురు, ముగ్గురు నలుగురు దీనిని సంక్షిప్తం చేశారు. ముందు కావలసినటువంటిది మొట్టమొదట కావలసినటువంటిది శారీరకమైనటువంటి శ్రమ. భగవంతుడు కరచరణాది అవయవాలు మనకిచ్చాడు. అన్నీ ఆధీనంలో ఉన్నాయి. తేజోమయంగా ఉన్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. వీటిని గనక మనం వాడుకోకుండా వదిలిపెట్టినట్లయితే నీవు యోగివి కాలేవు. అర్జునుడు యుద్ధం చేయాలి, కృష్ణుడు చేయించాలి. మన బోటి వారందరం యజ్ఞంలో పాల్గొనాలి. యజ్ఞ నిర్వహణ ఒక group చేయాలి. యజ్ఞం చేయించడానికి పరమాత్మ సాయం కావాలి. చూశారా, స్వామి లేకుండా వేదపండితులు లేరు. స్వామి, వేదపండితులు లేకుండా యజ్ఞం లేదు. యజ్ఞం లేకుండా మనం లేం. నిజానికి మనం లేకుండా కూడా యజ్ఞం బోసిపోతుంది గనుక ఇది ఒక సమగ్రమైనటువంటి ఒక సత్రయాగంగా జీవితాన్ని భావన చేయమంటున్నారు. అందుకనే శారీరకమైన ఒక శ్రమ చేయాలి. శ్రమ అనంగానే బాగా కష్టపడటం అంటాం, బాగా కష్టపడటం కాదు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. ఎవడయ్యా మహాత్ముడు అంటే ఏది ఆలోచిస్తున్నాడో అది మాటగా చెప్తున్నవాడు, దేనిని చెప్తున్నాడో అదే చేస్తున్నవాడు. వాడు మహాత్ముడు. He is the greatest of all. అనుకుంటున్నది ఒకటి, చెప్తున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. వాడు అధ్యాత్మలో అంగుళం కూడా ముందుకు వెళ్ళలేడు. ఆత్మ, మహాత్మల సంగతి తర్వాత తాను ఉన్న స్థితి నుంచి ముందుకు ఒక అంగుళం కూడా జరగలేడు గనుక ఆలోచించి చెప్పాలి, చెప్పాము అంటే చేయాలి. చేయగలిగిందే చెప్పాలి, చెప్పాము అంటే చేసి తీరాలి. అందుకే స్వామి చెప్పుట సులభము, చేయుట కష్టము. క్రియాయోగాన్ని గురించి ఒక గంట సేపు equations తో సహా అదో ప్రత్యేకమైన class demo lecture అది వేరే. కానీ క్రియా అంటే శారీరకమైన ఒక శ్రమ ఉండాలి శరీరానికి. దానికి క్రమశిక్షణ ఉండాలి, నియమం ఉండాలి. శ్రేయో నియమం వినా. నియమం లేదనుకోండి శ్రేయస్సు ఎక్కడిది? అంతా ప్రేయస్సే. discipline ఉండాలి ప్రతి దానికి. సమయపాలన ఉండాలి, అది ఒక discipline. యుక్తాహార విహారస్య అదొక discipline. యుక్తమైనదే తినాలి, కావలసినంతే తినాలి.ఇంకొకరిని సంతోష పెట్టడానికి తినకూడదు. మన శక్తి మనకు ఎంతవరకు ఉందో అంతవరకు చక్కగా తినాలి, దాన్ని వదిలిపెట్టాలి. వెళ్ళవలసిన చోటికి మాత్రమే వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా అధ్యాత్మ సాధనలో శరీరానికి సంబంధించినవి. స్వామి అన్నారే, కాళ్ళు ఇచ్చినది ఎందుకు? సందులు గొందులు తిరుగుటకా? అందుకు కాదు. సత్సంగనికి వెళ్ళాలి. చెవులు ఇచ్చినదెందుకు? సత్సంగంలో మాటలు వినటానికి ఇచ్చాడు పరమేశ్వరుడు. కళ్ళు ఎందుకు ఇచ్చాడు? సర్వాంగీణమైన ప్రకృతిలో విరాట్ పురుషుడిని దర్శనం చేయటం కోసం ఇచ్చాడు. ప్రాపంచికమైన వ్యర్థమైనటువంటి లాలస కలిగించే వస్తువుల పట్ల మన మనస్సును ఒక వైముఖ్యానికి నేర్పాలి దానికి. దాంట్లో ఏం లేదు అని మనం చెప్తూ ఉండాలి మనస్సుకి. లేదు అనుకొని అది కూడా మన దగ్గర ఉంటుంది. దీనిలో ఏముందో అని మనమే సంకల్పిస్తే ఏముందో చూద్దామని మనతో అది కూడా వస్తుంది, వచ్చి ఇరుక్కుపోతుంది. బంధనాల్లో నుంచి అనేకమైనటువంటి బాంధవ్యాలు ఏర్పడతాయి. బాంధవ్యాలలో నుంచి మళ్ళీ బంధనలు ఏర్పడతాయి. బంధనంలో నుంచి మోహం ఏర్పడుతుంది. మోహంలో నుంచి వ్యామోహం ఏర్పడుతుంది. వ్యామోహంలో నుంచి వ్యసనం ఏర్పడుతుంది. వ్యసనం భగవంతుని యందు వ్యసనం గనుక ఉన్నట్లయితే దాని పేరు భగవద్రతి అన్నారు. మాట వాడింది భగవాన్ సత్యసాయిబాబా వారు. ఇంకెవరూ కాదు. భగవద్రతి, భగవంతుని యందు రతి ఉండాలి. భగవంతుని గురించే ఆలోచించాలి, భగవన్నామమే చేస్తూ ఉండాలి. అన్నింటికీ ఆయనే కారణం అన్నటువంటి ఒక శరణాగతి ఉండాలి, సమర్పణ ఉండాలి, వినయం ఉండాలి. ఉన్నప్పుడు మనం చేసేటువంటి అన్ని కార్యకలాపాలు కూడా క్రియాయోగంగా రూపాంతరీకరణం చెందుతాయి. ఇక రెండవది, మనో నైర్మల్యం కావాలి. మనస్సును నియంత్రించాలి. మనస్సుకి ప్రపంచంలో ఉన్న అన్నీ కావాలనిపిస్తుంది. దాని లక్షణం అది. ఇది వద్దు అనేవాడు లేడు, నాకు చాలు అనేవాడు లేడు. కోటానుకోట్ల సంపాదన చేసిన వాడు, బాగున్నారా? అని మనం అడిగితే, ఏం బాగు, క్రితం సంవత్సరం కంటే ఒక వంద కోట్లు తగ్గినాయి అంటాడు. మామూలు వాడిని అడగండి, ఏమో ఎప్పటికైనా వంద కోట్లు సంపాదించగలనా అంటాడు. ఇద్దరిదీ నిరాశే. కనుక ప్రపంచంలో తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం లేదు. తృప్తి ఎవరికి ఉన్నదో వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. కోటి ఈశ్వరులను తన యందు నిలబెట్టుకున్నవాడు కోటీశ్వరుడు అన్నారు స్వామి. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే, మన మనస్సును నిగ్రహించుకోగలిగితే. అనేకమైన ఆకర్షణావలయాలు ఏర్పడుతూనే ఉంటాయి. అది ప్రపంచ లక్షణం. జగత్తు మన మీద విసిరేటువంటి ఒక పరమాద్భుతమైన రంగుల వల అది. తప్పించుకోలేనిది ఏం కాదు. తప్పించుకోవాలన్న స్థిమితమైన నిర్ణయం మనం చేసుకోవాలి. మనకు ఏం కావాలి? ఎంత కావాలి? ఎప్పటికి ఏం కావాలి? వయస్సులో ఏం కావాలి? బాల్యం నుంచి అధ్యాత్మ కావాలి. మరణం ఆసన్నమయ్యే వేళ పరమాత్మను గురించి అనుకున్నా కించిత్ ఫలం ఉంటుందే గాని తృప్తి మాత్రం ఉండదు. అమ్మయ్యా బయటపడ్డాం అన్నట్లు ఉంటుంది. చిన్నప్పుడే గనుక అధ్యాత్మలోకి రాగలిగినట్లయితే పరమేశ్వరుడి యొక్క భావాలన్నీ కూడా మనయందు జీర్ణమై మన ఆలోచనలన్నీ కూడా పవిత్రీకరణం చెంది సమస్త ప్రకృతి కూడా శివాయతనంగా కనిపిస్తుంది. మనో నియంత్రణ ధ్యానం ద్వారా సాధించుకోవాలి. జ్ఞానం పుస్తకం చదివితే రాదు. జ్ఞానం ధ్యానంలో నుంచి వస్తుంది. ఎందుకని అంటే మనస్సు ఎప్పుడైతే నియంత్రించబడిందో ఆలోచనలు బలహీనపడతాయి. తక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు మనస్సు తేలికవుతుంది. ఆలోచనలు పెరుగుతున్నప్పుడు మనస్సు బరువు ఎక్కుతుంది. మనస్సుని తేలిక పరచుకునేటువంటి దివ్య విధానమే ధియానం, అదే ధ్యానం. బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానందదాయిని. శంకర భగవత్పాదులు. నేను బ్రహ్మమును అని అనుకోవాలన్నారు. అనుకోవాలి అంటే మనో నియంత్రణ కావాలి, మనో నైశ్చల్యం కావాలి, నిశ్చలత్వం కావాలి. మనస్సుకి ఒక నిగ్రహం కావాలి. దేనియందు తాదాత్మ్యం చెందనటువంటి, ఉద్వేగం చెందనటువంటి ఒక సరళమైన, సున్నితమైనటువంటి, మార్ధవమైన, లలితాత్మకమైనటువంటి భావనా స్థితి ఎవరి యందు ఉంటుందో అటువంటి వాడు నిశ్చుడై, నిత్య తృప్తుడై, శాశ్వతుడై, నిర్మలుడై, అచలుడై, అద్వయమై, అద్వైతమై, పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, గంభీరమై, పారమార్థికమైన సత్యాన్ని ఎరిగిన యదార్థమై ఉంటాడు గనుక అటువంటి వాడు యోగి అవుతాడు అంటున్నారు శమాచరణ లాహిరి మహరాజ్. మనస్సును నియంత్రించు. అయ్యా సంసారంలో ఉన్నాను మనసంతా దాని యందే ఉన్నది. స్వామి చెప్పారు, కెమెరా నీ వైపు తిప్పుకుంటే నీ ఫోటో నీ చేతికి వస్తుంది. ప్రపంచం వైపు తిప్పి తీస్తే ప్రపంచం ఫోటో వస్తుంది. తిప్పటంలోనే ఉన్నది మర్మమంతా అన్నారు. మనకు అర్థం కావాలిగా. ప్రాచీన ఋషులకి కెమెరాలు లేవు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి స్వామి కెమెరా ఎగ్జాంపుల్ చెప్పారు. మన బొమ్మ మనం చూడాలి అంటే అర్థం కావాలి. పదే పదే చూడాలి అంటే మన ఫోటో మనోడన్నా తీసెయ్యన్నాయివాలి, మనమన్నా తీసుకోవాలి.మనం తీసుకోవాలి అంటే camera మనవైపు మనం తిప్పుకోవాలి అప్పుడు మన బొమ్మే పడుతుంది ఇంకోటిది పడదు. మనవైపు మనం తిప్పుకోవటమే అంతర్ముఖత్వం. మనస్సు యొక్క లక్షణం అంతా కూడా బయటకు పరిగెత్తటం, బయట వస్తువులను పట్టుకోవటం, బయట ఉన్నటువంటి విషయాల పట్ల చాలా ఆసక్తి పెంచుకోవటం. వాడు ఇట్లా, వీడు ఇట్లా. వాడు చెడిపోయినాడు, వీడు చెడిపోయినాడు. వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడలేదు. ఇన్నాళ్లు ఉండి వాడేమి సాధించాడు? సాధనలో ఉండవలసినటువంటి వాడు ప్రశ్నలకు స్వస్తి చెప్పమన్నారు. సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయిన స్వామి రెండు ఉపదేశనాలు చేశారు మనో నియంత్రణకి. Avoid gossip number one. ఎందుకంటే అది నీ energy ని drain చేసి, నీ time and space ని అది occupy చేస్తుంది. నీకున్న విలువైనటువంటి ప్రాణ సమానమైన నీ కాలాన్ని అది హరించి వేస్తుంది. ఎవరో ఏదో అయిపోతే మనకేమి పోనీ, మనం ఎట్లా ఉన్నాం అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక రెండవది Never speak ill about anybody behind the person. చూశారా! ఒక వ్యక్తి వెనక అతని గురించి ఎప్పుడూ తప్పు మాట్లాడకూడదు. మాట్లాడుతున్నాం అంటే మాట్లాడుతున్న మనం పిరికి వాళ్ళము అని అర్థం. ధైర్యం ఉంటే, అతని క్షేమాన్ని కోరిన వాడివి అయితే మర్యాదగా, mobilizing గా, polite గా "అయ్యా! మీరు ఇట్లా ఉన్నందువలన మీకు నష్టం కలుగుతుందేమో ఆలోచించుకోండి. ఇట్లా ఉండకూడదు" అని చెప్పాలి. ఎదురుగా బానే ఉన్నట్లుగా ఉండి వెనక గనక అన్నట్లయితే మనస్సు నియంత్రం-నియంత్రణలో లేనట్లు లెక్క. మనసుకు లోబడిన వాడు, మనసుకు లొంగిన వాడు చేసేటువంటి ఒక అరాచకమైనటువంటి పని కాబట్టి ఇది యోగిగా ఉండాలి అనుకునేవాడు వదిలిపెట్టవలసినవి. ముందు ఏం చేయాలో తర్వాత చూద్దాం, ఏం చేయకూడదో ముందు తెలుసుకోవాలి. కాబట్టి శరీరాన్ని కర్మనిష్ఠ లో నిలబెట్టటం మొట్టమొదటిది. అంటే చేస్తున్న ప్రతి పని వెనుక భగవంతుడు ఉన్నాడని, అది భగవంతుడికి సమర్పిస్తూ చేస్తున్నానని, భగవంతుడే గనుక లేకపోయినట్లయితే నేను పని చేయగలిగే వాడిని కాదు అని ఉండాలి. రెండవది moral conduct గురించినటువంటి విచారణ. ఇగో! ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. సత్యమే చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. ఒకవేళ అసత్యం చెప్పవలసి వస్తే, దుర్వార్త చెప్పవలసి వస్తే చాలా ప్రియంగా చెప్పాలి, కష్టపడేట్లు గా చెప్పకూడదు, కష్టపెట్టేట్లు గా చెప్పకూడదు. దేనియందు తాదాత్మ్యం చెందకూడదు, ఉద్వేగం చెందకూడదు. అనుద్వేగకరం వాక్యం. ఇవన్నీ కూడా సత్ప్రమాణికమైనటువంటి మాటలు గనుక మనస్సుని నియంత్రించుకోవటానికి ధ్యానము ఒక ఎత్తయితే moral conduct రెండో ఎత్తు. ధ్యానం ఆంతరంగికం, ఇవన్నీ బహిరంగం. ముందు బయట ఉన్నదాన్ని శుద్ధి చేయాలి. వంటవాడు ఏం చేస్తాడు? పాత్ర శుద్ధి చేస్తాడు. లోపల చేస్తాడా, బయట చేస్తాడా? లోపలే చేస్తాడు. భాండ శుద్ధి చేయాలి, పాక శుద్ధి చేయాలి, పదార్థ శుద్ధి చేయాలి అప్పుడు పరమాత్మకు సమర్పించాలి. అట్లాగే అంతర్ముఖుడు కావటానికి, తన లోపలికి తాను చూసుకోవటానికి, లో వెలుగును దర్శించటానికి ప్రమాణమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా, విషయాసక్తిని తగ్గించుకుంటూ విషయ వాంఛను విష్ణు వాంఛగా మార్చుకోవాలి అన్నారు. విష్ణువు శివుడు కావచ్చు, భవుడు కావచ్చు, మాధవుడు కావచ్చు, ఎవడో ఒకడు కావచ్చు, పరమాత్మ కావాలి. పరమాత్మ మన కంటే మించినటువంటి ఒక పరమాద్భుత శక్తి. ఇక మూడవది ఓంకార ధ్యానం చేయాలి. ఓంకార ధ్యానము, శారీరక శ్రమ, మనో నియంత్రణ మూడు కలిపితే అది క్రియాయోగ, అంతే. అదేమిటి? అది ఎలా చేయాలి? అవన్నీ తర్వాత విచారణ చేద్దాం. అయితే క్రియాయోగ చేస్తాం బానే ఉంది. మనం మనస్సును నియంత్రించుకున్నాం. రోజూ ఓంకార ధ్యానం చేస్తున్నాం. ఓం అంటున్నాం, అరుస్తున్నాం, గందరగోళ పడిపోతున్నాం. "అకారోకార మకార యుక్తమగు ఓంకారాభిధానం" అంటాడు దుర్జటి. అకారము అగ్ని బీజమై, మకారము చంద్ర బీజమై, ఉకారము ఉమా బీజమై ఉన్నట్లయితే దాని పేరు ఓంకారం, అది. ఓం అనేటువంటి ప్రణవ శబ్దమే మహాద్భుతమైన ఆధ్యాత్మిక భూమిక. ఓం లేకుండా సృష్టి లేదు. ప్రణవం లేకుండా శబ్ద బ్రహ్మం లేదు. ప్రణవం లేకుండా వేదం లేదు, వేదాంతం లేదు. ప్రణవం లేకుండా వాక్కు లేదు. ప్రణవం లేకుండా జీవం లేదు. కనుకనే ఓం అనబడేటువంటి ప్రణవ శబ్దాన్ని నీ ఉచ్ఛ్వాస నిశ్వాసగా మార్చుకో. కనుకనే ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మనకు తెలియకుండానే జరిగేటువంటి నిత్య ప్రాణాయామానికి సంకేతంగా కనీసం ఇరవై ఒక్క సార్లు ఓంకార ధ్యానం చేయమన్నారు. మాట ఎవరు చెప్పారు? సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయిన స్వామి చెప్పారు. ఇరవై ఒక్క సార్లు ఓంకార ధ్యానం అంటే అరవటం కాదు. ఓం అంటూ మనతో మనం ఇరవై ఒక్క సార్లు అయ్యేప్పటికీ మనతో మనం కూడి ఉండగలిగిన స్థాయికి వెళ్ళాలి. అది ఎవరికోసమో అరిచేటువంటి అరుపు కాదు, పిలుపు కాదు. లోక లోకాంతర ప్రాణాలన్నీ నిశ్చలమయ్యేట్లుగా, నిర్మమయ్యేట్లుగా, నిరామయమయ్యేట్లుగా, ఒక నికేతనా భూమికలోకి వెళ్ళేట్లుగా ఓంకార ప్రణవ శబ్దాన్ని నాభి నుంచి ప్రారంభించి కంఠగతంతో దాన్ని ముగించాలి. ముగించినట్లయితే ఓంకార ధ్యానంలో, క్రియాయోగలో మనకు కలిగేటువంటి లాభండెబ్బై రెండు వేల యోగ నాడులు తేజం పొందుతాయి. వాటి యందున్న మాలిన్యాలన్నీ సమసిపోతాయి. నాడి శుద్ధి జరుగుతుంది. నాద శ్రవణం జరుగుతుంది. ఒక నాదం వినపడాలి. సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతీ లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహేమన్యతమం లయానాం. శంకర భగవత్పాదులు యోగతారావళిలో ఇదొక ప్రమాణం. మనందరి యందు పండితుడు లేడు, పామరుడు లేడు, జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు. మానవ దేహాన్ని తీసుకువచ్చిన ప్రతి వాడి యందు డెబ్బై రెండు వేల నాడులున్నాయి. అంతే కాదు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఉపనాడులున్నాయి. ఇవన్నీ కూడా అక్కడక్కడ జామ్ అయిపోతే, అక్కడక్కడ కూరుకుపోతే, పేరుకుపోతే వాయు ప్రసరణ ఎట్లా జరుగుతుంది? వాయు ప్రసరణ ఎందుకు జరగాలి అంటే వాయువే మన ఆయువు. మనిషి ప్రాణం పోయింది అంటే శరీరంలో నుంచి వాయువు వెళ్ళిపోయింది అని అర్థం. అంతకంటే ఏం లేదు. శరీరం చైతన్య విలసితంగా, ప్రకాశమానంగా ఉన్నది అంటే లోపల ఉన్న చిన్న నీటి బుడగ, వాయువు బుడగ, గాలి బుడగ కారణం. అది ఎక్కడ ప్రారంభం అవుతున్నది? మూలాధారంలో ప్రారంభమై స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు దాటి సహస్రారాన్ని దాటి ద్వాదశాంత స్థానమైనటువంటి చంద్రకళా స్థానానికి వెళ్తున్నప్పుడు మనలో పుట్టినటువంటి, మనలో ఉన్నటువంటి వేడే, వాయువే ఒక వేడిమిని, తాలిమిని, పోడిమిని సంతరించుకొని యోగాగ్నిగా మారుతున్నది. యోగాగ్ని ఎట్లా ఉన్నది అంటే కట్టె యందు నిప్పు దాగినట్టు, నీటి యందు నిప్పు దాగినట్లు, నువ్వు గింజల యందు నూనె దాగినట్లు, పాల యందు నెయ్యి దాగినట్లు. కనబడుతున్నాయా? పాలల్లో నెయ్యి కనపడట్ల. నువ్వు గింజలు తీసుకుంటే దీంట్లో నూనె ఉందంటే, అయితే చూపించు తాతా అంటాడు ఇంట్లో ఉన్న మనవడు. వాడ్ని నమ్మడు. అదెట్లా ఉంటుందో చూపించు అంటాడు. ప్రాసెస్ చేయాలి. కట్టె కట్టె రాపిడి అయినప్పుడు అగ్ని పుడుతున్నది. బడబాగ్ని పుడుతున్నది సముద్ర మధ్యంలో నుంచి. నీటి యందు నిప్పు దాగి ఉన్నది. అట్లాగే జీవుడి యందు పరమాత్మ నిక్షిప్తంగా ఉన్నాడు. గుప్తంగా ఉన్నాడు. స్వామి అన్నారు, మీ పాపాలన్నీ రాసే చిత్రగుప్తుడు ఎక్కడో ఉన్నాడులే, పైన రాస్తున్నాడు అనంటే, పైన ఎక్కడో ఉన్నాడు అని ఎందుకు అనుకుంటున్నావు బంగారు? నీ యందే చిత్రంగా, గుప్తంగా లేడా? కర్మ సాక్షిగా లేడా? నీవు చేస్తున్న ప్రతి పనినీ వాడు చూడటం లేదా? కాకపోతే సాక్షిభూతంగా ఉన్నాడు అంతే అన్నారు. ఇది పరమ మార్మికమైనటువంటి ఒక యోగ రహస్యం. లోపల ఉన్నటువంటి పరమాత్మని ఎరగాలి అంటే ఓంకార నాదాన్ని, ఓంకార ప్రణవ శబ్దాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. బయట ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి సంగీతమంతా వినాలి అంటే పెద్ద కష్టపడవలసిన పని లేదు. హోరెత్తించే మైకులున్నాయి. Dolby systems ఉన్నాయి. ఇవి కాదు కావలసింది. నిస్తంద్ర మంద్రమైనటువంటి కోటి వీణా నాదాలు ఒక్కసారి శృతి చేసినప్పుడు వినపడి, వినపడనట్లుగా, నిస్వనంగా, సస్వనంగా, సుస్వరంగా, సస్వరంగా ఉన్నటువంటి ఒక అనాహత నాదాన్ని మనం సాధించుకోవాలి. అది బయట లేదు. మన యందున్నది. మన యందున్న దానిని వినాలి అంటే అదిగో మనం మన మనస్సును నియంత్రించాలి. మనస్సు అనేకమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నప్పుడు నాదాలు వినపడవు, నినాదాలు వినపడతాయి. నినాదాలలో నుంచి వివాదాలు ఏర్పడతాయి. ఇది దుఃఖానికి కారణం. నాదం సుఖానికి కారణం. ఆనందానికి కారణం. త్యాగరాజ స్వామి వంటి వారు నాదానుసంధాన యోగంలో పూర్ణ ప్రజ్ఞను సాధించుకున్నటువంటి వారు. అందుకనే త్యాగరాజ స్వామి వంటి వారంతా పాడి ఏమి తరించలే, తరించాకే పాడారు. కనుకనే కాలాతీతమైనటువంటి, సార్వకాలికమైనటువంటి ఒక ప్రజ్ఞాన భూమికలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు ఇవాల్టికి కూడా మనం నెమరువేసుకుంటున్నాం. ఇదంతా క్రియా యోగంలో భాగమే. అంతే కాదు మనస్సును నిగ్రహించుకోలేకపోతే, మన మనస్సుని మనమే అదుపులో పెట్టుకోలేకపోతే మన మనస్సుని ఇంకొకడు ఎవరు వస్తారు అదుపులో పెట్టడానికి? ఒకవేళ పెడతాను అంటే మన అహం అంగీకరిస్తుందా? మానవుడు మనోమయుడే, అహంకార పురితుడే. నీ మనస్సును నేను మరమ్మత్తు చేస్తాను అనగానే ముందు మీ మనస్సుని మీరు మరమ్మత్తు చేసుకోండి అనాలి. మరమ్మత్తు అలా జరగదు. భౌతికవాదంలో నుంచి యదార్థ వాదం రాదు. భౌతికవాదాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ పదార్థ విజ్ఞానం నుంచి పరమార్థ విజ్ఞానంలోకి, పరమార్థ విజ్ఞానంలో నుంచి యదార్థ జ్ఞానానికి జీవుడు పరమోత్కృష్టమైనటువంటి ప్రస్థానాన్ని సాగించాలి. అదే యోగ భూమిక.
SSSMC · audio

Yoga Pravaham - 05

Home

Yoga Pravaham - 05

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:34

More in this series

Yoga Pravaham

15 episodes · 7 hr 37 min

  1. 27 min 1

    Yoga Pravaham - 01

  2. 34 min 2

    Yoga Pravaham - 02

  3. 24 min 3

    Yoga Pravaham - 03

  4. 30 min 4

    Yoga Pravaham - 04

  5. 29 min 5

    Yoga Pravaham - 05

    Now playing
  6. 41 min 6

    Yoga Pravaham - 06

  7. 26 min 7

    Yoga Pravaham - 07

  8. 42 min 8

    Yoga Pravaham - 08

  9. 32 min 9

    Yoga Pravaham - 09

  10. 29 min 10

    Yoga Pravaham - 10

  11. 26 min 11

    Yoga Pravaham - 11

  12. 40 min 12

    Yoga Pravaham - 12

  13. 19 min 13

    Yoga Pravaham - 13

  14. 28 min 14

    Yoga Pravaham - 14

  15. 21 min 15

    Yoga Pravaham - 15